In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, August 15, 2018

శ్రీ సాయి సత్చరిత అధ్యాయం - 49




మహానుభావుల సుగుణాలను పొగడగల శక్తి ఎవరికి మాత్రం ఉంటుంది. శాస్త్రాలు వారిని ఎంత కీర్తించినా ఇంకా ఎంతో తెలియనిది ఉంటుంది. అలానే సాయి లీలలు అపారమైనవి. అందుకే హేమద్పంత్ గారు తన ప్రయత్నం బాబా అనుగ్రహం లేనిదే సాధ్యం కాదు అని చెప్పారు. గురువు అనుగ్రహం లేనిదే ఆత్మ సాక్షాత్కారం కలుగదు. వారికి సర్వస్య శరణాగతి చేసి వారియందే ధ్యానము చేయుటయే భక్తుల కర్తవ్యము. గురువులు పరమాత్మ స్వరూపులు. గురు పాదాలను భక్తితో ప్రేమతో సేవించాలి. వారి సత్సాంగత్యం సాధకులకు అమృతప్రాయం. ఎవరికైతే అహం అడ్డుపడుతూ ఉంటుందో వారు గురువు చెప్పిన విద్యను అందుకోలేరు. గురువు దగ్గర మనం శుభ్రమైన ఏమీ రాయని పలక లాగా ఉండాలి. మనం మన వాసనలతో ఇలా ఉండాలి, ఆలా ఉండాలి అని వెళితే ఏమి ఉపయోగం ఉండదు. మనకు తెలిసిన ఆచార సంప్రదాయాలు ఒక్కోసారి మనకు అడ్డుగోడలు అవుతాయి. తీర్థ యాత్ర, వ్రతము, త్యాగము, దానముల కంటె తపస్సు చేయుట గొప్ప. హరిని పూజించుట తపస్సుకంటె మేలు. కాని గురువుని పూజించుట అన్నిటికన్నా మేలైనది. తొందరగా మన గమ్యాన్ని చేరుకోవచ్చు. అందుకే సాయి భక్తులకు సాయి నామమే దివ్యమంత్రం కావాలి. భవభయాలనుంచి తప్పించుకోవడానికి దీన్ని మించిన మంచి ఉపాయం ఇంకొకటి లేదు. గురువుని నమ్మితే, గురువు భగవంతుడిని చాలా సులువుగా చూపిస్తారు. 

హరి కానోబా కథ 
బాబా లీలలు గురించి విని హరి కానోబా అనే అతను బొంబాయి నుంచి షిర్డీ వస్తారు. ఆయన బాబాను పరీక్షించాలి అనుకోని వస్తారు. ఆయన స్నేహితులకూడా ఆయనతో వస్తారు. అతను తలపై మంచి జలతారు పాగా, కాళ్లకు మంచి కొత్త చెప్పులు వేసుకొని ద్వారకామాయికి బయలుదేరతాడు. కాని ఈ కొత్త చెప్పులు ఎక్కడ ఉంచాలి అని ఆలోచిస్తూ ఒక మూల వాటిని వదిలి బాబాను దర్శించుకుంటాడు. వచ్చి చూస్తే చెప్పులు మాయం అవుతాయి. అక్కడ అంత వెదికి ఉపయోగం లేక నిరుత్సాహంతో వాడాకు వెళ్తాడు. తరువాత స్నానం చేసి, భగవంతుడికి నైవేద్యం పెట్టి చెప్పులగురించే ఆలోచించ సాగెను. ఇంతలో ఒక పిల్లవాడు అటుగా వస్తూ ఉంటాడు. అతని చేతిలో ఒక కర్ర, ఆ కర్ర చివర తన చెప్పులు కనిపిస్తూ ఉంటాయి. ఆ పిల్ల వాడు "హరీ కా బేటా, జరీ కా ఫేటా" అని అరవమని బాబా చెప్పారు అని అంటాడు. అప్పుడు తాను కానోబా కుమారుడును, హరి యని తన దగ్గర జరీ తలపాగా ఉంది అని చూపిస్తాడు. తన చెప్పులు తనకు దక్కుతాయి. కానోబాకు మిక్కిలి ఆశ్చర్యం కలిగింది. బాబాకు తన తండ్రి పేరు ఎలా తెలిసింది అనుకుంటూ బాబా సత్పురుషుడు అని అర్ధం చేసుకుంటాడు. 

సోమదేవ స్వామి:
హారికానోబా లాగానే ఇంకొకరు బాబాను పరీక్షించేందుకు షిర్డీ వస్తారు. ఆయనే సోమదేవ స్వామి. ఆయన ఒక సారి దీక్షిత్ తమ్ముడు అయిన బాయీజీ 1906 లో హిమాలయాలకు వెళ్ళినప్పుడు ఈ సోమదేవ స్వామిని కలుస్తారు. ఆయనకు తన చిరునామా తెలిపి రమ్మని ఆహ్వానిస్తారు. సోమదేవ స్వామి బాయీజీ ని కలిసి బాబా గురించి తెలుసుకొని షిర్డీ ప్రయాణం కడతాడు. తను షిర్డీ సమీపంలోకి రాగానే రెండు జండాలు కనపడతాయి. ఇవి  చూసి తన మనసులో ఇదేమిటి ఈయన జండాలపై వ్యామోహం చూపిస్తున్నారు అని అనుకుంటాడు. పక్క వాళ్ళతో అంటే వారు బాబా సంస్థానంలో గుఱ్ఱము, రధము ఇంకా కొన్ని వస్తువులు ఉన్నాయని తెలిసి వెనుకకు వెళ్లి పోవాలి అని అనుకుంటాడు. పక్కనున్న వారు బాబాకు వీటిపై ఎలాంటి వ్యామోహం ఉండదు అని ఆయనను సమాధానపరిచి ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి బాబాను కలిసి వెళ్ళమని చెప్తారు. అలా వారు చెప్పగా బాబాను కలుస్తాడు. 

బాబాను కలిసిన మరుక్షణమే ఆయన మనస్సు కరిగింది. కన్నులలో నీరు నిండింది. అతని సందేహాలన్నీ అడుగంటిపోయాయి. ఆయన మనస్సు ఎన్ని తీర్ధాలు దర్శించినా కుదుట పడనిది, ఇక్కడ బాబాను చూడగానే ఎనలేని ఆనందం కలిగింది. దర్శన మాత్రంతో వికల్పాలు సంశయాలు మాయం అయ్యాయి. బుద్ది మౌనం వహించింది. కళ్ళు రెప్పలు వేయడం ఆగిపోయింది. ద్వైత భావం పోయి లోపల బయట అంతా ఉన్న చైతన్యమే అని మనసు గ్రహించింది. స్వామిలో సాత్విక అష్టభావాలు ఉప్పొంగాయి. మనసు పూర్తిగా తల్లీనత చెందిన చోటే మన నిజమైన స్థానమని తన గురువు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. అతను బాబా దగ్గరకు వెళ్లగా బాబా ఇలా అంటారు. "మా వైభవం మా దగ్గరే ఉండనీ. పో ఇంటికి వెళ్ళు మరల ఈ మసీదుకు రావద్దు. మసీదుపైన పతాకాలు కట్టుకొనేవారిని ఎందుకు చూడాలి? ఇది సత్పురుషుల లక్షణము కాదు. ఇక్కడ ఒక క్షణం అయినా ఉండద్దు" అని అంటారు. సోమదేవ స్వామి తన మనసులో ఉన్న సందేహాల గురించి చెప్పారు అని అర్ధం చేసుకొని బాబా పై ప్రేమను ఇంకా పెంచుకుంటాడు. అయ్యో నేను ఎంతటి బుద్ది లేని వాడిని, బాబాను తప్పుగా అర్ధం చేసుకున్నాను. తరువాత సోమదేవ స్వామి బాబా దగ్గరే ఉండి ఆధ్యాత్మిక ప్రగతిని సాధించారు. విశ్వంభరుడు ఈ విశ్వమంతా చైతన్యమై వ్యాపించి ఉంటారు. మనం గురువుని ఎంతైనా పరీక్షించవచ్చు. కాని ఒక్క సారి వారిని నమ్మిన తరువాత వెనుకకు తిరుగకూడదు. అందుకే బాబా దేన్నీ గుడ్డిగా నమ్మనక్కరలేదు అని చెప్పారు. ఒక్క సారి నమ్మిన తరువాత ఆ నమ్మకాన్ని దృఢం చేసుకోవాలి. 

తరువాత హేమద్పంత్ గారు నానాచందోర్కర్ గురించిన ఒక సంఘటన చెప్పారు.  
ఒకసారి నానా ద్వారకామాయిలో కూర్చుని ఉండగా, మహల్సాపతి మరియు బాబా ఏదో సంబాషణలో ఉన్నారు. ఇంతలో ఒక గృహస్తుడు వైజాపురం నుంచి బాబా దర్శనార్ధం వచ్చాడు. అతనితో స్త్రీలు ఘోషా (అంటే ముసుగు) దరించి ఉన్నారు. వారిని చూచి నానా అక్కడ నుంచి లేచి వెళ్ళబోతుంటే బాబా నానాను వారించి కూర్చోమంటారు. వారిలో ఒక స్త్రీ బాబాకు వందనం చేస్తున్నప్పుడు ఆమె ముఖముపై ముసుగు తొలగింది. ఆమె సౌందర్యానికి నానా మనసు చలించింది. మరల ఆమె ముఖం చూడాలి అని అనిపించింది. అలానే దొంగచూపులతో చూస్తాడు. కాని బాబా దగ్గర తన మనసు దారి తప్పటంతో నానా చాలా సిగ్గుపడ్తాడు. బాబా ఆయనను తొడమీద కొట్టి నేను
ఎందుకు కొట్టాను? అని అడుగుతారు. అప్పుడు నానా, బాబా మీకు తెలియంది ఏముంది. నా మనసు మీ సమక్షంలో కూడా ఎందుకు చలించింది. అని అడుగుతాడు. అప్పుడు బాబా! నానా నీ మనసు ఎందుకు కలవరపడుతోంది? ఇంద్రియాలు వాటి ధర్మం ప్రకారం నడుచుకొంటాయి, వాటిని ఎందుకు అడ్డగించాలి? వాటి వల్ల మనకు ఎటువంటి హానిలేదు. బ్రహ్మదేవుడు సృష్టికర్త. అతని రచనను మనం ఆస్వాదించాలి. లేకపోతే ఈ సృష్టి వైశిష్ట్యం వ్యర్ధమై పోదా? ఈ సృష్టి, సృష్టిగానే ఉంటుంది. మనసు క్రమంగా శాంతిస్తుంది. మనకు ఎన్నో అందమైన దేవాలయాలు చక్కటి రంగులతో ఉన్నాయి. మనము దేవాలయాల బాహ్య సౌందర్యం కోసం వెళ్తామా లేక లోపల ఉన్న భగవంతుడి కోసం వెళ్తామా. బాహ్యసౌందర్యాన్ని ఆస్వాదిస్తూ లోపలనున్న దేవుడ్ని గుర్తు చేసుకోవాలి. అలానే భగవంతుడు ఒక్క దేవాలయంలోనే లేడు, అన్ని ప్రాణులలో ఉన్నాడు. కాబట్టి నీవు ఒక అందమైన ముఖము చూసినప్పుడు దానిలోని సౌందర్యంతో పాటు ఆ అందాన్ని ఇచ్చిన భగవంతుడ్ని ఆ అందంలో చూడు. ఇంత అందాన్ని సృష్టించిన ఆ భగవంతుడు ఎంత శక్తి వంతుడో అర్ధం చేసుకో. ఇలా బాబా ఎంతో చక్కటి బోధచేసి నానాలోని ఆలోచనలకు అర్ధం చెప్పారు.  ఆ తరువాత నానా ఈ బోధన ఆచరణలో పెట్టి తన మనసుపై విజయం సాధిస్తాడు. 

సాయి నామము ఎవరైతే ఎల్లప్పుడూ జపిస్తూ ఉంటారో, సాయి పట్ల మిక్కిలి ప్రేమతో ఉంటారో, వారు చేసే పనులు సాయికి ఎవరైతే అర్పిస్తూ చేస్తారో అటువంటి వారికి సాయి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. సాయి కథలు మన మనసులను శుద్ధి చేస్తాయి. మన పాదాలు సాయి ప్రదక్షిణానికి వాడాలి. మన కళ్ళు సాయి దివ్య రూపాన్నే చూడాలి. మన చెవులు సాయి లీలలే వినాలి. మన శరీరం అంతా సాయి చైతన్యమే అని తెలుసుకోవాలి.

ఓం శ్రీ సాయినాథార్పణమస్తు!








No comments:

Post a Comment