భగవానుడు
కర్మలు ఎలా చేయాలో, వాటిని కర్మయోగంగా ఎలా మార్చుకోవాలో చెప్పారు. శాస్త్రాలు
నిర్దేశించినట్లు కర్మలు చేయాలి అని కూడా చెప్పారు. ఇప్పుడు కర్మలు ఒక యజ్ఞం లాగా
చేయాలి అని రాబోయే శ్లోకాల్లో చెప్పబోతున్నారు. ఎవరి ధర్మం ప్రకారం వాళ్లు కర్మలు
చేయడంవల్ల ఈ లోకం సమిష్టిగా ముందుకి సాగుతూ ఉంటుంది. కర్మలు కర్మయోగంగా చేయగలిగితే
చిత్తం శుద్ధి అవుతుంది. చిత్తం శుద్ధి అయితే జ్ఞాన గురించి తెలుసుకొనే అర్హత
వస్తుంది.
కల్పాదియందు
బ్రహ్మదేవుడు యజ్ఞ సహితముగ సృష్టి చేసి ఇలా చెప్పారు " మీరు యజ్ఞముల ద్వారా అభివృద్ధి చెందండి. ఈ యజ్ఞములు కామధేనువు
వలె మీ కోరికలన్ని తీర్చును".
యజ్ఞార్ధము
కర్మలను చేయు వారిని ఆ కర్మలు బంధింపవు. మనము శాస్త్ర విహితమైన యజ్ఞ దాన తపస్సుల
ద్వారా మనము రోజువారి కర్మలను నిర్వర్తించినచో అవి అన్ని యజ్ఞమే అవుతాయి. అందుకే
భగవానుడు ఇలా చెప్పారు.
దేవాన్
భావయతానేన తే దేవా భావయంతు వః !
పరస్పరం
భావయంతః శ్రేయః పరమవాప్స్యథ !!
మనము ఈ
యజ్ఞముల ద్వారా దేవతలును తృప్తిపరచాలి. అప్పుడు దేవతలు మిమ్ములను అనుగ్రహింతురు.
నిస్స్వార్ధముగా మీరు పరస్పరము సంతృప్తిపరుచు కొనుచు పరమ శ్రేయస్సును పొందగలరు.
ఇష్టాన్
భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః !
తైర్దత్తాన
ప్రదాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః !!
యజ్ఞములద్వారా
సంతృప్తిని పొందిన దేవతలు మానవులకు ఇష్టమైన భోగములను ప్రసాదించెదరు. ఈ విధముగా
దేవతలచేత తీర్చబడిన కోరికలను ఆ దేవతలకు నివేదించకుండా తానే అనుభవించువాడు నిజముగా
దొంగయే అని భగవానుడు చెప్పారు.
కర్తవ్య
కర్మలు చేయువారిని పొగుడుతూ, అలా యజ్ఞార్ధము కర్మలు చేయనివారిని చోరులుగా చెప్పడం
జరిగింది. కేవలము శరీర పోషణకే కర్మలు చేయువారు పాపులు అని భగవానుడు
అధిక్షేపించుచున్నారు. ప్రాణులన్ని అన్నం ద్వారా జన్మించును. అన్నం వర్షమువలన
ఏర్పడును. యజ్ఞముల వలన వర్షములు కురియును. వేద విహిత కర్మలు చేయడం చాలా అవసరం. ఈ
వేదములు పరమాత్మ నుండి ఉద్భవించినవి. అందువల్ల సర్వ వ్యాపి అయిన పరమాత్మ సర్వదా
యజ్ఞముల యందె ప్రతిష్టితుడై ఉన్నాడు. యజ్ఞ శిష్టాన్నము తిను వారు అన్ని
పాపములనుండి విముక్తులు అవుదురు. అలా కాక తమ శరీర పోషణకే ఆహారమును తినువారు
పాపమునే తినుచున్నారు.
కర్మ
ఫలితం కోసం తపించకుండా కర్మలు చేస్తే అది యజ్ఞమే అవుతుంది. ఎందుకంటే సూర్యుడు తన
శక్తిచే లోకాలను రక్షించుచున్నారు. అలానే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని
చుట్టూ తిరుగుతుంది. భూమి తిరగడం ఆపేస్తే ప్రాణుల పరిస్థితి ఏమిటి? ఎవరి ధర్మాన్ని
వారు శాస్త్ర విహితంగా నిర్వర్తించడం నేర్చుకోవాలి. బ్రహ్మ ద్వారా సృష్టించబడిన ఈ
కాల చక్రం స్వార్ధరహిత కర్మలనే యజ్ఞాలపై ఆధారపడియున్నది. పరమాత్మ ఇటువంటి
యజ్ఞాలలోనే ఉన్నాను అని గట్టిగా చెప్తున్నారు.
ఏవం
ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః !
అఘాయురిన్ద్రియారామో
మోఘం పార్థ స జీవతి !!
ఓ
అర్జున! ఇట్లు పరంపరాగతంగా కొనసాగుతున్న సృష్టి చక్రమునకు అనుకూలముగా
ప్రవర్తించనివారు, తన కర్తవ్యములను పాటించకుండా సుఖలోలుడైన వాడు పాపి. అట్టివాని
జీవితం వ్యర్ధము.
మనము ఏ వస్తువైనా
అనిభవించే ముందు దేవుని స్మరించుట అన్నది చాలా గొప్ప సాధన. అప్పుడు మనము
అనుభవించాల్సిన వస్తువు మనము పొందవచ్చా లేదా అన్న సద్విచారము కలుగుతుంది. అప్పుడు మన బుద్దిని వాడుకుంటాము.
మనస్సుని ఇష్టము వచ్చిన రీతిలో కదలనివ్వము. ఇలా కామ, క్రోధ, లోభా మోహాలను భగవంతునికి అర్పించే అభ్యాసం మొదలు పెడితే మన దుర్గుణాలన్ని
నశిస్తాయి. మన వ్యక్తిత్వం పరిశుద్ధం అవుతుంది. ఇలా కర్మలు చేస్తే అవి అన్ని
యజ్ఞంగా మారిపోతాయి.
మన జీవితంలో మనము
కొన్నింటిని ఆశించినప్పుడు ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. ఇలా అందరు
ప్రవర్తిస్తే ఇంక అధికారాల కోసం పోట్లాడుకోవలసిన అవసరం లేదు.
బాబా పంచ మహా
యజ్ఞాల ప్రాముఖ్యత బిక్షాటన ద్వారా చేసి చూపించారు .
దేవ యజ్ఞం: మనము
దేవతలకు భక్తితో ఏదైనా సమర్పిస్తే అది దేవ యజ్ఞం అవుతుంది.
ఋషి యజ్ఞం : మన
ఋషులు ప్రసాదించిన
శాస్త్రాలను, జ్ఞానాన్ని గౌరవించి వాటిని మన జీవితంలో అవలంభించడమే ఋషి లేదా బ్రహ్మ
యజ్ఞం అంటారు.
పితృ యజ్ఞం: మన
పూర్వీకులను గౌరవించి శ్రద్ధాభక్తులతో సేవించాలి.
మనుష్య యజ్ఞం:
తోటి మానవులకు అవసరమైన సహాయం చేయడమే మనుష్య యజ్ఞం.
భూత యజ్ఞం: మన
చుట్టూ ఉన్న అనేక వృక్ష జంతు జాలాన్ని సంరక్షిస్తూ ఉండడమే భూత యజ్ఞం.
ఇలా ఈ పంచ మహా
యజ్ఞాలను మన జీవితంలో పాటిస్తూ మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. అప్పుడు
కర్మలు కాస్తా కర్మ యోగం అవుతాయి. ఇలా కర్మలు ఆచరించడం వల్ల మన జీవితమే ఒక యజ్ఞంగా
మారుతుంది
ఓం శ్రీ సాయి రామ్
No comments:
Post a Comment