మనం
చిన్నప్పుడు పాఠాలు బట్టీయం పెట్టి చదువుకొని పై తరగతులకు వెళ్లగలిగాము. కాని పై
తరగతులకు వెళ్లే కొలది, ఇది ఇలా ఎందుకు ? అది ఇలానే ఎందుకు ఉండాలి? ఇలా కొన్ని
ప్రశ్నలు మనలో ఉదయించి మనలను ఆలోచింప చేస్తాయి. ఈ ఆలోచనలే మనం చదివే చదువును బాగా
అర్ధం అయ్యేలాగా చేస్తాయి. అలానే మనం అందరు చేస్తున్నారు అని కొన్ని పనులు
చేస్తాము కాని ఎంతమంది అలోచించి చేస్తారు. ఎంతోమంది పేరు ప్రఖ్యాతలు, ఆస్తులు సంపాయించి వారి ప్రాణాలను వదిలివేశారు. వారిగురించి ఎంతమంది
తలచుకుంటారు. ఒకరు ఆస్తులు కూడబెట్టి వారి పిల్లలకు
ఇచ్చారు, వారు వెళ్ళిపోయినా తరువాత వారి పరిస్థితి ఏమిటి? వారి పిల్లలు ఎంత కాలం
వారిని తలచుకుంటారు. కాని ఇక్కడ అర్ధం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, వారు
తలుచుకోవాలి అని తల్లితండ్రులు అన్ని చేయలేదు. నా వారు అన్న ప్రేమ వారి చేత ఈ
పనులన్నీ చేయించినది. కాని ఎక్కడో ఒక స్వార్ధం ఉంది. నిజాన్ని అర్ధం చేసుకోలేని
స్థితి. మన జీవిత కాలంలో ఎంత మందినో చూస్తాము అయినా మనం నేర్చుకోము. పాఠాలు అర్ధం
చేసుకొని చదివిన దానికి, కేవలం బట్టీయం పెట్టి చదివిన దానికి ఎంత తేడా ఉందొ మన
అందరికి తెలుసు. అలానే జీవితంలో చేసే ప్రతి కర్మ మనం ఎందుకు చేస్తున్నాము? ఈ కర్మల
వెనుక ఉన్న జ్ఞానం ఏమిటి? మంచి కర్మలు చేస్తూ చెడ్డ కర్మలకు దూరంగా ఎందుకు ఉండాలి
అనే రక రకాల మూలా భావాలను తెలిపేదే ఈ నాలుగవ అధ్యాయం.
భగవానుడు
అధ్యాయం ప్రారంభిస్తూ తాను చెప్తున్న సత్యాలు తాను ఎప్పుడో సూర్యుడికి చెప్పానని,
ఆ సూర్యుడు వైవస్వత మనువుకి బోధించెనని, ఆ తరువాత మనువు తన కుమారుడైన
ఇక్ష్వాకునికి ఉపదేశించెనని చెప్పారు. అంటే ఈ జ్ఞానం మొట్టమొదటినుంచి ఉంది.
అందరికి కలిగే సందేహమే అర్జునునికి కూడా కలిగింది. శ్రీకృష్ణుడు అర్జునుడు
బంధువుల్లాగా, స్నేహితుల్లాగా కలిసి పెరిగారు. ఇద్దరికీ దాదాపు ఒకటే వయస్సు, కాని
శ్రీకృష్ణుడేమో ఈ జ్ఞానాన్ని సూర్యుడికి చెప్పాను అంటున్నారు, ఇది ఎలా సాధ్యం? అని
అర్జునిని సందేహం. అదే ప్రశ్న అర్జునుడు వ్యక్తం చేసాడు. తరువాత భగవానుడు మన
అందరమూ ఎన్నో జన్మలు ఎత్తుతాము, కాని అవి మనకు గుర్తు ఉండవు అని చెప్పారు. మరి
మహానుభావులు ఎందుకు జన్మలు తీసికొని వస్తారు అనే విషయాన్ని తరువాత శ్లోకంలో
చెప్పారు.
యదా యదా
హి ధర్మస్య గ్లానిర్భవతి భారత !
అభ్యుత్థానమధర్మస్య
తదాత్మానం సృజామ్యహమ్ !!
ఓ భారత!
ధర్మమునకు హాని కలిగినప్పుడును, అధర్మము పెరిగిపోయినప్పుడును, నన్ను నేను
సృజించుకొందును. అనగా సాకార రూపంతో ఈ లోకమున అవతరింతును.
ఊరికినే
వస్తే సరిపోదు కదా తాను వచ్చి ఏమి చేస్తారో అది కూడా తరువాత శ్లోకంలో భగవానుడు
చెప్పారు.
పరిత్రాణాయ
సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ !
ధర్మ
సంస్థాపనార్దాయా సంభవామి యుగే యుగే
!!
సత్పురుషులను
రక్షించుటకు, దుష్టులను రూపుమాపుటకు, ధర్మమును పరిరక్షించుటకు నేను ప్రతి
యుగమునందును అవతరించుచుందును.
మానవులుగా
ధర్మముతో బతకటం చాలా అవసరం. ఈ ధర్మము పాటించక పొతే దాని ఫలితాన్ని మనమే
అనుభవించాలి. ఒక పిల్లవాడు తప్పు చేస్తే తల్లితండ్రులు వాడికి నయానో భయానో మంచి
దారిని చూపించ ప్రయత్నిస్తారు. అలానే భగవంతుడు కూడా ఒక అవతార పురుషుడుగా కాని,
లేదా సాధు సంతుల రూపంలో మనలను సరైన దారిలో పెట్టడానికే వస్తారు.
భగవంతుడు
అవతారములు తీసుకోకుండా కూడా ఈ పనులు చేయవచ్చు. ఏదైనా అనుభవంతో నేర్పిస్తేనే
నిలబడుతుంది. అందుకే అవతార ధారణ. భక్తులు భగవంతుడికి దగ్గరగా ఉండి, సాకారంగా వారి
సాన్నిధ్యాన్ని పొంది ఆనందిస్తారు. మంచివారిని రక్షించడం అంటే దుష్టులనుంచి
మాత్రమే కాదు. వారిలోఉన్న కొన్ని చెడు ప్రవృత్తులు వారిని భగవంతుడికి దూరంగా
ఉంచుతాయి. ఇలాంటి దుష్ట స్వభావాలను దూరం చేసి మంచి మార్గంలో నడిపించడం కూడా ఒక
ఉద్దేశ్యం. ఇలా మారాలి అనుకొనే వారికి సాధుసంతుల రూపంలో అవకాశం వస్తుంది.
సత్యాన్ని, ధర్మాన్ని అవగతం చేసుకొనే శక్తి వస్తుంది. ధర్మం లేకుండా ఈ సృష్టి సాగదు.
ప్రకృతి తన ధర్మాన్ని తప్పక పాటించాలి. సూర్యుడు తన పని తాను చేయక తప్పదు. అలానే
భూమి తన కక్షలో తాను తిరగాలి. వాటి ప్రవర్తన కొంచెం మారినా చాలా ప్రమాదం.
మానవులుగా మన కర్తవ్యం మనం నిర్వర్తించాలి.
ఓం శ్రీ
సాయి రామ్!
No comments:
Post a Comment