In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, May 17, 2017

భగవద్గీత స్థితప్రజ్ఞత - క్రోధమోహాలు



భగవానుడు ఇంద్రియాల సంయమనం ఎంత ముఖ్యమో తెలుపుతూ స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడో కూడా చెప్పారు. విషయ చింతన చేసే వారికి ఆ విషయములందు ఆసక్తి ఏర్పడుతుంది. ఈ ఆసక్తే ఈ విషయాలను పొందాలనే తపనను పెంచుతుంది. ఆ కోరికలు తీరకపోతే క్రోధం కలుగుతుంది. స్థితప్రజ్ఞుడు సమదృష్టితో ఉంటాడు. పరమాత్మ ప్రాప్తి పొందిన వారిని ఈ విషయాలు, ఆసక్తి అనేవి ఏమి చేయలేవు. వారెప్పుడు సమదృష్టితో ఉంటారు.

విషయాసక్తి ఉన్న వారి పరిస్థితి ఏమిటి అనే అంశం గురించి భగవానుడు ఇలా చెప్పారు.

క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః !
స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశో  బుద్ధినాశాత్ ప్రణశ్యతి !!

కోపం వల్ల వ్యామోహం కలుగుతుంది. దాని ప్రభావమున స్మృతి చిన్నాభిన్నమవుతుంది. స్మృతి పొతే బుద్ధి నశిస్తుంది. బుద్ధి నాశమైతే మనుష్యుడు తన స్థితినుండి పతనమగును.

రాగము, ద్వేషము, భయము మరియు క్రోధములనే వాటికి మనం లొంగిపోతే ఏమిజరుగుతుందో మనం బాగా అర్ధం చేసుకోవాలి.

ఒక దాన్ని ఇష్టపడితే ఆ వస్తువు మనతోనే ఉండాలి అని అనుకోవడం - రాగం.

ఎవరైనా మనకు అనుకూలంగా లేకపోతే మనకు ఇష్టం లేకుండా ఉండటమే - ద్వేషం.

మనం కోరుకున్నవి, మనకు ఇష్టమైనవి మనకు దూరమవుతాయనే మానసిక వ్యథే - భయం.

మనం అనుకున్నది జరుగక పోయినా, మనకు ఎవరైనా ప్రతికూలంగా ఉంటే కలిగేదే - క్రోధం.

ఒక విషయంపై మనకు ఆసక్తి ఏర్పడితే దాన్ని గురించే మనం ఆలోచిస్తాము. దానిపట్ల మనకు సంగమం ఏర్పడుతుంది. అప్పుడు ఇంద్రియాలు, మనసు దానికొరకు తపిస్తాయి. అప్పుడు ఆ వస్తువుని ఎలాగైనా పొందాలి అనే తపన మొదలవుతుంది. ఇదే కామం లేదా కోరిక అంటారు. ఈ కోరిక తీరకపోతే మనలో క్రోధం మొదలవుతుంది. క్రోధం కాస్తా మనలను ఒక రకమైన మోహంలో పడేస్తుంది. అప్పుడు మనకు నిజం అబద్దంగా, నిజం కానిది నిజంగా కనిపిస్తుంది. మనలో ఒక ఏమరుపాటు కలుగుతుంది. దీన్నే స్మృతి విభ్రమం అంటారు. ఒక్కో సారి జ్ఞాపక శక్తి కూడా నశిస్తుంది. అప్పుడు బుద్ధి నాశనం జరుగుతుంది. ఇలా బుద్ధి నాశనం జరిగితే మనిషికి పతనం తప్పదు. ఇక్కడ పతనం అంటే డబ్బు, ఆస్తులు, హోదా ఇవి పోవడం కాదు. మనిషికి తన నిజ స్వరూపం ఏమిటో అర్ధం కాకపోవడం. బుద్ధి అనేది మనకు నిజానిజాలను తెలియ చేస్తుంది. ఆ బుద్ధే నశిస్తే ఇంద్రియాలకు, మనసుకు నిజం చెప్పేది ఎవరు?

అందుకే భగవానుడు ఇలా చెప్పారు.
నాస్తి బుద్ధిరయుక్తస్య న  చాయుక్తస్య భావనా !
న చాభావయతః శాంతిరశాంతస్య కుతః సుఖం !!

ఇంద్రియములు, మనస్సు వశమునందు ఉండని వానియందు నిశ్చయాత్మక బుద్ధి ఉండదు. అటువంటి వానికి ఆస్తిక (పరమాత్మ) భావమే కలుగదు. అలాంటి వారికి శాంతి లభించదు. మనశ్శాంతి లేని వారికి సుఖం ఎట్లా లభించగలదు.

ఇంద్రియాలను అదుపులో ఉంచలేక, మానసిక వత్తిడితో ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, గాలివానలో చిక్కుకుపోయిన నావలాంటిది. గాలి ఎటు వీస్తే, అలలు ఎటు తోస్తే అటు నెట్టబడుతుంది. అందుకే విషయాసక్తిని అర్ధం చేసుకోవాలి. మనలో ఉన్న బుద్ధి సూక్ష్మతను బయటకు తేవాలి. మన జీవితంలో జరిగే సంఘటనలలో ఉన్న సత్యాన్ని అర్ధం చేసుకోవాలి. మనం జీవించడానికి ఏమి అవసరమో, వాటికి ఎంత ప్రాముఖ్యం ఇవ్వాలి అనే విషయాలను పరిశీలించి జీవితంలో అన్వయించుకోవాలి. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా మనకు తగని వాటిపై మన దృష్టి ఉండకూడదు.

ఇంద్రియములను ఇంద్రియార్ధముల నుండి అన్నివిధములుగా నిగ్రహించిన మానవునియొక్క బుద్ధి స్థిరముగా ఉండును అని అర్జునితో భగవానుడు చెప్పారు. ఇలా స్థిరముగా ఉన్నవారినే స్థితప్రజ్ఞుడు అంటారు.



ఓం శ్రీ సాయి రాం!

No comments:

Post a Comment