In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, December 9, 2015

శ్రీ శాంతారామ్ బల్వంత్ నాచ్నే-3



Play Audio


పిల్లల కోసం బాబా ఆశీర్వాదం-కాలురామ్ జననం
నాచ్నే కుటుంబం చాలా కష్టాలకు గురి అవుతుంది. నాచ్నే భార్యకు పుట్టిన పిల్లలందరు పుట్టిన వెంటనే చనిపోతూ ఉంటారు. అప్పుడు నాచ్నే భార్య శ్యామాతో కలసి వెళ్ళి బాబాను ప్రార్ధిస్తుంది. ఆమె వెళ్ళేటప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకొని వెళ్తుంది. ఆ కొబ్బరికాయను బాబాకు సమర్పించగా బాబా దాన్ని నాచ్నే భార్య ఒడిలో వేస్తారు. అది వేసేటప్పుడు బాబా కళ్ళు చెమరుస్తాయి. అప్పుడు బాబా నాచ్నేను తన దగ్గర కూర్చుండ పెట్టుకొని తన పాదసేవ చేయించుకుంటారు. బాబా మెల్లగా నాచ్నే వీపు మీద వాత్సల్యముతో నిమురుతూ ఉంటారు. శాంతారాం నాచ్నే బాబా ప్రేమకు కరిగి ఆయన పిల్లలు పుట్టేందుకు ఇచ్చిన కొబ్బరికాయతో సహా తృప్తి చెంది బాబా వైపు భక్తితో చూస్తాడు. బాబా వెంటనే అల్లామాలిక్ అని పలుకుతారు.

                రెండుమూడు ఏళ్ళ తరువాత 1919లో నాచ్నేకు ఒక కొడుకు పుడతాడు. ఆ బాబుకు కాలురాం అని పేరు పెడతారు. కాలురాం మూలానక్షత్రంలో పుడతాడు. ఆ బాబు రెండు సంవత్సరాల వయసప్పుడు తన తల్లి చనిపోతుంది. ఈ కుర్రవాడు రెండుమూడు ఏళ్ళ చిన్న వయసులోనే అందరిని ఆశ్చర్యపరచసాగాడు. హెగ్డే అనే ఆయన నాచ్నే ఇంటిప్రక్కననే ఉండేవాడు. ఆయన ప్రతిరోజు హరివిజయము అనే పుస్తకం చదివి అందరికి వినిపించేవారు. కాలురాం కృష్ణలీలలను చూసినట్లుగా చెప్పేవాడు. అతను బృందావనంలో కృష్ణుడితో ఆడుకున్నట్లు మరుసటి రోజు రాబోయే కథ గురించి ముందుగానే చెప్పగలిగేవాడు. కృష్ణుడు నన్ను బాగా ఏడిపించేవాడు, ఆట పట్టించేవాడు. ఒకసారి నేను ఆయనను గిచ్చాను వెంటనే కృష్ణుడు వెన్న ఉండే కుండను నాపై ఒలక పోసాడు. అప్పుడు ఆ ఇంటి ఆవిడ మా వెంటబడింది. అని కాలారాం చెప్పేవాడు.

                ఒక రోజు కాలురాం ఒకచోట కదలకుండా కూర్చుని ఉన్నాడు. కళ్ళు ధ్యానం చేస్తునట్లు ఉన్నాయి. మొహం మీద ఒక గుడ్డ వేసుకున్నాడు. నాచ్నే వెళ్ళి ఏమి చేస్తున్నావు అని అడిగితే ఆ పిల్లవాడు నవ్వి "ఇదా! మేము మామూలుగా చేసే సాధన" అని చెప్తాడు. ఆ బాబు ఒక పత్రికలోంచి ఓంకారం కత్తిరించి గోడమీద తను పడుకునే దగ్గర అంటించుతాడు. ఇలా ఆ బాబు చేసే పనులు ఒక గొప్ప యోగీశ్వరుడు వలే ఉండేవి.

          ఒకసారి గ్రామఫోన్ రికార్డు మీద హెచ్.ఎమ్.వి (His Masters Voice)అని ఉంటే అది ఏమిటి అని నాచ్నేను అడుగుతాడు కాలురాం. అది ఒక ప్రకటన అని అంటాడు నాచ్నే. వెంటనే కాదు! అది కృష్ణుడి నుంచి వచ్చిన ప్రత్యేక సందేశం. దానిలో ఉన్న కుక్క తన యజమాని చెప్పేమాటలు జాగ్రత్తగా వింటుంది అని చెప్తాడు కాలురాం.   నాచ్నే వెంటనే ఆ సందేశం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు కాలురాం ఆ కుక్కను చూపించి ఈ కుక్క ఎంత జాగ్రత్తగా వింటుందో మనము కూడా అలానే కూర్చుని బాబా చెప్పేది జాగ్రత్తగా వినాలి అంటాడు. నాచ్నే ఆశ్చర్యపడి బాబా మాట నువ్వు వినలేదు కదా నీకెలా తెలుసు? అంటాడు. నువ్వు పుట్టేటప్పటికి బాబా ఈ శరీరం వదిలేశారు. కాలురాం వెంటనే "నాకు తెలుసు కాని నీకు చెప్పను" అంటాడు.

                కాలురాం రామనామ జపం చేస్తూ ఉండేవాడు. చిన్నప్పుడే రామ అని రామకోటి లాగా రాస్తూ ఉండేవాడు. ఒకసారి గాడ్గిబాబా కాలురాంను చూడడానికి వస్తారు. అప్పుడు కాలురాంకి జ్వరంగా ఉంటుంది. బాబా ఊది నీళ్ళలో కలిపి ఇస్తారు. కాని జ్వరం కొద్దిరోజులు ఉంటుంది. జ్వరంతో బాబు చాలా నీరసపడ్తాడు. అప్పుడు కాలురాం వాళ్ళనాన్నను పిలిచి జ్ఞానేశ్వరి(భగవద్గీత) తెమ్మంటాడు.
    
                భగవద్గీత తేగానే, ఒక పేజీ తీసి చదవమంటాడు. అది క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము. 13వ అధ్యాయము. నేను ఈ రోజు వెళ్ళిపోతున్నాను ఏడవవద్దు. దీంట్లో ఏడవడానికి ఏమి లేదు. ఇది చదవండి అని అడుగుతాడు. ఆ పుస్తకం తన కళ్ళ ఎదురుగా ఉంచుకొని తన తుదిశ్వాసను వదులుతాడు. ఆరోజు కార్తీక శుద్ధ ఏకాదశి ఆరోజు అన్ని చోట్ల విష్ణు పూజలు జరుగుతున్నాయి.

                నాచ్నేకు దుఃఖము ముంచుకొని వస్తుంది. ఇంత చిన్న వయసులో ఎనిమిది ఏళ్ళకే పిల్లవాడు చనిపోయాడు. బాబా నాచ్నే భార్యకు కొబ్బరికాయను ఇచ్చినప్పుడు కళ్ళవెంట నీరుకార్చారు. బాబాకు తెలుసు నాచ్నే భార్య 2 ఏళ్ళకు చనిపోతుందని మరియు కాలురాం కూడా ఎనిమిది ఏళ్ళకు చనిపోతాడని, కాని నాచ్నే కాలురాం లాంటి దివ్యాత్మునకు తండ్రియై తరించాడు.

                బాబా మహాసమాధి తరువాత నాచ్నే మూడుసార్లు పెళ్ళిచేసుకోవాల్సి వచ్చింది. చాలా పెద్ద కుటుంబం ఏర్పడింది. బాబా తన వెన్నంటి ఉండి రక్షిస్తూ వచ్చారు. 1935లో తన రెండేళ్ళ కొడుకుని బాబా కాపాడుతారు.  ఆ బాబు పేరు ఆనంద్. బాగా అల్లరిగా ఉండేవాడు. పరిగెత్తుతూ వెళ్ళి స్టవ్ మీద పడ్తాడు. దాని మీద పాలు బాగా మరుగుతూ ఉంటాయి. స్టవ్ ఒకవైపు, పాలు మరొక వైపుకు పడ్తాయి. రెండింటి మధ్యలో ఆనందుకు ఏమి దెబ్బలు తగలకుండా బయటపడ్తాడు. అలానే ఇంకోసారి సాయిహరనాధ్ అనే తొమ్మిది నెలల పిల్లవాడు మంచం మీద పడుకుని ఉంటాడు. పెద్ద పిల్లలు టపాకాయలతో ఆడుతూ ఉంటారు. ఒక టపాకాయ వెళ్ళి సాయిహరనాధ్ పై పడ్తుంది. పిల్లలు దాన్ని చూడరు. వాళ్ళు ఆటల్లో ఉంటారు. వాళ్ళ అమ్మ క్రింద పనిచేసుకుంటూ ఉంటుంది. ఇంతలో ఒక ఫకీరు వచ్చి "అమ్మా పైకి వెళ్ళి ఏం జరుగుతుందో చూడు" అని అంటాడు. ఆమె ఆలోచించకుండా వెంటనే మేడపైకి వెళ్తుంది. వెంటనే కాలుతున్న సాయిహరనాధ్ బట్టలను తీసివేస్తుంది. ఆ బట్టలు అంతా కాలిపోయినా బాబుకు ఏమీ కాదు. ఇదంతా బాబా మహిమ అని అర్ధం చేసుకుంటారు
.
ఇలా నాచ్నే కుటుంబాన్ని బాబా రక్షిస్తూ వచ్చారు.

                శాంతారాం నాచ్నే యొక్క తల్లి 1926లో చనిపోతారు. ఆమె బాబా ఫోటోని ప్రక్కనే పెట్టుకుని నాచ్నే చేత విష్ణుసహస్ర నామము చదివించుకుంటూ రామ్! రామ్! అని తన ప్రాణాలు వదిలింది. ఇంతకంటే చక్కటి సద్గతి ఎవరికి కల్గుతుంది.

బాబా గణపతి శంకర్ అనే వ్యక్తిగా రావడం
1929 లో  నాచ్నే రెండోభార్య చనిపోతుంది. ఆమె అస్తికలు నాసిక్ దగ్గర గోదావరిలో కలపాలని, ఆమెకు సద్గతి కలిగించాలని నాచ్నే బయలుదేరతాడు. నాచ్నే తండ్రికి జబ్బు చేసి ఆయన ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. నాచ్నే ఒక్కడే 80 రూపాయలు తీసుకుని విక్టోరియా టర్మినల్ స్టేషన్ నుంచి రైలు ఎక్కుతాడు. నాచ్నేకు ఏంచేయాలో దిక్కుతోచని పరిస్థితి. ఇంతలో గణపతి శంకర్ అనే వ్యక్తి, నాచ్నే మంచి చెడ్డలు అడిగి ఒక దుప్పటి ఇచ్చి పడుకునేందుకు జాగా కల్పిస్తాడు. ఆయన బాంబే ఆర్ట్స్ స్కూలులో ప్యూన్‌గా పనిచేస్తున్నట్లు చెప్తాడు. తను కూడా నాసిక్ వెళ్తున్నానని తను దగ్గర ఉండి నాచ్నే భార్యకు చేయవలసిన ఉత్తరక్రియలన్ని చేపిస్తానని చెప్తాడు. అలాగే ఆ 80 రూపాయలు జాగ్రత్తగా వాడిపించి ఆ పనులన్ని పూర్తి చేపిస్తారు. బయలు దేరకముందు నాచ్నే ఎంత కంగారు పడ్డాడో, ఎలా చేయాలని ఆదుర్దా పడ్డాడో, కాని అవన్ని తీసివేసినట్లు ఈ గణపతి శంకర్ చేశాడు.

                ఆ అస్తికలు గోదావరిలో కలిపి చేయవలసిన పనులన్ని పూర్తి చేసి గణపతి శంకర్ వెళ్ళిపోతాడు. నాచ్నే తన ఇంటికి తిరిగివచ్చి గణపతిని కలుద్దామని ఆ కాలేజీకి వెళ్తాడు. వాళ్ళు గణపతి శంకర్ అనే ప్యూన్ ఎవరూ లేరని చెప్తారు. అప్పుడు నాచ్నేకు అర్ధం అవుతుంది ఇదంతా బాబా యొక్క లీల అని.


                నాచ్నేను బాబా దగ్గర ఉండి రక్షిస్తూ వచ్చారు. నాచ్నే కూడా బాబా చెప్పిన విధంగా నడుచుకుంటూ తన జీవితాన్ని సాగించాడు.

ఓం శ్రీ సాయి రాం!

No comments:

Post a Comment