Play Audio |
సాయి భక్తులందరిలోకి శ్యామాకు ప్రత్యేక స్థానం ఉంది. బాబానే స్వయంగా ఈ విషయం చాలాసార్లు చెప్పడం జరిగింది. వారి ఇద్దరి మధ్య 72 జన్మల సంబంధం ఉందని బాబానే స్వయంగా చెప్పారు. అట్లానే శ్యామాని తన ప్రతినిధిగా కొన్ని సార్లు బాబా పంపించడం జరిగింది. మరి ఇంతటి గౌరవాన్ని పొందిన భక్తుడు శ్యామా. అచంచల విశ్వాసముతో అపారమైన నమ్మకంతో బాబాను సేవించిన వారిలో మొట్టమొదటి వ్యక్తి శ్యామా. తనని పాము కరచి ప్రాణాపాయ స్థితిలో కూడా బాబాని తప్ప మరెవరిని నమ్మని భక్తితత్పరత శ్యామాలో ఉంది. బాబా నేర్పిన శ్రద్ధ, సబూరి తత్వాన్ని శ్యామా దగ్గర నుంచి మనము నేర్చుకోవాలి. అటువంటి మహానుభావుడి గురించి మనము తెలుసుకోవడం మన పూర్వజన్మ పుణ్యం మరియు బాబా అనుగ్రహం ఉండటం వల్ల మనకు ఈ సత్సంగ భాగ్యం లభించింది.
మాధవరావు దేశ్‌పాండే సుమారుగా 1858-1860 ప్రాంతంలో పుట్టి ఉండవచ్చు. ఆయనకు బాబా పెట్టిన ముద్దుపేరు శ్యామా. ఆయన షిరిడికి 20 మైళ్ళ దూరంలో ఉన్న నిమోన్ అనే గ్రామంలో పుట్టారు. శ్యామా తండ్రి మూడు వివాహాలు చేసుకున్నా సంతానం కలగలేదు. చివరికి ఆయన షిరిడి గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే ఆయన సోదరిని వివాహం చేసుకున్నారు. ఆ తరువాత వారికి పిల్లలు పుట్టారు. శ్యామాకు కాశీనాధ్, బాపాజి బల్వంత్ అనే ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. శ్యామా 2 సంవత్సరాల వరకు నిమోన్ గ్రామంలో పెరిగారు. తరువాత వారి కుటుంబం షిర్డికి వచ్చి స్థిరపడింది. శ్యామా తన మూడవ సంవత్సరం నుంచి షిర్డిలోనే పెరిగారు. ఆయన 6వ తరగతి వరకు చదివి అక్కడి మరాఠి బడిలోనే ఉద్యోగంలో చేరారు. ఆయనను షిర్డి ప్రజలు చాలా గౌరవించే వారు. ఒక పోలీస్ అధికారి దానంగా ఇచ్చిన ఒక ఇంటిని బడిగా ఉపయోగించేవారు. ఆ బడి బాబా ఉన్న మశీదు ప్రక్కనే ఉండేది.
శ్యామాను గురించిన విషయాలు మనకు బి.వి.
నరసింహస్వామి గారు ద్వారా కొన్ని లభించాయి. ఆయన శ్యామాను 1938 మార్చి నెలలో చూడడం జరిగింది.
అప్పటికి సుమారుగా శ్యామాకు 80 ఏళ్ళు ఉండవచ్చని ఆయన రాయడం జరిగింది. ఈ సంభాషణల ద్వారా
మనకు సచ్చరితలో లేని విషయాలు కూడా కొన్ని తెలియడం జరిగింది. కొన్ని విషయాలు సాయిలీల
పత్రిక ద్వారా మరియు కపర్డ డైరి అనే పుస్తకం ద్వారా మనం తెలుసుకోవచ్చు.
శ్యామాకు, బాబాకు 72 జన్మల సంబంధం ఉన్నప్పటికి
చాలా సంవత్సరాలు శ్యామా బాబాని గురువుగా నమ్మలేదు. తను పనిచేసే బడి, మశీదు ప్రక్కనే
ఉండేవి. ఇప్పుడు అది శ్యామసుందర్ గదిగా చెప్పబడుతుంది. శ్యామా ఒక్కోసారి ఆ బడిలోనే
నిద్రించే వాడు. ఆ బడి కిటికీలో నుంచి బాబాను పరిశీలిస్తూ ఉండేవాడు. చాలా సంవత్సరాలు
బాబాని ఒక పిచ్చి ఫకీరుగా అనుకునేవాడు. శ్యామా దీన్ని గురించి ఈ విధంగా చెప్పడం జరిగింది.
బాబా ఒక్కోసారి మశీదులో మరొకసారి మారుతి గుడిలో కూర్చునేవారు. జోలి వేసుకుని భిక్షాటనకు
వెళ్ళేవారు. ఆయన కాళ్ళకు గజ్జలు కట్టి నాట్యం చేసేవారు. ఒక్కోసారి చాలా చక్కగా పాటలు
పాడేవారు. రాత్రిళ్ళు మశీదులో నుంచి మరాఠి, ఉర్డు, హింది, ఇంగ్లీషు బాషలో మాటలు వినబడుతూ
ఉండేవి. బాబా ఒక్కరే మాట్లాడుతూ ఉండేవారు. నేను ఆయన దగ్గరకు చిలుము పీల్చటానికి వెళ్తూ
ఉండేవాడిని అని చెప్పారు.
శ్యామా కుటుంబ వివరాలు
మాధవరావ్
రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. మొట్టమొదటి భార్యపేరు సావిత్రిబాయి. ఆమె ద్వారా ఒక
కొడుకు పుట్టారు. అతని పేరు ఏకనాథ్‌పంతు. శ్యామా రెండవ భార్య పేరు ద్వారకాబాయి. ఆమెకు
ఇద్దరు పుత్రులు (జగన్నాథ్‌పంతు మరియు ఉద్ధవరావ్) ఒక పుత్రిక (బిజితాయి). వీరిలో ఉద్ధవరావ్
ఎక్కువగా బాబా దగ్గరకు వెళ్ళేవాడు. బాబా ఇచ్చే స్వీట్లు మరియు ఇతర తినుబండారములు కోసం
వెళ్ళేవాడు. ఉద్ధవరావు 6 సంవత్సరములు వచ్చినా విధ్యాభ్యాసం మొదలు పెట్టలేదు. శ్యామా
ఎంత బయపెట్టినా స్కూలుకి వెళ్ళేవాడు కాదు. ఒకసారి శ్యామా అతనిని కొట్టబోతే పరిగెత్తి
బాబా దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు బాబా శ్యామాని వారించి, వాడి సంగతి నేను చూసుకుంటానులే
అని చెప్పారు. అదే విధంగా ఉద్ధవరావ్ పెద్ద అయిన తరువాత షిర్డి సంస్థానంలో పూజారిగా
పనిచేయడం జరిగింది. మిగిలిన పిల్లలు సాయికి అంత దగ్గరగా ఉన్నట్లు చెప్పబడలేదు.
శ్యామా వృత్తి వివరాలు
శ్యామా
షిర్డి మరాఠి బడిలో ఆరవ తరగతి వరకు చదివాడని చెప్పుకున్నాము. సుమారు 15-16 సంవత్సరాల
వయస్సులో అదే బడిలో ఉపాధ్యాయునిగా చేరాడు. నానా రత్నపార్కె అనే ఆయన వాళ్ళకి ప్రధాన
ఉపాధ్యాయుడు. లక్ష్మణ మాష్టారు అనే ఆయన కూడా అక్కడ పనిచేసేవాడు. శ్యామా టీచరుగా సుమారు
6 సంవత్సరాలు పనిచేశారు. ఆ తరువాత బదిలీ అయితే షిర్డి వదలి వెళ్ళడం ఇష్టం లేక ఉద్యోగం
మానేస్తారు.
ఆ తరువాత కొంత వైద్యం నేర్చుకుని బాబా
అనుగ్రహంతో వైద్యుడిగా సేవ చేయడం జరిగింది. రోగుల నాడి చూసి జబ్బు కనుక్కోవడంలో మంచి
పేరు తెచ్చుకొంటారు. ఆయుర్వేద మరియు కొన్ని ఇంగ్లీషు మందులు ఇచ్చేవారు. బాబా ఊది కలిపి
మందులను ఇచ్చేవారు. ఈ విధంగా కొంత డబ్బుని
సంపాయించే వారు. కాని ఆయన మాత్రము ఈ మందులు వాడేవారు కాదు. బాబా చెప్పిన వైద్యం
మాత్రమే చేసుకునేవారు. మెల్లగా షిర్డికి వచ్చిన యాత్రికుల మంచి, చెడ్డలు చూడటం వారికి వసతి సౌకర్యాలు ఏర్పరచటం లాంటి పనులలో నిమగ్నమై
ఉండేవారు. బాబాకు కావల్సిన పనులన్ని చేసిపెట్టేవారు. బాబాని ఎవరైనా వారి ఇండ్లకు రమ్మని
ఆహ్వానిస్తే తనతరపున బాబా శ్యామాను పంపేవారు. ఈ విధంగా శ్యామా బాబా సేవయే తన వృత్తిగా
చేపట్టిన పుణ్యాత్ముడు. నానాసాహెబ్‌చందోర్కరు, దీక్షిత్, కపర్డె బూటి వంటివారు శ్యామాకు
బాబాతో సమానమైన గౌరవం ఇచ్చేవారు.
ఓం శ్రీ సాయి రామ్ !
No comments:
Post a Comment