In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, December 27, 2017

శ్రీ సాయిసత్చరిత అధ్యాయం - 13




 సాయిసచ్చరితలో భీమాజీ పాటిల్ కథకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మహానుభావుని చేత సాయి సత్య వ్రతము ప్రారంభించబడింది. వీరి యొక్క కథ పడుమూడవ అధ్యాయంలో చెప్పబడింది. ఈ అధ్యాయంలో బాబా వివిద వ్యాధులను నివారించడం గురించి మనము చదువుతాము. కాని అధ్యాయం మొదట మాయ గురించి చెప్పడం జరుగుతుంది. ఈ మాయ గురించి ఇక్కడ ఎందుకు చెప్పటం జరిగింది అనే విషయాన్ని పరిశీలిస్తే దానిలో ఉన్న గూడార్ధం వ్యక్తమవుతుంది.

బాబా ఈ మాయ గురించి ఈ విధంగా చెప్పారు. నేను ఇల్లు, వాకిలి లేని ఫకీరుని ఏ బాధలు లేకుండా ఒక చోట స్థిరంగా కూర్చున్నాను. అయినా తప్పించుకోలేని ఈ మాయ నన్నుకూడా తరచు వేదిస్తూ ఉంటుంది. నేను మరచిపోయినా అది నన్ను మరవకుండా నిరంతరం పెనవేసుకొని ఉంది.  అది హరి యొక్క ఆది మాయ. బ్రహ్మాదులను కూడా ఎగర కొట్టేస్తుంది. మరి నేనెంత? హరిప్రసన్నుడైతే అది విచ్చినమవుతుంది. అఖండ హరి భజన లేకుండా మాయ నిరసనం కాదు. ఇట్లా చెప్పి సాయి మరికొన్ని రహస్యాలు కూడా చెప్పారు.

ఎల్లప్పుడూ "సాయి! సాయి!" అని స్మరించే వారిని సప్త సముద్రాల అవతల ఉన్నా రక్షిస్తాను. ఈ మాటల యందు విశ్వాసం ఉంచితే తప్పక మేలు కలుగుతుంది. నాకు పూజా సామాగ్రి కాని, అష్టోపచార, షోడోపచార పూజలు కాని అవసరం లేదు. అపరిమితమైన భక్తి ఉన్నచోటే నా నివాసం.  ఈ మాటలు ఎంతటి వారికైన ఊరట కలిగిస్తాయి. మరి భీమాజి పాటిల్ అందుకనే బాబాని నమ్మి ద్వారకామాయికి చేరుకున్నాడు.

సరే మనము అసలు కథ చెప్పుకొనే ముందు ఈ మాయ యొక్క పుట్టుపూర్వొత్తరాలు, ఇది ఈ అధ్యాయం మొదట్లో ఎందుకు చెప్పబడింది, అనే అంశం చూద్దాము. మాయను మనము విష్ణు మాయగా పిలుస్తాము. బాబా కూడా అదే చెప్పడం జరిగింది. 

హింస మరియు అధర్మం రెండింటి కలయిక మూలానా అనృతము మరియు నికృతి అనే సంతానం కలిగింది. అనృతము అంటే ఏమి చేయకుండా ఉండటం. నికృతి అంటే అసత్యాలతో మోసాలు చేయడం. 

ఈ రెండింటి తరువాత తరం :  నాలుగు ప్రవృత్తులు వచ్చినవి.
అవి 1. భయం            2. నరకం          3. మాయ         4. వేదన
వేదన నుంచి - నొప్పి (బాధ) - దుఃఖము వచ్చినవి. ఇక మాయ నుంచి - మృత్యువు వచ్చింది.

మృత్యువు నుంచి ఈ 5 వచ్చినవి
1. వ్యాధి            2. జర (ముసలితనం)        3. శోకము          4. తృష్ణ      5. క్రోధము
వీటిని పరిశీలిస్తే మాయ నుంచి ఈ వ్యాధి మొదలుగా గల బాధలన్ని ఎలా వచ్చినవో మరియు ఈ అధ్యాయంలో మాయ గురించి ఎందుకు చెప్పారో అర్ధం అవుతుంది.

భీమాజి పాటిల్ కథ మనం చాలా సార్లు విన్నాము. కాని క్లుప్తంగా ఇక్కడ చెప్పుకుందాము. భీమాజి పూన జిల్లాలో నారాయణగాం అనే పల్లెలో ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు. అందరికి లేదనకుండా దానం ఇచ్చే సుగుణం కల్గినవాడు. చూసే వారందరికి చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న పెద్ద మనిషి, భక్తి పారాయణుడు కూడా. మరి ఇన్ని మంచి గుణములు ఉన్న ఈ భీమాజీకి క్షయ రోగం వచ్చి పట్టుకుంది. ఆరోగ్యం బాగా క్షీణించి, రక్తం కక్కుకోవడం ప్రారంభిస్తాడు. చాలా వైద్యులను కలుస్తాడు. ఇంకా రకరకాల చిట్కాలను పాటిస్తాడు. కాని ప్రయోజనం ఉండదు. చివరకు నానా ద్వారా బాబా గురించి తెలుసుకొని బాబా దగ్గరకు వెళ్ళడం జరుగుతుంది. ఆ తరువాత అతని జబ్బు నయం అవుతుంది. ఇది మనందరికి తెలిసిన కథ. మనము ఇప్పుడు దీనిలో ఉన్న పరమార్దాలను పరిశీలిద్దాము.

భీమాజి ద్వారకా మాయికి రాగానే బాబా ఈ విధంగా అన్నారు.
“శ్యామా! ఈ దొంగను ఎక్కడ నుండి తీసుకు వచ్చి నా మీద పడవేశారు. ఇదేమైన మంచి పనేనా!” అని అన్నారు.
అప్పుడు భీమాజి తన తలను బాబా పాదముల వద్ద ఉంచి, రక్షించమని వేడుకొనెను. నేను అనాధను నన్ను కరుణించండి అని భీమాజి పల్కెను. ఇక్కడ భీమాజి శరణాగతి చేసి అనాధను అనడంలో ఎంతో నమ్మకము, ఇక నీవే నాకు దిక్కు, నన్ను ఈ భవసాగరము నుంచి రక్షించు. నేను అనాధను అంటే నాకు, నా అనే వాళ్లు ఉన్నా ఎవరు లేనట్లే మృత్యువు సమీపిస్తుంటే ఈ శరీరం వదిలి ఇంకో శరీరంలోకి వెళ్తా, ఇక్కడ మిగిలింది ఏమి లేదు. ఇక్కడ ఉన్న వారంతా నావారు కారు.

అప్పుడు బాబా, కూర్చో ఏం బాధపడకు, బుద్ధిమంతులు కలవరపడరు. షిర్డిలో అడుగు పెట్టిన మరుక్షణమే నీవు అనుభవించాల్సిన కర్మ అంతా కరిగిపోయింది. కంఠం వరకు కష్టాల్లో ఉన్నా మహామహా బాధల లోతుల్లో  పాతుకుపోయినా ఈ మశీదు మాత మెట్లు ఎక్కిన వారు ధుఃఖాన్ని అదిరోహించినట్లే. ఇక్కడి ఫకీరు చాలా దయాళువు, నిన్ను రక్షిస్తారు.

ఆ తరువాత భీమాజీని  భీమా భాయి యింట్లో ఉండమని బాబా చెప్తారు. భీమాజీకి తెలిసిన వాళ్ళు ఎంత మంది షిర్డిలో ఉన్నా భీమాబాయి ఇంట్లో సాదాసీదాగానే సంచులే పక్కగా పరిచి నిద్రించి ఉండవలసి వచ్చింది.
నారాయణగాంలో ఊరి పెద్దగా ఉన్న భీమాజీని అందరు ధర్మాత్ముడు, చాలా మంచి వాడని చెప్పేవారు. కాని ఇంత మంచివాడికి కూడా పూర్వ జన్మ కర్మలు అనుభవింప చేసి మోక్షానికి దగ్గరకు చేర్చడమే బాబా చూపించే కృప. మనకు జబ్బులు బాధలు వచ్చినవని కృంగిపోరాదు. ఇది మన మంచికే అని బాబా ఇక్కడ కర్మ సిద్దాంతం గురించి చెప్పి మనందరికి ధైర్యం చెప్తున్నారు.


భీమాజీ పూర్వకర్మలను వదిలించటానికి బాబా రెండు స్వప్నాలను వాడుకున్నారు.

1. భీమాజీని ఒక బెత్తంతో మాష్టారు కొట్టడం
భీమాజీ కలలో ఒక టీచరు పద్యం కంఠస్తం చేయమని కొట్టడం. ఆ పద్యం ఏమిటంటే 
పరుల గృహాలలో పాదం పెట్టడం - పాము తలపై పాదం మోపటమని భావించే స్త్రీ||
లోభి చేతినుండి అతి కష్టంగా రాలే డబ్బులా అతి తక్కువగా మాట్లాడే స్త్రీ||
ఇంట్లో డబ్బు లేకపోయినా పతి సహచర్యాన్నే సుఖంగా భావించే స్త్రీ||
తన పతి కోరిన విధంగా ప్రశాంత మనసుతో ప్రవర్తించే స్త్రీ||
ఈ స్వభావం గల స్త్రీయే నిజమైన సతి

2. భీమాజీ చాతిపై ఒక గృహస్తుడు పొత్రంతో తిప్పడం
ఒక గృహస్తుడు భీమాజీ చాతిని గట్టిగా అదిమి పట్టి కూర్చున్నాడు. చేతిలోకి ఒక పొత్రాన్ని తీసుకొని దాన్ని భీమాజీ చాతిపై తిప్పుతూ ఉంటే భయంకరమైన భాద.
ఇలా రెండు కలలు తర్వాత భీమాజి వ్యాధి నయమవుతుంది.

బాబా ఈ రెండు స్వప్నాలని ఎందుకు ఎంచుకున్నారు. ఇది కేవలము భీమాజీ పూర్వ జన్మ కర్మలకు నివృత్తి అయి ఉండాలి. వాటి గురించి తెలుసుకోవాలంటే కర్మ సిద్దాంతం వాటికి సంబంధించిన వ్యాధులు అనేవి తెలియాలి.
మనము కలలో ఒక స్త్రీ గురించిన పద్యం ఆమె ఎట్లా జీవితంలో ప్రవర్తించాలి అనే విషయం గురించి చెప్పబడింది. మరి భీమాజీ పూర్వ జన్మలలో ఎక్కడా ఈ ధర్మాన్ని పాటించకుండా ఉండటం జరిగిందా!

దానినే ఇంకోరకంగా చూడచ్చు, ఆధ్యాత్మిక పథంలో
1. ఒకవ్యక్తి (జీవుడు) తను జన్మ తీసుకొన్న విషయం వదిలి వేరే వాటిని పట్టించుకోవడం. అదే కలలో పరుల గృహాలలో కాలు మోపడం అంటే.

2. ఒక లోభి ఎంత తక్కువ ఖర్చు పెడ్తాడో మనం అంత తక్కువగా మన మాటల్ని వాడాలి. ఎవరి గురించి అనవసరంగా చెడుగా మాట్లాడరాదు.

3. పతి సహచర్యాన్ని సుఖంగా భావించే స్త్రీ. అంటే విషయానందాన్ని వదిలి కేవలం భగవంతుడే తన సుఖం అని అర్ధం చేసుకొని ప్రవర్తించడం.

4. తన పతి కోరిన విధంగా ఉండటం అంటే భగవంతుడు చూపిన మార్గంలో ఉండటం.

ఇది ఒక వ్యక్తి సరిగ్గా చేయలేనప్పుడు ఈ మాయలో పడి రకరకాల కష్టాలతో, భాదలతో ఈ భవసాగరంలో కొట్టుకుంటూ ఉంటాడు.

ఇక రెండో కల చాతిపై పొత్రం తిప్పడం. కర్మ మరియు వ్యాధుల గురించి చూస్తే ఒక వ్యక్తి ఒక జంతువు గాని, మనిషిగాని ఊపిరి సల్పకుండా హింస పెడితోనో లేక వారిని ఏ దిక్కు తెలినీకుండా కష్టపెట్టితే లేదా చంపితే ఇట్లాంటి క్షయ రోగ సంబంధమైన ఊపిరి తిత్తుల వ్యాధులు రావచ్చు అని చెప్పబడింది.
బాబా ఈ రెండు కలలతో భీమాజీ యొక్క పూర్వ జన్మ కర్మలను పోగొట్టి తనను ముక్తి పథంలో నడపడానికి దారి ఏర్పరిచారు.

అట్లానే సచ్చరిత పదమూడవ అధ్యాయంలో రకరకాల జబ్బులను వింతైన పద్దతులలో తగ్గించడం జరిగింది. ఒక్కోదానికి ఒక్కో అర్ధం ఉంటుంది. ఇవన్ని గరుడ పురాణంలో కూడా చెప్పబడతాయి. మనం ఎటువంటి కర్మలు చేస్తే ఎట్లాంటి జన్మలు వస్తాయి అనే విషయాలు కూడా దీనిలో ఉంటాయి. బాబా చాలా సార్లు వీటి గురించిన ప్రస్తావన తేవడం జరిగింది. అందుకే మనము ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించ రాదు. ధర్మాన్ని తెలుసుకొని మసలు కోవాలి. దారి తప్పకూడదు. మనము పూర్వ జన్మలలో చేసిన వాటి గురించి బాబాకు వదిలేసి ఇప్పుడు మనము బాబాపై అమిత శ్రద్ధతో ఉండి ఆయనే మనల్ని రక్షించే ఏకైక గురువుగా నమ్ముకొని ముందుకు సాగితే ఆయన మనల్ని తప్పక రక్షిస్తాడు. అవతల తీరానికి అంటే ముక్తి మార్గంలోకి తీసుకువెళ్తారు.

ఈ మాయ సిద్దాంతానికి పరిష్కారము ఆ విష్ణువే. విష్ణువు అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు. ఆయనే పరమాత్మ, ఆయనే సత్యము అందుకే ఆయనను సత్యనారాయణుడని అంటారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కలయికే సత్యనారాయణుడు. అందుకే భీమాజీకి బాబా సత్యవ్రత సంకల్పం కలుగచేసి మనందరిని ఉద్దరించడం జరిగింది. మనము సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికి కూడా అర్ధం ఇదే. కాని బాబాని గురువుగా భావించిన వారు సాయి సత్యవ్రతం చేస్తే మంచిది. బాబాయే పరమాత్మా, పరమాత్మే బాబా.



శ్రీ సాయినాథార్పణమస్తు !

No comments:

Post a Comment