భగవానుడు
కర్మలు యజ్ఞార్థమే చేయాలి అని చెప్పారు. ఇలా చేస్తే ఈ కర్మలు బంధహేతువులు కావు అని
కూడా చెప్పారు. ఆసక్తి, దేహాభిమానము, మమకారము ఏ మాత్రము లేనివాడును, పరమాత్మ
జ్ఞానమునందు నిరంతరము లీనమైనవాడు, కేవలము యజ్ఞార్ధమే కర్మలు నిర్వహించువాడును అగు
మనుష్యుని కర్మలన్నియును పూర్తిగా విలీనములగును. మన బాధ్యతలను అనుసరించి,
పరిస్థితులను అనుసరించి శాస్త్రోక్తముగా కర్తవ్యమును నిర్వర్తించటమే యజ్ఞము
అంటారు. కేవలము అగ్నితో చేసేది మాత్రమే యజ్ఞము అని మనం భావించరాదు. పైన చెప్పిన విధంగా భగవంతునికి
సమర్పించి, నిస్స్వార్ధంగా కర్తవ్యపరంగా చేసే ఏ కర్మ అయినా యజ్ఞమే అవుతుంది.
అందుకే భగవానుడు తరువాత శ్లోకంలో ఇలా చెప్పారు.
బ్రహ్మార్పణం
బ్రహ్మ హవి: బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతం !
బ్రహ్మ
ఏవ తేన గన్తవ్యం బ్రహ్మ కర్మ సమాధినా !!
యజ్ఞ
కార్యములందు వాడు వస్తువులన్నీ బ్రహ్మము. యజ్ఞములో వేసే ద్రవ్యము బ్రహ్మము.
అగ్నియు బ్రహ్మము. యజ్ఞమునాచరించు కర్తయు బ్రహ్మము. హవన క్రియయు బ్రహ్మము. ఈ
బ్రహ్మ కర్మయందు స్థితుడై యుండు యోగి ద్వారా పొందదగిన యజ్ఞఫలము కూడా బ్రహ్మమే.
అంతటా
పరమాత్మే ఉన్నట్లు మన శాస్త్రాలు చెప్తాయి. అన్నింటిలో ఆ భగవంతుడే కొలువై ఉంటే ఇంక
ఆ పరమాత్మ లేని స్థానం కాని, ఆ శక్తికి సంబంధించని వస్తువు కాని ఈ సృష్టిలో ఉండదు.
మనం ప్రసాదంగా సమర్పించే వస్తువులన్ని ఆ భగవంతునికే చెందినవి. కేవలం సమర్పణ భావం
ఉంటే చాలు. మనం మనం చేసే కర్మ
ఫలితం మీద ఆసక్తిని వదిలితే అది యజ్ఞం అవుతుంది అని చెప్పుకున్నాము. ఇది కష్టతరం
అని మనం అనుకోవచ్చు, కాని ఏ పని అయినా చేసేముందు భగవంతుని తలుచుకుంటూ చేస్తే అది
యజ్ఞమే అవుతుంది. భగవంతుని తలుచుకుంటే ఆ పని చేయవచ్చా లేదా అన్న విచక్షణ మనలో
కలుగుతుంది. అప్పుడు మనకు తెలిసి చెడు కర్మలు జరగవు. మంచి కర్మలు కూడా మనలను
బంధంలో ఇరికించవు.
చాలా
మంది భోజనం చేసేటప్పుడు పై చెప్పిన శ్లోకం
తలుచుకొని అన్నం తింటారు. అప్పుడు ఈ భోజనానికి సంబంధించిన కర్మ ఫలితం అంతా
భగవదర్పితం అవుతుంది. మనం తినే అన్నం బ్రహ్మము. తినే వారు బ్రహ్మము. అన్నం జీర్ణం
చేసే జఠరాగ్ని బ్రహ్మమే. ఇలా సర్వం బ్రహ్మమే అన్న భావనతో యోగులు కర్మలు
నిర్వర్తిస్తారు.
మనం
ఏగాగ్రతతో ఏ పని చేయాలి అనుకున్నా మనస్సు పలు దారులు పడుతుంది. సరిగా లక్ష్యంమీద
దృష్టి నిలపనీయదు. మనము శ్రోత్రాది -ఇంద్రియములను సంయమనం చేయడం కూడా యజ్ఞమే
అవుతుంది. మనం మమత, ఫలాసక్తి లేకుండా వివిధవ్రతములను చేయుట, ధర్మ పాలనకై కష్టములను
సహించుట, మౌనము పాటించుట మొదలైనవన్ని యజ్ఞం అని పిలవబడతాయి. మన జీవనమే ఒక యజ్ఞము.
పరమాత్మ భావనతో ఏ కర్మ చేసినా అది యజ్ఞమే అవుతుంది. ఇలా కర్మలు
ఆచరించినప్పుడు జ్ఞానం ఉదయిస్తుంది. అప్పుడు మనం సుఖదుఃఖాల వలయంలో చిక్కుకోము. ఈ
జ్ఞానమే మనలను సత్యానికి దగ్గర చేస్తుంది.
ఓం
శ్రీ సాయి రాం !
No comments:
Post a Comment