భగవానుడు మిధ్యాచారులు లాగా ఉండద్దు అని చెపుతూ
తరువాత ఈ కర్మలు ఎలా చేయాలో చెప్పారు.
నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణః !
శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేధ కర్మణః !!
నీవు శాస్త్రవిహిత కర్తవ్యకర్మలను ఆచరించుము. ఏలనన
కర్మలను చేయకుండుట కంటే చేయుటయే ఉత్తమము. కర్మలను ఆచరించనినచో నీ శరీర నిర్వహణము
కూడా సాధ్యము కాదు.
కర్మ చేయుటకు మానవులకు మాత్రమే అధికారము కలదు.
మానవ జన్మలో చేసిన కర్మల ఫలితం అనుభవించుటకు రకరకాల జంతు, మానవేతర జన్మలను
ఎత్తవలిసిఉండును. జంతు జన్మలలో ఉన్నప్పుడు పుణ్యపాప కర్మాచరణములు
జరుగవు. కేవలము మానవజన్మలో చేసిన కర్మలే బంధహేతువులు.
శాస్త్రవిహితములైన యజ్ఞ, దాన, తపశ్చర్యాది
శుభకర్మలు కూడా బంధహేతువులుగనే భావింపబడుచున్నవి. ఇలా అయితే అసలు కర్మలు ఎలా
చేయాలి?
అసలు కర్మలు చేయకుండా ఉంటె సరిపోతుంది కదా!
దీనికి సమాధానముగా భగవానుడు ఇలా చెప్పారు.
యజ్ఞార్దాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః !
తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచార !!
ఓ అర్జున! యజ్ఞార్ధము చేయబడు కర్మలలో గాక ఇతర
కర్మలయందు నిమగ్నులగుటవలన మనుష్యులు కర్మబంధములలో చిక్కుపడుదురు; కనుక నీవు
ఆసక్తిరహితుడవై యజ్ఞార్ధమే కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము.
మనం ఈ శరీరంలో ఉన్నంతవరకు కర్మలు చేయకుండా
ఉండలేము. అందుకే ఎలాంటి కర్మలు చేస్తే ఎటువంటి ప్రభావం ఉంటుందో తెలుసుకొని కర్మలు
చేయాలి.
భగవానుడు కర్మలను కర్మ యోగంగా మార్చుకోమని
చెప్పారు. అలానే ఆ కర్మలు ఆసక్తిని వీడి చేయమని బోధించారు. అసలు మనం ఎలాంటి కర్మలు
చేస్తే అవి మనకు బంధంగా చుట్టుకోకుండా ఉంటాయి. ఈ కర్మల ఫలితం మనకు అంటకుండా ఉండాలి
అంటే కోరికలను మనోబుద్ధుల పరంగా నియంత్రించడం
నేర్చుకోవాలి.
మనస్సులో వచ్చే కోరికలను నియంత్రించే విధానం:
-ధర్మబద్ధము కాని మరియు అక్రమమైనా కోరికలను దూరంగా
ఉంచాలి.
-నిషిద్ధ కర్మలు చేయకూడదు.
-ధర్మబద్ధమైన కోరికలను కూడా నియంత్రించాలి.
-ధర్మబద్ధమైన కోరికలు తీర్చుకున్నప్పుడు వాటిపట్ల
అనాసక్తితో వ్యవహరించాలి.
బుద్ధిలోనుంచి వచ్చే కోరికలను నియంత్రించే
విధానం:
-కర్మను బాధ్యతగా గుర్తించి దాని ఫలితం మీద దృష్టి
పెట్టకుండా చేయాలి.
-దేనిని మన హక్కుగా పరిగణించి కర్మలు చేయకూడదు.
-బాధ్యతతో కూడుకున్న కర్మలను మనస్ఫూర్తిగా
పూర్తిచేయడం నేర్చుకోవాలి.
-కర్మలు విచక్షణా బుద్ధితో నిర్వర్తించాలి.
ఓం
శ్రీ సాయి రామ్ !
No comments:
Post a Comment