మనం ఈ
శరీరంలో ఉన్నంత వరకు కర్మలు చేస్తూనే ఉండాలి. కర్మ చేయకుండా ఉండటం సాధ్యం కాదు.
అందుకే మనము కర్మను కర్మ యోగంగా మార్చుకోవడం నేర్చుకోవాలి. కర్మ వల్ల ద్వంద్వాలకు
లోనవుతాము అంటే కర్మ ఫలితం మనలను సుఖానికి గాని లేదా దుఃఖానికి గాని గురి
చేస్తుంది. కాని కర్మను కర్మ యోగంగా మారిస్తే మనం స్థిమితంగా ఉండ గలుగుతాము. ఈ సుఖ
దుఃఖాలు మనలను బాధ పెట్టవు. అందుకే భగవానుడు ఇలా చెప్పారు. కర్మ యోగము ముందుగా అలవరుచుకుంటే మన మనస్సు పరిపక్వము చెంది జ్ఞాన
యోగ సాధనకు ఉపయోగపడుతుంది. అందుకే మనం జీవితంలో అసలు ఈ కర్మలు ఎలా చేయాలో మొట్టమొదట
నేర్చుకోవాలి.
మన
జీవితాన్ని నాలుగు విధాలుగా విభజిస్తే
1)
విద్యార్థి దశ : ఏదైనా నేర్చుకునేటప్పుడు మనం ఈ దశలో ఉండాలి. అప్పుడు వేరే ఏ
ఆలోచనలు రాకూడదు. చిన్నప్పుడు అందుకే చదువు బాగా వంటపడుతుంది.
2) సంసార
జీవితం: మనం విద్యను ముగించుకొని, సంపాదనలో పడి, పిల్లలను పెంచి పోషించడం మొదలైన
కర్మలన్ని చేస్తాము. బాగా డబ్బు సంపాయించడం, ఆస్తులు కూడబెట్టడం ఇలా ఇంకెన్నో
చేయవలిసి ఉంటుంది.
3)
ఉద్యోగ విరమణ: బాధ్యతలు తీరిన తరువాత మనం ఇప్పటిదాకా
కష్టపడి చేసిన పనులనుంచి సెలవు తీసుకొనే సమయం. తరువాతి తరానికి
బాధ్యతలు అప్పచెప్పి భగవంతుని వైపు తిరగవలిసిన సమయం ఆసన్నమైనది అని తెలుసుకోవాలి.
4)
ఆధ్యాత్మిక జీవనం: ఇది చివరి స్థితి. ఈ స్థితిలో ఉండాలి అంటే మనం పైన చెప్పిన మూడు
స్థితిల్లో కర్మ యోగాన్ని సాధన చేసి ఉండాలి.లేకపోతె చివరిదశలో కూడా సంసార దశలోనే
కొట్టుకుంటూ ఉంటాము.
కర్మ
యోగం గురించి విద్యార్థి దశలోనే నేర్చుకోవాలి. ఇక్కడ నేర్చుకుంటే సంసార జీవితం
సుఖమయం అవుతుంది. అప్పుడు తొందరగా బాధ్యతలనుంచి విరమించుకోగలుగుతాము. లేకపోతె
ముసలివాళ్ళు అయిన తరువాత కూడా ఆరాటపడుతూ ఉంటాము. ఇంక రిటైర్ అయ్యేది చనిపోయిన
తరువాతే. ఎంత తొందరగా కర్మ యోగాన్ని అర్ధం చేసుకంటే అంత తొందరగా మనం ఆధ్యాత్మిక
స్థితిలో ప్రయాణం చేయవచ్చు. ఈ స్థితిలో ఎటువంటి కష్టాన్ని అయినా ఎదుర్కోవచ్చు.
అంటే ఎప్పుడు సమతలో ఉండవచ్చు. ఇదే కర్మ యోగముయొక్క ముఖ్య ఉద్దేశ్యము.
భగవానుడు
రెండు దారులు ఉన్నాయి అని చెప్పారు. ఎవరికి ఏ దారి మంచిది అనే విషయం కూడా
చెప్పారు. మనలో బాగా వాసనలు ఉండి, పనులమీద ఆసక్తి ఉన్నప్పుడు ముందుగా కర్మ
యోగాన్ని అభ్యసించాలి. ఇలా చేస్తే మనసు కుదట పడి ఆత్మ గురించి తెలుసుకోవడానికి
అర్హత వస్తుంది. అందుకే అర్జునుడు నేను ఈ యుద్ధం చేయను, ఆత్మను తెలుసుకునే
మార్గంలో వెళ్తాను అని చెప్తాడు. కాని అయన ఒక క్షత్రియుడుగా యుద్ధం చేయాలి అని
రణరంగంలోకి వచ్చాడు. ఈ వాసన తీరకుండా అయన జ్ఞాన మార్గంలోకి వెళ్ళలేడు. అందుకే
భగవానుడు యుద్ధమే నీకు శ్రేయస్కరము అని తెలియ చెప్పారు. కాని ఆ యుద్ధాన్ని
ప్రతీకారంతోనో, లేక రాజ్య కాంక్షతోనో చేయకుండా స్వధర్మం కోసం చేయమని చెప్పారు.
అప్పుడు వాసనలు ఖర్చు అవుతాయి. వాసనలు తగ్గేకొద్దీ మనసు ప్రశాంతం అయ్యి జ్ఞానం గురించి తెలుసుకొనే అర్హత వస్తుంది. ఇది అర్ధం చేసుకున్నాడు కాబట్టే
అర్జునునికి భగవద్గీత బోధించడం జరిగింది.
పంట
పండాలి అంటే మొదట భూమిని దున్నాలి. తరువాత విత్తనం నాటాలి. అలానే మన మనస్సుని
కర్మ, భక్తి యోగాలతో శుద్ధం చేసుకొని తరువాత
జ్ఞానం అనే బీజం నాటాలి. అప్పుడే అది మొలకెత్తుతుంది.
అందుకే
భగవానుడు ఇలా చెప్పారు.
కర్మేంద్రియాణి
సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ !
ఇంద్రియార్ధాన్
విమూఢాత్మా మిధ్యాచారః స ఉచ్యతే !!
బలవంతముగా,
బయట వరకు ఇంద్రియాలను నిగ్oరహించి, మానసికంగా ఇంద్రియ విషయములను చింతించునట్టి
మూఢుని మిధ్యాచారి అనగా దంబి అని అందురు.
మనసు
పరిపక్వము చెందకుండా నేను ఆత్మ వైపు నడుస్తాను అంటే కుదరదు. ఒక వేళ గట్టిగా
కర్మేంద్రియాలను బంధించినా మనసు అధీనంలో లేక పొతే కుదరదు. ఇట్టి వారినే భగవానుడు
మిద్యాచారులు అని చెప్పారు. వీరు హఠ యోగంద్వారా శరీరాన్ని ఆధీనంలోకి
తెచ్చుకోవచ్చు, సమాధి స్థితిలోకి వెళ్ళవచ్చు, కాని వారిలో వాసనలు తొలగవు. వారు
పేరు ప్రతిష్ఠలకోసం, వారు అనుకున్న అభివృద్ధి కోసం పరుగులు పెడతారు. అంటే కర్మ
మాత్రమే చేస్తారు. దాన్ని కర్మయోగంగా మలుచుకోవడం నేర్చుకోరు. అందుకే వారికి
కష్టాలు తప్పవు. అందుకే భగవానుడు తరువాత శ్లోకంలో ఇలా చెప్పారు.
యస్త్విన్ద్రియాణి
మనసా నియమ్యారభతే అర్జున !
కర్మేంద్రియై:
కర్మ యోగమస్తకః స విశిష్యతే !!
అర్జున!
మనస్సుతో ఇంద్రియములను వశపరుచుకొని, అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మ
యోగాచారణమును కావించు పురుషుడు శ్రేష్ఠుడు.
మనసు
కోరికతో ఉండి, బయటకు ఇంద్రియాలను నిగ్రహించి నటించే వారిని మిధ్యాచారి అని
భగవానుడు పిలిచారు. మిధ్యాచారిని ఆసురీ సంపద గల వానిగా చెప్తారు. వీరి కన్నా సకామ కర్మలు ఆచరించు మనుష్యులే శ్రేష్ఠులు. కర్మయోగాన్ని
ఆచరించే వారు వీరందరికన్నా శ్రేష్ఠులు.
మన
సమాజంలో కొంతమంది గొప్ప కోసమో, పేరు ప్రతిష్టల కోసమో, ఎన్నో పనులు చేస్తారు.
దీనివల్ల వీరికి గాని, వారి కుటుంబానికి నిజంగా ఉపయోగం ఉండదు. అప్పులు చేసి అయినా
సరే అందరిముందు గొప్పగా ఉండాలనే ప్రయత్నం వారిని కష్టాలకు గురి చేస్తుంది. అలానే
దైవ కార్యాలలో కూడా ఈ గొప్పతనం ప్రదర్శిస్తూ ఉంటారు. పెద్ద విగ్రహాలు పెట్టడం, బాగా
ఖర్చుపెట్టి యజ్ఞాలు, యాగాలు చేయడం కూడా వీటికి ఉదాహరణలు. అలా చేసినప్పుడు మన
దృష్ఠి అంతా ఈ కార్యాలను సరిగ్గా నిర్వర్తించాలి అనే అంశం మీదే కేంద్రీకృతం
అవుతుంది. భక్తి భావంలో లోపం జరిగే ప్రమాదం ఉంది. ఇవన్ని కూడా పైన చెప్పిన మిధ్యాచారికి బిన్నం కావు.
అందుకే
మనమందరము కర్మను కర్మ యోగంగా మార్చుకునే విధానాన్ని నేర్చుకోమని భగవానుడు
ఆదేశిస్తున్నారు. ఇకనుంచి మనం కూడా ఈ విధానాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాము.
ఓం శ్రీ
సాయి రామ్ !
No comments:
Post a Comment