బాబా కొంత కాలం షిర్డీలో ఉండి అదృశ్యం అవుతారు. తరువాత కొంతకాలం ఆయన
ఎక్కడఉన్నారో ఎవరికీ తెలియదు. ఔరంగాబాదు జిల్లాలోని ధూప్ అనే చిన్న గ్రామంలో చాంద్
పాటిల్ అనే భాగ్యశాలికి మొట్టమొదట కనిపిస్తారు. ఈ పాటిల్ తన గ్రామానికి అధికారి. చాంద్ పాటిల్ రెండునెలలుగా తప్పిపోయిన గుర్రాన్ని వెదుకుతూ ఉంటారు.
గుర్రం జీను భుజాన వేసుకొని దిగాలుగా వెనుతిరిగి వెళ్తున్నప్పుడు ఒక మామిడి చెట్టు
కింద బాబా కూర్చుని ఉంటారు. పాటిల్కు ఆ గుర్రం జాడ తెలిపి నిప్పు నీరు భూమిలో
నుంచి తెప్పించి ఆశ్యర్య పరుస్తారు.
తరువాత బాబాను తన ఇంటికి ఆహ్వానించి తీసుకువెళతారు. ఈ సన్నివేశం గురించి మనం ఎన్నో సార్లు చదువుకున్నాము. ఇక్కడ గుఱ్ఱం తప్పిపోవడం అంటే మన మనస్సు మన అధీనంలో లేకుండా పోయి మనం పరమాత్మకు దూరం అవడం. గురువు మన జీవితంలో ప్రవేశించితే వారు మనకు సరిఅయిన దారి చూపించితే మనస్సుని ఆధీనంలోకి తెచ్చుకోవడం తేలిక అవుతుంది. ఇక్కడ గుడ్డను నీటితో తడపడం అంటే మనలో ఉన్న రజోతమో గుణాలను పోగొట్టడం. అలానే నిప్పుతో పొగాకు వెలిగించటం అంటే మనలో జ్ఞాన జ్యోతిని వెలిగించడం. ఒక్క సారి ఈ జ్యోతి వెలిగితే ఇంక మనలో మార్పులు వస్తాయి. గురువుని హృదయ మందిరంలో పదిలంగా ప్రతిష్ట చేసుకోవాలి. అంటే మన ఇంటికి ఆహ్వానించాలి.
చాంద్
పాటిల్ భార్య మేనల్లుడి పెళ్లి కోసం బాబా పెళ్లిబృందంతో కలిసి షిర్డీ రెండోసారి
వస్తారు. వారు ఖండోబా ఆలయం దగ్గర దిగగానే మహల్సాపతి "రండి సాయి" అని
పిలుస్తారు. అప్పటి నుండి అందరు బాబాను సాయి సాయి అని పిలవడం మొదలు పెట్టారు.
మహల్సాపతి గారు ఎప్పటినుండో గురువు కోసం తపించిపోతూ ఉంటారు. సాయి రావడంతో అయన
జీవితంలోకి గురువు ప్రవేశించారు. తరువాత మసీదులో
నివాసం చేసుకొని షిర్డీలోనే ఉండిపోయారు. సాయి దేవీదాసు మరియు జానకి దాసులతో రోజు
ఆధ్యాత్మిక చర్చ చేసే వారు. గంగాఘీరు అనే మహానుభావుడు బాబాను ఒక రత్నంగా పొగిడారు.
బాబా
రహతా నుంచి బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలు తెచ్చి
పెంచారు. వామన్ తాత్యా ఇచ్చిన పచ్చి మట్టి కుండలతో రోజు వాటికి నీరు పొసే వారు.
తరువాత కాలంలో ఆ స్థలంలోనే సమాధిమందిరం కట్టడం జరిగింది. ఇక్కడ బాబా కాల్చని పచ్చి కుండలను వాడారు. రోజు నీరు పోసిన తరువాత వేప చెట్టు దగ్గర
బోర్లించుచుండిరి. అవి పచ్చివి అవడం చేత విరిగి ముక్కలగుచుండెడివి. మనం రోజు చేసే
పనులు మన మనస్సులో వాసనలుగా మిగలకుండా పచ్చి కుండలాగా ఏ రోజుకారోజు వదిలిపోవాలి.
ఇలా సాధన చేస్తే మన హృదయం ఒక సమాధి మందిరం అవుతుంది. అట్లా కాకుండా వాసనలతో ఆ
కుండను కాలిస్తే అది ఎన్నో జన్మలకు కారణం అవుతుంది.
తరువాత ఈ
అధ్యాయంలో వేపచెట్టు క్రింద పాదుకలు ప్రతిష్టంచడం చెప్పారు. అక్కల్కోట మహారాజ్
గారి భక్తుడు భాయి కృష్ణజీ అలీబాగ్ కర్ బాబాను పూజించి ఆరు నెలలు షిర్డీలో ఉంటారు.
దీని జ్ఞాపకార్ధం పాదుకలు చేయించి అక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది. గురు పాదుకలకు
పూజ చేస్తే మనకు తొందరగా జ్ఞానం ప్రసాదంగా లభిస్తుంది.
అందుకే శంకరాచార్యులవారు గురుపాదుకా స్తోత్రం మనకు ఇచ్చారు. గురు గీతలో కూడా
గురువు పాదాలలోనే సర్వ తీర్ధాలు ఉన్నాయి అని పరమశివుడు పార్వతి మాతతో చెప్పారు.
బాబా అందుకే దక్షిణామూర్తి లాగా కూర్చుని మనలను కరుణించారు. అప్పుడు బాబా పాదాలను
మన తలతో స్పృశించడానికి వీలవుతుంది. గురువు పాదాలనుంచి వచ్చే శక్తి మనలను చైతన్య
పరుస్తుంది.
మనం
గురువుని పూజించడానికి శ్రద్ధ సభూరిలు చాలా అవసరం. ఈ అధ్యాయంలో మొహియుద్దీన్ తంబోలి
తో బాబా కుస్తీ పట్టి ఓడిపోయి తన వేషధారణ మార్చుకున్నారు అని సతచరితలో చెప్పడం
జరిగింది. అలానే గంగాఘీరుకి కూడా కుస్తీలపై అభిమానం ఉండేది. ఆయనకూడా తరువాత
వైరాగ్యం పొంది ఆత్మా సాక్షాత్కారంకై పాటుపడ్డారు. ఒక సారి మనం భగవంతుడివైపు
తిరిగితే లేదా మన జీవితంలో గురువు తారసపడితే అప్పుడు మొదలవుతుంది మల్ల యుద్ధం.
మనలో ఉన్న అరిషడ్ వర్గాలతో, కామ క్రోధాలతో కుస్తీ మొదలవుతుంది. ఇక్కడ మనకు
వైరాగ్యం లేకపొతే మనలో మార్పు రాదు. అప్పటిదాకా ఉన్న అలవాట్లు మార్చుకొని సరి అయిన
దారిలో నడవడం కత్తిమీద సాము అవుతుంది. కాని గురువు అనే శక్తి మన దగ్గర ఉంటే
ఎటువంటి యుద్ధం అయినా గెలవవచ్చు.
బాబా
ఎవ్వరితోను తనంతట తాను మాట్లాడేవారు కాదు. ఎవరైనా అడిగితె సమాధానం ఇచ్చేవారు. రోజు
ఎక్కువ సేపు వేపచెట్టునీడలో ఉండేవారు. అప్పుడప్పుడు ఒక కాలువ ఒడ్డున ఉన్న
తుమ్మచెట్టు దగ్గర కూర్చునేవారు. ఆయన రాత్రుళ్ళు మసీదులో పడుకునేవారు. వారు చాలా
నిరాడంబరంగా ఉండే వారు. ఎప్పుడు భగవన్నామ స్మరణ చేసే వారు. బాబా భక్తి పాటలు పాడే
వారు. అలానే కాళ్లకు చిన్న గజ్జెలు కట్టుకొని చక్కగా నాట్యం చేసే వారు. ఇలా ఆయన
లీలలకు అంతే లేదు.
బాబా
ఒకసారి నీటితో దీపాలను వెలిగించి
షిర్డీవాసులను అబ్బురపరిచారు. నూనె అడిగితె ఇవ్వని వర్తకులు పశ్చాత్తాప పడి బాబాని
మన్నింపమని కోరారు. ఇక్కడ బాబా అడిగినది నూనె, అంటే వైరాగ్యం. మనము బాబా పట్ల
శ్రద్ధ సభూరిలతో ఉంటే అప్పుడు ఆయన ఈ వైరాగ్యాన్ని ఎదో
విధంగా కలుగచేసి ఈ జ్ఞాన జ్యోతిని వెలిగిస్తారు. ఇదే
విషయం కాకడ మరియు సెజ్ ఆరతులలో చెప్పారు. ఇక్కడ వర్తకులకు
అంటే మన అందరికి సత్యం పలకమని బోధించారు.
ఇక
చివరిగా ఈ అధ్యాయంలో జవహర్ అలీ అనే అతను కొంతమంది శిష్యులతో షిర్డీ వస్తారు. ఆయన
బాబా కూడా తనకు శిష్యుడు అని చెప్తారు. బాబా పరమగురువు ఐనప్పటికి ఒక శిష్యుడులాగా
ఆయనను సేవిస్తారు. శిష్య ధర్మాన్ని ఎలా చేయాలో చేసి చూపించారు. ఇక్కడ జవహర్ అలీ
నిమిత్తమాత్రుడు. ఆయనను ఒక కపట గురువుగా చెప్పడం
జరిగింది. కాని ఆయన బాబా చేసిన లీలలో ఒక భాగం అయ్యారు. మనకు కొంచెం తెలియగానే మనకు అంతా తెలిసినట్లే ప్రవర్తిస్తాము. అలానే ఈ
జవహర్ అలీ కూడా. ఆధ్యాత్మిక సాధనలో ఎంత తెలిసినా ఇంకా తెలుసుకోవాల్సినది ఉంటుంది.
సహనం ఓర్పు చాలా అవసరం. ఇవి నేర్పించేందుకే ఈ ఘట్టం ఇక్కడ చెప్పబడింది. బాబా మనకు
ఆ శక్తిని ఇవ్వాలి అని కోరుకుందాము.
ఓం శ్రీ
సద్గురు సాయినాథార్పణ మస్తు!
No comments:
Post a Comment