మనము రోజు కర్మలు చేస్తూనే ఉంటాము కాని
వాటిని కర్మ యోగంగా మార్చుకోనే సాధనాలు కావాలి. ఇక్కడ మనం అర్ధం చేసుకోవాల్సిన
ముఖ్యమైన విషయం ఏమిటి ?
కర్మను కర్మ యోగంగా మార్చాలి అంటే, ఆ పని
చేయడానికి ముఖ్యమైన కారణాన్ని అర్ధం చేసుకోవాలి. ఈ పని చేయడంవల్ల మనము మానసికంగా
ఎదగాలి. ఇది మన ఆలోచన శక్తి ఉన్నతంగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. ఒక పని
చేయడానికి వెనక నిస్స్వార్ధ బుద్ధి ఉండాలి. అప్పుడు మనలను మనం అర్ధం
చేసుకోగలుగుతాము. దీనివల్ల ప్రతిపని కర్మయోగంగా మారే అవకాశం ఉంది. ఇదే మన జీవం
విధానం అయినప్పుడు మోక్షమార్గానికి చేరువ అవుతాము. మనందరికి కర్మ యోగం ఆచరించడం
కష్టం అనిపిస్తుంది కాబట్టి భగవానుడు ఒక తేలిక మార్గాన్ని ఈ క్రింది శ్లోకంలో చెప్పారు.
మయి సర్వాణి కర్మాణి సన్న్యస్య ఆధ్యాత్మచేతసా !
నిరాశీ నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః !!
3.30
అంతర్యామినైన నా యందు లగ్నమైన మనసు ద్వారా
అన్ని కర్మలను నాకే అర్పించి, ఆశ, మమతా, సంతాపములను వీడి యుద్ధం చేయుము.
మనం చేసే పనులను భగవంతుడికి సమర్పించడం ఎలా?
అలా మనం మనసులో అనుకుంటే సరిపోతుందా!
ఇప్పుడు కర్మను కర్మ యోగంగా మార్చుకోవడానికి
ఉపయోగపడే అంశాలను పరిశీలిద్దాము.
భగవంతుడు సర్వ
వ్యాపి, సర్వాధారుడు అలానే సర్వజ్ఞుడు. అందరిలోనూ కొలువై ఉన్నాడు. ఈ సత్యాన్ని
మొట్టమొదటగా మన చిత్తంలో నింపుకోవాలి. మనకు ఒకరి మీద పూర్తి నమ్మకం లేక పొతే సమర్పణ భావం రాదు. అందుకే శ్రద్ధ అనేది మొట్టమొదటి సాధనం.
కర్మాచరణలో ఆలోచనా విధానం సరళంగా, ఉన్నతంగా
ఉండాలి.
మనమందరము కర్మకు బద్ధులము. ఎవరు కర్మ
చేయకుండా ఉండలేరు.
ఈ కర్మలే మన జీవితాన్ని, ఈ ప్రపంచాన్ని
ముందుకు నడిపిస్తాయి. ఒక శరీరంలో ఎంతవరకు కర్మలు చేయాలో అంతవరకు మాత్రమే మన
ఆయుష్షు. అలానే ఈ ప్రపంచం కూడా ఎంతవరకు ఉండాలో ఉండి ఆ తరువాత పరమాత్మలో
లీనమవుతుంది.
మనం చేసే పనులు బాధ్యతాయుతంగా ఉండాలి. బాధ్యత
అనే ఉన్నతమైన భావం ఉంటే చేసే ప్రతిపనికి ఒక అర్ధం ఉంటుంది.
మన సంస్కృతిని, శాస్త్రాలను ఆధారంగా చేసుకుని
మన కర్తవ్య కర్మలు నిర్వర్తించాలి. వీటిని మన పెద్దవారినుంచి, గురువులనుంచి
తెలుసుకోవాలి.
ధర్మాధర్మాలను అర్ధం చేసుకొని వ్యవహరించాలి. ఏది ధర్మమో
తెలియక పొతే మనం చేసే కర్మలు ఎప్పటికి కర్మ యోగంగా మారలేవు.
మనం చేసే పనులవల్ల కలిగే ఫలితం మీద ఆసక్తిని
వీడాలి. ఫలితాన్ని అనుభవించద్దు అని భగవానుడు చెప్పలేదు. కాని దాని మీద ఆసక్తిని
మాత్రమే వదలమన్నారు.
మనం చేసే కర్మలు బుద్ధిని ఆధారంగా చేసుకొని
చేయాలి. బుద్ధిని వాడకపోతే మనలోని విచక్షణా శక్తిని
ఉపయోగించుకోలేము.
మనం చేసే కర్మలు ఇష్ట అయిష్టాలకు అతీతంగా
ఉండాలి. ఆ సమయానికి ఏది అవసరమో అది నిస్వార్ధ బుద్ధితో చేయాలి.
ఎప్పడు నేను చేస్తున్నాను అన్న భావనను రానివ్వకూడదు. మనమే కనుక కర్తలం అయితే, మనకు ప్రతి సారి విజయం రావాలి. కాని అలా జరగడం లేదు. అందుకే మన గొప్పతనం ఏమి లేదు అని అర్ధం చేసుకోవాలి. మనమంతా కర్మకు బద్ధులము.
మనం చేసే ప్రతి కర్మను భగవదర్పితం చేయడం నేర్చుకోవాలి.
భగవానుడు ఇప్పుడు తాను చూపించిన మార్గం అనుసరిస్తే కలిగే ఉపయోగం తెలిపి, అలానే అనుసరించకపోతే కలిగే నష్టాన్ని కూడా చెప్పారు.
యే మే మతమిదం నిత్యమనుతిష్ఠన్తి మానవాః !
శ్రద్ధావంతో -నసూయంతో ముచ్యంతే తే అపి కర్మభిః
!! 3. 31
ఏ మనుష్యులైతే శ్రద్దా భక్తులతో దోషదృష్టి లేకుండా నా ఈ మతమును అనుసరించెదరో వారు సమస్త కర్మబంధములనుండి ముక్తులు అయ్యెదరు.
అలా అనుసరించనిచో కలిగే నష్టాన్ని తరువాత చెప్తున్నారు.
యే త్వేతదభ్యసూయంతో నానుతిష్ఠన్తి మీ మతం !
సర్వజ్ఞానవిమూఢాంస్తాన్ విద్ధి నష్టానచేతసః !!
3. 32
కాని నా యందు దోషారోపణ చేయుచు, నా ఈ ఉపదేశాన్ని అనుసరించని మూర్ఖులు సమస్త అజ్ఞాన విషయములందు మోహితులై భ్రష్టులై కష్టాలపాలు అయ్యెదరు.
పైన చెప్పిన అంశాలను మనం అవలంబించడం నేర్చుకుంటే శరణాగతి చేయడం తేలిక అవుతుంది. శరణాగతి ఎక్కడైతే ఉందో అక్కడ కర్మ యోగం తప్పకుండా ఉంటుంది. భగవంతుడికి సమర్పించడం అలవాటైతే రాగ ద్వేషాలకు దూరంగా ఉండగలుగుతాము. మనం చేసే పని మంచిదో కాదో అన్న ఆలోచన మనలో వస్తుంది. ఈ విచక్షణా జ్ఞానం మనలను సరైన దారిలో నడిపిస్తుంది.
ఓం శ్రీ
సాయి రామ్ !
No comments:
Post a Comment