ఈ సృష్టిలోని ప్రతి వస్తువులో జడమైన పదార్ధంతో
పాటు చైతన్యం కూడా ఉంది. మనిషిలో మనస్సు శరీరాలు జడమైతే, వీటికి శక్తిని ఇచ్చేది
చైతన్యం. మనస్సుకి ఆలోచించే శక్తి ఈ చైతన్యం ద్వారానే వస్తుంది. ఈ చైతన్యమే నేను
అని తెలుసుకున్న వారినే జ్ఞానులు అంటారు. వారు సచ్చిదానంద మైన ఆత్మ స్థితిలో
రమిస్తూ ఉంటారు. వారు నిత్యతృప్తులు. అట్టివారికి ఎట్టి కర్తవ్యము ఉండదు. కాని
వారు ఆసక్తిరహితులై వారి వారి కర్మలను చేస్తారు. అందుకే వారు ఆ కర్మల ఫలితాలకు
స్పందించరు. మనము కూడా ఆసక్తి రహితముగా కర్మలు ఆచరిస్తే పరమాత్మ స్థితిని పొందగలము
అని భగవానుడు చెప్పారు. ఇలా చేయడం కష్టమని మనం అనుకోవచ్చు, అందుకే భగవానుడు తరువాత
శ్లోకంలో ఇలా చెప్పారు.
కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయః !
లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి !!
జనకుడు మొదలగు జ్ఞానులు కూడా ఆసక్తిరహితంగా
కర్మలను ఆచరించుటవలననే పరమసిద్ధిని పొందిరి. కావున నీవును లోకహితార్థమే కర్మలను
ఆచరించుటయే సముచితము.
ఇక్కడ జనకుడు మొదలైన వారు అని చెప్పారు. జనకుడు ఒక
రాజు. రాజు ఐన వాడు రోజు ఎన్నో కార్యక్రమాలలో తలమునకలై ఉంటాడు. వారికన్నా మనం
ఎక్కువ కర్మలను ఏమి చేయము. వీరు ఆత్మా స్థితిలో ఉండి రాజ్యపరిపాలన చేశారు. అలానే
ప్రహ్లాదుడు కూడా ఆసక్తిరహితంగా కర్మలు చేస్తూ రాజ్య పరిపాలన చేశారు.
పైన శ్లోకంలో భగవానుడు "లోకసంగ్రహమ్" అనే పదాన్ని వాడారు. ఇది అర్ధం చేసుకుంటే
మనం ఆధ్యాత్మిక పధంలో ఉన్నత శిఖరాలకు చేరవచ్చు. దీన్ని రోజువారీ జీవితంలో
అనుసరిస్తే సుఖదుఃఖాల వలయంలో చిక్కుకోకుండా ఉంటాము.
సృష్టిక్రమాన్ని సురక్షితంగా ఉంచేందుకు, దానికి
ఎటువంటి అడ్డంకులు లేకుండా సహాయపడటమే లోకసంగ్రహము పాటించుట అని చెప్తారు. ఈ సమస్త
ప్రాణికోటి పోషణ రక్షణ బాధ్యతలు మనుషుల పైననే ఉంది. మిగిలిన ప్రాణులతో పోల్చితే
మనిషికి బుద్ధి అనే ఆయధం ఉంది. దీన్ని ఉపయోగించకుండా ఉంటే, ఈ బాధ్యతను మనం
నిర్వర్తించలేము. ఈ సృష్టి క్రమంలో ప్రతిప్రాణి ఎంతోకొంత తమతమ బాధ్యతలను
నెరవేరుస్తుంటాయి. కాని మానవులు మాత్రం కేవలం స్వార్ధం కోసం సృష్టిక్రమానికి గండి
కొట్టే ప్రయత్నం చేస్తారు. అలా అని మనం ఎదో గొప్పగొప్ప పనులు చేయవలిసిన అవసరం
లేదు. మనకు ఈ సమాజంలో వృత్తిపరంగా సంక్రమించిన పనులను లోకహితంకోసమే చేస్తే చాలు.
ఒక వ్యక్తి తను పని చేసే వ్యవస్థను
అందరితోపాటు స్వార్థరహితంగా ముందుకు తీసుకుపోతే, అది సమాజానికి మేలు చేస్తుంది.
ఇది ఒక్కరు చేసేది కాదు. అందరు సమిష్టిగా చేయవలిసింది. నాయకులైన వారు ఈ బాధ్యతను
నిర్వర్తిస్తే వారిని ఆదర్శంగా తీసుకొని మిగిలిన వారు తరిస్తారు. అలానే
తల్లితండ్రులు ఆదర్శంగా నిలబడగలిగితే పిల్లలు తప్పకుండా మంచిదారిలో నడుస్తారు. మనం
చేసే ప్రతిపనిలో లోకహితం ఉండాలి. అప్పుడు సృష్టిక్రమం చక్కగా సాగుతుంది.
అందుకే భగవానుడు తరువాత శ్లోకాలలో ఇలా చెప్పారు.
యద్యదాచరతి శ్రేష్ట: తత్తదేవేతరో జనః !
స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే !!
శ్రేష్ఠుడైన పురుషుని ఆచరణమునే ఇతరులు
అనుసరింతురు. అందరు ఆతడు ప్రతిష్టించిన ప్రమాణములనే పాటించెదరు.
న మే పార్దాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన !
నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి !!
ఓ అర్జున! ఈ ముల్లోకములయందు నాకు కర్తవ్యము అనునది
లేదు. అలాగే నేను పొందవలిసిన వస్తువు లేదు. అయినా నేను కర్మలయందే
ప్రవర్తిల్లుచున్నాను.
అంతే కాక భగవానుడు ఫలితంపై ఆసక్తిని వీడి కర్మలు
చేయకున్నచో లోకములో అలాకల్లోలం చెలరేగును అని చెప్పారు. ఈ కర్మలు మానినచో ఈ
లోకములన్నియు నశించును అని కూడా తెలిపారు. ఈ అనర్ధం జరగకుండా ఉండాలి అంటే మన వంతు
కర్తవ్యం మనం నిర్వర్తించాలి. మనమే స్వార్ధపూరితంగా ప్రక్క దారులు పడితే ఇంక మన
ముందు తరాలకు మనం ఏమి నేర్పిస్తాము?
No comments:
Post a Comment