మన కర్మానుసారంగా మూట కట్టుకొని వచ్చిన స్వధర్మాన్ని
పాటించడం చాలా అవసరం అని భగవానుడు చెప్పారు. మానవులు తమ ధర్మానికి విరుద్ధంగా,
ఇతరులు బలవంత పెట్టినట్లు ప్రేరిపితులై పాపములను చేయుటకు గల కారణము
వివరించవలిసినదిగా అర్జునుడు భగవానుని అర్ధించాడు. అప్పుడు భగవానుడు ఈ విధముగా
సమాధానము చెప్పారు.
కామ ఏష
క్రోధ ఏష రజోగుణ సముద్భవః !
మహాశనో
మహా పాప్మా విధ్యేనమిహి వైరిణమ్ !!
భగవానుడు
ఇట్లు పలుకుచున్నారు. రజోగుణం నుండి వచ్చునదే కామము. ఈ కొరికయే క్రోధరూపమును
దాల్చును. ఇది మహాశనము. ఇది కోరికలు తీర్చుకుంటూ పొతే చల్లారేది కాదు. పైగా
అంతులేని పాపకర్మలకు ఇదియే ప్రేరకము. అందుకే కామమునే పరమ శత్రువుగా చెప్పడం
జరిగింది.
కామము
క్రోధము మొదలైనవన్నీ శత్రువులే. కానీ ఇక్కడ భగవానుడు ఒక్క కామమునే శత్రువుగా
చెప్పడం జరిగింది. ఎందుకంటే కొరికే అందరిని క్రోధం వైపు తీసుకుపోతుంది. ఈ కోరిక మనలోని
జ్ఞానాన్ని కప్పివేసి మనలను అంధులుగా మారుస్తుంది. అందుకే భగవానుడు తరువాతి
శ్లోకంలో ఇలా చెప్పారు.
ధూమేనావ్రియతే
వహ్ని: యధా ఆదర్శ: మలేన చ !
యధోల్భేనావృతో
గర్భ: తధా తేనెదమావృతమ్ !!
పొగచే
అగ్నియు, ధూళిచే అద్దము, మాయచే గర్భము కప్పివేయబడునట్లు, జ్ఞానము కామముచే ఆవృతమై
యుండును.
మన
కోరికలే మనలను అశాంతికి గురి చేస్తాయి. ఈ కామమే మల, విక్షేప, ఆవరణములు అనే మూడు
దోషములుగా పరిణితి చెంది, మనలోని జ్ఞానాన్ని కప్పివేయును. అప్పుడు మనలోని విచక్షణా శక్తి నశిస్తుంది. ఈ కోరికకు
ఏమైనా అడ్డంకులు కలిగితే అది క్రోధంగా రూపు దిద్దుకుంటుంది. కోరిక అగ్నితో
సమానమైనది. అది ఎన్నటికిని చల్లారదు. జ్ఞానులకు అది నిత్య వైరి అని, ఇది మనుష్యుని
జ్ఞానమును కప్పివేయును అని భగవానుడు చెప్పారు. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ
కామమునకు నివాస స్థానములు. ఇవన్నీ కలిపి జీవుని మోహితునిగా మార్చివేయును.
దీనిని
దాటాలి అంటే మనం ఏమి చేయాలో భగవానుడు తరువాత శ్లోకంలో ఇలా చెప్తున్నారు.
మొదట
ఇంద్రియములను వశపర్చుకోవాలి. ఇది అంత సులభమైన కాదు అని మనం అనుకోవచ్చు, కాని
భగవానుడు అభ్యాస వైరాగ్యముల ద్వారా ఈ కోరికను జయించవచ్చు అని చెప్పారు. కోరికలను
అర్ధం చేసుకోవడం మొదలు పెడితే వాటిని నియంత్రించే మార్గం దొరుకుతుంది. ఎలాగైనా
పాపి అయిన ఈ కామాన్ని అడ్డుకోవాలి. బుద్ధి ద్వారా మనస్సుని అదుపులోకి తెస్తే
కోరికలు వాటంతట అవే దారిలోకి వస్తాయి.
భగవానుడు
మూడో అధ్యాయం ముగిస్తూ కోరికలను అదుపులో ఉంచే మార్గాన్ని వివరించారు. స్థూల శరీరం
కంటె ఇంద్రియములు బలీయములు, సూక్షములు, శ్రేష్ఠములు అని మన శాస్త్రాలు చెప్తాయి.
ఇంద్రియములకంటే మనస్సు, దానికంటెను బుధ్ది శ్రేష్టమైనవి. బుద్ధి కంటె ఆత్మ అత్యంత శ్రేష్టమైనది, సూక్ష్మమైనది. బుద్ధి ద్వారా
మనస్సును వశపరుచుకొని కోరికను జయించవచ్చును. కోరికను జయించడం అంటే కోరికలను
చంపుకోవడం కాదు. వాటిపై ఆసక్తిని పోగొట్టుకావాలి. మనము ఈ శరీరంతో వచ్చింది సుఖ
దుఃఖాలను అనుభవించడానికే. పూర్వ జన్మ కర్మల ఫలితాలకు అనుగుణంగా మన జీవితం
సాగుతుంది.
కర్మ యోగాన్నిఅవలంబించడం మొదలు పెడితే జీవితం సుఖమయం అవుతుంది. కోరికలను
నియంత్రించగలుగుతాము. అప్పుడు ఆత్మ తత్వాన్ని అర్ధం చేసుకోగలుగుతాము.
ఓం శ్రీ సాయి రామ్ !
No comments:
Post a Comment