పరమ యోగీశ్వరులైన సాయి షిర్డీలో మనలను
ఉద్ధరించడానికి, సరైన మార్గంలో నడిపించడానికే అవతరించారు. ధర్మము నశించినప్పుడు,
అధర్మము వృద్ధి పొందినప్పుడు నేను అవతరిస్తాను అని భగవానుడు గీతలో చెప్పారు. అలానే
భగవానుడు యోగీశ్వరుల రూపంలో అవతరించి ధర్మాన్ని రక్షిస్తారు. వారు సమాజానికి సరైన
దారి చూపిస్తారు. ఇదే విషయాన్ని సత్చరిత నాలుగో అధ్యాయం మొదటిలో చెప్పారు. షిర్డీ
క్షేత్రం సాయి నాధుని కృపతో పుణ్య క్షేత్రం అయ్యింది. షిర్డీ కోపర్గామ్ తాలూకా,
అహమద్ నగరు జిల్లాలో ఉంది. కోపర్గామ్ వద్ద గోదావరి నది దాటి
షిర్డీ చేరవలిసి ఉంది. షిర్డీ అంటేనే సాయి. సాయి అంటేనే షిర్డీ.
సాయి నడిచిన ఆ నేల అతిపవిత్రం. సాయి
మూర్తీభవించిన జ్ఞానభండారం. శాంతి వారి భూషణం. వారు పరమార్థ వితరణలో అపర గురు
స్వరూపం. సారాలలో సారం సాయి. వారు ఎప్పుడు ఆత్మ స్వరూపంలో లీనమై ఉంటారు. అందరి
పట్ల అన్ని ప్రాణుల పట్ల వారి దృష్టి సమానము. వారు మానావమానాలకు అతీతులు. సర్వ
జీవులలోను నిండియున్న భగవత్స్వరూపులు. భగవంతుని నామం వారి ముద్ర. వారి అంతఃకరణం
శాంత సముద్రం వంటిది. వారు షిర్డీనుంచి శారీరక పరంగా అక్కడే ఉన్నట్లు అనిపించినా వారు అంతటా ఉంటారు. షిర్డీలోనే అన్ని
పుణ్యక్షేత్రాలు నెలకొని ఉన్నాయి. సాయి సమర్ధుని దర్శనమే మనకు యోగసాధనం. వారితో
సంభాషణే మనకు పాప ప్రక్షాళనము. వారి చరణసంవాహనే మనకు త్రివేణి సంగమ స్నానం. వారి
విభూతి ప్రసాదాల సేవనం అన్ని విధాలా పుణ్యపావనం. సాయియే మనకు పరబ్రహ్మ. అందుకే
మహాభక్తుడైన 95 సంవత్సరాల గౌలి బువా సాయియే పండరినాథుడు అని సెలవిచ్చారు.
సాయికి నామస్మరణ చాలా ప్రీతికరము అందుకే
దాసగణుకు నామసప్తాహం చేయమని చెప్పారు. అప్పుడు దాసగణు మహారాజ్ తనకు విఠల దర్శనం
అవుతుంది అంటే చేస్తాను అని అన్నారు. బాబా అప్పుడు భక్తిభావం ఉంటె విఠలుడు తప్పక
ప్రకటమౌతాడు అని చెప్పారు. అదే విధంగా ఆయనకు ఆ దర్శనం అయింది అని చెప్తారు. అలానే
దీక్షిత్ గారికి కూడా ఆ దర్శన భాగ్యం కలిగింది. ఏ సన్నివేశాన్ని చక్కగా సత్చరితలో
మనము చదవచ్చు. అలానే బాబా చెప్పినట్టు చిత్రపటం రూపంలో కూడా విఠలుడు వస్తారు.
భగవంతరావు క్షీర సాగర్ షిర్డీకి వస్తే తన తండ్రి ఎంత విఠల భక్తుడో తెలిపి తనను
సరైన దారిలో పెట్టారు. మన పూర్వ జన్మ వాసనలను ఆధారంగా మనకు ఏ దారి మంచిదో ఆ దారిలో
బాబా నడిపిస్తారు.
దాసగణు మహారాజకు త్రివేణి సంగమాన్ని తన పాదాల దగ్గరే చూపించి పావనం చేశారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం బాబా తన గురువుని వదిలి ఎక్కడకు వెళ్ళలేదు. అలానే షిర్డీ వదిలి వెళ్ళలేదు. అందుకే మనం బాబాను గురువుగా స్వీకరిస్తే అన్ని తీర్ధాలు ఆయన లోనే ఉన్నాయి అన్న సత్యం తెలుసుకోవాలి. దాసగణు మహారాజ్ సాయి పాదాలలో త్రివేణి స్నానం చేసిన తరువాత పరవశంతో స్తోత్రం చేస్తారు. ఇది మనం పెద్ద సత్చరితలో చదవవచ్చు.మనం త్రివేణి సంగమంలో గంగ, యమునలను చూడవచ్చు కాని సరస్వతి అంతర్వేది అంటే మనకు బయటకు కన్పించదు. అలానే బాబా రెండు పాదాలలోనుంచి గంగ యమున బయటకు కన్పించాయి. బాబా అనుగ్రహం మాత్రం (సరస్వతి) బయటకు కన్పించేది కాదు. ఈ అనుగ్రహం అంతర్ శుద్ధిని కలుగ చేస్తుంది. సాయి భక్తులమైన మనము కూడా బాబా నుంచి ఈ అంతరశుద్ధిని కోరుకుందాము.
బాబా షిర్డీ ఆగమనం ఒక మదురమైన ఘట్టం. వారు
పదహారు ప్రాయాన షిర్డీలో అత్యంత
సుందర రూపంతో వేపచెట్టు క్రింద స్థిరాసనంలో కన్పించారు. ఆయనకు పగలు రాత్రి అనే
బేధం లేదు. అతడు మూర్తీభవించిన వైరాగ్య మూర్తివలె దర్శనమిచ్చేవారు. అందరు
ఎక్కడనుంచో వచ్చి దర్శనం చేసుకునే వారు. ఇతడు ఎవరు అనే ఆశ్యర్యం అందరిలోను ఉండేది.
ఇద్దరి ముగ్గురికి ఖండోబా ఆవేశమై ఊగుతూఉంటే జనం వారిని బాబా గూర్చి అడిగారు.
అప్పుడు ఒక విచిత్రం జరిగింది. ఖండోబా దేవుడు చెప్పిన విధంగా ఊరిచివరి వేపచెట్టు క్రింద
తవ్వగా ఒక సొరంగం వెలుగుతున్న నాలుగు పెద్ద కుందులు కనిపించాయి. బాబా
అది తన గురు స్థానం అని దాన్ని మూసివేయమని చెప్పారు. అక్కడ బాబా పన్నెండు
సంవత్సరాలు తపస్సు చేసినట్లు చెప్పబడింది.
తరువాత ఈ అధ్యాయం చివరలో మూడు వాడాలు ఎలా
షిర్డీలో వచ్చాయో చెప్పడం జరిగింది. మొట్టమొదట గురు స్థానం దగ్గర సాఠె వేపచెట్టు
చుట్టూ అరుగు, దక్షిణోత్తరంగా భవనాన్ని నిర్మించారు. చాలా రోజులు షిర్డీకి వచ్చిన
యాత్రికులకు ఇదే బసగా ఉండేది. తరువాత దీక్షిత్ వాడా కట్టించారు. షిర్డీలో సెజ్
ఆరతి మొదలైన రోజే ఈ దీక్షిత్ వాడాకు కూడా పునాది వెయ్యడం జరిగింది. తరువాత 1911 శ్రీరామ
నవమి రోజున గృహప్రవేశం జరిగింది. తరువాత శ్రీమంతుడైన బూటీ చేతులమీదుగా ఇప్పుడు
సమాధిమందిరమున్న వాడా నిర్మాణం జరిగింది. ఈ ప్రదేశాన్నే సాయి తన మందిరంగా
ఎంచుకున్నారు. సాయినాథుడే మురళీకృష్ణుడై అక్కడ వెలిశారు.
మొట్టమొదటి వాడా హరివినాయక్ సాఠే గారు కట్టించారు. ఆయన ఒక డెప్యూటీ కలెక్టర్ మరియు కలెక్షన్స్ ఆఫీసర్. బాగా డబ్బు సంపాయించి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలనే మనసుతో ఉండే వారు. ఆయనకు మగ బిడ్డలు లేకపోవడంతో బాబా భక్తుడైన దాదా కేల్కర్ కూతురిని రెండోవివాహం చేసుకుంటాడు. అదికూడా బాబా మగబిడ్డ పుడతాడు అని చెప్తే చేసుకుంటాడు. ఇలా ఆయన బాబాను ఆశ్రయించి సాఠే వాడాను కట్టిస్తారు. కాని తరువాత వచ్చిన దీక్షిత్ గారు మాత్రము ఆధ్యాత్మిక సాధన కోసం వాడాను కట్టారు. ఇక చివరిగా మనము ఈ సాధనలో పరిపక్వత చెందితే మోక్షము సమాధి మందిర రూపంలో సాయి పరమాత్మ దర్శనం కలుగుతుంది.
శ్రీ
సద్గురు సాయినాథార్పణమస్తు !
No comments:
Post a Comment