In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, October 11, 2017

శ్రీ సాయి సత్చరిత - అధ్యాయం 2



మనం మొదటి అధ్యాయంలో హేమద్పంత్ గారికి సత్చరిత రాయాలని ప్రేరణ ఎలా కలిగిందో చెప్పుకున్నాము. ఇక రెండో అధ్యాయంలో ఆయన ఈ సంకల్పాన్ని శ్యామా ద్వారా ఎలా బయట పెట్టి సాయి ఆశీర్వాదాన్ని పొందారు. తనలో కలిగిన సందేహయాలు, సందిగ్తత బాబా ఎలా పోగొట్టారు, ఆయనకు హేమాడపంత్ అనే పేరు ఎలా వచ్చింది? ఇంకా గురువు యొక్క ఆవశ్యకత అనే అంశాలు ఈ అధ్యాయంలో చెప్పబడ్డాయి. 

హేమద్పంత్ బాబా లీలలను ఒక చోట గ్రంధంగా సంకలనం చేస్తే సాయి భక్తులకు మేలుచేస్తుందని భావించారు. కాని తనలో ఒకరకమైన భయం, సరిగ్గా రాయగలనో లేదో అన్న సందిగ్ధం. అప్పటికే బాబా గురించి కొంతమంది వ్రాయడం జరిగింది. దాసగణు మహారాజ్, శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ టెండూల్కర్ మరియు అమీదాస్ భావాన్ని మెహతా ఇలా చాలా మంది బాబా గురించి వ్రాసారు. మహానుభావుల చరిత్రలు వ్రాయాలి అంటే సామాన్యమైన విషయం కాదు. కాని వారి లీలలు ఎన్ని సార్లు, ఎంతమంది రాసినా ఇంకా చదువుకోవచ్చు. సాయి లీలలు నీతిని బోధిస్తాయి. శాంతిని కలుగచేస్తాయి. మన మనోభీష్టాలు నెరవేరుస్తాయి. ఇహపరములకు కావాల్సిన జ్ఞాన బుద్ధిని ప్రసాదిస్తాయి. ఇంకా ఎదిగిన సాధకులకు బ్రహ్మైక్య జ్ఞానాన్ని, అష్టాంగ యోగ ప్రావీణ్యాన్ని మరియు ధ్యానానందాన్ని అనుభవపూర్వకంగా కలుగచేస్తాయి. 

హేమద్పంత్ గారు శ్యామా ద్వారా బాబాకు సత్చరిత వ్రాయాలనే సంకల్పాన్ని తెలియచేస్తే బాబా తన ఆశీస్సులను అందచేశారు. తనలో ఉన్న సందేహాలు, అనుమానాలు పోగొట్టారు. అందుకే బాబా ఇలా చెప్పారు. "నేను వ్రాస్తున్నాను అన్న భావనను వదిలి, అహంకారాన్ని పక్కకు పెట్టి, అందరి దగ్గరనుంచి విషయాలను సేకరించి ఈ కార్యానికి పూనుకుంటే, నా చరిత నేనే వ్రాసుకుంటాను. ఈ కథలు చదివిన వారికి భక్తి విశ్వాసములు కుదురును. వారు ఆత్మసాక్షాత్కారమను బ్రహ్మానందమును పొందెదరు" అని బాబా చెప్పారు. 

మనం భగవత్కార్యాలలో లేదా ఏ మంచి పని అయినా చేసేటప్పుడు మనలో బాగా చేయాలి అన్న తపన సహజంగా ఉంటుంది. అది మంచిదే. కాని నేను చేస్తున్నాను, నేను లేకపోతె ఈ పనులు సరిగ్గా జరగవు అన్న భావన కొంతమందిని వేధిస్తుంది. మనలో సాయి మీద భక్తి ఉండచ్చు కాని ఈ భావన మనలను పూర్తిగా భక్తి పారవశ్యాన్ని పొందనివ్వదు. మనం పూర్తిగా సాయిని నమ్మితే ఆయనే అవన్నీ చేయించుకుంటారు అన్న సత్యం బోధపడుతుంది. అప్పుడు మన పని మనం నిశ్చింతగా చేయగలుతాము. ఇక్కడ నేను చేస్తున్నాను అన్న భావన ఉండదు. అలానే మనం మన కుటుంబ వ్యవహారాల్లో కూడా ఈ సమర్పణ భావాన్ని మర్చిపోతాము. బాబా ఎప్పుడు మనతో ఉన్నాడు అని మనం నమ్మితే ఈ అహంభావన మనలను మానసిక సంఘర్షణకు గురి చేయదు. అప్పుడు మన బాధ్యతను మనం చక్కగా నిర్వర్తించగలుగుతాము. నేను లేకపోతె నా వాళ్ళు ఎలా బతుకుతారో అన్న ఆలోచన చాలామందిని వేధిస్తుంది. ఇది ఎంతవరకు నిజమో మనకు తెలుసు. మన తాతలు లేకుండా మన తల్లితండ్రులు బతికారు. అలానే రేపు రాబోయే తరం కూడా. మనం పుట్టకు ముందు ఈ ప్రపంచం ఉంది, మనం పోయిన తరువాత సాగిపోతుంది. ఇక్కడ బాధ్యతలు మాత్రమే ముఖ్యం. అందుకే ఈ రెండో అధ్యాయంలో నేను అన్న భావన గురించి తెలుసుకోమని చెప్పి, అది మనలను ఎంతవరకు ఇబ్బంది పెడుతుందో తెలుసుకుంటే అప్పుడు అంతా సాయి మయమే అవుతుంది. 

తరువాత హేమద్పంత్ బాబాను ఎలా కలిశారో చెప్పుకుందాము. హేమద్పంత్ గారి అసలు పేరు అన్నా సాహెబ్ దాభోల్కర్. ఆయనను షిర్డీ వెళ్ళమని సాయిని కలవమని నానా చాందోర్కర్ చాలాసార్లు చెప్పడం జరిగింది. చివరికి నానా హేమద్పంత్ గారిని కలిసి గట్టిగా వెళ్ళమని చెప్తారు. అప్పుడు ఆయన షిర్డీవచ్చి బాబాను దర్శించుకుంటారు. ఆయనలో ఈ సందేహాలు, తన స్నేహితుడి కుమారుడ్ని ఒక గురువు రక్షించలేదు అనే భావన ఆయనను అలా ఆలోచింప చేసినవి. మనం కూడా ఒక్కొక్కసారి బాబాకు మానసికంగా దూరం అవుతాము.  సంసార సంబంధ విషయాలలో పడి తీరికలేనంతగా అవుతాము. ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి. బాబా మీద బాగా నమ్మకం ఉన్న వాళ్లతో మెలగాలి. ఒక వేళ మనం దారి తప్పినా నానా లాంటి భక్తులు మన జీవితంలో ఉంటే, వాళ్ళ ద్వారా బాబా మనలను దారిలో పెడతారు.  

వాగ్వివాదాలు వద్దు అని, ఎప్పుడు మనం చెప్పినదే జరగాలి అని, మనం చెప్పేదే సరి అయినది అనే భావనను వదలమన్నారు.  అలా అని మంచిమాటలు చెప్పద్దు అని కాదు. వాదం మంచిది కాదు అని మాత్రమే చెప్పారు.  అందుకే హేమద్పంత్ అనే పేరు నాకు పెట్టారు అని ఆయన భావించి ఇంక ఎప్పుడు బాబా చెప్పిన విధంగానే ఉండాలి. ఈ పేరే ఆ విషయాన్ని నాకు గుర్తు చేస్తుంది అని ఆయన వ్రాసుకున్నారు. గురువు యొక్క ఆవశ్యకతను చివరిగా ఈ అధ్యాయంలో చెప్పారు. 

మనం ఎన్నో జన్మలనుంచి ఈ పుట్టటం, పెళ్లిళ్లు చేసికోవడం, పిల్లల్ని పెంచడం, ముసలి తనంతో బాధపడటం చివరికి ఈ శరీరాన్ని వదిలివేయడం అనే కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. ఇలా ఎందుకు అనే ప్రశ్న మనలో ఉదయింపచేసే వారే గురువు. గురువు అనే మార్గదర్శి ఎంత అవసరమో బాబా ఈ అధ్యాయంలో చెప్పారు. హేమద్పంత్ గారి జీవితంలో సాయిని మొట్టమొదట కలిసినప్పుడు ఆయనలో కలిగిన భావనలను ఇలా తెలిపారు. 

నేను ధన్యుణ్ణి అయ్యాను. నా నయనాలు సజలమయ్యాయి. దృష్టి నిశ్చలమైనది. నా ఆకలి దప్పులు హరించుకుపోయాయి. ఎవరైతే నాకు సాయి దర్శనం  కలిగించారో వారే నాకు ఆప్తులు. వారి కంటే నాకు దగ్గర బంధువులు లేరు. సాయి దర్శన భాగ్యముతో కాకి వంటి నేను సాయి చరణ మానస సరోవరంలో హంసను అయ్యాను. ఈ సాయి ఒక్కరు మనసులోకి ప్రవేశిస్తే సకల సృష్టి సాయిమయం అని అనిపిస్తుంది అని ఏంతో చక్కగా అభివర్ణించారు. 

సాయి భక్తులారా! సాయిని గురువుగా మన జీవితంలో ప్రవేశించమని వేడుకుందాము. ఆయనను గురువుగా కొలుద్దాము. ఆయన గురువుగా మన జీవితంలో ఉంటే, ఇంకా దేని గురించిన చింతన మనకు అక్కర లేదు. ఆయనే మనలను ముందుకు నడిపిస్తారు. అప్పుడు మనలోనే ఒక సత్చరిత వ్యక్తం అవుతుంది. 

సద్గురు శ్రీ సాయినాధార్పణమస్తు!

No comments:

Post a Comment