భగవానుడు
భగవద్గీతను సంక్షిప్తంగా రెండో అధ్యాయంలోనే దాదాపు చెప్పేసారు. అధ్యాయము చివరలో
స్థితప్రజ్ఞుడు గురించి చెపుతూ ఇంద్రియాలను ఎలా నియంత్రించుకోవాలో చెప్పారు. ఇక ఈ
అధ్యాయము ముగిస్తూ ఇంకా స్థితప్రజ్ఞుడు ఈ లోకంలో ఎలా వ్యవహరిస్తాడో చెప్తున్నారు.
యా నిశా
సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ !
యస్యాం
జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే: !!
నిత్య
జ్ఞానస్వరూపుడైన స్థితప్రజ్ఞుడు పరమానంద ప్రాప్తినందు మేల్కొని ఉండును. అది ఇతర
ప్రాణులకు రాత్రి వంటిది. నశ్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుచు
ప్రాణులన్నియు మేల్కొని ఉండును. ఇది స్థితప్రజ్ఞుడైన మునికి రాత్రితో సమానము.
ఈ శ్లోకం
కేవలము మాటల అర్ధంతో మాత్రమే చూడకూడదు. దీని భావార్ధాన్ని గ్రహించాలి. సామాన్యంగా
అందరూ ఆరాటపడే వాటిపై జ్ఞానికి ఏ మాత్రము మనసు పోదు. అవి అశాశ్వతము అని తనకు
తెలుసు. ఆ వస్తువుల విషయంలో జ్ఞాని నిద్రపోవడం అంటే, వాటికి ఏమి ప్రాముఖ్యత
ఇవ్వకపోవడం. అలానే పరమాత్మ విషయంలో మామూలు ప్రాణులన్ని నిర్లిప్తంగా ఉంటాయి. అంటే
వారు పరమాత్మ విషయంలో నిద్రిస్తున్నట్లు. కాని జ్ఞాని మాత్రము ఎప్పుడూ ఆ
స్థితిలోనే ఉంటాడు. జ్ఞాని దేని కోసం ఆరాటపడకుండా తనకు లభించినా వాటితో సంతోషంగా
ఉంటాడు.
ఈ వస్తు
ప్రపంచాన్ని మాయ అనే రంగు కళ్లద్దాలు పెట్టుకొని మనం చూడడం నేర్చుకున్నాము. దీన్నే అజ్ఞానము అంటారు. మన మనస్సు మనపై ఒక రకమైన మాయాజాలాన్ని చేస్తుంది. అంతటా
వ్యాపించిఉన్నభగవంతుని అసలు రూపాన్ని మనం చూడలేము. ఒక సాధకునికి తన
అసలు రూపం ఏమిటో అనుభవం అయినప్పుడు ఇక అంతా పరమాత్మ తత్వమే గోచరిస్తుంది. ఒకవేళ ఈ
జ్ఞాని మనకు ఈ ప్రపంచంలో మునిగి ఉన్నట్లు కనిపించినా ఈ వస్తువులు వారిని ఏ విధంగా
కదపవు. ఆ మాయ అనే కళ్లద్దాలు లేక పొతే మనకు పరమాత్మ తత్త్వం ఏమిటో తెలుస్తుంది.
తరువాత
శ్లోకంలో భగవానుడు మనకు తేలికగా అర్ధం అయ్యే ఉదాహరణ చెప్పారు.
ఆపూర్యమాణం
అచలప్రతిష్ఠం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ !
తద్వత్
కామా యం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామకామీ !!
అన్ని
దిక్కులనుండి పొంగి ప్రవహించి వచ్చి చేరిన నదులన్నియును పరిపూర్ణమై నిశ్చలమైన
సముద్రమును ఏ మాత్రము చలింపచేయకుండగనే అందులో లీనమగును. అట్లే సమస్త భోగములు
స్థితప్రజ్ఞుని యందు ఎట్టి వికారములను కల్గించకుండానే వానిలో లీనమగును. అట్టి
పురుషుడే పరమ శాంతిని పొందును. భోగములపై ఆసక్తి ఉన్న వారు శాంతిని పొందజాలరు.
ఇక్కడ
భగవానుడు చాలా తేలికగా అందరికి అర్ధం అయ్యేలాగా మంచి ఉదాహరణతో పోల్చి చెప్పారు.
ఎంత నీరు వచ్చి చేరినా సముద్రం అలాగే ఉంటుంది. అలానే సూర్యుడు తాపంతో ఎంత నీరు
ఆవిరి అయినా దాని మట్టం ఏమి మారదు. అందుకే భూమిమీద దేని కొలతలన్నా చెప్పాలి అంటే
అవి సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉన్నాయో చెప్తారు. దీని వల్ల మనం ఏమి నేర్చుకోవచ్చు
అంటే, చిన్న చిన్న వాటికి తొణకకుండా వాటిని బాధ్యత ప్రకారం నిర్వర్తించడం
నేర్చుకోవాలి. కంగారు పడకూడదు. ప్రతిదానికి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించకుండా,
అవసరాన్ని బట్టి స్పందించడం నేర్చుకోవాలి. అప్పుడే ఈ జీవితంలో వచ్చే ఆటుపోట్లను
భరించగలుగుతాము.
మనం ఎప్పుడైతే
సమస్థితిలో ఉండడం నేర్చుకుంటామో, మన ప్రవర్తనలో మార్పు వస్తుంది. అది బయటకు
స్పష్టంగా కనపడుతుంది. దీనివల్ల మన చుట్టూ ఉండే వారు కూడా ప్రభావితులు అవుతారు.
ఇదే విషయాన్ని భగవానుడు ఈ రెండో అధ్యాయము చివరలో చెప్పారు. దీన్నే మన శాస్త్రాలు
బ్రాహ్మీస్థితి అని అంటాయి. ఈ స్థితిలో ఉన్న వారు కోరికలన్నిటిని త్యజించిన వారై,
మమతా, అహంకార, స్పృహ రహితులై చరిస్తారు. వీరు అన్నివేళలా పరమ శాంతితో ఉంటారు. మనం
కూడా ఈ స్థితిని రోజు గాఢ నిద్రలో అనుభవిస్తాము. కాని
ఈ స్థితిని మనం ఏమి తెలియకుండానే, ఒక రకమైన తామసిక స్థితిలో అనుభవిస్తాము. ఎలాంటి
శారీరక, మానసిక బాధ ఉన్నా మనకు గాఢనిద్రలో తెలియదు. అలానే స్థితప్రజ్ఞుడికి
ఎల్లవేళలా ఆ స్థితి ఉంటుంది. మనం అందరం ఎప్పుడు ప్రయత్నించేది ఈ శాశ్వత సుఖం
కోసమే. కాని మనం పరుగులు తీసే దారి దీనికి భిన్న మైన దారిలో తీసుకు వెళ్తుంది.
డబ్బు, హోదా, పరపతి, పదవులు, మన వారిపై ఎనలేని ప్రేమ ఇలాంటివి ఎన్నో మనలను పక్క
దారులు పట్టిస్తాయి. మన సమస్య ఇవన్నీ కూడా కాదు. వాటిపై మనకున్న ఆసక్తి మాత్రమే
మనలను మాయలో పడవేస్తుంది.
స్థితప్రజ్ఞుడు
మనస్సు అహంకారాలకు అతీతంగా ఉంటారు. అందుకే ఈ రెండో అధ్యాయంలో భగవానుడు చాలా
సూత్రాలను చెప్పారు. వాటిని మనం చాలా తేలిక భాషలో చెప్పుకుందాము. ఇవి కనక మనం
కొంచమైనా అనుసరించ కలిగితే మనం చాలా సంతోషంగా ఉండచ్చు.
మనకు
అవసరంలేని ప్రపంచ విషయాలలో ఆసక్తిని తగ్గించుకోవాలి. ఈ విషయాలను పూర్తిగా చూడకుండా
ఉండడం కష్టం. కాని వాటిమీద ఆసక్తి తగ్గించుకోవాలి.
మనం రోజు
తినే ఆహారపదార్ధాలపై మనకు ఎంత ఆసక్తి ఉందొ అర్ధం చేసుకోవాలి. వాటి రుచి కోసమే
తినకుండా, కేవలం శరీర పోషణ కోసం తినాలి.
ఆధ్యాత్మిక
సాధకుడుగా ఉన్న వారు, అందరిని మార్చాలని, అందరికి అన్ని చెప్పాలి అనే తపనను
తగ్గించుకోవాలి. ఎవరినైతే ఆ విధి మన ముందు ప్రవేశపెడుతుందో
వారితో మాత్రమే ఈ జ్ఞానాన్ని పంచుకోవాలి.
ఎవరితో
కూడా అనవసరమైన వాగ్వివాదములలో దిగకూడదు.
నేను
నాది అనే భావాలు ఎక్కడ బయట పడుతున్నాయో అర్ధం చేసుకోవాలి.
ఎక్కడైతే
వ్యతిరేఖ భావాలు ఉంటాయో, అక్కడ జాగ్రత్తను వహించాలి. అతివాద సిద్ధాంతాలు ఉన్నచోట ఏ
పక్షం వహించరాదు. తెలివిగా అక్కడనుండి బయటపడాలి.
ఎవరి
గురించి చెడు ఆలోచనలు చేయకూడదు. ఎవరిపై తొందరగా ఒక అభిప్రాయాన్ని ఏర్పడుచుకోకూడదు.
అందరు
మనలను ప్రేమించాలి లేదా మనం అందరి ఆప్యాయతను పొందాలి అనే ఆసక్తిని వదలాలి. మనం అందరిని ప్రేమించడం నేర్చుకోవాలి.
మనం
ఏకాంతంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. ఏకాంతం అంటే ఒంటరిగా ఉండడం కాదు. మనం సమ
స్థితిలో ఉంటే పదిమందిలో ఉన్నా ఏకాంతంగా ఉండచ్చు. మనలో ఈ సమస్థితి లేకపోతే ఒంటరిగా
మాత్రమే ఉండగలుగుతాము.
చివరిగా
భగవంతుని ప్రేమించడం నేర్చుకోవాలి. శాస్త్రాలను అవగాహన
చేసుకోవాలి. పరమాత్మను ధ్యానించడం నేర్చుకోవాలి.
ఓం శ్రీ
సాయిరామ్!
No comments:
Post a Comment