In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, July 26, 2017

భగవద్గీత -కర్మ యోగం 3. 7 ప్రాణులు - ప్రకృతి స్వభావం



భగవానుడు కర్మ యోగం అనుసరించడం మంచిది అని చెప్పి మనలను మేల్కొలిపే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రాణులన్ని కర్మలను ఎందుకు చేస్తాయి అన్న విషయం గురించి చెప్తున్నారు. మనం ఒకరి స్వభావాన్ని ఎందుకు మార్చలేము అన్న విషయాన్ని కూడా చర్చించారు.

సదృశం చేష్టతే స్వస్యా: ప్రకృతే : జ్ఞానవానపి !
ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి !! 3. 33

సమస్త ప్రాణులు తమ తమ స్వభావానికి లోబడి కర్మలు చేయుచుండును. జ్ఞానియు తన ప్రకృతిని అనుసరించియే క్రియలను ఆచరించును. ఎవరైనా పట్టుబట్టి కర్మలను ఎట్లు త్యజించగలరు?

మన ఆలోచనలే మన మాటల రూపంలో వ్యక్తం అవుతాయి. మనం చేసే కర్మలు మన ఆలోచనా విధానాన్ని అనుసరించే చేయబడతాయి. మనం పోయిన జన్మల్లో లేదా ఈ జన్మలో పొందిన అనుభవాల ఆధారంగా మనం మన కర్మలను చేస్తాము. పుట్టటంతోటే మనకు ఇష్టాయిష్టాలు ఉంటాయి. ఇవి మన స్వభావంగా వ్యక్తం అవుతాయి. అందుకే ఎవరికీ ఇష్టం లేకుండా ఏ పని అయినా చేయించాలి అంటే కష్టం. కాని సమస్త ప్రాణులు వాటి స్వభావాన్ని అనుసరించే కర్మలు చేస్తాయి. ఒక్క మానవునికి మాత్రం మార్చుకొనే అవకాశం ఉంది. ఎందుకంటే మన పూర్వజన్మ సంస్కారాలు మనలను మారకుండా అడ్డు పడతాయి. ఒక తేలుకి కుట్టే స్వభావమే ఉంటుంది. ఒక పాము దానికి హాని కలుగుతోంది అనుకున్నప్పుడు కాటు వేయడం దాని స్వభావం. అలానే ప్రకృతిలో వేటి స్వభావం వాటికి ఉంటుంది. అలా అని నేను మారను అని కూర్చుంటే కష్టపడేది మనమే.
జ్ఞానులు కర్మలు చేస్తూ ఉన్నట్లు అనిపించినా, వాస్తవముగా వారికి కర్మ సంస్కారములతో ఏ విధమైన సంబంధము లేదు. వారు ఆ శరీరంలో చేయవలిసిన కర్మలన్ని లోక హితార్ధమై మాత్రమే చేస్తారు. వారికి కర్తృత్వ భావన ఉండదు. అంటే వారు చేసే ప్రతి పని కర్మ యోగమే అవుతుంది. అందుకే వారికి కర్మ బంధం ఉండదు.
మనం మన చుట్టూ ఉండే వారిని మనకు అనుగుణంగా లేక మనకు మంచిది అనిపించిన విధంగా మార్చాలి అని విశ్వప్రయత్నం చేస్తాము. వారు మారకపోతే, మన మాట వినకపోతే మనకు ఎనలేని దుఃఖం కలుగుతుంది. ఇక్కడ మనం అర్ధం చేసుకోవాల్సిన కొన్ని విషయాలను పరిశీలిద్దాము.

మనం ఎవరినీ వారి స్వభావానికి బిన్నంగా మార్చలేము అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. మనం చెప్పినంత మాత్రమే వారు మారారు అని అనుకుంటే పొరపాటు. వారు మారాలి అనుకున్నారు కాబట్టి వారు మారతారు.

మనం పుట్టినప్పుడే పూర్వజన్మ వాసనలు, అనుభవాలతో పుడతాము. మన కర్మ ఫలితాలకు భిన్నంగా మనం ఫలితం ఆశించడం, వాటిని పొందడం కష్టతరం.

మనం ఎక్కడ జీవించాలి అనేది కూడా పూర్వజన్మల కర్మ ఫలితమే. ఒక్కోసారి సమిష్టిగా ప్రకృతి వైపరీత్యాలను అనుభవించాలి.

మనం పూర్వజన్మలలో చేసిన కర్మలను వెనకకు వెళ్లి మార్చలేము. కాని ఇప్పుడు తెలుసుకొని సత్కర్మలను చేస్తూ, సత్సాంగత్యముతో మెలుగుతూ, భగవంతుని వైపు నడవడం నేర్చుకోవాలి. ఇలా చేస్తూవుంటే ఒక రోజు మనకు శాస్త్రాలలో ఉన్న సత్యం బోధించే గురువులు ఎదురుపడతారు. వారిద్వారా ఈ సత్యం అనుభవంలోకి వస్తే మన జీవిత లక్ష్యం నెరవేరినట్లే. అప్పుడు ఈ కర్మ బంధంనుంచి శాశ్వత ముక్తి లభిస్తుంది.



ఓం శ్రీ సాయి రామ్ !









No comments:

Post a Comment