స్థితప్రజ్ఞుడు ఎప్పుడూ స్థిరబుద్ధితో ఉంటారు అని
భగవద్గీత చెపుతుంది. కాని స్థిర బుద్ధి అంటే ఏమిటి? అది ఎలా పొందవచ్చు? దీనికి
అడ్డంకులు ఏమిటి?
కోరికలయందు ఆసక్తి తొలిగిపోయి, ఆత్మ యందు సంతుష్టుడై ఉన్న
వానిని స్థితప్రజ్ఞుడు అని చెప్తారు. ఇక్కడ కోరికలన్ని పూర్తిగా తొలిగిపోతే కాని ఈ
లోకంలో కష్టాలు లేకుండా పోవు అని చెప్పచ్చు. కాని ఇది సాధ్యమేనా! ప్రపంచంలో ఎన్నో
విషయాలు, ఈ విషయాలు మాటి మాటికి మనలను బాహ్య ప్రపంచములోకి లాగుతాయి. ఈ విషయాలు
సుఖం కాని లేదా దుఃఖం కూడా కలగచేయవచ్చు. అందుకే స్థిర బుద్ధి ఉంటే వీటిని సమ
స్థితిలో ఎదుర్కోవచ్చు. మనం ఈ ప్రపంచాన్ని నియంత్రించలేము, కాని మనం ఈ ప్రపంచాన్ని
చూసే విధానాన్ని మార్చుకోవచ్చు. మన ఆలోచనా సరళిని మార్చుకోవచ్చు. మనకు అప్పుడు ఈ
విషయాలు అంత కష్టం అని అనిపించకపోవచ్చు. ఈ విషయాలనే భగవానుడు ఈ శ్లోకంలో చెప్పారు.
యః సర్వత్రానభి స్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభమ్ !
నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠతా !!
దేనియందును మమతాసక్తులు లేనివారై, అనుకూల పరిస్థితులయందు
హర్షము, ప్రతికూల పరిస్థితులయందు ద్వేషము మొదలగు వికారములకు లోనుకాని వారిని
స్థితప్రజ్ఞులు అని అనబడును.
పైన చెప్పిన స్థితిలో స్థిత ప్రజ్ఞుడు ఎలా ఉంటాడో
తెలుసుకున్నాము. ఇది మనకు సాధ్యమేనా!
మన
మనస్సుని అదుపులోకి తెచ్చుకొని భగవంతుడు వైపు తిరగాలి అంటే మనకు అభ్యాస, వైరాగ్యాలు కావాలి. మనం ఒక విషయం నేర్చుకోవాలి అంటే
దాన్ని గురించి తెలుసుకోవడమే కాకుండా, అది పొందుతాము అనే నమ్మకం ఉండాలి. అది పొందినదాకా వేరే విషయాలపై వైరాగ్యం ఉండాలి. ఈ
ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు ఉంటాయి. అవన్నీ మనలను తప్పుదోవ పట్టిస్తాయి.
మనలను గమ్యం వైపు వెళ్లకుండా అడ్డుపడతాయి. అందుకే భగవానుడు తరువాత శ్లోకంలో మనం
ఎలా ఉండాలో చెప్తున్నారు.
యదా
సంహరతే చాయం కూర్మ అంగానీవ సర్వశ:!
ఇంద్రియాణి
ఇంద్రియార్ధేభ్య : తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా !!
తాబేలు
తన అంగములను అన్ని వైపులనుండి లోనికి ముడుచుకొనునట్లుగా, ఇంద్రియములను
విషయములనుండి అన్ని విధముల ఉపసంహరించుకొనిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా
ఉన్నట్లు భావించవలెను.
ఒక
విద్యార్థికి చదువుకన్నా ముఖ్యమైనది ఏదీ ఉండకూడదు. మిగిలిన
విషయాలు ఎంత వరకు అవసరమో అంతవరకే పట్టించుకోవాలి. లేకపోతె పక్క దారులు పట్టే
అవకాశం ఉంటుంది. అలానే ఒక సాధకుడు భగవంతుని గూర్చిన ఆలోచనలోనే ఉండాలి. మిగిలిన
కర్మలు ఈ శరీరానికి ఎంత అవసరమో అంత వరకే నిర్వర్తించాలి. అప్పుడు ఈ విషయవలయంలో
ఇరుక్కోకుండా ఉంటాము. ఈ సాధనకు మరీ భంగం వాటిల్లే పరిస్థితి వచ్చినప్పుడు ఒక
తాబేలు లాగా అన్ని ఇంద్రియాలను అదుపులోకి తెచ్చుకోవాలి.
మనకు
భగవంతుడు ఎందుకు కావాలో అర్ధం చేసుకోవాలి. ఆత్మ తత్త్వం ఎందుకు అవసరమో
తెలుసుకోవాలి. ఒక పిల్లవాడికి ఒక తినే వస్తువు, ఒక కట్ట డబ్బులు చూపించి ఏది
కావాలి అంటే ఆ పిల్లవాడు తినే వస్తువే తీసుకుంటాడు. ఆ పిల్లవాడికి డబ్బుల విలువ
తెలియదు. ఆ డబ్బులతో చాలా తినుబండారాలు కొనుక్కోవచ్చు కాని వాడికి ఆ తినే వస్తువే
పరమ సంతోషాన్ని ఇస్తుంది. అలానే మనం కూడా భగవంతుడు అనే అమూల్యమైన సత్యాన్ని
వదిలివేసి, స్వల్ప సంతోషాన్ని ఇచ్చే వస్తువుల వెంట పడుతున్నాము. మనం ఏమి
పోగొట్టుకుంటున్నామో అర్ధం చేసుకోవడం లేదు.
స్థిరబుద్ధికి
అవసరమైన సాధనాలు:
జీవిత
లక్ష్యం ఏమిటో అర్ధం చేసుకోవాలి:
మన గమ్యం
ఏమిటో, మనం ఆ గమ్యాన్ని ఎలా చేరుకోవాలో తెలుసుకోవాలి. ఇది ఒక్కోసారి అంత సులభం
కాదు అందుకే మనకు ఒక మార్గదర్శి (శాస్త్రాలు -గురువు) కావాలి. అందరు పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన దాకా ఏమి చేస్తున్నారు, ఎందుకు సుఖంగా
ఉండలేక పోతున్నారు అనే ప్రశ్నలను ఎవరికి వారు వేసుకొని వారి గమ్యం ఏమిటో
తెలుసుకోవాలి.
జీవన
ప్రయాణం గురించి తెలుసుకోవాలి:
ప్రయాణంలో
వచ్చే లోటుపాట్లు తెలుసుకొని అవసరమైనవి సమకూర్చుకోవాలి. ఈ ప్రయాణంలో ఎక్కడ ఏది
అవసరం అవుతుందో అడిగి తెలుకోవాలి. ప్రయాణం చేసిన వారి దగ్గర నుంచి అడిగి
తెలుసుకోవాలి.
శారీరక
ఆరోగ్యం మెరుగ్గా ఉంచుకోవాలి:
శరీరంపై
వ్యామోహం ఉండకూడదు అని మన శాస్త్రాలు చెప్తాయి కాని ఆ శరీరమే లేక పొతే మనం ఈ
ప్రయాణం చేయలేము. శరీరమే లేకపోతే ఆధ్యాత్మిక సాధనే లేదు. అందుకే మనకు మానవ జన్మ
వచ్చింది అని మన శాస్త్రాలు చెప్తాయి. మనం మన శరీరాన్ని ఒక
సాధనం లాగా వాడుకోవాలి అని బాబా కూడా చెప్పారు. దానికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో
అర్ధం చేసుకోవాలి. ఒకరికి దాహం వేసింది, అంటే శరీరానికి నీరు అవసరం అయింది.కాని మన
మనస్సు సాఫ్ట్ డ్రింక్ కావాలి అంటుంది.లేక పొతే నాలుకకు టేస్ట్ ఉండదు. అందుకని
శరీరానికి అక్కరలేనిది ఇస్తాము. మరి ఆరోగ్యం సంగతి ఏంటి? ఇలా చెప్పుకుంటే మనం మన
శరీరాన్ని నాలుక ఆధారంగా హింసించడం నేర్చుకున్నాము.
మానసిక
ఆరోగ్యం పాడవకుండా చూసుకోవాలి:
మనసుని
కలుషితం చేసే వాటికి దూరంగా ఉండటం నేర్చుకోవాలి. కోపము, ద్వేషము, పగ, అసూయ, భయము,
ఆదుర్దా పడడం, అతిప్రేమ, అహంకారము మొదలైనవన్ని మనసుని ఉద్రిక్తతకు గురి చేస్తాయి.
జీవితంలో కొన్ని నిబంధనలు ఉండాలి. మనం వాటిని దాటకూడదు. దైవ చింతన, సత్సంగము, మంచి
ఆలోచనలు, దయా గుణం, క్షమాగుణం అలవాటు చేసుకొని, వీటిని మన జీవితంలో ఒక భాగంగా
చేసుకోవాలి. అప్పుడే మన మానసిక ఆరోగ్యం బాగుంటుంది. మన బుద్ధి స్థిరంగా ఉండాలి
అంటే ఇవన్నీ చేయక తప్పదు.
ధర్మాన్ని
అనుసరించాలి:
మనం
ధర్మాన్ని వదిలితే మానసిక క్షోభ తప్పదు. మనం చేసే పనిని మనం ఎంత సమర్ధించుకున్నా
తప్పు తప్పే అవుతుంది. మనం కళ్ళు మూసుకున్నా దాని ఫలితం మనలను వెంటాడుతుంది. మనం
ఒక అబద్దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇంక స్థిరబుద్ధి
ఎక్కడ నుంచి వస్తుంది.
విచక్షణ-
విచారణ అలవాటు చేసుకోవాలి:
మనం చేసే
ప్రతి కర్మలో ఉన్న సత్యాన్ని అర్ధం చేసుకోవాలి. ఈ కర్మ వల్ల ఎవరికి కష్టం నష్టం
జరగకుండా చూసుకోవాలి. ఒక పని చేసే ముందు అది ఎంత వరకు మన ప్రయాణంలో ఉపయోగపడుతుందో
అర్ధం చేసుకోవాలి. ఒక ట్రైన్లో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మధ్యలో చాలా స్టేషన్స్
వస్తాయి. ఒక ఊరు చాలా బాగుంది అని మన గమ్యం రాకముందే అక్కడ మనం దిగము. మనం
ట్రైన్ దిగకుండానే దాన్ని ఎంత వరకు ఆస్వాదించాలో అంత
వరకే ఎంజాయ్ చేస్తాము. అలానే మనకు అవసరం లేని వాటిని ఎంత వరకు పట్టించుకోవాలో
అంతవరకే పట్టించుకోవాలి. వేరేవాళ్లు చేస్తున్నారని వాటివెంట పరుగులు తీయకూడదు.
మనస్సుకి అనవసరమైనవి ఇస్తూ ఉంటే, బుద్ధికి స్థిరత్వం ఉండదు.
జీవితానికి
అవసరమైన వస్తువుల మీద నియంత్రణ ఉండాలి:
సంపాదన
అనేది జీవితంలో ముఖ్యమైన అంశం. అలానే మన దగ్గర ఉన్న సంపదను ఎలా ఖర్చు చేస్తామనేది
కూడా ముఖ్యమే. ఇవి మన జీవితంలో ఎటువంటి ప్రాముఖ్యతను సంతరించుకున్నాయో అర్ధం
చేసుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కో ప్రమాణం ఉంటుంది. కాని ఈ సంపాదన మనకు సంతోషాన్ని
ఇవ్వకపోతే ఉపయోగం ఏంటి? మనం సంపాదించేదే సుఖపడడానికి కదా! మరి ఈ సత్యాన్ని ఎందుకు
అర్ధం చేసుకోకూడదు? ఈ వస్తువులు మనకు ప్రయాణంలో ఉపయోగపడాలి. అంతే కాని వాటికోసమే
మనం మన ప్రయాణం మార్చుకోకూడదు. ఈ వస్తు సేకరణే మనలను స్థిరబుద్ధికి దూరం
చేస్తుంది. స్థితప్రజ్ఞుడు చాలా సంపాదించవచ్చు కాని దానిమీద ఏ మాత్రము ఆసక్తి
ఉండదు.
అంతర్గత
సుద్ధి - ధ్యానం:
మనం పైన
చెప్పినవన్ని చేస్తూవుంటే మానసిక సుద్ధి జరుగుతుంది. అప్పుడు చిత్తం ప్రశాంతతను
పొంది, బుద్ధి నిర్మలమవుతుంది. బుద్ధి స్థిరంగా ఉండాలి అంటే ధ్యానం చాలా అవసరం.
ధ్యానం కుదరాలి అంటే ఊరికినే కూర్చుంటే సరిపోదు. రోజంతా మనసుని ప్రశాంతంగా
ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకే బాబా ఇలా చెప్పారు. మీరుచేసే పనులన్నింటిని
నాకు సమర్పించండి. అప్పుడు మీలో ఈ పని చేయాలా వద్దా అన్న విచక్షణ మొదలవుతుంది. ఇదే
మిమ్మల్ని రక్షిస్తుంది.
స్థితప్రజ్ఞుడికి
స్థిరబుద్ధి అనేది స్వభావసిద్ధం. కాని సాధకులకు ఇది ఒక సాధన అంశం. సమాజంలో ప్రతి
వ్యక్తి సుఖంగా ఉండటానికి ఈ సూత్రాలు ఎంతో సహాయ పడతాయి. అందుకే
భగవానుడు వీటికి ఇంత ప్రాముఖ్యత ఇచ్చారు.
ఓం శ్రీ
సాయిరాం!
No comments:
Post a Comment