In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, December 30, 2015

మాధవరావ్ దేశ్‌పాండే (శ్యామా) - 3


Play Audio


గ్రంథ సేకరణ
బాబా కొన్ని గ్రంథాలను శ్యామాకు ఇవ్వడం జరిగింది. చాలామంది భక్తులు బాబా ఆశీర్వాదం కోసం కొన్ని గ్రంథాలను తెచ్చేవారు. బాబా చాలా వరకు వారి గ్రంథాలు వారికి ఇచ్చేవారు. కొన్నిసార్లు ఒకరు తెచ్చిన గ్రంథాలు ఇంకొకరికి ఇచ్చేవారు. బాబా సర్వజ్ఞుడు. మనము ఏది, ఎప్పుడు చదవాలో ఆయనకు బాగా తెలుసు. అట్లా తెచ్చిన వాటిలో కొన్నింటిని శ్యామాకు ఇచ్చి, జాగ్రత్తగా భద్రపరచమని చెప్పేవారు. షిరిడి పవిత్ర క్షేత్రానికి దేశదేశాల నుండి భక్తులు వచ్చి ఇక్కడ కలసి జ్ఞానయజ్ఞం చేస్తారు. అప్పుడు ఈ గ్రంథాలు అవసరమవుతాయి. నేను నా ధామానికి వెళ్ళిపోయాక శ్యామా దీనిని తీసి చూపుతాడు. ఈ గ్రంథాలు నా ప్రతిరూపాలు అవుతాయి. పరమపావనమైన ఈ గ్రంథాలు షిర్డిలో కాని, ఇతర ప్రదేశాలలో కాని చదివితే బాబా గుర్తుకు వస్తారు. పుస్తకాల సంగ్రహణకు కారణం ఇదే అయి ఉంటుందని హేమద్‌పంత్ సాయిసచ్చరితలో రాస్తారు.

బాబా శ్యామాకు ఇచ్చిన గ్రంథాలు
·        విష్ణు సహస్రనామము
·        ఏకనాధ్ భాగవతం
·        వివేక సింధూ
·        పంచరత్న గీత
·        సంత్‌లీలామృతము
·        భక్త లీలామృతము
·        దశావతార స్తోత్రాలు
·        దశావతార చిత్రాలు

విష్ణు సహస్రనామం-రామదాసి సాధువు కథ
శ్యామాకు బాబాపై అపరిమితమైన భక్తి ఉన్నట్లే, బాబాకు కూడా శ్యామాపై అత్యంత ప్రేమ ఉండేది. ఒకసారి ఒక రామదాసి సాధువు మశీదులో ఉండి గ్రంథ పఠనం చేసేవాడు. ఆయన విష్ణు సహస్రనామం చక్కగా చదివేవాడు. ఆ తరువాత ఆధ్యాత్మ రామాయణం కూడా పారాయణం చేసేవాడు.

              బాబా తనకు కడుపులో నొప్పిగా ఉన్నదని, సోనాముఖి అనే మందు తెమ్మని అతన్ని పంపించి, ఆ విష్ణు సహస్రనామ పుస్తకం శ్యామాకు ఇస్తారు. శ్యామా అప్పుడు దేవా! ఆ రాందాసి ముక్కోపి నాకు ఈ పుస్తకం వద్దు. నాకు ఈ సంస్కృత పదాలు నోరుతిరగవు నన్ను దీంట్లో ఇరికించవద్దు అని అంటాడు. కాని బాబా ఆ పుస్తకం తీసుకోమని చెప్పి దాని విశిష్టత ఇలా చెప్తారు.

              "శ్యామా దీనిలో గొప్ప గుణాలు ఉన్నాయి. అందువల్లె దీనిని నీకు ఇస్తున్నాను, చదివిచూడు. ఒకసారి నాకు చాలా బాధ కలిగింది. గుండె దడ దడ లాడింది. ప్రాణం రెపరెప లాడింది. నేను బ్రతుకుతానన్న నమ్మకం పోయింది. ఆ సందర్భంలో ఈ పుస్తకం ఎంతగా ఉపయోగపడిందో నీకెలా చెప్పను? శ్యామా ఈ పుస్తకం వలననే ఈ
ప్రాణాలు రక్షించబడ్డాయి. ఒక్క క్షణం గుండెకు హత్తుకోగానే వెంటనే ప్రాణం కుదుట పడింది. దేవుడే నాలో ప్రవేశించి నా ప్రాణాలు కాపాడాడు అని అనిపించింది. దీనివలననే జీవుడు బతికాడు. అందువల్ల శ్యామా! నీవు దీనిని తీసుకొని వెళ్ళి మెల్లమెల్లగా చదువు. రోజూ ఒకటో అరో మాటలను నేర్చుకో. గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది" అని చెప్పారు.
              తరువాత రామదాసి సాధువు వచ్చి ఆణ్ణాచించినీకర్ ద్వారా జరిగిన సంగతి తెలుసుకొని శ్యామాపై విరుచుకుపడ్డాడు. నువ్వు ఒక పథకం ప్రకారం ఈ పుస్తకం కొట్టేశావు. నా పుస్తకం నాకు ఇవ్వకపోతే నీ ఎదుటే తలబద్ధలు కొట్టుకుని రక్తం చిందిస్తాను. మాధవరావు ఎన్నో విధాల నచ్చచెప్పినా రామదాసు శాంతించలేదు. అప్పుడు శ్యామా చాలా శాంతంగా "నేను కపటినని నాపై నిందవేయకు. వృధాగా నాకు దోషాన్ని అంటకట్టకు. ఆ పుస్తకం విశేషమేమిటీ? అది ఎక్కడా లభించదా? నీ పుస్తకాలకు రత్నాలు పొదిగారా, లేక బంగారం తొడిగారా? బాబాపైన కూడా నీకు విశ్వాసం లేదు. ఇది సిగ్గు పడవలసిన విషయం" అని అన్నాడు. 

అప్పుడు బాబా రామదాసి సాధువుని చూసి ఈ విధంగా అన్నారు. "రామదాసూ! ఇప్పుడు ఏం మునిగి పోయింది? అనవసరంగా ఎందుకు బాధ పడుతున్నావు. శ్యామా మన కుర్రవాడే కదా, నీవు ఊరికే ఎందుకు నరాలు తెంచుకుంటున్నావు? వృధాగా ఎందుకింత కష్టపడుతున్నావు? ప్రపంచానికి తమాషా చూపిస్తున్నావు. ఎందుకిలా కయ్యానికి కాలు దువ్వుతున్నావు. చక్కగా మంచిగా మాట్లాడు రామా? ఈ పుస్తకాలను నిరంతరం చదువుతావు, అయినా నీ అంతకరణం ఇంకా శుద్ధి కాలేదు. నీవు ఎటువంటి రామదాసువయ్యా? నీకు అన్నింటి యందు అనాసక్తి ఉండాలి. కాని నీకీ పుస్తకం పైనే వ్యామోహం పోలేదు. రామదాసుకు మమత ఉండరాదు. సమత ఉండాలి. ఆ పుస్తకాన్ని నేనే శ్యామాకు ఇచ్చాను. అదంతా నీకు కంఠస్థం కదా!"
              
రామదాసు బాబా చెప్పిన మాటలు విని కోపంగా బాగా ఎర్రబారిన ముఖంతో శ్యామాను ఉద్దేశించి ఇదిగో నీకిప్పుడే చెబుతున్నా దీనికి బదులుగా నువ్వు పంచరత్న గీతను ఇవ్వు అన్నాడు. తరువాత శ్యామాకు బాగా నిష్ఠ కుదిరి దీక్షిత్ మరియు నార్కెల సాయంతో మెల్లగా విష్ణుసహస్ర నామం నేర్చుకొని తరించాడు. ఇక్కడ బాబా విష్ణుసహస్రనామం యొక్క గొప్పతనాన్ని చాలా చక్కగా చెప్పారు.

              విష్ణుసహస్రనామాలను స్వహస్తాలతో శ్యామా కంఠానికి కట్టి అతని భవ, భయ, బాధలనుండి ముక్తుణ్ణి చెయ్యాలని ఆ పుస్తకం శ్యామాకు ఇవ్వడం జరిగింది. బాబా ఇంకా ఇలా చెప్పారు. అతనికి నామంపై ప్రీతి కలిగిస్తాను. నామం పాపాలనే పర్వతాలను పగలగొట్టుతుంది. నామం శరీర బంధనాలను విడగొట్టుతుంది. నామం కోటి చెడు వాసనలను సమూలంగా పెరికివేస్తుంది. నామం కాలుని మెడను విరిచేస్తుంది. నామం జనన మరణ చక్రాన్ని తప్పిస్తుంది.

శ్యామాకు ఇటువంటి సహస్రనామం మధురమవ్వాలి. ప్రయత్న పూర్వకంగా నామాన్ని స్మరిస్తే మంచిది. అప్రయత్నంగా నామ జపం చేసినా చెడుకలగదు. తెలియకుండా నోటితో ఉచ్చరించినా నామ ప్రభావం ప్రకటమవుతుంది. అంతఃకరణాన్ని పరిశుద్ధపరచడానికి నామం కంటే సులభమైన మరో సాధనం లేదు. నామం జిహ్వకు భూషణం. నామం పరమార్ధాన్ని పోషిస్తుంది. నామ జపానికి స్నానం చేయాల్సిన పనిలేదు. అట్లే నామానికి విధి విధానాలేవి లేవు. నామ సంకీర్తనలో సకల పాపాలు ప్రక్షాలన మవుతాయి. మెల్లమెల్లగా లోలోపల నా నామాన్ని జపించే వారు ఉత్తమ గుణ సంపన్నులకంటే ఉత్తములు.

సాయి బంధువులారా! మరి మనమందరమూ సాయి నామం తోనే తరించవచ్చు. సాయి మనలను సరయిన మార్గంలో నడిపిస్తారు. 

బాబా మహాసమాధి తర్వాత శ్యామా జీవితం
బాబా మహా సమాధి అనంతరం శ్యామా ధీక్షిత్ వాడాలో ఉన్నారు. అప్పట్లో ధీక్షిత్ మరియు బూటి ఈ వ్యవహారాలు చూసేందుకు జీతం కూడా ఇచ్చేవారు. శ్యామా అక్కడే ఉండి వచ్చే యాత్రికులకు వీలైనంత సహాయం చేస్తుండేవాడు. తనకు బాబా ఇచ్చిన ఊధిని రెండు కుండల్లో జాగ్రత్తగా భద్రపరచి, వచ్చిన వారికి ఇస్తూ ఉండేవాడు. ఎందుకంటే ఈ ఊధి బాబా స్వయానా శ్యామాకు ఇచ్చింది.  

  కొన్ని రోజుల తర్వాత సాయి సంస్థాన్ ఏర్పడడం జరిగింది. ఆ సంస్థాన్‌లోని సభ్యులకు శ్యామాకు కొన్ని విషయాల్లో అవగాహన కుదరక, శ్యామాను వాళ్ళు ధీక్షిత్ వాడా నుంచి పంపించవలసి వచ్చింది. అప్పుడు శ్యామా బాబా పాదుకలను మరికొన్ని వస్తువులను తీసుకుని ఇంటికి వెళ్ళాడు. సంస్థాన్ వారు ఆ వస్తువులను అడిగినా శ్యామా  ఇచ్చేందుకు ఇష్టపడలేదు. తరువాత  ధుమాలు మొదలైన వారు, ఒక ఊరేగింపుగా భజన్లు చేస్తూ శ్యామా ఇంటికి వెళ్ళి ఆ వస్తువులను అడిగి తీసికొని వచ్చారు. ఆ తరువాత ఆ పాదుకలను ద్వారకామాయిలో భక్తుల దర్శనార్ధం ఉంచడం జరిగింది.

              శ్యామా తరువాత తన ఇంటిలోనే ఉంటూ, వచ్చిన భక్తులకు బాబా విషయాలను వివరిస్తూ బాబాను సేవిస్తూ గడిపాడు. 1940  ఏప్రియల్  నెలలో తన జీవితం చాలించారు.

ఓం శ్రీ సాయి రామ్!  

No comments:

Post a Comment