In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, December 13, 2017

శ్రీ సాయి సత్చరిత అధ్యాయం - 11



భగవంతుడిని సగుణం మరియు నిర్గుణం అనే రెండువిధాలుగా చెప్తారు. సగుణ స్వరూపమునకు ఆకారము ఉంటుంది కాని నిర్గుణము అంటే ఆకారము లేదు. రెండును పరబ్రహ్మ స్వరూపములే. మొదట్లో సగుణ స్వరూపమే మనకు అనువుగా ఉంటుంది. భక్తి వృద్ధి చెంది, జ్ఞానం కలిగితే అప్పుడు నిర్గుణ ఆరాధన కుదురుతుంది. బాబా అందుకే తనను నిర్గుణంగా ఆరాధించమని చెప్పి అలా కుదరకపోతే అప్పుడు నన్ను సగుణంగా పూజించండి అని చెప్పారు. 

 భక్తిపై గట్టి నమ్మకం ఉండాలి అని సాయి చెప్పారు. ఆయన రకరకాల దేవతలా రూపంలో దర్శనం ఇచ్చారు. అలానే వేరే గురువుల రూపంలో కూడా దర్శనం ఇచ్చారు. అలాఅంటే ఒక సన్నివేశమే డాక్టర్ పండిట్ గారి కథ.  ఒక సారి తాత్యా సాహెబ్ నూల్కర్ స్నేహితుడైన డాక్టర్ పండిట్ అనే ఆయన షిర్డీ వచ్చారు. బాబా అతనిని దాదా భట్ వద్దకు పంపిస్తారు. వారు ఇరువురు బాబా దగ్గరకు వచ్చినప్పుడు, ఈ డాక్టర్ పండిట్ బాబాకు నుదిటిపై త్రిపుండ్రం పెడతాడు. అందరికి ఆశ్చర్యం ఎందుకంటే బాబా ఎవరిని అలా బొట్టు పెట్టనివ్వరు. దాదా తరువాత ఆలా ఎందుకు చేయనిచ్చారు
అని అడిగితె బాబా ఇలా చెప్పారు. ఈ డాక్టర్ నాలో తన గురువైన రఘునాథ్ (కాకా పురానిక్) గారిని చూసుకున్నాడు. అందుకే అతను ఆలా చేయగలిగాడు అని సమాధానం ఇచ్చారు.  ఇక్కడ ఆయన చూపించిన నిష్కల్మష భక్తి నన్ను కట్టిపడివేసింది అని కూడా బాబా చెప్పారు. దాదా భట్ తరువాత డాక్టర్ పండిట్ ఈ విషయం గురించి అడగగా తన గురువుని బాబాలో చూసినట్లు చెప్తారు. సాయి ఈ విధంగా మన గురువుని మనం ఎలా ఆరాధించాలో నేర్పించారు. మనం మన గురువుతో మమేకం అవ్వాలి. ఆయన దారే మన దారి కావాలి. సాయి ఆరాధన అన్నిదేవతల ఆరాధన కన్నా గొప్పది అని తెలుసుకోవాలి. ఒక్క సారి మనకు గురువు లభిస్తే ఆ గురువు తప్ప మనకు వేరే ఆరాధనలతో అవసరం ఉండదు. ఎందుకంటే గురువే పరబ్రహ్మము. 


ఒకసారి కళ్యాణి నివాసియైన సిద్దిక్ ఫాల్కే అనే ముస్లిం, మక్కమదీనా యాత్రలు చేసి షిర్డికి రావడం జరిగింది. ఆ వృద్దుడైన హాజీ ఉత్తరాభిముఖంగా ఉన్న చావడిలో దిగాడు. బాబా దర్శనం చేసుకోవాలని అని అనుకుంటాడు. కాని తొమ్మిది నెలలు అయినా బాబా అతనిని ద్వారకామాయిలో అడుగు పెట్టనివ్వలేదు. ఫాల్కే దుఃఖానికి అంతేలేదు. ఇదేమిటి ద్వారకామాయి తలుపులు అందరికి తెరిచే ఉంటాయి కాని ఏమిటి నా కర్మ! నేనేం పాపం చేశాను అని అనుకుంటాడు. ఎవరో శ్యామాను పట్టుకుంటే పని జరుగుతుందని చెప్తే ఆశతో ఆయనను సంప్రదించాడు.ఫాల్కే శ్యామాతో ఇలా అన్నాడు. ఒకసారి నా తపనను తొలగించు, దుర్లభమైన బాబా దర్శనాన్ని కలిగించు అని బ్రతిమాలాడు. 

 అప్పుడు శ్యామా బాబా దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు. దేవా! ఆ వృద్దుడు చాలా భాద పడుతున్నాడు అతనిని కరుణించండి, హాజీ మక్కామదీనా యాత్రలు చేసి షిర్డికి తమ దర్శనార్ధమై వచ్చాడు. అతనిపై దయ చూపడం లేదు ఎందుకు? అతనిని మసీదులోకి రానివ్వండి. జనులు అసంఖ్యాకంగా వచ్చి మసీదులో మీ దర్శనం చేసుకొని వెళ్తున్నారు కదా! మరి ఇతని విషయంలో విషమ భావం ఎందుకు? ఒక్కసారి మీ కృపా దృష్టిని ప్రసరించండి. అతనిని మసీదులో మిమ్మల్ని కలుసుకోనివ్వండి. తన మనసులోని మాటను చెప్పుకొని వెళ్ళిపోతాడు.
అప్పుడు బాబా శ్యామా! నువ్వు ఇంకా ముక్కుపచ్చలారని పసివాడవు అతనిపై అల్లా అనుగ్రహం లేకపోతే అతనిని నేనేం చేయగలను. అల్లామియాకు ఋణపడి ఉండకపోతే ఎవరైన మసీదు ఎక్కగలరా? ఇక్కడి ఫకీరు లీల అపూర్వం. నేను అతనికి యజమానిని కాను, ఇంకా ఈ సంభాషణ ఇలా సాగుతుంది.  


బాబా అడిగిన ప్రశ్నలకు హాజీ  సమాధానాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఈ సంభాషణ శ్యామా మద్యవర్తిగా జరుగుతుంది.

బాబా : సరే అక్కడ బారవి బావి సమీపంలో వెనుక వైపున ఇరుక బాట ఉండి. అతడు ఆ మార్గంలో వస్తాడా అని వెళ్ళి స్పష్టంగా అడుగు అని అన్నాడు.

హాజీ  : ఎంతటి కష్టమైన మార్గమైన వస్తాను, నేను వారిని ప్రత్యక్షంగా కలుసుకోవాలి నన్ను వారి చరణాల వద్ద కూర్చోనివ్వాలి.


బాబా : నాలుగు వాయిదాలతో నాకు నలభై వేల రూపాయలను ఇస్తాడా!

హాజీ  : ఈ మాట అడగాలా, వేలు ఏమిటి, అడగాలేకాని నలభై లక్షలైనా ఇస్తాను.

బాబా : ఈ రోజు మా మసీదులో మేకను కోయాలని ఉంది. మరి నీకు మాంసం కావాలా! ఎముక మాంసం కావాలా లేక వృషణాలపై కోరికా? ఆ ముసలి వాణ్ణి నిశ్చయంగా ఏది కావాలో వెళ్ళి అడుగు.

హాజీ  : ఇవేమి నాకు వద్దు. వారికి ఇవ్వాలని ఉంటే నా కోరిక ఒక్కటే    కొళంబో లోని  ఒక ముక్క లభిస్తే చాలు కృతజ్ఞుణ్ణి అని చెప్పాడు.


ఇది విని బాబా ఉగ్రులయ్యారు మట్టి పాత్రను, నీళ్ల కుండను స్వయంగా పైకి ఎత్తి ద్వారం వైపు విసిరివేసారు. తమ చేతిని కరకరా కొరుకుతూ హాజీ  దగ్గరకు వచ్చారు.


బాబా తమ కఫినీని రెండు చేతులా పట్టుకుని నీ మనసులో ఏమనుకుంటున్నావు?  నా ముందా,  నీ ప్రతాపం. ముసని వానిలా బడాయి చూపిస్తున్నావు. ఇలాగేనా ఖురాను పఠించడం? మక్కా యాత్ర చేసానని గర్విస్తున్నావు గాని నన్ను ఎరుగలేకున్నావు. ఇలా ఆయనను మందలించి బాబా అక్కడ నుంచి వెళ్తారు. 

హాజీ  గాబరా పడ్తాడు. మసీదు ప్రాంగణంలోకి ప్రవేశిస్తూ తోటమాలి మామిడి పళ్ళను అమ్మడం చూసారు. మొత్తం బుట్టను కొని హాజీకి  పంపించారు. వెంటనే వెనుదిరిగి మరల ఆ హాజీ  వద్దకు వెళ్ళారు. తమ జేబులో నుండి డబ్బు తీసి 55 రూపాయలను లెక్క పెట్టి అతని చేతిలో పెట్టారు. అప్పటి నుండి అతనిపై ప్రేమ కలిగి అతనిని భోజనానికి ఆహ్వానించారు. ఇద్దరూ అంతా మరచి పోయారు. హాజీ ఆత్మానందంలో లీనమైపోయాడు.


ఈ కథ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలను పరిశీలిద్దాము.

బాబా హాజీ  మధ్య జరిగిన సంభాషణలలో ఉన్న అర్ధం ఏమిటి? సద్గురువులకు మాత్రమే ఇది అర్ధం అవ్వాలి.

బాబా బారవి బావి దగ్గర ఉన్న ఇరుకు మార్గం దగ్గరకు రమ్మన్నారు. బారవి బావి అనేది షిర్డిలో ఉన్నట్లుగా చెప్పలేదు. బారవి అంటే 12, ఇది ఆధ్యాత్మిక మార్గంలో కావాలసిన 12 సాధనాలు. ఇరుకు మార్గం అంటే శమధమాది సాధనాలతో, వివేక వైరాగ్యములతో, శ్రద్ద సబూరిలతో, మనస్సును నిర్మలం చేసి గురు కృప పొందడమే ముక్తికి సోపానము. ఈ పన్నెండు  ఆధ్యాత్మిక మార్గంలో ఉపయోగపడ్తాయి.


బాబా 40 వేలు నాలుగు దపాలుగా ఇవ్వమన్నారు. ఇవి మనస్సు, బుద్ది , అహంకారం, చిత్తము. వీటిని అంతఃకరణ చతుష్టయము అంటారు. వీటిని సమర్పిస్తే కాని మనకు గురు కృప కలగదు. ఈ నాలుగు అంతరించినప్పుడే మన నిజ స్వరూపం మనకు అవగతమవుతుంది.
  

తరువాత ఎముక మాంసం కావాలా లేక వృషణాలపై కోరికా అని అడుగుతారు, కాని పాల్కే బాబా దగ్గర ఉన్న కాళంబలోని ఒక్క మెతుకు లభిస్తే చాలు అని అంటారు.


ఇక్కడ బాబా అడిగింది ఏమిటి? ఈ ప్రాపంచిక వ్యవహారాల మీద ఇంకా ఆశ ఉందా, లేదా. 
ఎముకల్లో ఉన్న మజ్జ ద్వారా మన శరీరంలో కణాలన్ని సృష్టించబడతాయి. వృషణాలు  కోరికలకు ప్రతీక. మనలో ఉన్న కోరికలు నశిస్తే కాని హాజీ  కోరుకునే ఆ మోక్షం లభించదు. మక్కామదీన యాత్రలు చేయడం అంటే సామన్యం కాదు. దానికి పరిపూర్ణ హృదయం ఉండాలి. మనం కాశీ లాంటి యాత్రలు చేస్తాము కాని మన మనస్సు పవిత్రం కాకపోతే ఏమి ప్రయోజనం లేదు. ఇవన్ని విన్న తర్వాత బాబా వెళ్ళి హాజీ ను పోట్లాడతారు. ఖురాను చదువుతావు కాని నన్ను తెలుసుకోలేక పోతున్నావు. మక్కా యాత్ర చేసానని గర్విస్తున్నావు, అని మదలించారు. గురువు మందలిస్తే మన మనస్సులోని దుర్గుణాలు నశిస్తాయి. మనంతట మనము మార్చుకోలేని బుద్ది అహంకారములు నశిస్తాయి. గురువు ఆగ్రహం వీటి మీద మాత్రమే. మనం వాటిని అపార్ధం చేసుకోరాదు. గురువు తిట్టినా కొట్టినా గురువు పాదాలను మాత్రము వదలరాదు. గురువుకు మన కర్మ శేషములన్ని ఎరుకయె. వీటిని దగ్ధం చేస్తే కాని మనకు జ్ఞానం లభించదు. అందుకే మనము అహంకార రహితులమై నమ్రతతో జీవించాలి. బాబా 55 రూపాయలు ఇవ్వడంలో కూడా ప్రత్యేకత ఉంది. ఇది బ్రహ్మజ్ఞానికి కావాల్సిన అర్హత. ఇలా ఈ సంభాషణల్లొ ఎన్నో అర్ధాలు దాగి ఉన్నాయి. 
  

తరువాత హాజీ  12 సంవత్సరములు బాబాను సేవిస్తూ షిర్డికి వస్తూ ఉండేవాడు అని చెప్తారు.


 
మనలో కూడా ఈ హాజీ  లాంటి మనస్తత్వమే ఉంది. దానిలో అహంకారం మెండుగా ఉండచ్చు. కాని దాన్ని మనకి మనముగా తెలుసుకోలేము. మనం మంచి అలవాట్లతో ఉండచ్చు. ఎవ్వరికి తెలిసి అన్యాయం చేయకపోవచ్చు. దయా గుణాలు ఉండవచ్చు. భక్తి, జ్ఞానం ఉండచ్చు. వీటన్నింటికి  వెనుక దాగి ఉన్న ఆ అహంభావనను అర్ధంచేసుకోవాలి. అది చాలా లోతుల్లోకి వెళ్ళి ఆత్మ విశ్లేషణ చేస్తేకాని అర్ధం కాదు. ఈ మాయను చేధించాలి అంటే బాబా కృప తప్పక ఉండాలి. బాబా లాంటి సద్గురువులు అరుదు. అటువంటి వారిని గట్టిగా పట్టుకోవాలి. అప్పుడు మన మార్గం సుగమం  అవుతుంది.  



ఇక చివరగా ఈ అధ్యాయంలో బాబా ఎలా పంచభూతాలను తన అధీనంలో ఉంచుకున్నారో అన్న విష్యం గురించి చెప్పారు. ఒక సారి భయంకరమైన తుఫాను వచ్చి, గాలివానతో షిర్డీ గ్రామమంతా అల్లకల్లోలం అయితే, బాబా 
రక్షించడం జరిగింది. అలానే ఒక సారి ధుని మంటలు బాగా ఉదృతమై ద్వారకామాయి కప్పును తాకుతూ ఉంటె, తన సట్కాతో ఆ మంటను అదుపులో ఉంచడం జరిగింది. ఇలా పంచభూతాలను కూడా యోగులు శాసించగలరు. సాయి పరమగురువు మరియు యోగీశ్వరులు. ఆయన అధీనంలో ఈ ప్రకృతి అంతా ఉంటుంది. మనందరము సాయికి శరణాగతి చేస్తే ఆయన మనలను తప్పక రక్షిస్తారు. 

ఓం శ్రీ సాయినాథార్పణమస్తు 



No comments:

Post a Comment