హేమద్పంత్
గారు ఈ అధ్యాయంలో బాబా చమత్కారాన్ని శనగల కథ ద్వారా వివరిస్తూ మనం ఎలా భగవంతునికి
అన్ని సమర్పించాలో నేర్పించారు. అలానే బాబా తన భక్తులను వారికి ఇష్టం వచ్చిన
రీతిలో సేవ చేయనివ్వడం గురించి కూడా చెప్పారు.
శనగల కథ
ఒక ఆదివారం
నాడు హేమద్పంత్ బాబా ముందు కూర్చొని పాదాలు వత్తుచూ సేవ చేస్తూ ఉంటారు. శ్యామా,
వామన్ రావు, బూటీ మరియు కాకా దీక్షిత్ అక్కడే ఉంటారు. ఇంతలో శ్యామా నవ్వుచూ
హేమద్పంత్ ని ఇలా అంటారు. "నీ కోటుకు శనగ గింజలు అంటినట్లున్నవి చూడు"
అని అంటారు. అప్పుడు హేమద్పంత్ కోటు మడతలో నుంచి శనగ గింజలు రాలతాయి. అక్కడవున్న
వారంతరికి ఆశ్యర్యం కలుగుతుంది. అప్పుడు బాబా ఇలా అంటారు. " వీనికి తానొక్కడే
తినే దుర్గుణం ఉంది. ఈ నాడు సంతరోజు శనగలు తినుచు ఇక్కడకు వచ్చినాడు. వాని గురించి
నాకు తెలియును. ఈ శనగలే దానికి నిదర్శనము. ఈ విషయంలో ఆశ్యర్యపడవలసినదేమి
లేదు" అని చెప్పారు.
హేమద్పంత్
అప్పుడు బాబా నేనెప్పుడూ వంటరిగా తిని ఎరుగను. అయితే ఈ దుర్గుణము నా పై ఏల
మోపెదరు? నేనెప్పుడూ సంతకు పోలేదు మరి నేనెలా శనగలు కొనెదను. నా దగ్గర ఉన్న వారికి
పెట్టకుండా నేనెప్పుడూ తినలేదు అని అంటారు. బాబా వెంటనే "అవును నిజమే దగ్గర
ఉన్న వారికి ఇచ్చెదవు. ఎవరు దగ్గర లేనప్పుడు నీవు మాత్రము ఏమి చేసెదవు. కాని నీవు
తినుటకు ముందు నన్ను స్మరింతువా? నేనెప్పుడూ నీ చెంత లేనా ! నీవేదైనా తినుటకు
ముందు నాకర్పించుచున్నావా? అని బోధ చేస్తారు.
ఇక్కడ
బాబా శనగపప్పు మిషతో అసలు తత్వాన్ని చక్కగా బోధించారు. ముందు దేవతలకు,
పంచప్రాణాలకు వైశ్వానర దేవతాగ్నికి అర్పించకుండా, అతిథికి భోజనం పెట్టకుండా భోజనం
చేస్తే ఆ ఆహరం దోషపూరితం. ఇది చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు కాని దీనిలో చాలా
పరమార్ధం ఉంది. ఇది ఒక రసాస్వాదన గురించి చెప్పినా
పంచ విషయాలకు ఇది వర్తిస్తుంది. విషయ భోగాలకు బాగా అలవాటుపడి, విషయాల అధీనంలో
ఉండేవాడు పరమార్ధాన్ని సాధించలేడు. వాటిని అధీనంలో ఉంచుకుంటే పరమార్ధం దాసోహం
అంటుంది.
యదా
పంచావతిష్టంతే అన్న శృతి వాఖ్యం దీన్నే దృఢపరుస్తుంది. శబ్ద స్పర్శ రూప రస గంధాల
తోటి సంబంధం కూడా ఇదే. మనసు బుద్ది మొదలగు ఇంద్రియాలు విషయాలను సేవించేటప్పుడు
ముందుగా నన్ను స్మరిస్తే అవి మెల్ల మెల్లగా నాకు సమర్పించబడతాయి. ఈ విషయాలను గురు
చరణాలకు అర్పిస్తే విషయాసక్తి సహజంగా తొలిగిపోతుంది. దేనినైనా కోరాలి అనిపిస్తే నా
విషయాలనే కోరుకోండి. కోపమొస్తే నా పైనే కోపం తెచ్చుకోండి. అహంకారాన్ని
దురభిమానాన్ని నాకు సమర్పించి నా పాదాలయందు భక్తి కలిగి ఉండండి. కామం క్రోధం,
అభిమానం ఉదృతంగా లేచినప్పుడు వానిని నా వైపుకు మళ్లించండి. ఈ విధంగా శ్రీ హరి
మనోవృత్తులను తొలిగిస్తాడు. నిజానికి ఈ మనోవృత్తులు నా లోనే లయం అవుతాయి. గురువు
ఎల్లప్పుడూ మన సమీపంలోనే ఉన్నారన్న దృఢమైన బుద్ది ఉన్న వారిని విషయాలు ఎప్పుడు
బాధించవు. ఈ భావం బాగా నాటుకుంటే అన్ని విషయాలలో గురువు ప్రకటమవుతారు. అప్పుడు ఆ
విషయాలు అనుభవించతగ్గవా కాదా అన్న విచక్షణ మనకు కలుగుతుంది. ఇలా మనం విషయలోలత్వం
నుంచి బయట పడగలుగుతాము. ఇదే ఈ కధలోని సారం. పవిత్రమైన గురు సేవ లభిస్తే విషయవాసనలు
నిర్మూలనమౌతాయి. బాబా ఈ శనగలు సృష్టించడం కేవలం చమత్కారం కాదు. ఈ లీల ఎంతో
మహిమాన్వితమైనది. పంచ విషయాలలోని ఏ విషయమైనా బాబాను తలుచుకోకుండా అనుభవించరాదు.
ఇదే మనకు బాబా నేర్పించాలి అనుకున్న విషయం.
అలానే
భగవంతుడు ఫలం పత్రం తోయం అని భగవద్గీతలో చెప్పారు. మనం మనస్ఫూర్తిగా ఏది
సమర్పించినా చాలు అన్న సత్యం గ్రహిస్తే చాలు. సుదాముడు శ్రీకృష్ణునకు అటుకులు
సమర్పించి సకల భోగాలు పొందాడు. కాని ఆయన శ్రీకృష్ణుని భక్తితో సేవించాడు. బాబా
కూడా తన భక్తులను ఇలానే అనుగ్రహిస్తారు. భక్తులు ఎలా సేవ చేయాలి అనుకుంటే అలానే
చేయనిస్తారు. అన్న చించణీకర్ ఒక సారి బాబా ఎడం చేతిని మర్దన చేస్తుంటాడు. సాయి
భక్తులు అప్పట్లో ఒకరు కాళ్ళు పడితే, ఒకరు పొట్టను నొక్కే వారు, ఒకరు నడుము పట్టే
వారు. ఇలా ఎవరికి ఇష్టం వచ్చిన సేవ వారు చేసే వారు. అలానే మౌసీబాయి అనే ఆమె బాబా
పొట్టను మర్దన చేస్తూ ఉంటే అన్నా మూతి ఆమె మొహం దగ్గరగా వస్తే ఆమెకు కోపం వచ్చి
అన్నా తనను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడని ఆమె అంటుంది. ఇద్దరు కోపంతో
గొడవపడతారు. అప్పుడు బాబా ఆమెతో ఒక తల్లిని కొడుకు ముద్దు పెట్టుకుంటే తప్పేమిటి
అని వాళ్ళ గొడవ చల్లారుస్తారు. ఇంకోసారి మౌసీబాయి గట్టిగా బాబా పొట్టను అదిమి
మర్దన చేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు కంగారుపడతారు. అప్పుడు బాబా తన పొట్టను సట్కాతో
అక్కడ ఉన్న స్తంబానికేసి వత్తుకుంటారు. అందరికి అప్పుడు అర్ధం అవుతుంది భక్తుల
సేవలో వారు కల్పించుకోకూడదు అని.
సాయి
సమర్థులు స్వయం సామర్ధ్యవంతులు, నిగ్రహానుగ్రహాలు ఎరిగిన జ్ఞానులు. సేవ చేసే వారి
గుణాలు అవగుణాలు వారికి తెలుసు. భక్తుల అధీనంలో ఉండడం బాబా వ్రతం.
No comments:
Post a Comment