భగవంతుడు దుష్ట శిక్షణ మరియు శిష్ట రక్షణ
కోసం అవతారం తీసుకొంటాను అని గీతలో చెప్పారు. కాని గురువులకు అందరు సమానులే. ఒకరు
ఎక్కువ, ఒకరు తక్కువ అన్న భావన ఉండదు. సత్పురుషులు మొదట దుర్జనులను దారిలో
పెడతారు. వారి మనసు దీనులకొరకు తపించిపోతుంటుంది. అజ్ఞానాంధకారాన్ని తొలిగించే
జ్ఞాన భాస్కరులు వీరు. పరమాత్మే గురువు రూపంలో వస్తారు. సాయి మహారాజ్ కూడా ఈ కోవకు
చెందిన వారే. వీరికి అన్ని ప్రాణుల యందు ప్రేమ. అన్ని విషయాలు పట్టించుకున్నట్లు
ఉన్నా ఆయన అంతర్ వైరాగ్యంతో ఉండే వారు. వారికి ఎవరియందు మితృత్వము కాని, శతృత్వము
కాని ఉండేది కాదు. అందరు వారికి సమానులే.
పండితులమని అనుకునే వారు జ్ఞాన గర్వంతో మదోన్మత్తులై భక్తి మార్గానికి అడ్డు
తగులుతారు. వారికి తరించే మార్గం లేదు. అమాయకులు విశ్వాసం ఆధారంతో భవ భయ సంకటాల
నుండి విముక్తులౌతారు. ఎవరైనా బాబాను కలవాలి అంటే ఆయన కృప ఉండాలి. వారు షిర్డీ
రావాలి అన్నా, అక్కడినుంచి వెళ్ళాలి అన్నా బాబా ఆశీర్వాదం లేకుండా ఏమి జరుగదు.
బాబా అనుమతి ఉంటేనే ఉండాలి. వెళ్లిపొమ్మంటే తిరిగి వెళ్లాల్సిందే.
ఒకసారి కాకామహాజని షిర్డీలో వారం రోజులు ఉండి
వెళదామని అనుకోని వస్తారు. బాబాను కలవగానే ఎప్పుడు వెళ్తున్నావు అని అడుగుతారు.
బాబా ఎప్పుడు ఆజ్ఞ ఇస్తే అప్పుడే అని కాకామహాజని చెప్తారు. రేపే వెళ్ళమని బాబా
అంటారు. కాకా గోకులాష్టమి వేడుకలు చూసి బాబాతో కొన్ని రోజులు ఉండాలి అని అనుకోని
వస్తారు కాని బాబా వెంటనే వెళ్లమంటున్నారు. ఇక తప్పక తన ఊరు వెళ్తారు. అక్కడకు
వెళ్లగానే తన యజమాని కాకా ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఒక గుమస్తాలకు
జబ్బు చేస్తే కాకా అవసరం పడుతుంది. బాబాకు సర్వం ఎరుకే అందుకే వెళ్ళమని చెప్పారు.
ఇంకోసారి ధుమాళ్ అనే వకీలు బాబాను దర్శించుకొని త్వరగా వెళ్ళాలి అనే ఉద్దేశంతో
షిర్డీ వస్తాడు. కాని బాబా మాత్రం అతనిని వారం రోజులు ఉంచుతారు. అతను నిఫాడ్ అనే
ఊరిలో ఒక కేసుకి సంబంధించి త్వరగా వెళ్ళాలి అనుకుంటే బాబా అక్కడే ఉంచారు. తరువాత
అసలు విషయం ధుమాలుకు తెలుస్తుంది. అక్కడ జడ్జికి ఎప్పుడూ లేనంత కడుపులో నెప్పి
వచ్చి కేసులు వాయిదా వేయడం జరిగింది. బాబాకు సర్వం తెలుసు అలానే ఆయన తన
భక్తులందరిని రక్షిస్తూ ఉంటారు. అలానే నిమోంకర్ భార్య కోరిక కూడా తీరుస్తారు. ఆమె
కుమారుడు జబ్బు పడితే బేలాపూర్ వెళదామని అనుకుంటుంది. నిమోంకర్ ఆమెను తరువాత రోజే
రమ్మంటాడు. ఆమె బాబా అనుమతి తీసుకోవడానికి వస్తే అందరి ముందు నాలుగు రోజులు ఉంది
రమ్మని బాబా చెప్తారు. ఇలా వారు తన భక్తుల మనసులో ఏమి ఉందొ తెలుసుకొని వారికి ఏది
మంచిదో అది చేస్తారు.
తరువాత హేమద్పంత్ ముళే శాస్త్రి గారి కథను
చెప్పారు. ఆయన మంచి పండితుడు మరియు హస్తసాముద్రికంలో దిట్ట. ఆయన శ్రీమంతుడైన బూటీ
గారిని కలవడానికి షిర్డీ రావడం జరిగింది. అప్పుడు బాబా అందరికి మామిడి మరియు
అరటిపండ్లు పంచిపెడుతూ ఉంటారు. ఈ ముళే శాస్త్రి బాబా చేయి చూసి జాతకం చూడాలని
అనుకుంటాడు. కాని బాబా అందుకు ఒప్పుకోరు. శాస్త్రికి నాలుగు అరటిపండ్లు ఇస్తారు.
తరువాత ఆయన వాడాకు వెళ్లి మడితో అగ్నిహోత్రాన్ని ఆరంభించాడు. ఇంతలో బాబా లెండీకి
వెళ్తూ ఈ రోజు కాషాయ రంగు తీసుకొని రండి, కాషాయ వస్త్రాలు ధరిస్తాను అని చెప్తారు.
బాబా ఆలా
ఎందుకు అన్నారో ఎవరికీ అర్ధం కాలేదు. తరువాత మధ్యాన్న ఆరతి జరుగుతూ ఉంటె, బూటిని పంపి దక్షిణ తెమ్మంటారు. శాస్త్రి నన్ను ఎందుకు దక్షిణ అడిగారు. నేను మడిలో ఉన్నాను అని అనుకుంటాడు. తరువాత మసీదుకు వెళ్తే ఎప్పుడో సమాధి చెందిన తన గురువైన ఘోలప్ స్వామి బాబా స్థానంలో కూర్చొని కనిపిస్తారు. తన గురువు కాళ్ళకు నమస్కరించి చేతులు కుదించి నిలబడిపోతాడు. సన్యాసి వలె కాషాయ వస్త్రాలు ధరించిన తన గురువు కనిపించడంతో సంభ్రమ ఆశ్యర్యాలకు గురి అవుతాడు. తరువాత ఆ స్థానంలో మరల బాబా కనిపిస్తారు. తన వద్ద నున్న దానిని బాబాకు దక్షిణ ఇస్తాడు. అప్పుడు బాబా కాషాయ రంగు గురించి ఎందుకు చెప్పారో అర్ధం తెలిసింది. ముళే శాస్త్రికి తన గురువు లభించారు.
ఎందుకు అన్నారో ఎవరికీ అర్ధం కాలేదు. తరువాత మధ్యాన్న ఆరతి జరుగుతూ ఉంటె, బూటిని పంపి దక్షిణ తెమ్మంటారు. శాస్త్రి నన్ను ఎందుకు దక్షిణ అడిగారు. నేను మడిలో ఉన్నాను అని అనుకుంటాడు. తరువాత మసీదుకు వెళ్తే ఎప్పుడో సమాధి చెందిన తన గురువైన ఘోలప్ స్వామి బాబా స్థానంలో కూర్చొని కనిపిస్తారు. తన గురువు కాళ్ళకు నమస్కరించి చేతులు కుదించి నిలబడిపోతాడు. సన్యాసి వలె కాషాయ వస్త్రాలు ధరించిన తన గురువు కనిపించడంతో సంభ్రమ ఆశ్యర్యాలకు గురి అవుతాడు. తరువాత ఆ స్థానంలో మరల బాబా కనిపిస్తారు. తన వద్ద నున్న దానిని బాబాకు దక్షిణ ఇస్తాడు. అప్పుడు బాబా కాషాయ రంగు గురించి ఎందుకు చెప్పారో అర్ధం తెలిసింది. ముళే శాస్త్రికి తన గురువు లభించారు.
ఇలానే సాయి దర్శనంలో శ్రద్ధ గల ఒక మామలతదార్
తన స్నేహితుడైన ఒక డాక్టరును వెంటపెట్టుకొని షిర్డీ ప్రయాణం కట్టాడు. బ్రాహ్మణుడైన
ఈ డాక్టర్ ఒక్క రాముడికి తప్ప ఎవరికీ నేను తలవంచి నమస్కారం చేయను, అలా అయితేనే
నేను వస్తాను అంటాడు. బాబా ఎవరినీ ఆలా నమస్కారం చేయమని అడగరు కాబట్టి నీవు రావచ్చు
అని ఆ మామలతదార్ అతనిని తీసుకువస్తాడు. అయితే షిర్డీలో బాబా దర్శనం చేయగానే అక్కడ
తన రాముడు బాబా స్థానంలో కనిపిస్తే వెంటనే నమస్కారం చేస్తాడు. ఆ స్నేహితుడు ఎందుకు
నాకన్నా ముందే నమస్కారం చేసావు అని అంటే, చూడు అక్కడ నా రాముడే కూర్చొని ఉన్నారు
అంటుండగా ఆ స్థలంలో బాబా కూర్చొని కనిపిస్తారు. అప్పుడు ఈ డాక్టర్ ఇక్కడ ఉన్నది
ముసల్మాను కాదు, వీరు అవతార పురుషులు అని అంటాడు. తరువాత తన అహంకారం పోగొట్టిన
సాయినాథులు నన్ను కరుణించిన దాకా నేను మసీదుకు వెళ్ళను అని దీక్ష పడతాడు. కాని
చాలా రోజుల తరువాత కలిసిన తన స్నేహితుడు అక్కడకు వస్తే, అతనితో కలిసి బాబా దర్శనం
కోసం మసీదుకు వస్తాడు. అప్పుడు బాబా " ఎం డాక్టర్ నిన్ను ఎవరైనా రమ్మని
పిలిచారా! ఎందుకు వచ్చావో నాకు జవాబు
చెప్పు" అని అడుగుతారు. ఆయనకు కళ్ళు చెమర్చి తన సంకల్పం గుర్తుకు వచ్చింది. ఆ
రోజు రాత్రి నిద్రలో అతనికి అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. పరమానందాన్ని అనుభవిస్తారు.
ఈ అనుభూతి దాదాపు పదిహేను రోజులు ఉంటుంది. ఇలా బాబా ఆ డాక్టరును ఆధ్యాత్మిక పధంలో
నడిపించారు.
బాబా ఈ అధ్యాయంలో గురువుపైన ఎలాంటి నమ్మకం, ప్రేమ ఉండాలో ఈ కథల ద్వారా చూపించారు. గురువే పరమాత్మ అన్ని రూపాలలో ఆయనే ఉంటారు అని రాముడి రూపంలో, ఇతర గురువుల రూపంలో కనిపించారు. ముళే శాస్త్రిగారికి నాలుగు అరటిపండ్లు ఇచ్చి ధర్మార్ధకామాలనే వాటిని దాటి నాలుగోది అయిన మోక్షం వైపు వెళ్ళాలి అంటే గురువే ముఖ్యం అని నేర్పించారు. అలానే డాక్టర్ కథ ద్వారా మనలో ఉన్న భక్తిపరంగా ఉండే మొండితనాన్ని పోగొట్టారు. ఇలా ఏ సాధకుడికి ఏది అవసరమో అది అనుగ్రహిస్తూ ఉండే వారే పరమగురువులు. అందుకే సాయి సమర్ధ సద్గురువులు. ఆయన మన జీవితంలో ఉంటే ఇంక మనకు ఏమి అక్కరలేదు. ఆయనే దగ్గర ఉండి మనలను నడిపిస్తారు.
ఓం శ్రీ సాయినాథార్పణమస్తు!
No comments:
Post a Comment