సద్గురువులు సమాజాన్ని సరయిన దారిలో నడిపిస్తారు.
బ్రహ్మ సత్యము జగత్తు మిధ్యా అనే సత్యాన్ని అనుభవ పూర్వకంగా మనకు అవగతం చేసే వారే
సద్గురువులు. మనకు అనేక సాధనా మార్గములు ఉండచ్చు కానీ చేరవలిసిన గమ్యం మాత్రం
ఒక్కటే. మన సనాతన సంప్రదాయంలో గురువుకి ఉన్న ప్రాముఖ్యత మరి ఎవరికీ ఉండదు. మొట్ట
మొదట పరమ శివుడు గురువు యొక్క ఆవశ్యకతను తెలియచేసారు. ఇప్పడు గురువులు ఎలా ఈ జ్ఞాన
దీపాన్ని వెలిగించుతారో చెప్పబోతున్నారు.
నిత్యం బ్రహ్మ నిరాకారం యేన ప్రాప్తం స వై గురుః !
స శిష్యం ప్రాపయేత్ ప్రాప్యం దీపో దీపాంతరం యథా !!
సద్గురువు అంటే ఎవరు ! నిత్యము నిరాకారము అయిన
బ్రహ్మ వస్తువును పొందిన వారు. ఒక దీపం మరొక దీపాన్ని వెలిగించినట్లుగా గురువులు
తమ శిష్యులలో ఈ జ్ఞాన జ్యోతిని వెలిగిస్తారు.
గురువు శిష్యుల మధ్య ఉన్న ఈ సంబంధమే అతి
ముఖ్యమైనది. మనం గురువుని ప్రాపంచిక కోరికలకు మాత్రమే పరిమితం చేయకుండా, ఈ జ్ఞాన
జ్యోతిని వెలిగించమని అర్ధించాలి. దానికి కావాల్సిన అర్హతను సంపాయించాలి. అప్పుడే
గురువులు మనలను ఈ దారిలో నడిపించగలుగుతారు. మనకు గురువుదగ్గరనుంచి ఏమి కోరుకోవాలో
తెలియదు. కానీ గురువుకి మాత్రం
మనకు ఏమి ఇవ్వాలో తెలుసు. అందుకే మనం మనకు నచ్చింది కాకుండా గురువు ప్రసాదించింది
స్వీకరించాలి. అప్పడు మాత్రమే మనకు శ్రేయమైనది లభిస్తుంది.
సరే గురువు ఈ దీపం వెలిగించాలి అంటే మనం ఏమి చేయాలి?
బాబా ఈ దీపం
వెలిగించడానికి కావలసిన యోగ్యతలు చాలా
సరళమైన భాషలో చెప్పడం జరిగింది.
1) ముముక్షత : ఎవరయితే
తాను బద్దుడనని గ్రహించి బందనముల నుండి విడివడుటకు కృతనిశ్చయుడై శ్రమపడి ఇతర
సుఖములను లక్ష్యపెట్టక దానిని పొందుటకై ప్రయత్నించునో వారే ఆధ్యాత్మిక జీవితమునకు
అర్హుడు.
2) విరక్తి లేదా ఇహపర
సుఖములందు విసుగు చెందుట : ఈ లోకములోని సుఖాలయందు , పరలోక సుఖాలయందు, అంటే స్వర్గాదిసుఖములందు ఆసక్తి లేకుండా ఉండటమే నిజమైన విరక్తి.
3) అంతర్ముఖత : మనకు
(ఇంద్రియాలకు) బాహ్యమైన వస్తువులను చూచుటకే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. కనుక
మానవులెప్పుడు బయటనున్న వానినే చూచును. కాని మనము ఆత్మసాక్షాత్కరము కోరుకుంటే మన
దృష్టిని లోపలకు పోనిచ్చి లోనున్న ఆత్మను ఏకధ్యానముతో జూడవలెను.
4) పాపవిమోచన పొందుట :
మానవుడు దుష్ట కర్మల నుండి మనస్సును మరలించలేనప్పుడు, తప్పులు చేయుట మాననప్పుడు, మనస్సును చలింపకుండ నిలబెట్టలేనప్పుడు జ్ఞానము ద్వారా కూడా
ఆత్మసాక్షాత్కారమును పొందలేడు.
5) సరియైన నడవడి : మనము
ఎప్పుడూ సత్యము పలుకుచూ, తపస్సు చేయిచూ, అంతర్‌దృష్టితో బ్రహ్మచారిగా నుండిన గాని
ఆత్మసాక్షాత్కారము లభించదు.
6) ప్రియమైన వాటి కంటే,
మనకి ఏది మంచిదో దాన్ని కోరుకోవడం ఎంతో ముఖ్యం.
7) మనస్సును,
ఇంద్రియాలను స్వాధీనమునందుంచుకొనుట : శరీరం రధం, ఆత్మ ఆ రధమును నడుపు సారధి, మనస్సు- కళ్ళెము, ఇంద్రియములు - గుఱ్ఱములు, ఇంద్రియ
విషయములు వాని మార్గములు. ఎవరికి గ్రహించు శక్తి లేదో, ఎవరి మనస్సు చంచలమయినదో,
ఎవరి ఇంద్రియములు స్వాధీనములో లేవో, అట్టి వాడు గమ్యస్థానము చేరలేడు. ఎవరయితే
వీటన్నింటిని ఆధీనములో నుంచునో వారు తప్పక గమ్యస్థానము చేరుకుంటారు.
8) మనస్సుని పావనము
చేయుట : మానవుడు ప్రపంచంలో తన
విధులను సక్రమంగా నిర్వర్తించితే మరియు ధర్మమార్గంలో ప్రయాణించితే కాని అతని
మనస్సు పావనము కాదు. మనస్సు పావనము కానిదే అతడు ఆత్మ సాక్షాత్కారము పొందలేడు.
9) గురువు యొక్క
ఆవశ్యకత : ఆత్మజ్ఞానము చాలా సూక్ష్మము అయినది. మనంతట మనము దానిని పొందలేము. దీనికి
గురువు యొక్క అవసరం ఎంతైనా ఉంది. ఆ గురువు ఆత్మసాక్షాత్కారము పొందినవారై యుండాలి.
గురువుకు దానిలో ఉన్న లోటుపాట్లు తెలుసు. అందుకే వారు మనలను సరియైన మార్గములో
నడిపించగలుగుతారు.
10) భగవంతుని కటాక్షము
: "ఆత్మ ఎవరిని ధరించునో వారే దానిని పొందుదురు" అని కఠోపనిషత్తు
చెప్పుచున్నది. భగవంతుని కటాక్షము లేనిదే వివేక వైరాగ్యములు కలగవని బాబా ఇక్కడ
బోదించడం జరిగింది.
బాబా ఈ పది యోగ్యతలను
బోధించి మనందరిని ఉద్దరించారు. వీటన్నింటిని మనము మన నిజజీవితంలో అన్వయించటం
నేర్చుకోవాలి.
ఇంకా గురు గీత ఇలా
చెప్తుంది.
గురో: కృపా ప్రసాదేన
బ్రహ్మాహ మితి భావయేత్ !
అనేన ముక్తి మార్గేణ
హ్యాత్మ జ్ఞానం ప్రకాశయేత్ !!
మనలో అన్ని అర్హతలు
కలిగిన తర్వాత, గురు కృపతో లభించిన "నేనే బ్రహ్మను " అనే జ్ఞానాన్ని భావన చేస్తూ ఉండాలి.
ఇదే ముక్తికి మార్గము. ఇలా చేస్తూ ముందుకి సాగితే ఆత్మ జ్ఞానం ప్రకాశిస్తుంది.
మనము అంతర్ముఖమై మనలోని
గుణాలను, అలవాట్లను విశ్లేషణ చేయక పొతే ఇది సాధ్యపడదు. మనలో ఎన్నో జన్మలనుంచి
దాగిఉన్న వాసనలు మనకు అడ్డుపడతాయి. గురువు జ్ఞానాన్ని బోధించడం అంటూ ఉండదు, కానీ
మనలోఉన్న ఈ అనవసరమైన వాసనలను తీసి వేస్తె అప్పుడు మనం పరబ్రహ్మగా మిగిలిపోతాము.
ఆత్మ జ్ఞానం దానంతట అదే ప్రకాశిస్తుంది. ఇదే నిజమైన ఆత్మానుసంధానము. ఇదే సత్యమైన మార్గంగా గురు గీతలో
పరమశివుడు బోధించారు.
శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కి జై !
No comments:
Post a Comment