In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, May 30, 2018

శ్రీ సాయి సత్చరిత అధ్యాయం - 37






ఈ అధ్యాయంలో మనం తెలుసుకోవాల్సిన వేదాంత విషయాలన్ని చెప్పటం జరిగింది. హేమద్పంత్ గారు చావడి ఉత్సవాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తారు. సాయి చరిత్ర ధన్యము మరియు పావనమైనది. వారు ఎల్లప్పుడూ ఆత్మస్వరూపులై ఉండేవారు. వారు సాగరంవలె ప్రసన్నులు. వారియందు అమితమైన భక్తి శ్రద్ధలు కలుగుగాక. ఇహపరలోక సుఖాల కోసం మానవులు పరుగులు తీస్తూఉంటారు. ఈ లోకంలో దుఃఖాలు ఎంత తొందరగా వస్తాయో అంత తొందరగా సుఖాలు మాయం అవుతాయి. భూలోక సుఖం కన్నా స్వర్గం మిన్న అని పుణ్యకర్మలు చేస్తే స్వర్గం ప్రాప్తించినా పుణ్యం అయిపోగానే మరల జన్మలు తప్పవు. అవి మానవ జన్మలైనా లేక జంతు జన్మలైనా కావచ్చు. కాని మానవ జన్మ ఒక్కటే మనలను పరమాత్మకు దగ్గర చేస్తుంది. అందుకే మన పురాణాలు అన్ని జన్మలకన్నా మానవజన్మ గొప్పది అని చెప్తాయి. మనం వైరాగ్యంతో ఉండగలిగితే ఇదే స్వర్గం అవుతుంది అని ఈ అధ్యాయంలో చెప్తారు. స్వర్గంలో కూడా రాగ ద్వేషాలు ఉంటాయి. అక్కడ ఉండే కాలం కూడా మన పుణ్యాన్ని ఆధారం చేసుకొని ఉంటుంది. ఈ మానవ జన్మ లక్ష్యం ఏమిటో బాబా ఇంతకుముందు అధ్యాయాల్లో చెప్పారు. మానవులుగా పుట్టిన తరువాత ఆత్మను తెలుసుకోకుండా ఈ శరీరాన్ని వదిలివేస్తే ఆ జన్మ వృధా అయినట్లే. అందుకే బాబా మనకు ఈ సున్నితమైన విషయాన్ని ఎప్పుడూ నేర్పించడానికే ప్రయత్నించేవారు. ఆయువు క్షణ భంగురమైనా, ఏ పనైనా ఒక్క క్షణం చేసినా, సర్వం ఈశ్వరార్పణం అని చేసే వారికి అభయ స్థానం ప్రాప్తిస్తుంది. భగవద్ భక్తులు లేని ప్రదేశం, గురువుల కధా వర్ణన, హరి సంకీర్తన, దేవుని పూజచేయని స్థానం ఎందుకు పనికివస్తాయి? బ్రహ్మ, ఆత్మ ఒక్కటే అన్న సత్యాన్ని తెలుసుకోవాలి అంటే ఈ భూలోకమే ఉత్తమం. అందుకే ఇహలోక పరలోక సుఖాలు శాశ్వతం కాదు అని తెలుసుకొని కాయా వాచా మనసా పంచప్రాణాలను గురువుకి సమర్పించి, నిశయాత్మక బుద్ధిని కూడా ఆత్మలో లీనం చేసి, అన్ని విధాలా గురువు అధీనంలో ఉండాలి. గురు కృపతో మనలో ఉన్న అజ్ఞానం తొలిగితే మనం ఆత్మగా మిగిలిపోతాము. గురువు చరణాలు గట్టిగా పట్టుకుంటే ఇంక మనకు భయం ఎందుకు?

బుద్ధి కోరికలకు ఆశ్రయాన్ని ఇస్తుంది. అజ్ఞానం, మాయ, కోరికలు, కర్మ ఇవే మృత్యువు యొక్క ముఖ్య ధర్మాలు. ఇవన్నీ ఉపశమిస్తే బంధనాలు తొలిగిపోతాయి. అజ్ఞానం అంటే నేను ఈ శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి మరియు నేను అన్న భావన ఉండడమే. ఇవి నేను కాదు అని తెలుసుకోవడమే జ్ఞానం. దీన్నే బ్రహ్మ జ్ఞానం అంటారు. ఈ జ్ఞానం అనుభవపూర్వకంగా కలగడమే సకల అనిష్టాల నివృత్తి. “బ్రహ్మవిదాప్నోతిపరం” బ్రహ్మను తెలుసుకున్న వారికి పరమపద ప్రాప్తి. సాయిని గురువుగా నమ్మిన వారు ఎలా ఉండాలో ఈ అధ్యాయంలో చక్కగా చెప్పారు. సాయియే అంతటా ఉంటె వేరే వస్తువు కనిపించదు. నోటిలో సాయి నామం, హృదయంలో సాయి యందు ప్రేమ ఉన్న వారి యోగక్షేమాలు సాయే స్వయంగా చూస్తారు. అదే విధంగా చెవులతో సాయి అన్న శబ్ధం తప్ప మరో శబ్ధం వినకూడదు. ముక్కుతో సాయి పరిమళాన్ని పీల్చాలి. జిహ్వతో సాయి యొక్క మధుర రసాన్ని ఆస్వాదించాలి. సాయి యొక్క మందహాస వదనం సుఖాలలో ఉత్తమ సుఖాన్ని ఇస్తుంది. సాయి వచనామృతాన్ని సేవించినవారు ధన్యులు. సాయిబాబా శుభాలకు నిలయం. పాలల్లో నెయ్యి బయటకు తీసినట్లే మనం సాధన ద్వారా అంతఃకరణాన్ని నిర్మలం చేసుకోవాలి. పరమార్ధం ప్రాప్తించే వరకు భక్తిని వీడకూడదు. ఇక్కడ భక్తి అంటే సాయి చెప్పిన మార్గంలో నడవడమే. ఈ మార్గం తెలియాలి అంటే సాయి సత్చరితను అధ్యయనం చేయాలి. కేవలం సాయి కోసమే సాయిని పూజిస్తే సాయి మనలను పరమార్ధం వైపు నడిపిస్తారు.

ఈ అధ్యాయంలో చావడి ఉత్సవం కన్నుల పండుగగా వర్ణించడం జరిగింది. బాబా ఒక రోజు మసీదులో ఇంకోనాడు చావడిలో నిద్రించేవారు. 1910 డిసెంబర్ 10వ తేదినుండి చావడిలో హారతులు జరపడం మొదలు అయ్యింది. చావడిలో నిద్రించే రోజు భక్తులు మసీదులో చేరి భజనలు చేసేవారు. అక్కడ రధము,తులసి బృందావనం మధ్యలో భక్తులు, ముందర బాబా, వీని మధ్య భజన జరుగుతూ ఉంటుంది.  కొందరు తాళములు, చిరతలు, మృదంగము, కంజీరా, మద్దెలలు పట్టుకొని భజన చేస్తూ ఉంటారు. బయట కొందరు దివిటీలు సరిచేయుచుండిరి. కొందరు పల్లకిని అలంకరిస్తే, కొందరు మసీదుకు తోరణాలు కడుతూ ఉంటె, కొందరు సాయినాథ మహారాజుకి జై
అని భక్తితో నామం పలుకుతుంటారు. శ్యామకర్ణి అనే గుఱ్ఱం సజ్జితమై బయట నిలిచిఉండును. అప్పుడు తాత్యా వచ్చి బాబాను సిద్ధంగా ఉండమని చెప్పి తరువాత బాబా చంకలో చేయివేసి లేవనెత్తును. బాబా కఫినీ ధరించి, సటకా తన చంకలో పెట్టుకొని, చిలుము, పొగాకు తీసుకొని, పైన ఉత్తరీయం వేసుకొని సిద్ధంగా ఉండే వారు. ధునిలో కట్టెలు వేసి, అక్కడ ఉన్న దీపం తన చేతితో నార్పి, చావడికి బయలుదేరేవారు. అన్ని వాయిద్యాలతో, మందు సామానులు అనేక రంగులతో కాలుతూ ఉంటె, భక్తుల భజనలతో, చామరములు విసురుతూ ఉంటె, కొందరు నాట్యం చేస్తూ ఉంటారు. మహల్సాపతి కుడిచేతిని, తాత్యా ఎడమచేతిని బాపుసాహెబు జోగ్ ఛత్రము పట్టుకునే వారు. ముందు శ్యామకర్ణి దారి తీయుచుండును. బాబా చావడివైపు ముఖం పెట్టి నిలిచియొక విచిత్రమైన ప్రకాశంతో వెలిగిపోతూ ఉంటే తన కుడి చేతిని ఆడిస్తూ ఉండేవారు. అప్పుడు కాకా దీక్షిత్ వచ్చి వెండిపళ్లెంలో ఉన్న పుష్పాలు గులాల్ పొడిలో అద్ది బాబాపై చల్లుచుండును. భక్తులందరూ బాబాకు ఇరుపక్కలా నడుస్తూ ఉండే దృశ్యమును, శోభను వర్ణించుటకు మాటలు చాలవు.  

చావడిని చక్కగా అలంకరించేవారు. తెల్లని పై కప్పుతో నిలువుటద్దములతో, అనేక రంగుదీపములతో అలంకరించేవారు. చావడికి చేరగానే తాత్యా ముందుగా బాబాకు ఆసనము వేసి కూర్చోబెట్టి అంగరఖా తొడిగిన తరువాత భక్తులు పూజించేవారు. బాబా తలపై తురాయి కిరీటం పెట్టి, మేడలో మాలలు వేసి, ముఖానికి కస్తూరి నామము పెట్టి బాబాను చూసుకునేవారు. నానాసాహెబ్ నిమోన్కర్ గిరగిరా తిరిగే ఛత్రం పట్టుకొనే వాడు. జోగ్ బాబా పాదాలను వెండిపళ్లెంలో ఉంచి కడిగి అర్ఘ్య పాద్యములర్పించి చేతులకు గంధము పూసి, తాంబూలము ఇచ్చేవాడు. బాబా ఆసనంపై విరాజమానులై వెనుక తలగడకు ఆనుకుని కూర్చోగానే, వారికి ఇరువైపులా వింజామరలు
వీసే వారు. మాధవరావు  పొగాకు నలిపి చిలుములో ఉంచి తాత్యాకు ఇస్తే, అది బాగా రాసుకునే వరకు ఊది బాబాకు ఇచ్చేవాడు. బాబా దానిని పీల్చి మహాల్సాపతికి ఇచ్చేవారు. అలా అది అయిపోయే వరకు అందరు పీల్చేవారు. భక్తులు బాబా రెండు చేతులకు కర్పూరం కేసరాలతో కలిపిన చందనం అద్దేవారు. కంఠమందు పూల మాలలు వేసి చేతికి ఒక పూలగుత్తిని ఇచ్చేవారు. బాబా భక్తుల ముచ్చట తీర్చడానికి ఇవన్ని చేయించుకునే వారు. భక్తి అనే ఆభరణాన్ని, శాంతి అనే భూషణాన్ని అలంకరించుకున్న వారికి ఈ లౌకిక మణిమాలల శృంగారం ఏమి అవసరం? మూర్తీభవించిన వైరాగ్యమూర్తికి పచ్చల హారం ఎందుకు?

శిరసుపైన జలతారు శాలువాతో చత్ర ఛామరాల సేవలతో వైష్ణవ భక్తుని వలె  తేజస్సుతో భాసిల్లే వారిని ఫకీరని అనగలమా?మంగళవాయిద్యాల చప్పుడులో జోగ్ ప్రేమతో పంచారతిని పట్టుకొని బాబాకు ఆరతి ఇచ్చేవాడు. తరువాత కర్పూర నీరాజనం ఇచ్చేవాడు. ఆ ఆరతి ముగిసిన తరువాత ఒక్కొక్కరుగా వచ్చి భక్తులు బాబాకు సాష్టాంగ నమస్కారం చేసే వారి వారి ఇళ్లకు వెళ్లేవారు. చివరకు అత్తరు, పన్నీరు మరియు చిలుము బాబాకు ఇచ్చి తాత్యా బయలుదేరగా. బాబా అతనితో “వెళ్తే వెళ్ళు కాని రాత్రి మధ్య మధ్య నన్ను గమనిస్తూ ఉండు” అని చెప్పే వారు. తరువాత అక్కడ ఉన్న దుప్పట్లు పరుచుకొని బాబా పడుకునే వారు. ఇలా హేమద్పంత్ గారు చావడి ఉత్సవాన్ని ఎంతో చక్కగా వర్ణించారు.

ఈ అధ్యాయంలో మొట్టమొదటగా ఆత్మతత్వాన్ని బోధించి తరువాత చావడి ఉత్సవం గురించి చెప్పారు. మనం బాబా చూపించిన మార్గంలో నడుస్తూ, అంతఃకరణం సుద్ధి చేసుకొని, ఆత్మ గురించి తెలుసుకొవాలి. ఈ సాధనలో వచ్చే అడ్డంకులను అర్ధం చేసుకొని ముందుకు సాగాలి అంటే చావడి ఉత్సవం అనే భక్తి కావాలి. ఇక్కడ చివరలో బాబా తాత్యాకు రాత్రి మధ్యలో నన్ను గమనిస్తూ ఉండు అని చెప్పారు. సేజ్ ఆరతి జ్ఞానానికి తుదిమెట్టుగా పనిచేస్తుంది. అందుకే బాబా తనను తలుచుకుంటూ భక్తి భావంతో ఆత్మతత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి అని చెప్తున్నారు. ఇదే మనందరినుంచి బాబా కోరుకునే శ్రద్దా సభూరి.

ఓం శ్రీసాయినాథార్పణమస్తు!

No comments:

Post a Comment