In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, August 1, 2018

శ్రీ సాయిసత్చరిత అధ్యాయం - 47



బాబా గత అధ్యాయంలో రెండు మేకల పూర్వ జన్మల గురించి చెప్పి అన్నదమ్ములైన ఇద్దరు వారి
 కర్మలు ఫలితంగా ఎలా మేకలుగా పుట్టారో చెప్పారు. పరమానందాన్ని ఉత్పన్నంమ్ చేసే సాయి యొక్క శ్రీ ముఖాన్ని ఒక్క క్షణం చూస్తే చాలు. అది అనంత జన్మల దుఃఖాన్ని నశింపచేస్తుంది. వారి కృపాదృష్టితో కర్మాకర్మల చిక్కు విడిపోతుంది. గంగ అందరి పాపాలను ప్రక్షాళన చేస్తే తన మాలిన్యం పోగొట్టుకోవడం కోసం సత్పురుషుల చరణ ధూళిని కోరుకుంటుంది. జ్ఞానులైన, అజ్ఞానులైన సాయి కథను వింటే కర్మ బంధనం విడిపోతుంది. బాబా భక్తులపై చూపించే ప్రేమను తలుచుకుంటే మనసు తన మనోధర్మాన్ని మరిచిపోతుంది. ప్రపంచ బాధలనుండి విముక్తి కలుగుతుంది.  కర్మ సిద్ధాంతం చాలా కఠినమైనది. అది ఎవరికీ అంత తేలికగా అర్ధం కాదు. మహా మహా జ్ఞానులను కూడా మోసగిస్త్తుంది. కాని ఏమి తెలియని అమాయక భక్తులను తరింపచేస్తుంది. అట్లే పరమేశ్వరుని  నియమం దుర్గమం. దానిని ఎవరు అతిక్రమించగలరు? కనుక, లౌకిక ధర్మానుసారం ఆయా కర్మలను ఎప్పుడూ చేస్తూ ఉండాలి. లేకపోతే, అత్యంత అధర్మం. 
  
ఈ అధ్యాయంలో బాబానే స్వయంగా చెప్పిన జన్మ చక్రం గురించి విందాము. 
ఒక రోజు ఉదయం బాబా అలా వాహ్యాళికి వెళ్తూ ఒక చిన్న నదీ తీరంలో దగ్గర ఆగి స్నానం చేసి అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. బాబా ఒక గుడ్డతో చిలుము శుభ్రం చేస్తూ ఉంటే ఒక బాటసారి అటుగా వచ్చి బాబాకు నమస్కరిస్తాడు. అప్పుడు  కప్ప బెకబెకలు వినపడసాగాయి. ఆ అరుపులో దాని బాధ వ్యక్తం కాసాగింది. ఆ కప్ప అంత పెద్దగా ఎందుకు అరుస్తోంది అని బాటసారి బాబాను అడిగాడు. దానికి బాబా ఆ కప్ప కష్టంలో ఉందిఅది తన పూర్వ జన్మల కర్మను ఇప్పుడు అనుభవిస్తుంది. ఇప్పుడు ఏడ్చి లాభం ఏముంది? గత జన్మలో మనం చేసిన కర్మఫలితాలను మనం ఎప్పుడైనా అనుభవించేందుకు సిద్ధంగా ఉండాలి. అప్పుడు ఆ బాటసారి ఆ కప్ప అరుస్తున్న వైపుకు వెళ్లి చూస్తే ఒక కప్ప పాము నోటిలో చిక్కుకొని అరుస్తుంది. అప్పుడు బాబా వాటి పూర్వ జన్మల గురించి ఆ బాటసారికి చెప్పడం మొదలుపెట్టారు. వారు క్రిందటి జన్మలలో మనుషులుగా పుట్టారు. కాని అప్పుడు ఘోర పాపాలను చేసారు. వీరు ఎన్ని నీచజన్మలు ఎత్తాల్సి వచ్చిందో. వీరు నాకు తెలుసు. నేనుండగా ఆ కప్పకు ఎటువంటి ప్రమాదం లేదు అంటూ బాబా అటుగా వెళ్తారు. ఆ పామును చూసి "ఒరేయ్ వీరభద్రప్ప నువ్వు పాముగా జన్మించావు. ఈ బసప్ప కప్పగా పుట్టాడు. నువ్వు ఈ శత్రుత్వాన్ని ఇంకా వదలలేదు. ఇంకా ఎందుకురా, ఈ పగలూ, వైరాలు? సిగ్గులేదా? వెంటనే ఆ కప్పను వదిలివేయి అని బాబా అంటారు. అప్పుడు ఆ పాము కప్పను వదిలివేసింది. ఆ కప్ప నీటిలోకి దూకి పారిపోయింది. బాటసారికి ఇదేమి అర్ధం కాక బాబాను అర్ధం అయ్యేలా చెప్పమని వేడుకుంటాడు. బాబా చెప్పగానే ఆ పాము కప్పను వదలడం అతనిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 

బాబా ఆ బాటసారితో కలిసి మరల చెట్టు క్రిందకు వెళ్లి వారి కథను చెప్పనారంభిస్తారు. ఒక సారి నేను ఒక ఊరిలో ఉండేవాడిని. అక్కడికి ఐదు మైళ్ళ దూరంలో ఒక పాత శివాలయం ఉండేది.  అది చాలా శిధిలావస్థలో ఉంది. అక్కడ ఉన్న భక్తులు దాని పునరుద్ధరణ కోసం చందాలు వసూలు చేసి అక్కడ ఉన్న ఒక ధనవంతుడికి ఇచ్చి, ఆయనను ధర్మకర్తగా ఎన్నుకున్నారు. అతను మహాలోభి. అతడు తన చేతినుండి పైసా ఖర్చుపెట్టకుండా పనులకు పూనుకున్నాడు. కాని ఆ డబ్బు సరిపోలేదు. మరమ్మత్తులు సగంలో ఆగిపోయాయి. ఆ గ్రామస్థులు మరల డబ్బు వసూలు చేసి అతనికి ఇస్తారు. ఈ సారికూడా ఆ లోభి సరిగ్గా పనులను చేయించడు. అప్పుడు శివుడే ఆ లోభి భార్యకు కలలో కన్పించి కలశ స్థాపన చేయమని, ఆమె ఖర్చుపెట్టిన సొత్తుకు వంద రెట్లు వస్తుంది అని చెప్తారు.
మరుసటి రోజు ఆమె ఈ కల గురించి లోభి అయిన తన భర్తకు చెపుతుంది. దేవుడు నాకే ఎందుకు కన్పించి చెప్పకూడదు. ఇవన్నీ నమ్మ వద్దు అని తోసిపారవేస్తాడు. మరల శివుడు ఆమె కలలో కన్పించి నీ భర్తను డబ్బులు అడగకు,  నువ్వే ఇవ్వదలుచుకున్నది ఇవ్వు అని అంతర్థానం అవుతారు. ఆమె తన తండ్రి ఇచ్చిన ఆభరణాలను అమ్మడానికి నిర్ణయించుకుంటే, భర్తే వాటిని కొని తన దగ్గర దుబాకి అనే ఆమె తాకట్టు పెట్టుకున్న బీడు భూమిని ఆమెకు ఇస్తాడు. ఆమె ఎంతో ప్రేమతో ఆ పొలాన్ని దేవునికి అర్పించింది. ఈ పొలం దుబాకి అనే ఆమె రెండువందల రూపాయలకు ఈ లోభి దగ్గర తాకట్టుగా పెట్టింది. ఆమె తన పొలాన్ని ఇలా పోగొట్టుకొని బాధపడుతుంది. ఆ శివాలయ పూజారి మాత్రం దేవుడికి పొలం వచ్చింది అని ఆనందపడతాడు. 

కొన్ని రోజుల తరువాత ఓక రోజు పిడుగుపడి ఆ లోభి ఇళ్లుతో పాటు భార్యాభర్తలిద్దరూ చనిపోతారు. దుబాకి కూడా చనిపోతుంది.  తరువాత ఈ లోభి ఒక బ్రాహ్మణుని ఇంట్లో పుట్టాడు. అతనికి వీరభద్రప్ప అని పేరు పెడతారు. ఆయన భార్య గౌరిగా ఒక పూజారి ఇంట్లో పుడుతుంది. దుబాకి గురవ వంశంలో మగపిల్లాడుగా పుడుతుంది. ఈ పిల్లవాడికి చిన్నబసప్ప అనే నామకరణం చేస్తారు. పూజారికి బాబా అంటే చాలా ప్రీతి. గౌరీకి యుక్త వయస్సు వచ్చింది. పూజారి ఆమె వివాహం గురించి బాబా దగ్గర ప్రస్తావిస్తే బాబా ఇలా అంటారు. ఆమె భర్త త్వరలో వస్తాడు. నీవు దిగాలుపడవద్దు అని ఆ పూజారికి దైర్యం చెపుతారు. వీరభద్రప్ప కటిక దరిద్రంలో ఉంటాడు. ఊరూరా తిరుగుతూ పూజారిఉన్న ఊరికి వస్తాడు. అతను అందరికి నచ్చుతాడు. అతనికి గౌరిని ఇచ్చి వివాహం చేస్తాడు. ఒక ఆధారం దొరికింది వీరభద్రప్పకు. అప్పటి దాకా కాయకష్టం చేసి బతుకుతూ ఉన్న తనకు సుఖాలవైపుకి దృష్టి మళ్లింది. త్వరలోనే ఒక సొంత ఇల్లు కట్టుకున్నాడు. ధనం అనే మత్తు ఎవరిని వదలదు. అతనికి భార్య పేరుమీదున్న ఆస్తి మీద   బతకటం ఇష్టం లేదు. ఇంతలో ఆమెకు ఉన్న స్థలాల రేటు బాగా పెరిగింది. ఒక సంపన్నుడు ఆమె భూమిని లక్ష రూపాయలకు కొన నిశ్చయించి, కొంత డబ్బు ముందుగా ఇచ్చి మిగిలినవి వాయిదా రూపంలో ఇవ్వడానికి ఒప్పొందం కుదుర్చుకొంటాడు. ఏడాదికి రెండువేల చొప్పున వడ్డీతో సహా ఇస్తానంటాడు. చిన్న బసప్ప వంశం వాళ్లకు గుడి తరుపున ఉన్న ఏదైనా ఆదాయంలో వారికి హక్కు ఉంది. ఇదే ఉద్దేశంతో చిన్నబసప్ప ప్రతిసంవత్సరం వచ్చే వడ్డీలో సగం ఆలయ మరమ్మత్తుకు ఇమ్మని అడుగుతాడు. దానికి వీరభద్రప్ప అడ్డు పడతాడు. మిగిలిన అందరూ ఒప్పుకున్నా వీరబద్రప్ప ఒప్పుకోక పోవడంతో వారిద్దరికీ సంఘర్షణ మొదలవుతుంది. చివరికి బాబా దగ్గరకు వస్తారు. బాబా ఈ స్థలం ఈశ్వరుడిది. ఈశ్వరుని ప్రతినిధిగా గౌరి ఎలా చెపితే అలా చేయమని చెప్తారు. వీరభద్రప్ప బాబాను కూడా నిందించి ఇదంతా నీ కుట్ర అని ఆరోపిస్తాడు. తరువాత వీరబద్రప్ప ఇంట్లో అందరి మీద విరుచుకు పడి బసప్ప అంతు తెలుస్తానని భయపెడతాడు. 

తరువాత దేవుడు గౌరి కలలో కన్పించి "అమ్మా గౌరి ఈ స్థలం నీది. నువ్వు ఎవరికీ ఏమి ఇవ్వకు. చెన్నబసప్ప చెప్పినట్లు ఆలయానికి కొంత దానం ఇవ్వు. అతనిని నమ్మ వచ్చు. మసీదులో బాబాకు చెప్పి అతని ఆజ్ఞానుసారం చేయి" అని చెప్తారు. ఆమె బాబా దగ్గరకు వెళ్లి కలగురించి చెప్తుంది. దేవుడు చెప్పినట్లే చేయమని బాబా ఆమెకు చెప్తారు. వీరభద్రప్పకు ఈ ఆలోచనకు మండిపడతాడు. చిన్నబసప్ప వీరభద్రప్ప పరస్పరం గొడవపడతారు. బాబా ఇద్దరికీ నచ్చ చెప్పినా వినరు. చిన్నబసప్పను చంపుతానని భయపెడితే అతను బాబాను రక్షించమని వేడుకుంటాడు. బయపడకు నేను ఉన్నంత వరకు నిన్ను ఎవరు ఏమి చేయరు అని అభయం ఇస్తారు. పిచ్చి పట్టిన వీరభద్రప్ప కొంతకాలానికి మరణించి ఇప్పుడు పాముగా పుట్టాడు. బసప్ప మరణించి కప్పగా పుట్టాడు. గత జన్మల వైరం ఇప్పుడు కూడా కొనసాగి వీరభద్రప్ప పాములాగా బసప్పను పట్టుకున్నాడు. నేను రక్షిస్తానని మాట ఇచ్చాను అందుకే బసప్పను వదలమని చెప్పాను. ఇలా బాబా ఈ కథను చెప్పి ఆ బాటసారి ఉత్సుకతను తీర్చారు.     

ఈ కథ ద్వారా బాబా మనందరికీ కనువిప్పు కలగాలి అని కర్మ సిద్ధాంతం గురించి మనం అర్ధం చేసుకోవాలి అని బోధ చేశారు. మరణం తరువాత వారి వారి కర్మలననుసరించి తదనురూపంగా జన్మలను పొందుతారు. తాము ఆర్జించుకున్న దానిని అనుసరించి తమకు శరీరాలు ప్రాప్తిస్తాయి అని తెలుసుకోవాలి. అందువలన శరీరం నేలరాలిపోక ముందె మానవ జన్మ యొక్క అమూల్య అవకాశాన్ని, ఆత్మజ్ఞాన ప్రాప్తి వరకు జాడవిరుచుకోని వారే జ్ఞానులు. వారే ప్రపంచ బంధనాల నుండి ముక్తులవుతారు. ఇతరులు ప్రపంచ చక్రంలో పడతారు. వారికి జన్మజన్మల యాతన తప్పదు. ఈ అధ్యాయంలో కథ వింటే నేను శరీరం అన్న ధ్యాస, చెడు ఆలోచన తొలిగిపోయి సాత్విక అష్టభావాలు ఉప్పొంగుతాయి. తమ వద్ద ఎంత ధనం ఉన్నా అత్యంత లోభ స్వబాహ్వం కల వారి జీవనం వ్యర్థం. అట్టివారు జీవితాంతం వ్యర్ధమైన శ్రమను అనుభవిస్తారు. పైగా మనసులో శత్రుత్వ భావం ఉండటం ఎన్నడూ మంచిది కాదు. ఈ భావం రాకుండా మనసును నిగ్రహించుకోవాలి లేదా అది జీవితాన్ని నాశనం చేస్తుంది. పరస్పరవైరం యొక్క పరిణామం ఉత్తమమైన జన్మనుండి అధమమైన జన్మకు వెళ్లడం. ఋణం, శత్రుత్వం, హత్య వీని ధర్మం ఇవి తీరేవరకు జన్మ పరంపర తప్పదు.

ఓం శ్రీ సాయినాథార్పణమస్తు!



No comments:

Post a Comment