In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, May 16, 2018

శ్రీ సాయిసత్చరిత అధ్యాయం - 35


ఈ అధ్యాయంలో కూడా ఊది గురించి చెపుతూ ఒకరిద్దరు భక్తులు బాబాను ఎలా పరీక్షించారు అన్న విషయాలు చెప్పారు. ముందుగా మనం ఆధ్యాత్మిక విషయంలో ముందుకు నడవాలి అంటే, దీనిలో ఉన్న శాఖలు మనకు ఎలా అడ్డుపడతాయి అన్న సత్యాన్ని చెప్పారు. కొందరు ఒక దారి సరి అయినది అంటే మరొకరికి ఇంకో దారి నిజమనిపిస్తుంది. ఇలా ఏ దారి మంచిది అనే చర్చలోనే మనం ఆగిపోతాము. యోగీశ్వరులు మామూలు మనుషులే కదా వారికి ఎందుకు నమస్కరించాలి అని కొందరి వాదన. ఇలా ఎన్నో వాదనల మధ్య మనం నలిగిపోతాము. బాబా అందుకే శ్రద్ధ సభూరి అనే రెండు సాధనలు చెప్పారు. ఏ మార్గంలో నువ్వు నడిచినా ఈ రెండు చాలా అవసరం. 

కాకా మహాజని స్నేహితుడు. 
కాకా మహాజని స్నేహితుడు నిరాకార సేవను నమ్మి విగ్రహారాధన ఇష్టపడే వాడు కాదు. కాని కాకాతో కలిసి వెళ్ళడానికి, ఊరికినే బాబాను కలిసేందుకు వస్తానని, ఆయనకు నమస్కరించను అనే షరతులతో వస్తాడు. ఇద్దరు బొంబాయి నుంచి బయలుదేరి షిర్డీకి వచ్చి ద్వారకామాయి మెట్లు ఎక్కబోతూ ఉంటే ఒక విచిత్ర కంఠ ధ్వనితో బాబా ఆహ్వానం పలుకుతారు. ఈ కంఠము తన తండ్రి మాటలాగా ఉందని ఆ స్నేహితుడు ఆశ్చర్యపోతాడు. వెంటనే అన్ని మరిచి లోపలికి వెళ్లి బాబా పాదాలకు నమస్కరిస్తాడు. కొంత సమయం తరువాత బాబా కాకాను దక్షిణ అడిగి తీసుకుంటారు. ఇలా రెండు సార్లు అడిగిన తరువాత ఈ స్నేహితుడు బాబా నన్ను దక్షిణ ఎందుకు అడగటం లేదు అని కాకాను అడుగుతాడు. అప్పుడు బాబా నీకు ఇవ్వడం ఇష్టం లేదు కదా అందుకే అడగలేదు. కాని ఇప్పుడు
ఇవ్వవచ్చు అని బాబా అంటారు. వెంటనే అతను కాకా వలె మొత్తం 17 రూపాయల దక్షిణ బాబాకు సమర్పిస్తాడు. అప్పుడు బాబా ఇలా అంటారు. " నీవు దానిని తీసివేయుము; మనకు మధ్య ఉన్న అడ్డును తీసివేయుము. అప్పుడు మనం ఒకరినిఒకరు ముఖాముఖి చూచుకొనగలము! అని చెపుతూ వారిని వెంటనే వెళ్ళమని ఆదేశిస్తారు. అప్పుడు బాగా వర్షము పడునేమో అన్న సందేహంతో వారు బయలుదేరి సురక్షితంగా ఇంటికి చేరుకుంటారు. ఇంటికి వెళ్లి తలుపు తీసేసరికి రెండు పిచ్చికలు చనిపోయి ఉంటాయి. ఇంకొక పిచ్చుక ఎగిరి బయటకు వెళ్లి పోతుంది. వీటిని రక్షించేందుకే బాబా తొందరగా వెళ్లామన్నారు అని ఆ స్నేహితుడు అర్ధం చేసుకుంటాడు. ఇలా ఆయనలో ఈ మార్పు తీసుకురావడం అత్యంత అవసరం. ఒక దారిలో మనం నడుస్తూ ఆ మార్గాన్ని నమ్మటం చాలా అవసరం. కాని మనం నమ్మిన సత్యాన్ని మిగిలిన వాటిలో చూడకపోతే మనం మన మార్గంలో ముందుకు వెళ్లలేము. 

ఇలానే ఒక సారి కాకా మహాజని యజమానికూడా బాబాను పరీక్షించడం జరిగింది. ఠక్కర్ అనే ఆయనకు ఒక కంపెనీ కలదు. దానిలో కాకా మేనేజరుగా పనిచేస్తూ ఉంటాడు. కాకా ఎప్పుడు బాబా దగ్గరకు వెళ్లి కొన్ని రోజులు ఉండి వస్తాడు అన్న సంగతి ఆయనకు తెలుసు. ఒక సారి బాబాను పరీక్షించాలి అన్న ఆసక్తితో తనతో ఇంకో వ్యక్తిని తీసుకొని కాకాతో సహా షిర్డీకి వస్తారు. దారిలో కాకా బాబాకు అర్పించేందుకు ద్రాక్ష పండ్లు కొంటాడు. వాటికి గింజలు  ఉంటాయి. అక్కడ తర్కడ్ ఉంటె ఏమైనా మహిమలు చూసావా అని ఠక్కర్ అడుగుతాడు. లేదు బాబా దర్శనం కోసం వచ్చాను అని అతను చెప్తాడు. బాబా భక్తులు ఏది అనుకుంటే అది జరుగుతుంది అని తర్కడ్ చెప్తాడు. ఇంతలో బాబా ఆ ద్రాక్ష పండ్లు అందరికి పంచమంటారు. ఠక్కర్కు ద్రాక్ష కడగకుండా తినవద్దని తన డాక్టర్ చెప్పిన విషయం గుర్తుకు వచ్చి ఏమి చేయాలో తెలియక అలానే దాన్ని తిని గింజలను తన దగ్గరే ఉంచుకుంటాడు. అప్పుడు బాబా గొప్ప యోగి అయినచో నాకు గింజలు ఇష్టంలేదు అని తెలియదా! అని అనుకుంటాడు. అంతలో బాబా మరల ద్రాక్ష ఠక్కర్ కు ఇవ్వమంటె అతనికి మరల ఇస్తారు. ఈ సారి మొహమాట పడుతుంటే బాబా తినమని చెప్తారు. ఆశ్చర్యం ఈ సారి వాటిలో గింజలు ఉండవు. ఇలా బాబా తన మనసులో ఉన్న ఆలోచనను తెలుసుకొని తనకు కావాల్సిన విధంగా చేశారు. 

తరువాత శ్యామా ఠక్కర్ను కాకా యజమానిగా బాబాకు పరిచయం చేస్తారు. బాబాకు నమస్కరించి వాడాకు వెళ్తారు.  మరల వచ్చినప్పుడు బాబా ఇలా అంటారు " ఒక చంచల మనిషి ఉండెను. అతనికి అన్ని ఉండెను. ఎట్టి విచారములు లేకుండెను. అనవసరమైన ఆరాటం మీద వేసుకొని తిరుగుతూ మనసులో శాంతిని పోగొట్టుకుంటున్నాడు. ఒక్కోసారి అన్నింటిని వదిలివేస్తాడు. ఇలా ఉండేబదులు ఒక దానిమీద నిశ్చలంగా ఉండు" అని అంటారు. ఇది తన స్వభావమే అని ఠక్కర్ అర్ధం చేసుకుంటాడు. తరువాత కాకా కూడా నాతొ వస్తే బాగుండు అనుకుంటాడు. బాబా కాకాను కూడా తనతో వెళ్ళమని ఆదేశిస్తారు. కాకా దగ్గర బాబా 15 రూపాయల దక్షిణ తీసుకొని ఇలా చెప్తారు. " నేను ఒక రూపాయి దక్షిణ ఎవరివద్దనైనా పుచ్చుకుంటే దానికి పది రెట్లు తిరిగి ఇవ్వవలెను. నేను ఊరికే ఎవరిని అడగను. ఫకీరు ఎవరిని చూపునో వారినే అడిగెదను. పూర్వజన్మల బట్టి లేదా ఈ జన్మలో ఉన్నదాని బట్టి అడుగుతాను. దానము చేయువాడు ఇచ్చునది విత్తనాలు నాటడం వంటిది. ముందు ముందు గొప్ప పంటను ఇస్తుంది. గత జన్మలో నీవు ఇచ్చివుంటే కాని ఇప్పుడు నీవు అనుభవించలేవు. ఇచ్చినచో వైరాగ్యం పెరుగును. దీని వలన భక్తిజ్ఞానములు కలుగును అని బాబా సెలవిచ్చిరి. ఇది విని వెంటనే ఠక్కర్ కూడా 15 రూపాయల దక్షిణ బాబాకు సమర్పిస్తాడు. ఇలా బాబా అతనిలో నమ్మకాన్ని కలుగచేసి తనను సరి ఐన దారిలో నడిపించారు. 

ఒక సారి బాంద్రా నివాసి అయిన ఒక వ్యక్తి నిద్ర పట్టక మిక్కిలి బాధ పడుతూ ఉండే వాడు. నిద్రపోతే చనిపోయిన తన తండ్రి స్వప్నంలో కనిపించి తీవ్రముగా తిడుతూ ఉండే వాడు. చాలా రోజులు నిద్రలేక అతని ఆరోగ్యం పాడవుతుంది. ఒక స్నేహితుడు బాబా ఊది నీటిలోకలుపుకొని  తాగి పడుకో అని సలహా ఇస్తే తాను అలా చేసి కొంచెం ఊది తన తలగడ కింద ఉంచి నిద్రపోతాడు. ఇక ఆ రోజు తన తండ్రి కలలో కనిపించడు. సుఖంగా నిద్ర పోతాడు. తరువాత బాబా పటం ఒకటి ఉంచి రోజూ పూజిస్తూ ఉండేవాడు. 

బాలాజీ పాటిల్ నెవాస్కర్ బాబాకు మంచి భక్తుడు. బాబా నడిచే దారులన్నీ శుబ్రపరిచేవాడు. అతని తరువాత రాధాకృష్ణమాయి ఈ పని చేసేవారు అని మనం విన్నాము. ఆయన ప్రతి ఏడాది పండిన పంటను బాబాకు ఇచ్చి, బాబా తనకు ఎంత ఇస్తే అంత తీసుకొని జీవించేవాడు.ఒక సారి బాలాజీ సాంవత్సరీకం నాడు ఆయన కుటుంబం కొంతమంది బంధువులను భోజనాలకు పిలిచారు. అనుకున్న దానికన్నా ఎక్కువ మంది వస్తారు. అప్పుడు బాలాజీ భార్యకు ఏమి చేయాలో తెలియక ఆదుర్దా పడుతూ ఉంటె ఆమె అత్తగారు కొంచెం బాబా ఊది తీసుకొని వాటిలో వేసి వడ్డించమంటుంది. ఆ తరువాత అందరికి తృప్తిగా భోజనం సరిపోతుంది. 
ఇంకో సారి రఘు పాటిలన్న వ్యక్తి బాలాజీ నెవాస్కర్ ఇంటికి వెళ్తాడు. అప్పుడు ఒక పాము వస్తే అందరు భయపడుతూ ఉంటె, బాలాజీ ఆ పామును బాబాగా తలిచి గిన్నెడు పాలు తీసుకొని దాని ముందు ఉంచుతాడు. తరువాత ఆ పాము అక్కడ కనిపించకుండా మాయం అవుతుంది. ఇలా బాబా బాలాజీ నెవాస్కరును అతని కుటుంబాన్ని దగ్గర ఉండి నడిపించారు. 

ఈ అధ్యాయంలో మనం బాబాను  నమ్మితే, ఆ నమ్మకాన్ని ఆయన ఎలా నిలబెడతారో, అలానే దగ్గర ఉండి మనలను సరి అయిన దారిలో ఎలా నడిపిస్తారో తెలుసుకున్నాము. అలానే వివిధమతాలు, వివిధ ఆచారాలు, మార్గాల గురించి వాగ్వివాదాలకు దిగకుండా మనం నమ్మిన మార్గంలో భగవంతుడ్ని చేరుకోవాలి. అన్నింటికి నమ్మకం ఓర్పు కావాలి. అదే బాబా మార్గం.  


ఓం శ్రీ సాయినాథార్పణమస్తు!

No comments:

Post a Comment