అపారమైన
సత్పురుషుల మహిమను సాంతం ఎవరు వర్ణించలేరు ఇక నేను ఎంత అని హేమద్పంత్ గారు ఈ అధ్యాయం మొదట్లో
చెప్పారు. సాయి తన అహంభావాన్ని వాత్సల్యంతో తొలిగించారు అని కూడా చెప్పారు. సాయి
పరతత్వ జ్ఞానావతారం. ఆయన పేరు ప్రతిష్టలకు దూరంగా ఉండి అనేక అనుభూతులతో
సాక్షాత్కారాన్ని కలుగచేస్తారు. తాము అనుగ్రహించినవారికి వారి తమ వివిధ రూపాలను
చూపుతారు. వారిని ధ్యానంతో తెలుసుకొనే వారు, భక్తితో కొలిచేవారు ఏ లోటు లేకుండా
రక్షించబడతారు. పరమార్ధమందు శ్రద్ద కలిగి, ప్రపంచ వాసనకు దూరంగా ఉండేవారిని వారు
తప్పక ఉద్ధరిస్తారు. ఇక ఈ అధ్యాయంలో చెప్పిన ఈ అనుభవాలను పరిశీలిద్దాము.
ఒక సారి
ఇద్దరు గృహస్తులు గోవా నగరం నుంచి షిర్డీకి వస్తారు. వారిలో ఒకరు బాబాకు 15 రూపాయల
దక్షిణ సమర్పించుకుంటారు. వేరే అతను 35 రూపాయల దక్షిణ ఇవ్వబోతే బాబా దానిని
స్వీకరించరు. అప్పుడు శ్యామా మీరు ఈ తేడా ఎందుకు చూపిస్తున్నారు బాబా అని
అడుగుతాడు. అప్పుడు బాబా "శ్యామా నీకసలు ఏమి తెలియదు. నేను ఎవరి దగ్గర నుండి
ఏమి తీసుకోను. ఈ మసీదు మాత ఇక్కడ బాకీ ఉన్న డబ్బు అడుగుతుంది. ఇచ్చినవారు రుణ
విముక్తులవుతారు. నాకేమైనా ఇల్లు ఉందా? సంసారం ఉందా? నాకు డబ్బుతో ఏమి అవసరం.
అన్నివిధాలా నేను నిచ్చింతగా ఉంటాను. కాని ఋణం, శత్రుత్వం, మరియు హత్య చేసిన
వారిని అవి కల్పాంతం వరకు విడిచిపెట్టవు. వారి వారి అవసరాలకు జనులు
దేవతలకుమొక్కుతారు. వారిని ఉద్దరించటానికి నేను కష్టపడాలి. మీకు ఆ చింతలేదు.
భక్తులలో రుణ విముక్తులైన వారు నాకు ప్రీతిపాత్రులు" అని చెపుతూ ఇంకా ఒక కథను
చెప్పారు. అప్పుడు ఆ గోవా గృహస్థులు అక్కడే ఉన్నారు. ఇతడు మిక్కిలి పేదవాడు.
ఇతనికి ఉద్యోగం వస్తే మొట్టమొదటి వేతనం దేవునికి ఇస్తానని మొక్కుకున్నాడు. అతని
మొదటి జీతం 15 రూపాయలు. ఆ తరువాత అతని జీతం పెరిగి ఏడు వందలు అయ్యింది. కాలంలో
అతని మొక్కు మరిచాడు. తన కర్మవశాత్తు ఇక్కడకు వచ్చాడు అందుకే 15 రూపాయలు దక్షిణ
తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా ఒక సారి నేను సముద్ర తీరంలో ఉండగా ఒక పెద్ద భవనం
కనిపించింది. ఆ భవనం యజమాని ఒక బ్రాహ్మణుడు. అతను నాకు అతిధి సత్కారాలు చేసి నాకు
అక్కడ ఉండేందుకు అనుమతి ఇచ్చాడు. నాకు నిద్ర వచ్చింది. అతను రాత్రి గోడకు రంద్రం చేసి
నా దగ్గర ఉన్న 30000 రూపాయలు దోచుకున్నాడు. నాకు చాలా దుఃఖం వేసింది. అంత మొత్తంలో
డబ్బు పోయే సరికి నాకు చాలా బాధ వేసింది. అలా పదిహేను రోజులు గడిచిన తరువాత ఒక
ఫకీర్ కలిసి నా బాధాపోవాలి అంటే ఇంకో ఫకీరును కలిసి శరణువేడితే తనకు మంచి
జరుగుతుంది అని చెప్తాడు. అలా చేసిన తరువాత ఈ బ్రాహ్మణుడు మరల వచ్చి తన డబ్బు
తిరిగి ఇచ్చివేస్తాడు. ఇక్కడ ఆ ఫకీరు చెప్పిన వ్రతం ఏమిటి అంటే, ఈ గృహస్తుడు తనకు
ఇష్టమైన ఆహారాన్ని కొన్ని రోజులపాటు వదిలివేయాలి. ఆయన అలా చేస్తే ఫలితం దక్కింది.
ఆ తరువాత సముద్ర తీరంలో ఒక నావ కనిపిస్తే ప్రవేశం దొరకలేదు. అప్పుడు ఒక సిపాయి
వచ్చి తనకు ప్రవేశం లభించేటట్లు చేసాడు. తరువాత ఆ నావలో వచ్చి బండిలో వస్తే
మసీదుమాత కనిపించింది అని బాబా కథ చెప్పడం ఆపారు.
తరువాత ఆ
ఇద్దరు గృహస్థులను ఇంటికి తీసుకువెళ్లి భోజనం పెట్టు అని శ్యామాకు చెప్పారు. అలానే
వారందరు శ్యామా ఇంటికి వెళ్లి భోజనం చేసి కూర్చున్నారు. అప్పుడు శ్యామా వారిని
బాబా చెప్పిన కథ మీ గురించేనా? అని అడుగుతాడు. అప్పుడు వారు బాబా చెప్పినదంతా వారి
కథే అని. అతనికి 15 రూపాయల ఉద్యోగం రావడం, అతని మొక్కు గురించి అలానే ఇంకోఅతను
సముద్ర తీరంలో జరిగిన విషయాలన్నీ తన గురించే అని చెప్తాడు. నా దగ్గర ముప్పై ఐదు
ఏళ్ల నుంచి పనిచేసిన ఒక బ్రాహ్మణుడు డబ్బులు దొంగిలించడం. మరల ఫకీరు చెప్పిన వ్రతం
ద్వారా డబ్బులు తిరిగి లభించడం ఇలా అన్ని విషయాలను పూసగుచ్చినట్లు బాబా ఎలా
చెప్పారు అని వారిద్దరూ ఆశ్చర్యపోతారు. ఇలా సాయి దక్షిణ తీసుకొని అతనిని రుణ
విముక్తుణ్ణి చేశారు. మేము ఎంత ధనవంతులం అయినా,ఇటువంటి సాయికి దగ్గరగా ఉన్న మీరందరు అదృష్టవంతులు. మా చేతులారా వారికి ఏమి చేయక
పోయినా వారు మాకెంతో చేశారు. అందుకే ఆయనను దర్శించుకునేందుకు వచ్చాము. అనంతకోటి
జన్మల పుణ్యఫలం వల్ల మాకు షిర్డీ వచ్చే భాగ్యం కలిగింది. మాకు వీరే దత్త భగవానులు.
శ్రీ సాయి దర్శన భాగ్యం కలగడానికి సర్వం అర్పించేయాలి అనిపిస్తుంది. సాయి
సజ్జనులు, స్వయంగా అవతార పురుషులు. వారే మమ్ములను ఇక్కడకు రప్పించుకున్నారు. మాకు
పరమార్ధాన్ని సాధించాలి అన్న ఉత్సాహం కూడా సాయే కలుగచేసారు అని వారు శ్యామాతో
చెప్పారు.
తరువాత ఈ
అధ్యాయంలో సఖారాం ఔరంగాబాదుకర్ భార్య గురించి చెప్పారు. సఖారాం షోలాపూర్ నివాసి.
అతనికి చాలా కాలం సంతానం కలుగలేదు. ఆయన భార్య బాబాను వేడుకునేందుకు తన సవతి కొడుకు
అయిన విశ్వనాధ్ అనే కుర్రవాడిని వెంట తీసుకొని షిర్డీకి వచ్చింది. ఎప్పుడు ద్వారకామాయిలో
జన సమూహం వల్ల ఆమె బాబాను రెండునెలలైనా కలవలేక
పోయింది. తరువాత శ్యామా సాయంతో బాబాను కలిసేందుకు
ప్రయత్నం జరుగుతుంది. బాబా భోజనానికి కూర్చున్నప్పుడు ఒక టెంకాయ, అగరవత్తులతో
తయారుగా ఉంటే, నేను సైగ చేసినప్పుడు బాబా దగ్గరకు రా అని ఆమెకు శ్యామా చెప్తాడు.
ఆమె అలా వేచిఉండి బాబాను కలుస్తుంది. ఇంతలో శ్యామా పక్కనే ఉంటే బాబా అతని బుగ్గ
గిల్లుతారు. అప్పుడు వారిద్దరూ పరాచకాలు ఆడుతూ ఉన్నప్పుడు, శ్యామా ఆమెకు పైకి
రమ్మని సైగ చేస్తాడు. ఆమె సమర్పించిన కొబ్బరికాయను అక్కడవున్న కటకటాలపై కొడతారు.
శ్యామా ఇదేమి ఈ కాయ శబ్దం చేస్తుంది అని బాబా అంటారు. అప్పుడు శ్యామా బాబా మీరు ఈ
టెంకాయ వలె ఆమె గర్భంలో కూడా శబ్దం వచ్చేలాగా పుత్రప్రాప్తి కలుగచేయండి అని
వేడుకుంటాడు. ఆ కొబ్బరికాయను ఆమె వొడిలో వేయమని శ్యామా బాబాను బతిమిలాడుతాడు. ఆ తరువాత బాబా అనుగ్రహిస్తే ఆ కొబ్బరికాయను పగలగొట్టి సగం ఆమే
వొడిలో వేయిస్తాడు శ్యామా. అమ్మా నీకు కనుక పిల్లలు కలగకపోతే ఈ దేవుణ్ణి ఈ మసీదులో
ఉండనివ్వను. అలా జరుగక పొతే నా పేరు మాధవరావే కాదు అని తనకు బాబాపై కల నమ్మకాన్ని
వ్యక్తం చేస్తాడు. ఆమెకు తరువాత సంతానం కలిగి
ఆ పుత్రుడుని తీసుకొని మరల ఆమె షిర్డీకి వస్తుంది. ఆమె భర్త ఎంతో ఆనందంతో సాయి చరణాలకు వందనం చేసి ఐదువందల రూపాయలను సమర్పిస్తాడు. తరువాత ఆ
ధనం శ్యామకర్ణి ఉండే స్థలంలో గోడలు కట్టేందుకు వాడారు.
బాబా ఇలా
తన భక్తులను ఎల్లప్పుడూ రక్షిస్తూ వారిని సరి అయిన దారిలో నడిపిస్తూ ఉంటారు.
ఇటువంటి సాయి సమర్ధుని ఎల్లప్పుడూ స్మరించండి, చింతన చేయండి, ధ్యానించండి, వేరే
ఎక్కడికో పరుగులు పెట్టకండి అని చెప్తూ హేమద్పంత్ గారు ఈ అధ్యాయం సశేషం చేశారు.
ఓం శ్రీ
సాయినాథార్పణమస్తు!
No comments:
Post a Comment