భగవానుడు కర్మలను యజ్ఞముగా లోకహితం కోసమే ఆచరించమని చెప్పి, ఇప్పుడు కర్మాచరణలో జ్ఞానికి మామూలు మనుషులకు తేడాలు ఏమిటో సెలవిస్తున్నారు. ఎందుకంటే ఈ తేడాలు అర్ధం చేసుకోపోతే మనం ఎప్పటికి మారలేము. మనకు ఆసక్తిరహిత కర్మలు చేయడం ఎందుకు కష్టం అయింది? వీటికి సమాధానంగానే భగవానుడు ఇలా చెప్తున్నారు.
ప్రకృతే: క్రియమాణాని గుణై: కర్మాణి సర్వశ: !
అహంకార విముడాత్మా కర్తాహమితి మన్యతే !!
వాస్తవముగా కర్మలన్నియు అన్నివిధముల ప్రకృతిగుణముల
ద్వారానే చేయబడుచుండును. అహంకారవిముడాత్ముడు ఈ కర్మలన్నిటికిని నేనే కర్తను అని
భావించును.
ప్రకృతి మూడు గుణాల సమ్మేళనం. అవి సత్వ రజో మరియు తమో
గుణాలు. ఈ గుణాలే 23 తత్వ రూపములుగా పరిణితి చెందినవి. అవే మనస్సు, బుద్ధి,
అహంకారము, పంచ మహా భూతాలు (ఆకాశం, గాలి, అగ్ని, నీరు మరియు భూమి); దశ ఇంద్రియములు
(5 కర్మేంద్రియములు - 5 జ్ఞానేంద్రియములు) ; శబ్దాది పంచ విషయములు (శబ్ద, స్పర్శ,
రూప, రస మరియు గంధ). ఇవి అన్ని కూడా ప్రకృతి యొక్క గుణములు. అంతే కాక సత్వ
రజో తమో గుణాలు వీటి ద్వారానే వ్యక్తం అవుతాయి. మనం ఏ కర్మలు చేయాలన్నా ఈ గుణాల
ప్రేరణ వల్లనే చేస్తాము.
ఈ 23 ప్రకృతి గుణాలు నేను అని నమ్మి కర్మలు చేసే వారిని
భగవానుడు అహంకార విముడాత్మా అని సంబోధిస్తున్నారు. అంటే అహంకారముచే
మోహితమైన అంతఃకరణములుగల అజ్ఞాని అని చెప్పారు. ఇలా ప్రభావితం అయిన వారు ఈ శరీరమే
నేను అని, ఈ మనస్సు, బుద్ధి నేనే అని ఆలోచిస్తారు. ఇలా అనుకోవడాన్నే
"అహంకారం" అంటారు. అప్పుడు మనలో వివేకశక్తి నశిస్తుంది. ఏది నిజమో ఏది
నిజం కాదో తేల్చుకోలేము. అంటే ఆత్మ అనాత్మ బేధం చూడలేము.
గుణాతీత
స్థితియే ఆత్మస్థితి అని మన శాస్త్రాలు చెప్తాయి. కాని మనం ఈ గుణాలకు లోబడిపోయి
ఉన్నాము. నిజముగా ఆత్మకు కర్మకు ఏమీ సంబంధం లేకపోయినా మనం ఈ 23 తత్వాలను మన
వ్యక్తిత్వంగా చేసుకొని, నేనే ఈ కర్మలు చేస్తున్నాను అనే భ్రాంతికి లోనవుతాము.
జ్ఞానేంద్రియాలు వాడినప్పుడు, నేను వాసన చూస్తున్నాను,
వింటున్నాను, నేను కంటితో చూస్తున్నాను, ఇలా అన్నిటికి కర్త మనమే అయి వాసనలు
పెంచుకుంటున్నాము. అప్పుడు ఆ కర్మలతో బంధం ఏర్పడి, వాటి ఫలితాన్ని కూడా
అనుభవించాల్సి ఉంటుంది. ఇలా ఈ కర్మ చక్రంలో పడి నలిగిపోతున్నాము. మనం ఈ సత్యాన్ని
అర్ధం చేసుకొని మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. కర్మలు చేసేటప్పుడు వాటి
ఫలితాన్ని దృష్టిలో ఉంచుకొవాలి. అందుకే జ్ఞానులైన వారు కర్మాసక్తులైన వారికి
శాస్త్రవిహిత కర్మలను ఆచరణాత్మకంగా ఆచరించమనే చెప్తారు. గురు స్థానంలో ఉన్న వారు
ఎప్పుడు కర్మలను త్యజించవద్దు అని బోధించరు. అందుకే భగవానుడు జ్ఞానులైన వారికి ఇలా
చేయవద్దు అని హెచ్చరిక చేశారు.
మనం
కర్మలు త్యజించడం వల్ల మోక్షాన్ని పొందలేము. ఆ కర్మల ద్వారా వచ్చే ఫలితం మీద
ఆసక్తిని వదలాలి. సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుని యొక్క గుణ ప్రభావ స్వరూపములను
తెలుసుకొని వాటిపై విశ్వాసముంచవలెను. ఆ గుణాల అధీనంలో
మనమందరం ఉంటాము. కాని గుణాలన్ని పరమేశ్వరుని అధీనంలో ఉంటాయి. పరమేశ్వరుడు
గుణాతీతుడు.
ఓం శ్రీ
సాయి రామ్!
No comments:
Post a Comment