మనం గురు రూపాన్ని ధ్యానించాలి అని పరమశివుడు చెప్పారు. గురువు భూమి
మీద ఉన్న చరా చరా లన్నింటిలోను శాంతుడై, పరమాత్మ స్వరూపుడై ఉన్నారని తెలుసుకోవాలి.
అలానే వాటన్నింటిలో మనం గురువునే చూడాలి. మనకు ధ్యానమార్గాలు చాలా ఉండచ్చు. కానీ
మనం ఏ మార్గంలో పోవాలో ఇక్కడ పరమ శివుడు చెప్తున్నారు.
శ్రీ గురుం సచ్చిదానందం భావాతీతం విభావ్య చ !
తన్నిదర్శిత మార్గేణ ధ్యాన మగ్నో భవత్సుధీ: !!
సచ్చిదానందుడు, భావాతీతుడు అయిన శ్రీ గురువుని ముందుగా మనస్సులో
నిలుపుకొని, విజ్ఞుడైనవాడు గురువు చెప్పిన మార్గంలో ధ్యానంలో ముందుకు సాగుతాడు.
ఇంతకు ముందు భక్తి పరంగా గురువుని పూజించడం నేర్పారు. గురువుని అనేక
గుణాలతో రూపయుక్తంగా భావించడం ఆయనకు ఎలా సపర్యలు చేయడం ఇలాంటి విషయాలను చెప్పారు.
ఇప్పుడు జ్ఞానపరంగా గురువుని ధ్యానించడం ఎలానో, నిరాకార మార్గంలో ఆధ్యాత్మికంగా
ఎలా ముందుకు సాగాలో చెప్తున్నారు.
ఇక్కడ బాబా చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుందాము. నన్ను నిరాకారంగా
ధ్యానించండి. ఇది కుదరకపోతే నా ఈ రూపాన్ని మీ హృదయంలో ఉంచి ధ్యానించండి అని
చెప్పారు. ఈ విషయాన్నే పరమశివుడు రాబోయే శ్లోకాల్లో చెపుతున్నారు.
పరాత్పరతరం ధ్యాయేత్ శుద్ధ స్ఫటిక సన్నిభమ్ !
హృదయాకాశ మధ్యస్థం స్వాంగుష్ఠ పరిమాణకమ్ !!
స్పటికంవలె పరిశుద్ధుడు, పరాత్పరుడు అయిన శ్రీ గురువుని మన హృదయాకాశం
మధ్యలో బొటన వేలు పరిమాణంగా ధ్యానించాలి.
ఈ విషయాన్నే మనం మంత్ర పుష్పంలో చెప్పుకుంటాము. మన చేసే ప్రతీ పూజా పూర్తి అయిన తర్వాత మంత్ర పుష్పము చదివించడానికి కారణము ఇదే. భగవంతుడు అన్నిటా ఉన్నా నీలోనే నువ్వు చూడగలవు అని చెప్పడమే. అందుకే మంత్ర పుష్పంలో ఇలా చెప్పారు. ఈ మంత్ర పుష్పం కృష్ణ యజుర్వేదంలో నుంచి తీసుకోవడం జరిగింది.
యచ్చ కించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపివా
అంతర్బహిశ్చ యత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః !!
పద్మ కోశ ప్రతీకాశగం హృదయం చాప్యధో ముఖం !
అథో నిష్టా వితస్యాంతే నాభ్యాముపరితిష్ఠతి !!
ఈ కనిపించే, వినిపించే సమస్త జగత్తు అంతా, లోపలా బయటా పరమాత్మే వ్యాపించి ఉన్నాడు అని చెప్తూ, మనలను మన లోపలికే తీసుకువెళ్లి, కంఠానికి క్రింద నాభికి పైన ఉన్న హృదయాకాశ కుహరంలో తామర మొగ్గలాంటి పద్మ కోశంలోనే ఈ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ ఉన్నట్లుగా మంత్ర పుష్పం చెపుతుంది.
మనమే బ్రహ్మము అని జ్ఞానపరంగా వింటూ మళ్లా ఈ గురు ధ్యానం ఎందుకు అని
మనకు అనుమానం రావచ్చు. కాని గురువు చెప్పిన దారిలో నడుస్తూ సాధన చేయడం అంత సులభం
కాదు. మనము మన అహంకారం వల్ల మన మనసులో కలిగిన భావాలను గురువు చెప్పినవిగా భ్రమ పడి
మాయాలో పడిపోతూ ఉంటాము. సరే ఇది ఎలా అర్ధం చేసుకోవడం. గురువు ఎప్పడు మనలను
మోక్షానికి, అంటే ఆత్మ సాక్షాత్కారం వైపే తీసుకువెళతారు. మనం వెళ్లే దారి దీనికి
బిన్నంగా ఉంటె మనం పక్క దారి పట్టినట్లే. ఇక్కడ మంచి పనులు (అంటే సత్వ గుణంతో
కూడుకున్న కార్యాలు) కూడా మనలను దారి తప్పిస్తాయి. ఎందుకు అంటే ప్రతి కర్మకు ఫలితం
ఉంటుంది. దాని ఫలితాన్ని అనుభవించాల్సిందే. అందుకని గురువు చెప్పిన మార్గంలోనే
నడవాలి. సరే ఈ మార్గం తప్పకుండా ఉండాలి అంటే ఏమి చేయాలి ?
గురువుని మన హృదయాకాశం మధ్యలో ఒక చైతన్య స్వరూపంగా ధ్యానించాలి. ఇలా
ధ్యానిస్తూ ఉంటె మనం అనుసరించవలిసిన మార్గం బోధపడుతుంది. మనం ఇక్కడ ఏకాగ్రతో
ఉండాలి. ఆలా కాకుండా వేరే దారులన్నీ అనుసరిస్తూ ఈ ధ్యానం చేయాలి అంటే కుదరదు.
మళ్ళా మనం తప్పుడు మార్గంలో ప్రయాణం చేయవచ్చు. చాలా మంది నాకు బాబా ఎందుకు దర్శనం
ఇవ్వడం లేదు అని అనుకొంటారు. ఒకే ఆలోచనతో, భక్తిభావంతో ఒక్క దేవతనే పూజిస్తే ఆ
దేవత తప్పకుండా అనుగ్రహించడం జరుగుతుంది. అలా కాకుండా అన్ని రూపాలను మనసులో
ఉంచితే, దేని మీద ఏకాగ్రత ఏర్పడదు.
ధ్యానం అంటేనే ఒక్క దాని మీద మనసు నిలపి, ఆ వస్తువే మనం అయిపోవడం.
ఇలా మనసు నిలపడాన్ని ధారణ అని అంటారు. చాలా సార్లు మనం చేసేది ధారణ మాత్రమే.
ఇందులో ముందుకి సాగితే అప్పుడు ధ్యానం చేయగలుగుతాము. ఈ ధ్యానమే మనలను సమాధి అనే స్థితికి చేరుస్తుంది. అందుకే గురువుని మనలో చూడమని
పరమ శివుడు గురు గీతలో చెపుతున్నారు.
అంగుష్ఠ మాత్రం పురుషం ధ్యాయత శ్చిన్మయం హృది !
తత్ర స్పురతి యో భావః శృణు తత్ కథయామి తే !!
ఇలా చిన్మయుడు, అంగుష్ఠ మాత్రుడు అయిన శ్రీ గురువును ధ్యానిస్తే
ఎలాంటి అనుభవం కలుగుతుందో చెపుతాను విను అని పరమ శివుడు అంటున్నారు.
విరజం పరమాకాశం ధ్రువమానంద మవ్యయమ్ !
అగోచరం తధాగమ్యం నామ రూప వివర్జితం !
తదహం బ్రహ్మ కైవల్య మితి బోధః ప్రజాయతే !!
నిర్మలము, అనంతము, శాశ్వతము, ఆనంద స్వరూపము, అగోచరము, అగమ్యము,
నామరూప రహితము అయిన పరబ్రహ్మము తానే అన్న జ్ఞానం కలుగుతుంది. ఇదే ఆత్మ
సాక్షాత్కారము.
శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కి జై !
No comments:
Post a Comment