సాయి పరిపూర్ణ అవతారమైన పర బ్రహ్మ. ఆయన మనో చిత్త అహంకారాలకు అతీతుడు. బయట భక్తులకోసం ఏవో కోరికలతో ఉన్నట్లు కనిపించినా ఆయన సర్వసంగపరిత్యాగి. మహానుభావులకు నిజ జీవితం కూడా ఒక కలే. వారు మానవదేహంతో ఉన్నా కాని, వారు సర్వహృదయాంతరస్థులు. శరీరానికి మనసుకి కలిగే సుఖదుఃఖాలు మిధ్య. అవి కలలవంటివని ఆత్మానుసంధానంతో గ్రహించి వానిని వదిలించుకున్నవారు ముక్తిని సాధించారు. బద్ధులుగా ఉన్న భక్తులను చూసి బాబా మనసు కరిగిపోయేది. వీరు శరీరానికి అతీత స్థితి ఎలా పొందగలరా అని వారికి అహర్నిశలు చింత. ఆహంబ్రహ్మాస్మి అనే వృత్తితో అఖండ ఆనందంలో ఉండే స్వభావం వారిది. పైకి ప్రపంచపు వ్యవహారాలలో చిక్కుకున్నట్లు కనిపించినా, వారికి లోపల భేదభావం లేని ప్రేమ. సాయిని ఓ మానవునిగా భావించిన వారు మందమతులు. సాయిబాబా ఆత్మబోధకు గని. ఆయన పూర్ణానంద విగ్రహం. మానవ రూపంలో అవతరించిన సాయి యొక్క సగుణ రూపం ఇది.
ఇలా బాబా వారి సగుణ రూపాన్ని ఆయన జీవన విధానాన్ని హేమద్పంత్ చక్కగా వర్ణించి తరువాత ఈ అధ్యాయంలో బాబా యొక్క శయన లీల గురించి ఇలా చెప్పారు. నాలుగు మూరల పొడవు, ఒక జానెడు వెడల్పు గల చెక్కపలకకు రెండువైపులా గుడ్డపీలికలు కట్టి, దానిని పైకప్పుకి వేలాడకట్టి బాబా దానిపై పడుకునే వారు. వారి తలవద్ద కాళ్లవద్ద దీపాలు వెలుగుతూవుండేవి. వారు దానిపైకి ఎప్పుడు ఎక్కేవారో దిగేవారో ఎవరికీ తెలియదు. దానిపై మెడవంచుకొని కూర్చునే వారు లేదా దానిపై నిద్రించేవారు. చింకి గుడ్డలతో కట్టిన ఆ చెక్క పలక బాబా బరువుని ఎలా మోస్తుంది అని అందరు ఆశర్యపోయే వారు. వారివద్ద మహా మహా సిద్ధులుఉండగా ఆ పలక ఏ పాటిది. బాబా ఎలా ఎక్కుతారో దిగుతారో చూద్దామని భక్తులందరూ అక్కడ చేరితే బాబా ఆ పలకను పగలకొట్టి ముక్కలుగా చేసి పారవేసారు.
సాయిని అందుకే అందరు యోగిరాజ అని పిలిచేవారు. అన్ని సిద్ధులు ఆయన అధీనంలో ఉండేవి. పతంజలి యోగసూత్రాలలో ఈ సిద్ధులగురించి చక్కగా చెప్పడం జరిగింది. అష్టమహా సిద్ధులు బాబాకు స్వయంసిద్ధం. అణిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రకామ్య, ఈశిత్వ, వశిత్వ, కామవసాయత అనే ఎనిమిది సిద్దులు అష్ట సిద్ధులుగా చెప్తారు. బాబా అణిమ సిద్ధితో సూక్ష్మ రూపాలు తీసుకొనే వారు. లఘిమా శక్తితో బరువులేకుండా ఉండే వారు. ఇలా ఈ శక్తులను భక్తుల నమ్మకాన్ని పెంచేందుకు, వారిలో మార్పు తీసుకువచ్చేందుకు వాడే వారు. వారి పూర్వకర్మలను పోగొట్టి వారిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించేవారు.
నానా
సాహెబ్ డేంగ్లే ఏంతో పుణ్యాత్ముడు. అందుకే బాబా ఆయన దగ్గరనుంచి ఆ చెక్క పలకను స్వీకరించారు. బాబా కొన్ని నాణాలను తీసుకొని రుద్ది
భక్తుల పాపాలు పోగొట్టేవారు అని సత్చరితలో చెప్పారు.
మరి డేంగ్లే ఇచ్చిన బల్లపై బాబా పడుకుంటే డేంగ్లేకు ఎంతటి అదృష్టమో ఇంక
చెప్పనవసరంలేదు. మాములుగా బాబా పాదాలు తాకితేనే శక్తి ప్రవహిస్తే ఇంక ఆయన శరీరం
అంతా ఆ బల్లను తాకితే దానికి అంతే ఉండదు. నాలుగు వైపులా వెలిగించిన దీపాలు
జ్ఞానానికి ప్రతీతి. ఇవి అజ్ఞానాన్ని పోగొడతాయి.
బాబా
పుట్టుక గురించి కాని తల్లితండ్రుల గురించి కాని ఎప్పుడు మాట్లాడలేదు. ఆయన పదహారేళ్ళ
వయసులో షిర్డీకి మొట్టమొదట వచ్చారు అని చెప్తారు. అప్పుడు మూడు సంవత్సారాలు ఉండి
మరల కనిపించరు. మరల 20 సంవత్సరాల వయసులో షిర్డీకి వచ్చారు అని చెప్తారు. ఆయన
మహాసమాధి వరకు 60 ఏళ్ళు పాటు షిర్డీలోనే ఉన్నారు.
కాని బాబా మాత్రం తనకు పుట్టుక చావులేవు అని చెప్పారు. హిందువులకు ముస్లింలకు దూరం
బాగా పెరుగుతున్న సమయంలో బాబా రావడం జరిగింది. ఆయన రాముడు రహీమ్ ఒక్కరే అని
చెప్పారు.
తరువాత ఈ అధ్యాయంలో హేమద్పంత్ గురువులగురించి చెప్పారు. నియత గురువులు, అనియత గురువులు అని రెండు రకాలుగా చెప్పారు.
దైవీ
సంపదతో పరిపూర్ణులుగా చేసి, అంతఃకరణాన్ని పరిశుద్ధ పరిచి, మోక్ష మార్గంలో
ప్రవేశపెట్టే వరకే అనియత గురువుల పని. కాని నియత గురువుల ఆశ్రయం లభిస్తే ద్వైతం
తొలగిపోయి అద్వైత భావం జాగృతమవుతుంది. వారు తత్వమసి మహావాక్యాన్ని అనుభవైక
వైద్యంగా చేస్తారు. చరాచరాలలో విశ్వమంతా వ్యాపించి ఉన్న గురు తత్త్వం భక్తుల కొరకు
సగుణ సాకార రూపంలో అవతరించి తన కార్యం సమాప్తి కాగానే తన
అవతారాన్ని చాలిస్తుంది. సాయిబాబా నియత గురువులు. వారు పరమగురువులు. ఆత్మ
సాక్షాత్కారాన్ని కలిగించే వారే సద్గురువులు.
యశస్సు, ఐశ్వర్యం,
వైరాగ్యం, జ్ఞానం, ఔదార్యం, మరియు వైభవం అనే ఈషడ్ గుణాలతో ఉన్న మూర్తి సాయి. వారి
నిగ్రహం చాలా విశిష్టమైనది. వారి మహిమ అగోచరం. వారు సర్వత్ర సర్వ జీవులలో
పరమేశ్వరుని చూచేవారు. వారికి మిత్ర శత్రు బేధం లేదు. ఎవరివద్ద ఏమి ఆశించేవారు
కాదు. వారికి ఎటువంటి వికల్పాలు లేవు. షిర్డీ జనులు ధన్యులు. సాయియే వారి పూజ్య
దైవం. భోజనం చేస్తున్నా, పడుకున్నా ఎల్లప్పుడూ సాయినే ధ్యానించేవారు. పొలాలలోను,
ఇళ్లలోనూ పనులు చేసుకుంటూ బాబా మహిమను గానం చేసే వారు. ఒక్క బాబా తప్ప మరో
దైవాన్ని స్మరించేవారు కాదు అని హేమద్పంత్ చెప్తున్నారు.
బాబా తన భక్తులతో
అతివినయంగా "నేను మీ దాసానుదాసుణ్ణి. మీకు రుణగ్రస్తుడను. మీ దర్శనానికి
వచ్చాను. నేను మీ మలంలో క్రిమిని. అందువల్ల ఈ సృష్టిలో ధన్యుణ్ణి" అని అనే వారు. బాబా ఎంతటి అణుకువతో ఉండే వారు, ఎంతటి
ఉన్నతమైన నిరభిమానం. ఎంత సౌమ్యత! నానావళి లెమ్మనగానే గద్దె విడచిపెట్టినవారికి
శరీరాభిమానం కాని, బేధ బుద్ది గాని కలలో కూడా ఉండవు. వారు కేవలం లోక కళ్యాణం కోసమే
అవతరించిన సత్పురుషులు.
ఇక చివరగా ఈ అధ్యాయంలో సత్సంగం యొక్క గొప్పతనం గురించి బాబా ఏమి
చెప్పారో వ్రాయడం జరిగింది. గురు కథ శ్రవణం అనే సత్సంఘాన్ని ఆశ్రయించి ప్రాపంచిక
బాధలను వదిలించుకోండి అని సత్చరిత చెపుతుంది. సాయి సాయి అనే మంత్రాన్ని గుర్తు
ఉంచుకుంటే చాలు అందరు తరిస్తారు. చేడు సావాసం మంచిది కాదు. అది అనేక దుఃఖాలకు నిలయం.
సత్సంగం శరీరాభిమానాన్ని తొలిగిస్తుంది. సత్సంఘాన్ని ఆశ్రయించకుండా ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోలేరు. జనన మరణాలు లేని ఉత్తమగతిని పొందవచ్చు. సత్సంగం వలన
పరమాత్మను చేరుకునే మార్గం అవగతం అవుతుంది.
ఓం శ్రీ
సాయినాథార్పణమస్తు!
No comments:
Post a Comment