In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, May 9, 2018

శ్రీ సాయిసత్చరిత అధ్యాయం -34



ఈ అధ్యాయంలో  కూడా ఊదీ మహిమ గురించిన సంఘటనలు చెప్పటం జరిగింది. నాసిక్ జిల్లాలో మాలెగావ్ అనే గ్రామంలో ఒక మంచిపేరున్న డాక్టర్ గారు ఉండే వారు. ఆయన మేనల్లుడు ఎముకలకు సంబంధించిన కురుపుతో బాధపడుతూ ఉంటాడు. డాక్టరుగారు తనకు తెలిసిన వైద్యం చేసి అలానే ఇతర వైద్యుల చేత కూడా ప్రయత్నం చేయించినా ఉపయోగం ఉండదు. ఆపరేషన్ చేసినా ఆ పుండు తగ్గదు. రోజు రోజుకి అతనికి నెప్పి ఎక్కువ అవుతూ ఉంటుంది. అప్పుడు ఆ కుర్రవాడి తల్లితండ్రులు చివరికి దైవం వైపు తిరిగి రక్షించమని అడుగుతారు. దేవీ దేవతలు గాని, కులదేవత కాని ఎవరు కూడా సహాయపడలేదు. ఎవరో షిర్డీకి వెళ్లి సాయిని శరణు వేడమని చెపితే చివరికి షిర్డీకి చేరతారు. సాయిని శరణువేడి ఆ అబ్బాయిని రక్షించమని అడుగుతారు. అప్పుడు బాబా ఈ ద్వారకామాయికి వచ్చినవారిని ఈ తల్లి తప్పకుండా కాపాడుతుంది. మీకు చింత వద్దు. ఈ ఊది తీసుకువెళ్లి ఆ పుండుమీద వ్రాయండి. నాలుగునుంచి ఎనిమిది రోజులలో ఉపశమనం కలుగుతుంది. భగవంతుడి మీద నమ్మకం ఉంచండి. అలా అని బాబా ప్రేమతో తన చేతిని ఆ బాబు కాలిపై నిమిరి అతనిపై కృపాదృష్టిని ప్రసరింప చేశారు. అది కేవలం శరీర బాధ. మానసిక వ్యధ ఐనా లేక దైవయోగం వల్ల వచ్చిన బాధైనా సరే బాబా దర్శనంతో నిర్మూలనమై పోతుంది. సాయి బాబా వదనాన్ని చూస్తే చాలు, దుఃఖమంతా తక్షణం నశించిపోతుంది. వారి వచనామృతాన్ని సేవిస్తే రోగికి పరమ సుఖం కలుగుతుంది. వారు తరువాత నాలుగు రోజులు షిర్డిలో ఉండి, పిల్లవాడికి వ్యాధి తగ్గుముఖం పట్టగానే వారి ఊరు వెళ్లి డాక్టర్ గారికి పుండు తగ్గిపోయిన సంగతి చెప్తారు.    

డాక్టర్ గారు షిర్డీ వెళదామని అనుకోని ముంబైకు బయలుదేరగా ఎవరో బాబా గురించి అతని మనసులో అనుమానం రేపుతారు.అతను వెనక్కు వచ్చేస్తాడు. తరువాత మూడు రాత్రులు కలలో బాబా "ఇంకా నాపై అవిశ్వాసమా! అన్న మాటలు వినిపించసాగాయి. అప్పుడు షిర్డీకి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. కాని ఒక రోగికి టైఫాయిడ్ వ్యాధి వచ్చి అతని పరిస్థితి గంభీరంగా ఉంటుంది. అతనికి జ్వరం తగ్గిపోతే బాబా దగ్గరకు వెళదామని అనుకుంటాడు. అప్పుడు ఆ కుర్రవాడికి జ్వరం తగ్గిపోతుంది. అప్పుడు షిర్డీకి వెళ్లి బాబాకు నమస్కరించుకుంటాడు. బాబా అతని మనసులోని అనుభవాలను దృఢపరిచి తమ సేవయందు అతనిని ధ్యానమగ్నుని చేశారు. అతనికి బాబా చరణాలయందు గురి కుదురుతుంది. 

డాక్టర్ పిళ్ళై
 
పిళ్ళై గారికి నారు కురుపు బాధతో వ్యాకుల పడ్డాడు. ఆయనకు ఏడు కురుపులు లేవగా చాలా దుఃఖం కలిగింది. బాబాపై అతనికి చాలా ప్రేమ. బాబా కూడా పిళ్ళైని ప్రేమతో భావు అని పిలిచే వారు. ఉదయం సాయంత్రం మసీద్ కటకటాల వద్ద భావు కూర్చొనే వాడు. బాబా అతనితో చాలా సమయం గడిపేవారు. నారుకురుపు బాధ భరించలేక మంచం పట్టాడు. ఇంత బాధలో కూడా సాయి నామస్మరణ చేస్తూఉంటాడు. ఈ బాధ సహించడానికి ఇంక నాకు శక్తి లేదు. నేనెన్నడూ దుష్కర్మలు చేయలేదే! నా తలపై ఈ పాపమెందుకు? బాబా! ఈ నారు కురుపు బాధ మరణప్రాయంగా ఉంది. ఇంకా చనిపోయి పదిజన్మలు ఎత్తైనా అనుభవిస్తా. ఈ జన్మలో జీవించింది చాలు, ఈ జీవితం నుండి నన్ను విముక్తిన్ని చేయండి. ఇదే మిమ్ములను వేడుకుంటున్నా అని కబురు పంపించాడు. ఆ కబురు తెచ్చిన దీక్షిత్తో బాబా ఇలా అంటారు. నువ్వు నిర్భయంగా ఉండు అని అతనితో చెప్పు. పదిజన్మలవరకు ఎందుకు? పది రోజులు అనుభవిస్తే చాలు. పరస్పరం కలిసి పంచుకొని అనుభవిద్దాము అని చెప్పు. స్వార్ధంగాని పరమార్ధం గాని ఇవ్వడానికి నేను ఉండగా అనర్ధమైన మరణాన్ని కోరుకుంటున్నావు, ఇదేనా నీ పురుషార్థం? అతనిని లేపి ఇక్కడకు తీసుకురండి అని బాబా చెప్పారు. అలానే పిళ్ళై గారిని మసీదుకు తీసుకువస్తారు. బాబా అతనిని చూసి తన వెనుకనున్న తలగడను ఇచ్చి కాళ్ళు బాగా చాపుకొని కూర్చోమని చెప్తారు. చేసుకున్న కర్మ అనుభవించకుండా ముగిసిపోదు. నానా కురుపుపైన పట్టీ వేసాడు అయినా నెప్పి ఏమి తగ్గలేదు అని పిళ్ళై అంటాడు. బాబా పట్టీ తీసేయ్ ఇప్పుడు కాకి వచ్చి పొడుస్తుంది. దానితో నీ కురుపు తగ్గిపోతుంది అని బాబా అంటారు. అప్పుడు అబ్దుల్ ప్రమిదలలో నూనె పోయడానికి పైకి వచ్చాడు. అక్కడ చాలామంది ఉండడం వల్ల అబ్దుల్ చూసుకోకుండా పిళ్ళై కాలిమీద తన కాలు వేస్తాడు. పిళ్ళై బాధను తట్టుకోలేక పెద్దగా అరుస్తాడు. నారు కురుపులు పగిలి చీము కారసాగింది. ఒక వైపు ఏడుస్తూ పాడసాగాడు. "ఓ దయామయా! నీ పేరు కరుణా మూర్తి. నా స్థితిని గని నన్ను కరుణించు. రెండు ప్రపంచాలకు మహారాజువు నువ్వే. నీ మహిమ ప్రపంచంలో వ్యాపించి ఉంది. ప్రపంచ వ్యవహారాలన్నీ ముగిసిపోయినా నీ మహిమ శాశ్వతంగా ఉంటుంది. నీవు ఎల్లప్పుడూ భక్తులకు సహాయకారివి అని పాడాడు. అప్పుడు పిళ్ళై కాకి ఎప్పుడు వచ్చి పొడుస్తుంది అని బాబాను అడుగుతాడు. ఇప్పుడే అది అబ్దుల్ రూపంలో వచ్చి కాలు తొక్కింది. వాడాకు వెళ్లి హాయిగా పడుకో అని పంపిస్తారు. పదవ రోజు ఉదయం సన్నని తీగలాంటి పురుగులు పండులోనుంచి బయటకు వస్తాయి. అప్పుడు బాధ పూర్తిగా తగ్గిపోయింది. ఇలా పిళ్ళై కష్టాన్ని తొలిగించి ఆయనను బాబా అనుగ్రహించారు. 

బాపాజీ భార్య ప్లేగ్ వ్యాధి
 
ఒక సారి శ్యామా తమ్ముడి భార్యను కూడా ఈ ఊది రక్షించింది. బాపాజీ శ్యామాకు తమ్ముడు. ఆయన సావుల్ విహార్ డాగారా ఉన్నప్పుడు, అతని భార్యకు తీవ్రమైన జ్వరం వస్తుంది. అలానే ఆమె తొడపై గడ్డలు వస్తాయి. అవి ప్లేగ్ వ్యాధి కారణంగా వచ్చినవని తెలిసి ఆందోళనతో షిర్డీ వచ్చి తన అన్న గారికి విన్నవించుకుంటాడు. ఇద్దరు కలిసి సాయి దగ్గరికి వెళ్తారు. అప్పుడు శ్యామా ఇలా బాబాను వేడుకుంటాడు. "జయ జయ సాయినాధా! అనాధలమైన మమ్ము అనుగ్రహించండి. ఇప్పుడు ఈ కష్టం ఎందుకు? లేని చింతపుట్టుకొచ్చింది. మిమ్ము కాక వెళ్లి ఎవరిని యాచించను? బాబా ఆ స్త్రీని ఆశీర్వదించి ఆమె బాధను నివారించండి. దుర్భరమైన ఈ జ్వరాన్ని నయం చేసి మీ మాటను నిలబెట్టుకోండి. అప్పుడు బాబా శ్యామాతో ఇలా అంటారు. " నీవు ఈ విభూది ఇచ్చి పంపు.అల్లా మాలిక్ మన తండ్రి. ఏ జ్వరమైనా ఎటువంటి గడ్డ అయినా దానంతట అదే తగ్గిపోతుంది. రేపు తెల్లవారగానే నువ్వు సావుల్ విహార్ వెళ్ళిరా. ఇప్పుడు వెళ్లాలని ఆరాటపడకు. ఇక్కడే నిశ్చింతగా ఉండు. విభూతిని రాసుకొని భక్తితో సేవిస్తే సరిపోతుంది అని చెప్తారు. బాపాజీ బాబా మాటలు విని భయపడతాడు. అతనికి నిరాశ కలుగుతుంది. మాధవరావుకు ఆకులు మూలికల వైద్యం తెలుసు. కాని శ్యామాకు బాబాపై గట్టి నమ్మకం. తమ్ముడికి దైర్యం చెప్పి పంపిస్తాడు. ఆ రాత్రి బాపాజీ విభూతిని కలిపి భార్యకు తాగించి ఆమె గడ్డలపై కొంచెం రాస్తాడు. ఆమె చక్కగా నిద్రపోయి పొద్దుటే లేచి తనపనులు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు శ్యామా వచ్చి చూసి ఆశ్చర్యపోతాడు. ఆమె ఇచ్చిన టీ తాగి మరల వెంటనే బాబా దగ్గరకు వచ్చి బాబాకు నమస్కరిస్తాడు. బాబా తనను వెంటనే ఎందుకు రమ్మన్నారో ఇప్పుడు అర్ధం అయింది. అంతా బాబా కరుణే అని అందరు అర్ధం చేసుకుంటారు. శ్యామా బాబాతో ఇలా అంటారు. " దేవా! ఏమిటి నీ లీల. మనసులో ఆందోళన కలగచేస్తావు. కూర్చున్న చోట సుడిగుండాలు లేపుతావు. మరల శాంతింప చేసేది కూడా నీవే అని అన్నాడు. అందుకు బాబా ఇలా అంటారు. " కర్మ తంత్రం యొక్క గతి అతిగహనమైనది. దానిని గమనించు. నిజంగా నేను ఏమి చేయను, చేయించను. అనవసరంగా కర్త్రుత్వాన్ని నా తలపై వేస్తారు. విధివశాత్తు జరిగే కర్మలకు నేను సాక్షీ భూతుణ్ణి మాత్రమే. చేసే వాడు, చేయించేవాడు ఆ పరమాత్ముడు మాత్రమే.  నేను ఆ పరమాత్ముని స్మరించే వాడిని. ఆ దేవునికి దాసుణ్ణి అని బాబా సెలవిచ్చారు. 

బాబా విభూతి తాగిస్తే ఒక ఇరానీ అమ్మాయికి తీవ్రంగా వస్తున్న మూర్ఛ రోగం నయం అవుతుంది. అలానే హార్ధ్యా గ్రామంలో ఒక వృద్దుడికి మూత్రపిండాలలో రాళ్లు మూలానా తీవ్రమైన నెప్పి వచ్చేది. శస్త్ర చికిత్స చేస్తే కాని నెప్పి తగ్గదు అని చెప్పారు. చివరికి బాబా విభూతి తాగితే ఆ రాళ్లు కరిగి మూత్రంలో బయట పడితే నెప్పి తగ్గిపోతుంది. చివరిగా ఈ అధ్యాయంలో ముంబై పట్టణానికి చెందిన ఒక స్త్రీకి ప్రసవం కష్టం అయ్యి ఆమెను షిర్డీకి తీసుకువస్తారు. ఆమెకు బాబా విభూతి తాగిస్తే ప్రసవం సులభం అవుతుంది. కాని బిడ్డ లోపలే చనిపోవడం మూలాన వారు నిరాశ చెందుతారు. కాని ఆ స్త్రీ బతికినందుకు అందరు సంతోషిస్తారు. ఇలా ఈ విభూతి మహిమలు చెప్పలేని విధంగా ఎంతోమంది బాధలను నివారించడం జరిగింది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మనలో బాబా పట్ల శ్రద్ద ఉండాలి. ఆయన మీద నమ్మకం ఉండాలి. మనకు ఏది మంచిదో, మనం ఎంత అనుభవించాలో బాబాకు తెలుసు. ఆ కర్మను మన చేత అనుభవించేటట్లు చేసి మనలను గట్టు ఎక్కిస్తారు. మనలో ఉన్న నమ్మకమే మనలను రక్షిస్తుంది. బాబా ఎప్పుడు తన భక్తులను వెనువెంట ఉండి కాపాడుతూ ఉంటారు.
 

ఓం శ్రీ సాయినాథార్పణమస్తు ! 





No comments:

Post a Comment