భగవానుడు
జ్ఞాన యజ్ఞము అన్ని యజ్ఞాలలో కన్నా శ్రేష్టమైనది అని చెప్పారు. అట్టి జ్ఞానాన్ని
పొందితే పరమశాంతి కలుగుతుంది అని మన శాస్త్రాలు చెప్పాయి. కాని ఇప్పుడు అటువంటి
శాంతి పొందటానికి కావాల్సిన అర్హతలను భగవానుడు చెప్పబోతున్నారు.
శ్రద్ధావాన్
లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియ : !
జ్ఞానం
లబ్ధ్వా పరాం శాంతిమచిరేణాధిగచ్ఛతి !!
జితేంద్రియుడు,
సాధన పరాయణుడు, శ్రద్ధ కలిగిన వాడు అయిన మానవునకు ఈ భగవత్తత్వ జ్ఞానము లభించును. ఆ
జ్ఞానము కలిగిన వెంటనే ఆతడు సచ్చిదానంద తత్వ రూపమైన పరమశాంతిని పొందును.
మనం
జీవితంలో ఏమి సాధించాలన్నా పట్టుదలతో, ఆసక్తితో, వేరే విషయాలమీదికి మనస్సు పోకుండా
మనం సాధించాలి అనుకున్న దానిమీద శ్రద్ధతో పనిచేయాలి. అప్పుడే ఆ ఫలితాన్ని పొందగల
అర్హత మనకు వస్తుంది. చాలామంది నేను బాగా కష్టపడ్డాను అనుకుంటారు. కాని నాకు
అనుకున్న ఫలితం రాలేదు అని బాధ పడతారు. ఇలా పొందకుండా ఉంటానికి కారణాలు బయట
వెతుకుతారు. ఫలితం దక్కించుకున్న వారికి, దక్కనివారికి తేడా ఎక్కడో ఉంది. ఆ తేడాను
భగవానుడు ఈ శ్లోకంలో చెప్పారు. ఒక కార్యం సాధించాలి అంటే మూడు అర్హతలు ఉండాలి.
వీటిలో ఎక్కడ లోపం జరిగినా ఫలితం ఇంకోరకంగా ఉంటుంది. ఇది ఒక్క ఆధ్యాత్మిక విషయంలోనే కాదు జీవన సమరంలో కూడా ఇది వర్తిస్తుంది.
శ్రద్ధావాన్
అని మొట్టమొదటగా చెప్పారు. అసలు శ్రద్ధ అంటే ఏమిటి? మన శాస్త్రాలయందు,
భగవంతునియెడ, మహాపురుషుల వచనములయందును, పరమాత్మ యందును పూజ్యభావము, ఉత్తమోత్తమ
భావము కలిగియుండు స్థితిని శ్రద్ధ అని అంటారు. అందుకే భగవానుడు జ్ఞానులు,తత్వ
దర్శులు అయిన పరమగురువులను ఆశ్రయించి వారికి ప్రణిపాతము చేసి, సేవలొనర్చి, భక్తి
శ్రద్ధలతో, జిజ్ఞాసతో వారిని ప్రశ్నించి తత్వ రహస్యాన్ని తెలుసుకోవాలి అని పూర్వ
శ్లోకంలో చెప్పారు. కొంచెం తెలుసుకొని మిడి మిడి జ్ఞానంతో అన్ని తెలుసు అనుకుంటే
మనం ఆ ఫలితాన్ని పొందలేము.
తత్పరః
అంటే సాధనపరాయణుడు. అభ్యాసము లేకుండా మనం ఏ పనిని సంపూర్ణం చేయలేము. సాధన అనేది
ఎప్పుడు జరుగుతూ ఉండాలి. ఈ సాధనకు మూలము శ్రద్ధయే. సాధన అంటే మనం నమ్మిన దానిని
మనసా వాచా కర్మణా రోజూ ఆచరించడమే. ఈ ఆచరణ లోపరహితంగా ఉండాలి. ఒక విద్యార్థి తను అనుకున్న పరీక్షలో ఉత్తమ ఫలితం సాధించడానికి ఎంతో కష్ట పడతాడు.
వేరే ఆలోచనే లేకుండా తన లక్ష్యం మీదే ద్యాస ఉంచుతాడు. ఈ ప్రక్రియ మనం రోజు
చూస్తున్నదే. ప్రతిఒక్కరు వారి జీవితంలో ఎప్పుడో ఒక అప్పుడు చవిచూసిందే. ఒకరు
జీవితంలో బాగా కష్ట పడి వ్యాపారాన్ని అభివృద్ధి చేసి సంపద గడిస్తారు. వారు
నిద్రాహారాలను కూడా లెక్క చేయరు. అలానే భగవంతుడి విషయంలో కూడా మనకు శ్రద్ద ఉండి
సాధన చేస్తే తత్వ దర్శనం అవుతుంది.
ఇక చివరి
అర్హత సంయతేంద్రియ: అని భగవానుడు చెప్పారు. అంటే మనం మన ఇంద్రియాలను అదుపు చేసి,
మన లక్ష్యం వైపే మన దృష్టి ఉంచాలి. మన మనస్సు ఎప్పుడు వేరే వస్తువుల మీదకే
వెళ్తూఉంటుంది. అందుకే మన లక్ష్యానికి బిన్నంగా ఉన్న వాటిమీద మనకు కాస్త వైరాగ్యం
ఉండాలి. ఇంద్రియాలను అదుపులో ఉంచి, శ్రద్ధతో సాధన చేస్తే ఏ లక్ష్యం అయినా మనకు
చేరువ అవ్వాల్సిందే. మనకు లక్ష్యం గురించిన అవగాహన ఉండచ్చు, మనమీద మనకు నమ్మకం
ఉండచ్చు కాని సరిఅయిన సాధన లేకపోతే మనం నిరాశకు గురి అవుతాము.
పైన
చెప్పిన మూడు అంశాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. దేనిలోనైనా కొంచెం లోపం
ఉన్నా మనం పూర్తి ఫలితాన్ని పొందలేము. ఒక్కసారి ఇవి అన్ని సమగ్రంగా కుదిరి పరమాత్మ
తత్త్వం అనుభూతి కలిగితే మనమే పరమశాంతిగా నిలిచిపోతాము.
చివరగా ఈ
అధ్యాయం ముగిస్తూ భగవానుడు ఇలా చెప్పారు.
విధిపూర్వకంగా
కర్మలు చేస్తూ, కర్మ ఫలములను భగవదర్పితం చేస్తూ, వివేకం ద్వారా సంశయములన్నిటిని
తొలిగించుకొనుచు, మనస్సుని వశమునందుంచుకొనిన వానిని కర్మలు బంధించవు అని గట్టిగా
చెప్పారు. అందుకే ఈ నాలుగో అధ్యాయం పేరు జ్ఞాన కర్మ సన్యాస యోగము అని కూడా
పిలుస్తారు.
మనం చేసే
చాలాపనుల్లో వచ్చే ఫలితాన్ని పూర్తిగా అనుభవించకుండా వేరే వాళ్ళు మనలను
గుర్తించలేదు అన్న బాధ కొంతమందిని నిరాశకు గురి చేస్తుంది. నాకు సరిఐన గుర్తింపు
రాలేదు అన్న బాధ ఉంటుంది. ఇలా మనం ఆనందంలోకూడా దుఃఖాన్ని
వెతుక్కుంటాము. ఇలా చేయకుండా మనకు లభించిన ఈ క్షణాన్ని మనదిగా చేసుకుందాము.
ఫలితాన్ని పూర్తిగా ఆస్వాదించడం అలవాటు చేసుకొందాము. అప్పుడే మనలో శ్రద్ధ
పెరుగుతుంది. సాధన గట్టిపడుతుంది. సాధన గట్టిపడితే జ్ఞానం వ్యక్తమవుతుంది. అప్పుడు
పరమశాంతిరూపమైన భగవత్తత్వం అనుభవమవుతుంది.
ఓం శ్రీ
సాయి రామ్ !
No comments:
Post a Comment