భగవంతుని
గూర్చి తెలుసుకోవాలి అనే తపన ఉన్నవారు సత్య శోధన చెయ్యాలి. అంటే హృదయపు లోతుల్లోకి
వెళ్లి పరిశీలించాలి. మనస్సు నిర్మలంగా, పవిత్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది
సాధ్యపడుతుంది. పుణ్య పురుషుల స్థాయికి మనం వెళ్ళాలి అంటే సాధన చెయ్యాలి. భగవంతుని
యొక్క దివ్యములైన అవతారముల, కర్మల రహస్యములను ఎరిగిన వారికి భగవంతునిపై అనన్య
భక్తి, ఆసక్తి ఏర్పడును. అంటే భగవంతునిపై ప్రేమ పెరగాలి అంటే ఆ భగవంతుని గూర్చి
తెలుసుకోవాలి. అలానే లౌకిక విషయముల మీద ఆసక్తి తగ్గాలి. మనకు దేని మీద ఆసక్తి
ఉంటుందో మనసు దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తుంది.
అందుకే భగవానుడు రాబోయే శ్లోకంలో మనం ఎలా ఉంటే ఆ
మోక్షానికి దగ్గరై ఆ స్వరూపంలోనే ఉండిపోతామో అనే విషయాన్ని గురించి చెప్తున్నారు.
వీతరాగభయక్రోధా
మన్మయా మాముపాశ్రితాః !
బహవో
జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః !!
ఇంతకు
ముందు కూడా సర్వధా రాగ, భయ, క్రోధ రహితులైనవారు, దృఢమైన భక్తి శ్రద్ధలతో
స్థిరబుద్ధి కలిగి నన్ను ఆశ్రయించిన పెక్కు భక్తులు జ్ఞాన తపఃసంపన్నులై పవిత్రులై
నా స్వరూపమును పొంది ఉన్నారు.
ఇక్కడ
భగవానుడు మనకు ఒక దారి చూపిస్తున్నారు. మనం ఎలా ఉండాలో నేర్పిస్తున్నారు. ఈ దారిలో
మనకు కలిగే అడ్డంకులనే క్లేశాలు అంటారు. ఇవి యోగ శాస్త్రంలో
ఐదుగా చెప్పబడ్డాయి.
1. అవిద్య
2. అస్మిత
3. రాగము
4. ద్వేషము
5.
అభినివేశము
మనమందరము
ఈ ఐదు క్లేశాలకు కట్టుబడి ఉంటాము.
సరైన విజ్ఞానాన్ని తెలిపి సత్యాన్ని వెలుగులోకి తెచ్చేదే విద్య. మనవి
కానివి అన్ని మనవి అని అనుకోవడమే అవిద్య. ఈ అవిద్య వల్లే మిగిలిన నాలుగు క్లేశాలు మనలను
బాధిస్తాయి. దేహమే నేను అనుకోవడం అవిద్య. ఇలా మనసులో భావించి నేను, నాది అనుకోవడమే
అస్మిత. దీన్నే అహంకారము అంటారు. ఈ నేను నాదిలో నుంచే రాగము వస్తుంది. ఈ దేహానికి
సంబంధించినవాటన్నిటి మీద మమకారం ఉంటుంది. ఈ మమకారమే రాగం. ఈ రాగం సత్యమనుకుంటూ,
ఇదే శాశ్వతం అనుకుంటూ వైరాగ్యమంటే ద్వేషం పెంచుకుంటున్నాము. ఇక చివరిది అభినివేశం.
అంటే ప్రాణంమీద తీపి. మనతో ఉన్నవి అన్ని వదిలి వెళ్ళాలి అంటే భయం. నా అన్న వారికి
దూరం అయిపోతాం అన్న భయం. ప్రాణాలు దక్కించుకోవడానికి మనం చేయని ప్రయత్నం ఉండదు.
ఇది మానవ సహజం.
అందుకే
భగవానుడు రాగభయక్రోధ రహితులమై, స్థిర బుధ్ధితో ఉండి భగవంతునిపై ఆసక్తిని
పెంచుకోవాలి. ఇలా ఉన్నవారిని "మన్మయా" అని భగవానుడు
చెప్పారు. ఇట్టి వారు సర్వత్ర భగవంతుని దర్శించెదరు. భగవంతుని లీలలు, అవతారములు
మరియు దివ్య కర్మలను తెలుసుకొని భగవంతునిపై అనురక్తిని పెంచుకోవాలి. అప్పుడు జ్ఞాన
సిద్ది కలిగి మానవుడు తనలోనే భగవంతుని దర్శించగలుగుతాడు. మరి మనుష్యులందరు వేరు
వేరు మార్గాల్లో ఆ భగవంతుడిని కొలుస్తారు. ఈ సందేహాన్ని తీర్చడానికే తరువాత
శ్లోకంలో ఇలా చెప్పారు.
యే యధా
మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్ !
మమ
వర్త్మానువర్తంతే మనుష్యా: పార్ధ
సర్వశ: !!
పార్ధ!
భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణంగా నేను వారిని అనుగ్రహింతును.
మనుష్యులందరును భిన్న రీతులలో నా మార్గమునే అనుసరింతురు.
మార్గము
ఏది అయినా రాగ భయ క్రోధాలు అనబడే ఈ క్లేశాలను అర్ధం చేసుకొని, భగవంతునిపై అనన్య
భక్తిని, ప్రేమను పెంచుకొని, స్థిర చిత్తంతో జ్ఞాన తపస్సు చేయాలి. అప్పుడే ఆ
భగవంతుని మనలో దర్శించగలుగుతాము.
ఓం శ్రీ
సాయిరామ్ !
No comments:
Post a Comment