In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Tuesday, September 19, 2017

భగవద్గీత 4. 5 జ్ఞాన యోగం - జ్ఞాన యజ్ఞమే శ్రేయం




పరమాత్మ ప్రాప్తికై ఆచరించబడు శాస్త్రవిహిత కర్మలన్నియు యజ్ఞమే అవుతాయి అని భగవానుడు ఇప్పటిదాకా చెప్పారు. కాని ఈ యజ్ఞాలన్నింటిలో శ్రేయమైనది ఎదో ఇప్పడు చెప్తున్నారు. 

శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతపా !
సర్వం కర్మాఖిలం పార్ధ జ్ఞానే పరిసమాప్యతే !!

హే పరంతపా !   అర్జున ! ద్రవ్యమయమైన యజ్ఞముల కంటే జ్ఞాన యజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది. కర్మలన్నియు జ్ఞానమునందే పరిసమాప్తమగును. 

మనము యజ్ఞగుండంలో వాడే నెయ్యి, పాలు, పెరుగు, ఇంకా ఇతర వస్తువులు, దాన ధర్మములు, మనుషులకు ఉపయోగపడే కార్యములు, ఆలయములు, సత్రములు కట్టించుట మొదలైన పవిత్రకర్మలన్నియు ద్రవ్యమయమైన యజ్ఞములే. వీటికన్నా జ్ఞాన యజ్ఞమే శ్రేయమైనది అని భగవానుడు ఈ శ్లోకంలో చెప్పారు. 

అసలు జ్ఞాన యజ్ఞం అంటే ఏమిటి?

ఆత్మ సంయమము, యోగ సాధన, శాస్త్ర అధ్యయనము, తత్వ విచారము మొదలైన కర్మలన్ని జ్ఞానయజ్ఞాలుగా చెప్పబడతాయి. ద్రవ్యమయ యజ్ఞాలు కూడా మమత, ఆసక్తి, ఫలేఛ్ఛ లేకుండా జ్ఞానయుక్తంగా చేస్తే అవికూడా ముక్తికి ఉపయోగపడతాయి. 

మనము ద్రవ్యమైన యజ్ఞాలు చక్కగా ఆచరించినప్పుడు మనకు జ్ఞానం పొందే అర్హత వస్తుంది.  

సరే ఈ జ్ఞానం మనకు ఎలా వస్తుంది? 

ఈ జ్ఞానం పొందే మార్గం ఏమిటో రాబోయే శ్లోకంలో భగవానుడు చెప్తున్నారు. 

తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా !
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వ దర్శినః !!

తత్వమును దర్శించన వారిదగ్గరకు చేరి జ్ఞానమును గ్రహించవలను. వారికి దండ ప్రణామములు సమర్పించి, సేవ చేసి, కపటం లేకుండా భక్తి శ్రద్ధలతో సముచిత రీతితో వారిని ప్రశ్నించి పరమాత్మ తత్వమును అనుభవ పూర్వకంగా నెరింగిన జ్ఞానులు సంప్రీతులై, నీకు ఆ పరమాత్మ తత్వమును ఉపదేశించెదరు. 

జ్ఞానులను సేవించుట అంటే వారు బాహ్యముగా పూజించటమే కాకుండా, వారు చూపించిన మార్గములో నడవాలి. వారు చెప్పిన సూత్రాలను పాటించాలి. భగవత్త్వత్వమును ఎరుగుటకు భక్తి శ్రద్ధలు సరళ స్వభావము చాలా అవసరము. ఇవి లేక పొతే జ్ఞానుల నుంచి ఆ జ్ఞానం పొందే అర్హత మనకు రాదు. ఇక్కడ నిజంగా గురువులు చేసేది మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలిగించడమే. అజ్ఞానం తొలిగిపోతే జ్ఞానం దానంతట అదే వ్యక్తం అవుతుంది. తత్వ జ్ఞానం కలిగితే మరల ఎట్టి వ్యామోహంలో చిక్కుకొనము. సమస్త ప్రాణులను నీలో సంపూర్ణంగా చూడగలవు. అప్పుడు సచ్చిదానంద ఘన పరమాత్ముడనైన నాలో చూడగలవు అని భగవానుడు చెప్పారు. అలానే జ్ఞాన నౌక సహాయంతో పాప సముద్రమునుండి నిస్సందేహంగా బయటపడగలవు అని గట్టిగా ఆశ్వాసన ఇస్తున్నారు. జ్ఞానమనే అగ్ని కర్మలన్నిటిని భస్మం చేస్తుంది అని కూడా భగవానుడు చెప్పారు. 

షిర్డి సాయినాధుడు పైన చెప్పిన శ్లోకం గురించి నానా చాందోర్కర్ ద్వారా మనందరికి బోధించిన సత్యం కూడా ఇదే. గురువులు అజ్ఞానాన్ని తొలిగిస్తారు అని చక్కగా చెప్పారు. ఎందుకంటే మనం స్వయంగా జ్ఞాన స్వరూపులము అని శాస్త్రాలు చెప్తాయి. అజ్ఞానమే మనకు పెద్ద అడ్డు. అది తొలిగించుకోవడానికే ఈ సాధన అంతా. 

మనము సాయి అష్టోత్తర శతనామావళిలో "హృదయ గ్రంథి భేదకాయ నమః" అని బాబాను పూజిస్తాము. ముండక ఉపనిషత్ కూడా ఈ విషయం చెప్తుంది. "భిద్యతే హృదయగ్రంధి: ఛిద్యంతే సర్వ సంశయా:" అంటే పరమాత్ముని సాక్ష్తాత్కారం అయిన వెంటనే హృదయ గ్రంథి విప్పుకొనును. మనలో జడమైన అజ్ఞాన జనితమైన ఆత్మాభిమానం వలన ఏర్పడిన సంశయములన్ని పటాపంచలైపోవును. 

అందుకే మనము మొట్ట మొదట చేయవలిసిన పని ఈ అజ్ఞానం తొలిగించగల పరమగురువులను ఆశ్రయించడమే. దీనికి కావలిసిన అర్హతను సంపాయించాల్సి ఉంటుంది. మనం ఆచరించే కర్మలన్ని భక్తితో జ్ఞానయుక్తంగా ఆచరించాలి. 




ఓం శ్రీ సాయి రామ్ !











No comments:

Post a Comment