In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, May 31, 2017

భగవద్గీత 3- కర్మయోగం



భగవద్గీత మూడో అధ్యాయం కర్మ యోగంగా చెప్తారు. ఈ కర్మయోగాన్ని అవలంభించాలి అంటే మనం కొన్ని సూత్రాలను అర్ధం చేసుకోవాలి. మొట్టమొదటిగా జీవితం యొక్క లక్ష్యం తెలుసుకోవాలి. లక్ష్యం లేని ఏ పని అయినా దారి తెన్నులేకుండా ఉంటుంది. అర్జునుడు సాంఖ్య యోగం అంతా విని ఒక పెద్ద సందేహం వ్యక్తపరుస్తాడు. భగవానుడు కర్మ గురించి, జ్ఞానం గురించి చెప్పిన తరువాత వీటిల్లో ఏది ఆచరించాలో తెలియక అర్జునుడు తికమక పడిపోతాడు. ఇవన్ని విని నా బుద్ధి భ్రమకు లోనవుతుంది. కనుక నీవే నాకు శ్రేయస్కరమైన ఒక మార్గాన్ని నిశ్చయంగా తెలుపు అని వేడుకున్నాడు. అప్పుడు భగవానుడు ఇలా చెప్పారు. 

లోకేస్మిన్ ద్వివిధా నిష్టా పురా ప్రోక్తా మయానఘ !
జ్ఞాన యోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం !!

ఓ అనఘా! అర్జున ! ఈ లోకంలో రెండు నిష్ఠలు ఉన్నాయని ఇంతకుముందే చెప్పాను. వానిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగము ద్వారా, యోగులకు కర్మ యోగం ద్వారా నిష్ఠ కలుగును.   

మనము ఏ నిష్ఠను ఆచరించినా కర్తవ్య కర్మాచరణను మాత్రము విస్మరించరాదు. మనుష్యులు కర్మలను ఆచరించకుండా నైష్కర్మ్యము అనే యోగనిష్ఠ సిద్ధించదు. అట్లే కేవలము కర్మలను త్యజించినంత మాత్రమున సాంఖ్య నిష్ఠను పొందజాలరు. 

మనం కర్మ చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేము. నిద్రలేచిన దగ్గరనుండి మళ్ళా పడుకునే దాకా మనం చాలా పనులు మనం చేస్తాము. నిలబడుట, కూర్చోవడం, తినుట, తాగుట, నిద్రించుట, కలలు గనుట, ఆలోచించుట ఇలా మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాము. అసలు మనం కర్మ అనేది ఎందుకు చేస్తాము. ప్రకృతిలో ఉన్న సత్వ, రజో మరియు తమో గుణాలు మనలను కర్మలు చేయడానికి ప్రేరేపిస్తాయి. కాని గుణాతీతుడైన జ్ఞాని ఈ గుణములకు వశుడై ఉండకుండా కర్మలను ఆచరిస్తారు. ఫలితంపై ఆసక్తి లేకుండా చేసిన కర్మలు మనలను కర్మ యోగం వైపు నడిపిస్తాయి. 

శ్రీ సద్గురు సాయి ఈ విషయాలనే చాలా సరళంగా మనకు అర్ధం అయ్యేలాగా చెప్పారు. అసలు ఈ నిష్కామ కర్మలు మన జీవితాన్ని పండించాలి అంటే మనం ఏమి అర్ధం చేసుకోవాలి? 

సాయి భక్తులమైన మనం శ్రీ సాయి సత్చరిత ద్వారా ఈ ధర్మాన్ని నేర్చుకోవచ్చు. సాయి చిన్న చిన్న జీవిత సంఘటనలతో మనకు ఈ సత్యాన్ని బోధించారు. 

సత్ చిత్ ఆనందం అనే మూడు మిళితం అయి ఉన్న తత్వమే పరతత్వం. సద్వస్తువు ఉన్న చోట జ్ఞానానందాలు తప్పక ఉంటాయి.  ధర్మ సంస్థాపనకొరకు , మరియు తాపత్రాయాలతో తపించి పోతున్న ఈ లోకాన్ని ఉద్దరించటానికి, నిర్గుణ నిరాకార పరబ్రహ్మ మానవ రూపంలో గురువుగా అవతరిస్తారు. అటువంటి నిరాకార పరబ్రహ్మమే, శ్రీ సాయినాథుని రూపంలో సాకార పరబ్రహ్మగా అవతారం దాల్చింది. ధర్మార్ధ కామ మోక్షాలనే పురుషార్ధాలలో మోక్షానికి మూలం అయినది ధర్మము. ధర్మం ఆచరింప బడితే మోక్షం దానంతట అదే వస్తుంది. అందుకే ఏ మతమైన, ఏ శాస్త్రమైన ఈ ధర్మాన్నే బోధించటం జరిగింది. కాని మానవులుగా దాన్ని మనం అర్ధం చేసుకునే విధంగా అర్ధం చేసుకుంటున్నామా, లేక మనకి ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నామా!  ధర్మానికి పెడర్ధాలు తీస్తే, మనం మోక్షానికి దూరం అవుతాము.  

ధర్మాన్ని అనుసరించాలి అంటే కర్మ యోగమంటే ఏమిటో తెలుసుకోవాలి. కర్మను కర్మ యోగంగా ఎలా మార్చుకోవాలో మూడో అధ్యాయం మనకు నేర్పిస్తుంది. ఈ కర్మయోగం ద్వారా మన జీవితాన్ని కూడా సుగమం చేసుకుందాము.  ఈ కర్మ యోగాన్ని మనకు అర్ధం అయ్యేలా చేసి , మన జీవితాన్ని మార్చుకొనే శక్తి మనకు శ్రీ సాయి ఇవ్వాలని ప్రార్ధిద్దాము.    

ఓం శ్రీ సాయి రామ్!

No comments:

Post a Comment