శ్రీ
సాయి గురువరేణ్యులను పరబ్రహ్మగా, సర్వ దేవతా స్వరూపంగా ప్రణామాలు చేయుచు వారి చూపించిన మార్గంలో నడిచే శక్తిని మనందరికి
ప్రసాదించమని వేడుకుందాము. వారు చూపించిన మార్గంలో నడవాలి అంటే మొట్ట మొదట వారు
చూపించిన దారి ఏమిటి అనే విషయం అర్ధం చేసుకోవాలి. వారినుంచి మనం పొందవలిసిన అసలైన,
శాశ్వతమైన సత్యం ఏమిటో తెలుసుకోవాలి. సాయి చరితకు సత్చరిత అనే పేరే ఎందుకు? వేరే
పేరు పెట్టి ఉండచ్చు కదా. పేరులోనే ఈ సత్యం ఉంది. సాయి ఈ గ్రంధం ద్వారా సత్యాన్ని
మాత్రమే బోధించారు. సత్యాన్ని చెప్పే గ్రంధం కాబట్టి ఇది శ్రీ సాయి సత్చరితగా బాబా
మనకు ఇచ్చారు. మనం మన కోరికల కోసం పారాయణ చేసినా చివరికి సత్యాన్ని బోధించే గ్రంధం
ఈ గ్రంధరాజం. బాబా అప్పట్లో గురు చరిత్ర చదవమని కొంతమందిని ప్రోత్సహించేవారు.
ఎందుకంటే పరమగురువుల గురించి తెలుసుకుంటే మనకు సత్యం ఏమిటో బోధపడుతుంది.
సాయి
ఎవరు? ఆయన దేవుడా! గురువా! ముస్లిం మతస్తులు భావించే ఒక పీరా!
అసలు వారెవరో, వారు అందరిలాగా పుట్టి పెరిగారా! అనే
విషయాలు ఎప్పుడు మాట్లాడలేదు. మనకు ఎందరో మహానుభావులు ఉన్నారు. వారి జీవిత
చరిత్రలు మనం చదువుతాము. సాయి విషయంలో మాత్రం పుట్టు పూర్వోత్తరాలు ఉండవు. ఈ ప్రపంచంలో ఎన్నో మతాలు, ఎన్నో భావనలు మనం చూస్తాము. ఒక్కొక
మతం వారి వారి ఆలోచన పరిధిలో భగవంతుడు ఇలా ఉంటాడు, మనం ఇలా ఆరాధిస్తే ఆ భగవంతుడిని
చేరుకుంటాము అనే విషయాలను చెప్పారు. ఏ మతం సరిఅయినది? ఏ దారి మనలను భగవంతుడి
దగ్గరకు తీసుకుపోతుంది? అనే ప్రశ్నలు మనలను వేధిస్తూ ఉంటాయి. ఒక్కొక్క గురువు
ఒక్కో మార్గం చెప్పారు. అప్పడు మనం ఏమి చేయాలి? ఏ మార్గం ఎంచుకోవాలి? ఆ మార్గం ఎదో మనకు ఎలా తెలుస్తుంది?
భగవంతుడు
మాత్రం ఒక మార్గానికె పరిమితం కాదు, అన్ని దారులు మనలను
భగవంతుడివైపే నడిపిస్తాయి అన్న సత్యాన్ని, అన్ని మతాల సారం ఒక్కటే అన్న నిజాన్ని
జీవితంలో ఆచరించి చూపించారు బాబా. మనం ఆ భగవత్
తత్వానికి ఎలా దగ్గర అవుతాము? అది ఎలా ఒక లీలా మాత్రంగా జరుగుతుంది అనే సంఘటనలను శ్రీ సాయి సత్చరితలో మొట్ట మొదటి అధ్యాయంలోనే చూపించారు బాబా. ఒక్కొక్క భక్తుడు బాబాకు
ఎలా దగ్గర అవ్వటం జరుగుతుందో ఊహించుకుంటేనే పరవశం కలుగుతుంది. బాబా నా వారే, నా
కోసమే బాబా ఇవన్నీ చేస్తారు అన్న నమ్మకం సాయి భక్తులను ముందుకు నడిపిస్తుంది.
హేమాద్పంత్
మొట్టమొదటగా సాయి సత్చరిత ప్రారంభిస్తూ సర్వ దేవతలకు నమస్కరిస్తూ, శ్రీ సాయియే
త్రిమూర్త్యాత్మక స్వరూపులనియు, సమర్ధ సద్గురువులనియు, వారు మనలను సంసారమును నదిని
దాటించ గల పరమగురువులని కొనియాడిరి. 1910 సంవత్సరంలో బాబా కలరా వ్యాధిని
తరిమికొట్టేందుకు గోధుమలు తిరుగలిలో వేసి పిండి చేసి, ఆ పిండిని గ్రామం నలుమూలల
చల్లమని అక్కడకు వచ్చిన స్త్రీలకు సెలవిచ్చారు. ఈ వింతైన దృశ్యం చూసి తనకు బాబా గురించి ఒక గ్రంధం రాయాలి అనే సంకల్పం కలిగింది అని హేమద్
పంత్ చెప్పారు. ఈ గోధుమ పిండికి ఈ
గ్రంధానికి ఉన్న సంబంధం ఏమిటి? రచయితకు ఈ ఘట్టం ద్వారానే ఎందుకు ప్రేరణ కలిగింది?
బాబా
ఎప్పుడు తిరుగలి విసురుతూనే ఉంటారు. కాని అందులో పిండి చేయబడేది గోధుమలు కావు, మన
పాపములు మాత్రమే. బాబా గోధుమలు విసురుతున్నప్పుడు వనితలు వచ్చి గోధుమ పిండిని
నాలుగు భాగాలుగా చేసి తీసుకువెళ్ళడానికి పధకం వేశారు. ఈ నాలుగు భాగాలు మన అంతఃకరణం
(మనస్సు, చిత్తం, బుద్ధి మరియు అహంకారము). వీటిలోనే మన వాసనలన్ని దాగివుంటాయి.
వాటిని ఒక గురువు సాయంతో వదిలించుకున్నప్పుడు మాత్రమే జ్ఞానబీజం మొలకెత్తుతుంది.
ఊరి బయట ఈ పిండిని చల్లడం అంటే బయట విషయాలు మన మనోబుద్దులలో ప్రవేశించకుండా మన
దృష్టి మనలో ఉన్న భగవంతునిపై తిరగాలి. ఇదే నిజమైన ఆధ్యాత్మిక సాధన. దీన్ని మించిన
సత్యం ఇంకొకటి లేదు. అందుకే ఈ గ్రంధం సత్చరితగా పిలువబడింది. కర్మ భక్తి జ్ఞాన
మార్గాలను ఏకం చేసి, అంతఃకరణ సుద్ధి జరిగే ఉపాయాలను చెప్తూ, జీవితం ఎలా ఉండాలో, ఏ
మార్పులు అవసరమో, ఎలా నడుచుకోవాలో అన్న ప్రక్రియలను చూపించే గ్రంధమే శ్రీ సాయి
సత్చరిత.
సాయి
బంధువులారా! శ్రీ సాయి సత్చరితను మన జీవితంలో ఒక భాగంగా చేసుకొని, బాబా చూపించిన
దారిలో నడుద్దాము. ప్రతి ఒక్కరి జీవితంలో గురువుయొక్క ఆగమనం విశేషంగా ఉంటుంది. అది ఎలా జరుగుతుందో
ఊహించుకుంటేనే సంభ్రమ ఆశ్యర్యాలు కలుగుతాయి. అందుకే సాయి భక్తులారా అంతఃకరణాన్ని
సాయికి సమర్పించండి, శ్రద్ద సభూరి అనే మంత్రాలను నిత్యం జపం చేయండి. అప్పుడు
మనలోనే ఉన్న సత్యం సత్చరిత రూపంలో వ్యక్తం అవుతుంది. ఇదే సాయి మన నుంచి కోరుకునే
నిజమైన సమర్పణ.
సద్గురు
శ్రీ సాయినాధార్పణమస్తు!
No comments:
Post a Comment