In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, August 8, 2018

శ్రీ సాయిసత్చరిత అధ్యాయం - 48



ఈ అధ్యాయంలో హేమద్పంత్ గారు మొట్టమొదటగా సద్గురువు అంటే ఎవరు? వారి లక్షణాలను గురించి చెప్పారు. మనం లోకంలో ఎంతోమందిని గురువులుగా పిలుస్తాము. గురుగీత గురువులు ఎన్నిరకాలో చెప్తుంది. ప్రాణాయామము ద్వారా గాలిని బంధించినా, ధారాళంగా వేదాంతం, పురాణాలు, లేదా బ్రహ్మము గురించి ఉపన్యాసములు ఇచ్చినా, లేదా మంత్రోపదేశములు ఎంతమందికి చేసినా ఏమి ఉపయోగము? వారి శిష్యులకు ఆత్మానుభూతి ప్రసాదించలేకపోతే వారిని సద్గురువులు అనకూడదు అని మన శాస్త్రాలు చెప్తాయి.  పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందినవారే ఈ అనుభవాన్ని మనకు అర్ధం అయ్యేటట్లు చేయగలరు. సంపూర్ణమైన శాస్త్రజ్ఞానం ఉంది, అపరోక్ష జ్ఞానాన్ని ప్రసాదించగల సంపూర్ణ అనుభవమున్న వారికే శిష్యులకు బోధించే అధికారం ఉంది. అట్టివారినే సద్గురువులు అని పిలవాలి. ఆత్మానుభవం లేనివారు శిష్యులకు ఏమి ఇవ్వగలరు? 

శిష్యులతో సేవ చేయించుకోవాలని కలలోనైనా తలచనివారు, తమ శరీరాన్ని శిష్యులకొరకు వినియోగించాలని కోరుకునే వారు సద్గురువులు అని తెలుసుకోవాలి. శిష్యుడు ఎందుకు పనికిరానివాడు, గురువు శ్రేష్ఠులలో శ్రేష్ఠుడు అన్న అహంభావం లేకుండా మంచిని కలిగించేవారే సద్గురువులు. శిష్యుడు పూర్ణబ్రహ్మ స్వరూపము అని అని
భావించి అతనిని తన పుత్రప్రేమతో చూస్తూ, తన పోషణకై అతనివద్దనుండి ఏమి ఆశించని సద్గురువు జగత్తులో పరమశ్రేష్ఠుడు. పరమశాంతికి స్థానమై విద్యా దర్పము లేకుండా చిన్నవారిని పెద్ద వారిని సమానంగా చూసే స్థలం సద్గురువు స్థానమని గ్రహించాలి. 

అనేక జన్మల అతిశయ పుణ్యసంచయం వల్ల మనకు సాయి సద్గురువు చరణాలు లభించాయి. సాయి ఎంతో నిరాడంబరంగా ఉండి, మనసును జయించి, ఎప్పుడు ఆత్మలో లీనమై ఉండే పరమగురువు. 

ఇక్కడ హేమద్పంత్ గారు బాబాను ఈ విధంగా స్తుతి చేస్తున్నారు. 
జయ పరబ్రహ్మ సనాతనా! జయ దీనోద్ధరా! ప్రసన్నవదనా! జయ చైతన్య ఘనా! భక్తాధీనా! భక్తులకు తమ దర్శనాన్ని ప్రసాదించండి. జయ జయ ద్వంద్వాతీతా! జయజయ అవ్యక్త వ్యక్తా! సర్వ సాక్షీ! సర్వాతీతా! భక్తిలేనివారు మిమ్ము తెలుసుకోలేరు. కష్టాలను తొలిగించే సద్గురువా! మీరు అవ్యక్తంలో లీనమై, నిరాకారులయ్యారు. శరీరాన్ని త్యజించిన తరువాత కూడా భక్తుల శ్రేయస్సుకై మీ కార్యాలు ఆగిపోలేదు. మీరు శరీరంతో ఉన్నప్పుడు చేసిన లీలల అనుభవాలను మీ యందు విశ్వాసము కల భక్తులు, మీరు అవ్యక్తంలో కలిసిన తరువాత కూడా ఈ నాటికి అదే అనుభవాలు పొందుతున్నారు. 

పరమేశ్వరుని అస్థిత్వ మందు విశ్వాసం, మరియు పరమేశ్వరునియందు భక్తిశ్రద్ధలు ఇవే భక్తుని హృదయంలో ప్రమిదలు. వానిలో ప్రేమయను చమురు పోసి వత్తిని వెలిగిస్తే జ్ఞాన జ్యోతి ప్రకటమవుతుంది. ప్రేమలేని జ్ఞానం శుష్కం. ప్రేమలేనిదే శాంతి ఉండదు. గాఢమైన ప్రేమలేకపోతే శ్రవణం, పఠనం నిష్ఫలం. ప్రేమలో భక్తి ఉంటుంది. విరక్తి, శాంతి కూడా అక్కడే ఉంటాయి. వాని వెనకే ముక్తి తన సంపత్తి సహితంగా తిష్ట వేసుకొని ఉంటుంది. భావం లేకుండా ప్రేమ ఉత్పన్నం కాదు. భావమున్న చోట దేవుడు ఉంటాడు అని తెలుసుకోవాలి. సాయి సత్చరిత గంగోదక సమానం. సాయి చరిత్రను విన్నా, చదివినా పాప పుణ్యాలు నశించిపోయి ముక్తి లభిస్తుంది. భక్తితో పారాయణం చేస్తే సాయి చరణాలయందు గురి కుదురుతుంది. ఇంద్రియాలు స్వేచ్ఛగా విహరించవు. మనసు కుదుటపడుతుంది. ప్రేమ భక్తి భావాలు కలిగి చిత్తశుద్ధి కలుగుతుంది. అప్పుడు వైరాగ్యం సిద్ధిస్తుంది. అప్పుడు భవాన్ని దాటటం అంత కష్టం కాదు. సద్గురువైన సాయినాథుడు మనలను ముక్తిపథం వైపు నడిపిస్తారు. 
మనకు గురువుపై నమ్మకం ఎలా కుదురుతుంది? పరిశుద్ధ మనసుతోనో లేక కపట బుద్ధితోనైనా సరే సద్గురువు సన్నిధికి చేరిన వారు సత్యం తెలుసుకుంటారు. అలాంటి కథలే ఈ అధ్యాయంలో చెప్పారు. అక్కల్కోట నివాసి అయిన సపత్నేకర్ అనే వకీలు యొక్క అనుభవాలను వింటే ఈ సత్యం మనకు బోధపడుతుంది. ఆయన లాయర్ చదువుకునే రోజుల్లో జరిగిన సంఘటన ఇది. ఆయన తోటి విద్యార్థులతో కలిసి పరీక్షలకు చదువుతూ ఉంటారు. వారిలో షేవడే అనే ఆయన పరీక్షలకు సరిగ్గా చదవలేదు. అందరు సరియైన సమాధానాలు చెప్తుంటే షేవడే మాత్రము సరిగ్గా చదవలేదని అర్ధం అవుతుంది. కాని ఆయన ధైర్యంగా ఉంటారు. ఎలా అని సపత్నేకర్ అడిగితే, నాకు నా సాయి ఉన్నాడు అని చెప్తాడు. ఎవరీ సాయి అని సపత్నేకర్ మొట్టమొదటగా బాబా గురుంచి వింటాడు. తరువాత అందరిలాగే షేవడే కూడా పరీక్ష పాసవుతాడు. కొన్ని రోజుల తరువాత సపత్నేకర్కు కాలం కలసి రాక దౌర్బాగ్యం ఆవహించింది. 1913 లో తనకున్న ఏకైక పుత్రుడు గొంతులో జబ్బు చేసి మరణిస్తాడు. మనస్సు వికలమై శాంతి లేక
ఏమి చేయాలో తెలియక విరక్తిని పొందుతాడు. వేదాంతం చదువుతాడు. అలా కొంత కాలం గడిచిన తరువాత షేవడే చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి షిర్డీ వెళ్లాలని బయలుదేరతాడు. తనతో కూడా తన తమ్ముడిని వెంట తీసుకు వెళ్తాడు. ఇద్దరు సాయి దర్శనానికి వెళ్తారు. సాయికి నమస్కరించి కొబ్బరికాయను సమర్పించగా బాబా " చల్ హట్" అని పొమ్మని కోపగిస్తారు. సపత్నేకర్ బాధపడతాడు. ఎవరితోనైనా ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటూ బాలా షింపీ అనే దర్జీని కలుసుకుంటాడు. అయినా ప్రయోజనం ఉండదు. బాబా మరల వెళ్లిపొమ్మంటారు. ఇక చివరికి చేసేది లేక తన ఊరికి వెళ్ళిపోతాడు. 

కొన్ని రోజులు గడిచిన తరువాత మనసు కుదుట పడక తీర్థ యాత్రలు చేస్తాడు. చివరికి కాశి వెళదామని అనుకుంటాడు. ఇంతలో అతని భార్యకు ఒక స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో ఆమె కుండ తీసుకొని బావి దగ్గరకు వెళ్తుంటే అక్కడ ఒక ఫకీర్ తారసపడతాడు. ఆమెతో ఇలా అంటాడు. "అమ్మాయీ! అనవసరంగా ఎందుకు కష్టపడతావు? నీ కుండను మంచినీటితో నింపి ఇస్తాను అని మంజుల స్వరంతో పలికారు. ఆమె బయపడి ఖాళీ కుండతో భయంతో వెనుతిరిగింది. ఆ ఫకీర్ ఆమె వెంటే నడిచి రావడంతో ఆమె ఇంకా బయపడి కళ్ళు తెరిచి ఇది కల అనుకుంటుంది. ఈ విషయం తన భర్తతో చెప్తుంది.  సపత్నేకర్ ఇది బాబా పిలుపుగా భావించి షిర్డీకి తన భార్యను తీసుకొని బయలుదేరతాడు. అక్కడకు చేరి ద్వారకామాయి దగ్గర బాబా కోసం వేచి ఉంటారు. బాబా లెండినుండి రాగానే ఆయనను సపత్నేకర్ భార్య పార్వతీబాయి  కళ్ళార్పకుండా చూస్తూ
ఉంటుంది. ఎందుకంటే తనకు కలలో కన్పించిన ఫకీర్ ఇతనే. ఆమె బాబాకు పాదాభివందనం చేసి వారిని చూస్తూ కూర్చుంది. అప్పుడు బాబా పక్కన ఉన్న వారితో ఇలా అంటారు. " చాలా రోజులుగా నా చేతులు కడుపు నడుము నెప్పిగా ఉన్నాయి. మందులు వాడినా తగ్గడం లేదు. మందులు వాడి విసిగిపోయాను. కాని ఇప్పుడు అవి తగ్గిపోయాయి అని ఆశ్చర్యంగా ఉంది. ఇలా తన కథ అంతా బాబా చెప్పారు. సపత్నేకర్ మరల బాబాకు నమస్కరిస్తే మరల ఆయనను వెళ్ళిపో అని అంటారు. చాలా నిరుత్సాహం కలిగినా పట్టుదలతో ఎలాగైనా బాబా అనుగ్రహం పొందాలి అని అనుకుంటాడు. ఎవరులేనప్పుడు బాబా దగ్గరకు చేరి బాబా పాదాలు పట్టుకుంటాడు. అంతలో అక్కడకు ఒక స్త్రీ కూడా వస్తుంది. ఆమెతో బాబా సపత్నేకర్ కథను చెప్పి అతని కుమారుని మరణాన్ని కూడా చెప్తారు. నేను వీని పుత్రుని చంపానని నేరం నాపై ఆరోపిస్తున్నాడు. నేను లోకుల బిడ్డలను చంపుతానా? ఇతడు మసీదుకు వచ్చి ఏడుస్తున్నాడు. సరే, చనిపోయిన ఇతని పుతృడిని మరల ఇతని భార్య గర్భంలోకి తీసుకు వస్తాను. ఇలా అంటూ బాబా అతని తలపై చేయి ఉంచి నిమురుతారు. సపత్నేకర్ కళ్ళలో  ఆనంద అశ్రువులు నిండాయి. తరువాత వాడాకు వెళ్లి బాబాకు నైవేద్యం తీసుకొని మరల బాబా దగ్గరకు వచ్చి నమస్కరిస్తాడు. బాబా అప్పుడు ఇన్ని సార్లు నమస్కరించాల్సిన అవసరం లేదు మనసులో ఉంటే చాలు అని చెప్తారు. తరువాత చావడి ఉత్సవం చూసి ధన్యతను పొందుతారు.  

కొన్ని రోజుల తరువాత తన ఊరికి వెళ్లాలని బాబా అనుమతి తీసుకునేందుకు వెళ్తాడు సపత్నేకర్. బాబా అడిగితె ఒక రూపాయి దక్షిణ ఇవ్వాలి అనుకుంటాడు. మిగిలిన సొమ్ము తనకు తిరుగు ప్రయాణ ఖర్చులకు సరిపోతుంది అని అనుకుంటాడు. అలానే బాబా ఒక్క రూపాయి మాత్రమే అడుగుతారు. ఒక కొబ్బరి కాయ ఇచ్చి తన భార్య ఒడిలో వేయి అంటారు. కొన్ని రోజులకు వారికి ఒక కొడుకు పుడతాడు. ఎనిమిదినెలల బిడ్డని తీసుకొని భార్యాభర్తలు షిర్డీకి వచ్చి ఆ బిడ్డను బాబా పాదాలచెంత ఉంచుతారు. బిడ్డను బాబా ఆశీర్వదిస్తారు. తరువాత కాలంలో వారికి ఎనిమిది మంది కుమారులు, ఒక ఆడపిల్ల పుడతారు. సపత్నేకర్ మరియు ఆయన భార్య బాబాను సదా సేవిస్తూ ఆయనకు పరమ భక్తులు అయ్యారు. ఇలా బాబా ఎంతోమందిని ఉద్దరించారు. 

బాబా సద్గురువులు. సర్వాంతర్యామి. ఈ కథలో సపత్నేకర్ తన కుమారుడు చనిపోతే దేవుడు తనకు అన్యాయం చేసాడని అనుకొని ఉండవచ్చు. బాబాను ఆయన ఏమి అనలేదు. ఎందుకంటే అప్పటికి ఆయన బాబాను ఇంకా కలవలేదు. ఇక్కడ సపత్నేకర్కు భగవంతుడు గురువు ఒక్కరే అన్న సత్యాన్ని నేర్పించడానికే బాబా కోపాన్ని ప్రదర్శించారు. అంతే కాని వారు కరుణామూర్తి. దయార్ధహృదయులు. మనం గురువుచేసే వాటిని ఆశీర్వాదంగా స్వీకరించి వారి పాదాలను వదలకూడదు. ఇక్కడ సపత్నేకర్ కూడా ఇలాంటి పరీక్షనే ఎదుర్కొని బాబా అనుగ్రహం పొందాడు. 

ఓం శ్రీ సాయి నాథార్పణమస్తు!




No comments:

Post a Comment