గురు గీత జీవన విధానాన్ని బోధిస్తుంది. అలానే ఏ శాస్త్రమైన ఈ
విషయాన్నే చెప్పడం జరిగింది. మతం అంటే అభిప్రాయము అని సంస్కృతంలో అర్థం. ఈ
అభిప్రాయం ఎప్పుడు శాస్త్రానికి భిన్నంగా ఉండకూడదు. ఈ శాస్త్రం అనేది మనకు నిజ
జీవితంలో ఉపయోగపడాలి. అందుకనే ఏ గ్రంధాన్ని అయినా సంపూర్ణం చేసేటప్పుడు ఫలశృతి
చెప్పడం ఆనవాయితి. అలానే పరమ శివుడు కూడా ఈ గురుగీత వల్ల కలిగే ప్రయోజనాన్ని
చెప్పారు. అదేమిటో ఇప్పడు తెలుసుకుందాము.
గురు గీత అతిగుహ్యేయం మయాస్తి కథితా శుభా !
శ్రీ గురుం చిన్మయం ధ్యాయన్ యామహం కలయే సదా !!
ఈ శ్లోకంలో పరమ శివుడు ఒక నిగూఢ రహస్యాన్ని చెప్పారు.
చిన్మయుడైన శ్రీగురువుని ధ్యానిస్తూ నేను నిత్యమూ జపించే అతి
రహస్యమైన గురుగీతను నీకు చెప్పాను అని పరమశివుడు పార్వతి మాతతో చెప్పారు.
ఆయన గురుగీతను జపించడం ఎందుకు?
గురువు జ్యోతి స్వరూపము. ఈ ఆత్మ జ్యోతి మనలోనే ఉంది. మనం భగవంతుడికి దీపారాధన
చేస్తాము. ఈ దీపం చూస్తూ మనం పూజ చేస్తాము. ఈ దీపమే మనలోని పరమాత్మకు ప్రతీక. మనలో ఉన్న అంతర్ జ్యోతిని అనుభూతి పొందటమే మన జీవిత లక్ష్యం. అందుకే
పరమశివుడు జ్యోతిర్లింగాలుగా అవతరించారు. మనకు ఈ నిరాకార తత్వాన్ని బోధించడమే
పరమలక్ష్యం.
అందుకే గురు గీతలో గురువు రూపాన్ని ధ్యానించమని చెప్పారు. ఇక్కడ
గురువు రూపాన్ని ధ్యానించడం అంటే ఏమిటో చూద్దాము. గురువు సర్వ వ్యాపి, అన్ని
రూపాల్లో ఈ పరమాత్మ తత్వమే ఉంది. అప్పుడు మనం గురువు రూపాన్ని ధ్యానించడం అంటే,
జీవం ఉన్న వాటిలో మరియు జీవం లేని వాటిలో కూడా ఈ చైతన్య శక్తి ఉంది. అంటే
పరమశివుడు ఈ సర్వవ్యాపకత్వ శక్తినే ధ్యానించమంటున్నారు. ఇదే గురు రూప ధ్యానం అంటే.
బాబా కూడా ఎల్లప్పుడూ నా గురువునే తలుచుకుంటూ ఉన్నాను. ఇంక వేరే సాధన అవసరం లేదు
అని చెప్పారు.
తరువాత గురువు పాదాలనే పూజించాలి అని చెప్పారు. గురువు చూపించిన
మార్గంలో నడవటమే నిజమైన పూజ. గురువు వాక్యమే మనకు మంత్రము అని చెప్పారు. గురువు
ఎల్లప్పుడూ సత్యాన్నే చెప్తారు. సత్యమైన వస్తువు మనకు అనుభవం అయ్యేలా చేస్తారు.
మంత్రము అంటే మనలను రక్షించేది. మంత్ర అంటే మనః త్రాయతే ఇతి మంత్ర: అని సంస్కృతంలో అర్థం చెప్తారు. మనస్సుని
శుద్ధి చేసి మనలను సరి అయిన దారిలో నడిపించేదే ఈ మంత్రము. అంటే గురు బోధ మన
మంత్రము అని గ్రహించాలి. ఇదే మనలను భవబంధాలనుంచి
రక్షించి మనకు ముక్తిని ప్రసాదించేది . అందుకే చివరకు మోక్షమూలం గురోర్ కృప అని చెప్పారు.
దీన్ని మించిన బోధ మనకు ఇంకేమి అక్కరలేదు. అందుకే గురుగీతకు అంత ప్రాముఖ్యత
వచ్చింది. శివమ్ అంటే మంగళ స్వరూపం అని అర్ధం. మనం ఏ పూజ చేసినా చివరకు మంగళం
ఉండాల్సిందే. ఈ మంగళం ఒక కర్పూర హారతితోనో లేక ఒక దీపంతోనో చేస్తాము. ఇదే శివ
ఐక్యానికి గుర్తు. అంటే పరమాత్మ తత్వాన్ని మనకు తెలియచెప్పడమే ముఖ్య ఉద్దేశం.
ఈ గురు గీత భక్తితో చదివినా, విన్నా, వ్రాసినా, ఇతరులకు ఇచ్చినా
అజ్ఞానం నశిస్తుంది అని పరమ శివుడు చెప్పారు (ఇక్కడ ఇవ్వడం అంటే ఊరికినే పుస్తకం
ఇవ్వడం కాదు. ఇతరులకు దీన్ని గురుంచి చెప్పడం లేదా బోధించడం).
గురు గీతను జపించిడంవల్ల అనంతమైన ఫలం లభిస్తుంది. ఇతర మంత్రాలు
దీనిలో పదహారోవంతు ఫలితాన్ని కూడా ఇవ్వవు అని గురు గీత చెప్తుంది.
గురు గీత సర్వపాపాలను పోగొడుతుంది. అన్ని సంకటాలను హరిస్తుంది. అన్ని
సిద్ధులను కలిగిస్తుంది. సర్వ లోకాలను వశం చేస్తుంది.
గురు గీత దుస్స్వప్న దోషాలను పోగొడుతుంది. సుస్స్వప్న ఫలితాలను కలుగచేస్తుంది.
శత్రువులను కూల్చి వేస్తుంది. నిన్ను బృహస్పతి అంత గొప్పవాడిగా చేస్తుంది. ఇక్కడ
అజ్ఞానమే దుస్స్వప్నము. గురువు లభించడమే సుస్స్వప్నము. శత్రువులు అంటే కామ
క్రోధములే.
ఎవరైతే మోక్షాన్ని కోరి గురు గీత నిత్యము జపిస్థారో, మోక్ష లక్ష్మిని
తప్పకుండా పొందుతారు. పుత్రులు కావాలన్న వారికి పిల్లలు కలుగుతారు. సంపదలు కావాలని
కోరితే వారికి అమితమైన ఐశ్వర్యం కలుగుతుంది.
గురు గీత సర్వ దేవ స్వరూపిణి, సిద్ధిదాయిని. కనుక దీన్ని దేవీ,
సూర్య, గణపతి, వైష్ణవ మరియు శైవ ఉపాసకులందరు
జపించాలి అని పరమ శివుడు చెప్తున్నారు.
సచ్చిదానంద రూపాయ వ్యాపినే పరమాత్మనే !
నమశ్శ్రీ గురు నాధాయ ప్రకాశనంద మూర్తయే !!
సర్వ వ్యాపకుడు, పరమాత్మ స్వరూపుడు, జ్ఞాన స్వరూపుడు, ఆనంద స్వరూపుడు
అయిన సచ్చిదానందరూప శ్రీ గురుదేవునకు నమస్కారము.
విష్ణు స్వరూపుడు, కష్టాలను హరించేవాడు, ఉపనిషత్తులచే తెలియదగినవాడు,
మనస్సులకు సాక్షి అయిన సచ్చిదానందరూప శ్రీ గురుదేవునకు నమస్కారము.
నేనే విష్ణువును, అన్నింటా వ్యాపించి ఉన్న ఆత్మను, ఈ ప్రపంచమంతా నా
లోనే కల్పితం అయినది అని ఈ సత్స్వరూపమైన ఆత్మ తత్వాన్ని ఎవరి అనుగ్రహంవల్ల
తెలుసుకున్నానో, ఆ సచ్చిదానంద సద్గురువుల పాద పద్మములకు నమస్కరిస్తున్నాను.
ఓం శాంతి శాంతి శాంతి:
శ్రీ
సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కి జై !
No comments:
Post a Comment