స్థితప్రజ్ఞునికి
ఇంద్రియాలమీద పూర్తి అవగాహన ఉంటుంది. వారికి వీటివల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు.
ఐదు జ్ఞానేంద్రియాలు బయట ఉన్న వస్తువులకు తగినట్లుగా వ్యవహరిస్తాయి. ఇవి మనస్సు
చెప్పినట్లుగా నడుచుకుంటాయి. ఒకవేళ సాధకుడు వీటిని గట్టిగా బంధించినా అది కొంతకాలం
మాత్రమే. వాటిమీద పట్టుసడలితే మళ్ళా విజృంభిస్తాయి. ఎదురుగా ఉన్న అందమైన వస్తువు
ఒక గుడ్డి వాడిని కదిలించలేక పోవచ్చు అంతమాత్రం చేత అతనికి ఇంద్రియాల మీద నియంత్రణ
ఉన్నట్లు కాదు. భగవానుడు అందుకే ఇలా చెప్పారు.
స్థితప్రజ్ఞుడికి ఇంద్రియాలనన్నింటిని నియంత్రించే శక్తి ఉంటుంది. విషయాల మధ్య ఉన్నా, వారు వాటిని అనుభవిస్తున్నట్లు
అనిపించినా వారికి వీటివల్ల ఎటువంటి అవరోధం ఉండదు. ఒక సాధకుడు
ప్రత్యాహారమనే యోగ ప్రక్రియ ద్వారా దీన్ని సాధించడానికి ప్రయత్నిస్తాడు. ఇది
తేలికగా సాధించే ఉపాయం షిర్డీ సాయి చెప్పారు. అదే భగవంతుని పట్ల అపారమైన నమ్మకం.
పూర్తి శ్రద్ధ కలిగి ఉండి సభూరితో వ్యవహరించాలి. గీతలో ఈ విషయం గురించి ఈ విధంగా చెప్పడం జరిగింది.
విషయా
వినివర్తన్తే నిరాహారస్య దేహినః !
రస
వర్జమ్ రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే !!
ఇంద్రియముల
ద్వారా విషయములను గ్రహింపని వానినుండి ఇంద్రియార్ధములు మాత్రమే వైదొలుగును. వాటిపై
ఆసక్తి మిగిలిఉండును. స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారమైనందువల్ల వాని నుండి ఆ
ఆసక్తి కూడా తొలిగిపోవును.
ఒక అజ్ఞాని బలవంతంగా ఇంద్రియాలను కట్టడి చేసినా వాటిపై
ఆసక్తి మాత్రం నశించదు. కావున అతని ఇంద్రియాలు విషయాల వైపు పరుగులు తీస్తూ ఉంటాయి.
అవి వారి మనస్సుని ప్రశాంతంగా ఉండనివ్వవు. డయాబెటిస్ ఉన్నవారు షుగర్ పెరుగుతుంది
అని తీపి పదార్ధాలను త్యజించవచ్చు. కాని వాటిపై ఆసక్తి మాత్రం పోకపోవచ్చు. అలానే
కొన్ని పనులు మనం చేయలేక పోవచ్చు కానీ వాటిమీద ఉన్న ఆసక్తే వాసనగా మిగిలిపోతుంది. ఇది
జన్మజన్మలకు మనలను వేధిస్తూ ఉంటుంది. అందుకే భగవానుడు పరమాత్మ సాక్షాత్కారమైతే ఈ
వాసనలన్నీ నాశనం అవుతాయి అని చెప్పారు.
పైన
నిరాహారస్య అనే పదాన్ని వాడారు. నిరాహారి అంటే కేవలం నాలుకకు సంబంధించినదే కాదు.
అన్ని జ్ఞానేంద్రియాలకు వర్తిస్తుంది. మనం కనులతో చూసేవి, చెవితో వినేవి ఇలా అన్ని
ఇంద్రియాలతో మనం గ్రహించేవి ఒక్కోసారి వాసనలుగా మిగిలిపోతాయి. ఈ ఇంద్రియాలను ఎలా
అదుపులో ఉంచుకోవాలో చెప్తూ బాబా నానాచందోర్కరుకు శమదమాది షట్ సంపత్తి గురించి ఇలా చెప్పారు.
శమ, దమ, తితీక్ష,
ఉపరతి, శ్రద్ధ మరియు సమాదానాలనే ఆరింటిని శమదమాధిషట్కము అంటారు.
శమము: ఇంద్రియ
విషయముల యందు మనోనిగ్రహము కలిగి ఉండటమే శమము అంటారు.
దమము : ఒకవేళ
కొన్ని విషయాల యందు ఆసక్తి కలిగిన వెంటనే ఆ చాంచల్యాన్ని బలవంతంగా అణిచివేయటమే
దమము అంటారు.
తితీక్ష : మనకు
ప్రారబ్ధవశాన ప్రాప్తించిన వాటిని ఓర్పుగా సహించటమే తితీక్ష.
ఉపరతి :
మాయాజాలంలో చిత్తం చిక్కు పడక, కాంత, కనకములు, సంతానము, ఆప్తులు వీళ్ళంతా మిధ్య
అని గ్రహించడం ఉపరతి అంటారు.
శ్రద్ధ : దృడ విశ్వాసముతో మెలగడం శ్రద్ధ అని అంటారు.
సమాధానం : సుఖదుఃఖాలను సమభావముతో చూస్తూ అంతరంగంలో ఎలాంటి
తడబాటు లేక నిశ్చలంగా ఉండటమే సమాధానము.
ఈ
ఆరింటిని అర్ధం చేసుకుని ఆచరిస్తే ఇంద్రియాలను నియంత్రించడం తేలిక అవుతుంది.
ఇప్పుడు నియంత్రణకు కావలసిన సూత్రాలను చూద్దాము. ఈ విషయవాంఛలకు మూలం ఏమిటో
పరిశీలిద్దాము.
ఎవరైనా
ఒక వస్తువుని అనుభవించాలి అంటే మూడు అంశాలు కలవాలి.
విషయవస్తువు:
ఈ ప్రపంచం అంతా విషయవస్తువులతో నిండియున్నది. మానవులుగా మనకు వీటివెనక పరుగులు
తప్పడంలేదు.
జ్ఞానేంద్రియాలు:
మనం బయటనున్న వస్తువులను అనుభవంలోకి తెచ్చుకోవాలి అంటే మనకు జ్ఞానేంద్రియాలు
కావాలి. వయసు వచ్చేకొద్దీ వీటిలో పటుత్వం కాస్త తగ్గచ్చు. కాని మనం ఈ వస్తువులను
వదలలేము. మనం వేరే రకంగా కష్టపడి మనం అనుభవించలేనివన్నీ మన పిల్లలుకు దక్కాలి అని
కోరుకుంటాము.
మనస్సు:
ఈ మూడుంటిలో మనస్సు ప్రధానమైనది. ఇంద్రియాలన్నింటికి రాజు. మనసు చెప్పినట్లు
మిగిలినవన్ని పనిచేయక తప్పదు. మనకు అన్ని ఎదురుగా ఉన్నామనసుగనుక ఇష్టం చూపించకపోతే
మనం ఆ వస్తువుని అనుభవించలేము.
ఒక్కో
సారి ఆ వస్తువుని వదిలివేయడంవల్ల కూడా మనం సుఖం పొందుతాము. లేదా వేరేవాళ్లు ఆ
వస్తువుతో సుఖపడితే మనకు చెప్పలేని ఆనందం కలుగుతుంది. తల్లితండ్రులు కష్టపడి తమ
బిడ్డలను పెద్ద స్థితికి ఎదిగేలాగా చేస్తారు. వారు సంపదలతో మంచి ఉద్యోగాలతో
సుఖపడితే తల్లితండ్రుల సంతోషానికి అంతే ఉండదు. ఈ ఉదాహరణలో ఆ వస్తువు మన దగ్గర
లేకుండానే మనం ఆనందాన్ని పొందుతున్నాము. ఇది ఎలా సాధ్యం! అంతా మన ఆలోచనా విధానంలో
ఉంది.
సరిగా
అర్ధం చేసుకుంటే ఈ మనసుని నియంత్రించడం మనకు పెద్ద
కష్టం కాదు. ఈ ప్రపంచంలో ఉన్న సుఖం అంతా మనదే. ఈ స్థితే స్థితప్రజ్ఞత. సమదర్శిగా
ఉండటం అలవాటు చేసుకుంటే మనం కూడా ఈ స్థితిని పొందవచ్చు.
ఓంశ్రీ
సాయిరాం!
No comments:
Post a Comment