గురువు చూపించిన పధంలో నడుస్తూ, గురు మూర్తినే ధ్యానిస్తూ, గురు
వాక్యాలనే వేద వాక్యంగా ధారణ చేస్తూ ఉంటే కలిగే ఫలితమే మోక్షము. ఇప్పుడు గురుతత్వ
ధ్యానం ఆత్మ తత్వ ధ్యానం వైపు ఎలా సాగిపోతుందో ఆ రహస్యాన్ని పరమ శివుడు
చెప్పబోతున్నారు.
యథా నిజ స్వభావేన కేయూర కటకాదయః !
సువర్ణత్వెన తిష్ఠన్తి తథాహం బ్రహ్మ శాశ్వతం !!
గాజులు, గొలుసులు మరెన్నో ఆభరణాలకు ఎన్ని ఆకారాలు ఉన్నా
నిజానికి అవన్నీ బంగారమే కదా. అలాగే నేను శాశ్వత బ్రహ్మనే ! అని పరమ శివుడు
పార్వతి మాతకు గురు గీతలో చెప్పారు.
ఈ విషయం గురుంచి భగవద్గీతలో భగవానుడు ఇలా చెప్పారు.
మత్త: పరతరం నాన్యత్ కించిదస్తి ధనుంజయ !
మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ !!
ఓ ధనుంజయ ! నా కంటెను పరమ కారణమైనది ఏదియను లేదు. ఈ జగత్తునందలి
వస్తువులన్నియును సూత్రమున సూత్ర మణుల వలె నా యందే కూర్చబడి ఉన్నవి.
రంగులు ఆకారాలు ఎన్ని ఉన్న అన్నింటిలో ఉన్న చైతన్యం ఒక్కటే. మనం చేసే
ప్రతిపనిలో ఈ భావం ఉండాలి. మనది అనుకున్నప్పుడు, మనలో ఎక్కడలేని కరుణ, క్షమా గుణం
వస్తాయి. అలానే ఈ జగత్తు అంతా పరమాత్మే అనే భావనను దృఢం చేసుకుంటే మనకు సుఖ
దుఃఖాలతో పని ఉండదు. వీటికి అతీతంగా ఉండగలుగుతాము. ఇదే పరమానందము.
ఒక మాదిరిగా మనమందరము ఈ స్థితిని రోజు అనుభవిస్తాము. మనం గాఢనిద్రలో
ఉన్నప్పుడు మనకు ఏమి తెలియదు. సుఖం లేదు. దుఃఖం లేదు. కాని ఆనందం ఉన్నది. ఎందుకు
అంటే ఇక్కడ నాది నీది అన్న భావన లేదు. ఈ సాధనే మనలను ఈ బ్రహ్మ భావనకు దగ్గర
చేస్తుంది.మనం రోజు చేయాల్సిన పనులలో ఈ తటస్థ భావనను అలవాటు చేసుకోవడమే నిజమైన
సాధన. అప్పడు మనము ఆ సమయానికి ఏమి చేయాలో అది మాత్రమే చేస్తాము. అప్పుడు సుఖ
దుఃఖాలతో పని లేదు.
ఇంకా గురు గీత ఇలా చెప్తుంది.
ఏవం ధ్యాయన్ పరం బ్రహ్మ స్థాతవ్యం యత్ర కుత్రచిత్ !
కీటో భృంగ ఇవ ధ్యానాత్ బ్రహ్మ ఇవ భవతి స్వయమ్ !!
మనం పైన చెప్పినవిధంగా అంతటా ఆ చైతన్య స్వరూపాన్ని చూస్తూ పరబ్రహ్మను
ధ్యానిస్తూ ఉండాలి. ఇలా చెయ్యగా పురుగు తుమ్మెద అయినట్లు సాధకుడు తానే బ్రహ్మ
అవుతాడు.
ఈ శ్లోకంలో "యత్ర కుత్రచిత్" అని చెప్పారు. అంటే ఈ సాధన
ఎక్కడ ఉన్నా చేయవచ్చు. మనం సంసార జీవితంలో ఉన్నా ఈ సాధన చేయవచ్చు. ఇదే బాబా
చెప్పిన సత్యం. అందుకే బాబా ఎప్పుడు సన్యాసం తీసుకోమని తన భక్తులను
ప్రోత్సహించలేదు. ఆయన కూడా మనుషలందరిలో ఉండే బోధలు చేశారు. మనం చేసే పనిమీద
ఏకాగ్రత ఉండాలి. అంటే శ్రద్ధ ఉండాలి. వేరే వాటిమీదకు మనస్సుని పోనివ్వకూడదు. మనకు
జీవితంలో అన్ని విషయాలమీదికి పరిగెత్తటం అలవాటు అయిపొయింది. అందుకే ఏ పనిలో మనకు
ఏకాగ్రత కుదరటంలేదు. కానీ మనం మనసు పెడితే చేయగలుగుతాము.
భూమిలో ఉన్న నీరు బయటకు తీయాలి అంటే ఒకే చోట లోతుగా తవ్వాలి అంతే
కాని పదిచోట్ల పైపైన తవ్వితే నీరు రాదు. మనకు నిజంగా మోక్షం కావాలి అంటే ఒక్క
గురువుని పట్టుకుంటే సరిపోతుంది. మన జీవితంలో గురువు ప్రవేశించిన తరువాత ఇంకా వేరే
సాధనలతో పని లేదు. గురు వాక్యమే మహావాక్యం కావాలి అని పరమశివుడు గురు గీతలో
చెప్తున్నారు. గురు కృపే మోక్షానికి దారి అని కూడా చెప్పారు.
వీక్షణ ధ్యాన సంస్పర్సః మత్స్య కూర్మ విహంగమాః !
పోషయన్తి స్వకాన్ పుత్రాన్ తద్వత్పండిత వృత్తయ:!!
చేప చూపుచేతను, తాబేలు చింతచేతను, పక్షి స్పర్శచేతను తమ గుడ్లను
పిల్లలను చేసి పోషించునో అదే విధముగా హస్త సంయోగముచే పక్షివలెను, సంకల్ప శక్తిచే
తాబేలువలెను, వీక్షణముచే చేపవలెను తమ శిష్యులను అజ్ఞానమునుంచి జ్ఞానం వైపు
తీసుకువెళతారు.
ఇదే బాబా చెప్పిన నిజమైన సాధన. ఇదే మనలను బ్రహ్మ భావనలో ఉండేటట్లు
చేస్తుంది. బాబా ఇలా అన్నారు. నాకు వేరే సాధన తెలియదు, ఎప్పుడు గురువు గురించిన
చింతనే. ఇక్కడ గురువు అంటే పరబ్రహ్మె. ఎందుకంటే గురువే దేవుడు, పరమాత్మ అని మన
శాస్త్రాలు మనకు చెప్పిన సత్యం.
శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కి జై !
No comments:
Post a Comment