హేమద్పంత్ సాయి
ఆశీస్సులతో సాయి సత్చరిత గ్రంధానికి శ్రీకారం చుట్టారు. మూడో అధ్యాయం ప్రారంభిస్తూ
ఒక్క సారి బాబా ఇంకా ఏమి చెప్పారో చూద్దాము. "నీవు నీ పనిని చేయి. మనసులో ఏ
మాత్రం బయపడకు. నా మాటలందు పూర్తీ విశ్వాసముంచు. నా లీలలను రచిస్తే అజ్ఞాన దోషం
తొలిగిపోతుంది. భక్తి భావంతో శ్రవణం చేస్తే ప్రపంచంపై ధ్యాస మాయమవుతుంది. శ్రవణమనే
సాగరాన భక్తి ప్రేమామృతమనే అలలు లేస్తాయి. వానిలో మరల మరల మునకలు వేస్తె జ్ఞాన
రత్నాలు లభిస్తాయి" అని చక్కగా చెప్పారు బాబా.
ఎలాగైతే హేమద్పంత్
గారికి సత్చరిత వ్రాసే కార్యం అప్పచెప్పారో, అలానే ఒక్కో భక్తుడికి ఒక్కో పని
అప్పచెప్తారు. మనలో ఉన్న వాసనలను బట్టి మనకు పనులు ఇస్తారు. ఒకరికి మందిర
నిర్మాణం, ఒకరికి హరికథా కీర్తనాదులలో నిమగ్నులను చేశారు. మనందరం అర్ధం
చేసుకోవాల్సిన విషయం బాబా శిష్యుడుగా ఏమి చేశారు అన్న సత్యం. మనందరం సత్చరితలో
చదువుకున్నాము బాబా లాంటి శిష్యుడు వేరెవరు ఉండరు అని. ఎందుకంటే ఆయనకు గురువు
తప్పితే వేరే ఆలోచనే లేదు. బాబాకు బయట హాంగులుతో పని లేదు. ఆయనకు కావాల్సినదల్లా
ఆయన చూపించిన మార్గంలో నడవడమే.
ఆధ్యాత్మిక
మార్గంలో నడిచే వారు ప్రక్క దారులు పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సముద్రంలో ఓడలు సుడిగుండాలలో చిక్కుకుపోకుండా, పెద్ద రాతి బండలు
కొట్టుకోకుండా, నిరాటంకంగా సాగిపోవడానికి, అపాయాలను సూచించే ఎర్రటి దీపస్తంభాలను
(లైట్ హౌసెస్) నిర్మిస్తారు. ఈ
దీపపు స్తంభాలు ఆ నావలు ఓడ్డుకు చేరటానికి ఉపయోగపడ్తాయి. చీకటిలో వాటికి దారి
చూపిస్తాయి.
సాయినాథుని
మధురమైన కథలు అమృతం సహితం సిగ్గుపడేలా, దుస్తరం అయిన భవసాగర మార్గాన్ని అతి
సులువుగా దాటింపచేస్తాయి. సాయి కథలు ధన్యం. వారి కథలు శ్రవణం ద్వారా హృదయంలోకి ప్రవేశించి శరీరాభిమానాన్ని
బయటకు నేట్టివేస్తాయి. సుఖదుఖాలనే
ద్వంద్వాలు ఉండవు. సాయి కథలను
హృదయంలో భద్రపరుచుకుంటే మనసులోని వికల్పాలు నలు దిక్కులా పారిపోతాయి. బాబా యొక్క నిర్మలమైన యశస్సును వర్ణిస్తే, ప్రేమతో శ్రవణం చేస్తే
భక్తుల కల్మషాలు దహించుకు పోతాయి.
సాయి ప్రేమను
ఆవుతో పోల్చారు హేమద్పంత్. ఆవు పొదుగునిండా పాలు ఉన్నా దూడ లేకుండా పాలు ఇవ్వదు.
బిడ్డ ఆకలి తల్లికి తెలుస్తుంది అంటారు. అలానే బాబా మనలను వెన్నంటి కాపాడుతూ
ఉంటారు. ఒక రోజు గురు పూర్ణిమ రోజున అణ్ణా చించణీకర్ హేమద్పంత్ ఉద్యోగం లేక
బాధల్లో ఉంటే సహాయం చేయమని అర్థిస్తాడు. అప్పుడు బాబా "ఇతనికి ఏదొక ఉద్యోగం
వస్తుంది. ఇప్పుడు మాత్రం నా సేవ చేయనీ. ఇతని పళ్ళాలు ఎప్పుడు నిండి ఉంటాయి.
యావజ్జీవం అవి ఖాళీ కావు. భక్తితో నా వాడై ఉంటే ఇతని ఆపదలన్నీ హరింప
చేస్తాను" ఇలా అతనికి భరోసా ఇచ్చారు.
హేమద్పంత్ గారు ఈ
అధ్యాయంలో ఆత్మ జ్ఞానం గురించి చక్కగా బాబా చెప్పిన చాలా విషయాలను పొందుపరిచారు.
ఇవి పెద్ద సత్చరితలో మనం నేర్చుకోవచ్చు. సాయి చరిత్ర మనకు
జ్ఞానాన్ని ప్రసాదించి, అహంభావాన్ని నశించేటట్లు చేస్తుంది. అహం నశిస్తే
ఆత్మసాక్షాత్కారం కల్గుతుంది.
తరువాత ఒక
రోహిల్లా కథను చెప్పారు. ఈ రోహిల్లా అర్ధరాత్రి కూడా "అల్లాహ్ అక్బర్"
అని కల్మా చదువుతూ ఉంటే గ్రామస్తులకు ఇబ్బందిగా ఉండేది. వారు ఈ విషయం గురించి
బాబాకు చెప్పుకున్నారు. అప్పుడు బాబా ఆతని కేకలు నాకు చాలా సుఖాన్ని ఇస్తాయి. అతడు
ఆలా అరవడం చాలామంచిది. లేక పొతే దుష్టురాలైన అతని భార్య నాకు చాలా
కష్టాన్ని కలుగచేస్తుంది. అతడు అలసి పోయినప్పుడు అతడే శాంతిస్తాడు అని
గ్రామస్తులను ఓదార్చారు. ఇక్కడ నిజంగా ఆ రోహిల్లాకు భార్య లేదు. భగవన్నామ స్మరణ
వల్ల మన చిత్తం సుద్ధి అవుతుంది. అలానే సాయి అనే స్మరణ సాయి భక్తులందఱకు మంచిది.
ఒక రోజు బాబా
మధ్యాన్న ఆరతి అయిన తరువాత ఇలా చెప్పారు. మీరెక్కడ ఉన్నా మీ చర్యలన్నీ నేను
గమనిస్తూ ఉంటాను. ఇలా తెలిసిన నేను సర్వాంతర్యామినై అందరి హృదయాల్లో ఉండేవాణ్ణి.
అంతటా చరించేవాణ్ణి. చరాచర సృష్టిలో ఉన్న అన్ని జీవ రాశులలో నేను ఉన్నాను. సకల
ప్రాణులకు తల్లిని. ఇవన్నీ నడిపించే
సూత్రధారిని నేనే. నా యందు శ్రద్ధ ఉన్న వారికి ఏ కష్టాలు ఉండవు. నన్ను మరిచిపోయిన
వారిని మాయ కొరడాతో కొడుతుంది. ఈ దృశ్య జగత్తు నా రూపం. అంటే చీమ, క్రిమికీటకం,
రాజు పేద స్థావర జంగమాలు అన్ని నా రూపమే అని తన నిజ స్వరూపం గురించి చెప్పారు.
సమర్ధ సాయి అన్న
మంత్రంతో వారి పవిత్ర పాదాలను ధ్యానం చేసే భక్తులకు ముక్తిని ప్రసాదించే ఆ
సూత్రధారి చరిత్ర పావనమైనది. సాయి చరిత్ర విన్నా చదివినా వారి చిత్తం
సుద్దమవుతుంది అని అధ్యాయం చివరలో చెప్పారు.
శ్రీ
సద్గురు సాయినాధార్పణమస్తు!
No comments:
Post a Comment