ప్రతిఒక్క
భక్తుని హృదయం షిర్డి అని మనం చెప్పుకోవచ్చు. సత్చరిత ఐదవ అధ్యాయంలో బాబా షిరిడీ
ఆగమనం గురించి తెలుసుకున్నాము అంటే గురువు మన హృదయమనే షిర్డీలో ఉంటేనే ఆ షిర్డీకి
ప్రాముఖ్యత. ఆయనను మన హృదయపీఠంలో ప్రతిష్టించుకుంటే మనలో తప్పకుండా మార్పులు
వస్తాయి. ఇప్పుడు ఆరవ అధ్యాయంలో గురు స్పర్శతో ఆ మార్పులు ఎలా సంభవిస్తాయి, మనం మన
జీవితంలో ఎటువంటి మార్పులు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలో కూడా బాబా చెప్పారు.
పైకి మాత్రం ఉర్సు ఉత్సవము, చందన ఉత్సవము మరియు శ్రీరామ నవమి ఉత్సవాల గురించి
చెప్పిన వీటిల్లో చాలా పరమార్ధం ఉంది. వీటన్నటిలో బాబా మనకు ఏమి నేర్పిస్తున్నారో
పరిశీలిద్దాము. మొట్టమొదట ఈ అధ్యాయంలో చాలా వేదాంత విషయాలు చెప్పారు. అవన్నీ
సందర్భాన్ని బట్టి చెప్పుకుందాము.
బాబాకు
మనం రోజు పూజ చేసుకుంటాము. ఆయన భక్తిలో చాలామంది పరవశం పొందుతారు. అలాంటి పరవశమే
ఇప్పుడు మన అందరమూ పొంద ప్రయత్నిద్దాము. బాబా ఆరతి అయిన తరువాత ద్వారకామాయి అరుగు
మీద కూర్చొని ఒక్కొక్కరికి నుదిటిన ఊది పెట్టి ఆశీర్వదించి పంపుతారు. ఒక్కసారి మనం
కూడా ఆ అనుభూతిని పొందుదాము. ఇప్పుడే ఆరతి అయిపొయింది. మనమందరము ఒక వరుసలో బాబా
ఆశీర్వదంకోసం తపిస్తూ ముందుకు నడుస్తున్నాము. బాబా దివ్యమంగళ రూపం మనకు కనిపిస్తుంది. ఆయన పొడవాటి తెల్లని కఫ్ని ధరించి ఉన్నారు. తలపై ఒక తెల్లటి గుడ్డను చుట్టి దాని అంచులు జడవలె
మెలిబెట్టి ముడివేసి ఎడమ చెవుమీదగా వెనుకకు వేలాడుతూ ఉంది. బాబా వెనక ద్వారకామాయిలో ఉన్న ధుని మంట కనపడుతుంది. ఆ ధుని వెలుతురు బాబా తల
వెనక ఒక కాంతిపుంజంలాగా కనపడుతూ ఉంది. వెనుక గోడ దగ్గర ఉన్న గూడు, పూల మాలలతో ఉన్న
నింబారు బాబా యొక్క నిర్గుణ స్వరూపాన్ని గుర్తుచేస్తుంది. ఇంతలోనే బాబా ఎదురుగా
చేరుకున్నాము. ఆయన దగ్గరకు వెళ్ళగానే ఎదో తెలియని అనుభూతి. అలానే మనసులో నా
తండ్రిని చూస్తున్నాను, ఆయన ఆశీర్వాదాన్ని పొందబోతున్నాను అనే ఉత్కంఠ. అంతలో బాబా
కుడిచెయ్యి పైకి లేచింది. నా కళ్ళు మూతలు పడ్డాయి. ఊది నుదిటిపై పెట్టి బాబా తన
చేతిని నా తలపై ఉంచారు. నా మనస్సు సంతోషంతో నిండిపోయి, కండ్లనిండా ప్రేమ
పొంగిపోయింది. ఈ ఆనందానికి అవధులు లేవు. నా గురువు నా హృదయంలోనే ఉన్నారు అన్న భావన
అధికం అయింది. నేను నీవు అన్న భావన ఈ స్పర్శతో నశించింది. సాయియే సర్వం
అనిపించింది. అంతా సాయి మయం, ఎదో ఎప్పుడు లేని అనుభూతి. సాయే శ్రీరాముడు,
శ్రీకృష్ణుడు, పరమ శివుడు. సాయే సర్వదేవతా స్వరూపము. సాయే నిర్గుణము. ఈ అనుభూతి
ఎప్పుడూ ఇలాగే ఉండిపోతే బాగుంటుంది అని మనసులో ఆరాటం. హేమద్పంత్ గారు గురు కర
స్పర్శ ప్రభావం గురించి
మనకు కళ్ళకు కట్టినట్లు చూపించి అందులో ఉన్న పరమార్ధాన్ని తెలిపారు. ఈ అనుభవం
బ్రహ్మైక్య భావనతో సమానమైనదిగా చెప్పారు.
ఈ
అధ్యాయంలో బాబా మనకు కొన్ని సూచనలు కూడా ఇచ్చారు. అవి చివరలో తెలుసుకుందాము.
గోపాలరావు గుండ్ అనే పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్కు పిల్లలులేక బాబా దగ్గరకు
వస్తారు. ఆయనకు మగ బిడ్డ పుడతాడు. అప్పుడు ఆయన శ్రీరామ నవమి రోజున ఉర్సు ఉత్సవము
చెయ్యాలి అని 1897 లో బాబా ఆశీర్వాదాన్ని పొందుతారు. ఈ ఉత్సవానికి చాలా మంది వస్తే
నీటి కొరతను ఎలా తీర్చాలి అనే సందేహం అందరిలో ఉంది. అప్పుడు షిర్డీలో రెండే నీటి
బావులు ఉండేవి. ఒకటి పూర్తిగా ఎండిపోయి ఉంటుంది. ఒకదానిలో ఉప్పు నీరు ఉంటుంది.
బాబా కొన్ని పూలు తీసుకొని ఉప్పు నీరు ఉన్న బావిలో వేశారు. అవి మంచి నీరుగా
మారినవి. అలానే నీరులేని బావిలో నీరు పుష్కలంగా వచ్చింది. ఇలా బాబా లీలలను మనం
చదువుకున్నాము. మనందరికి ఇలాంటి ఉత్సవాలు జరుపుకోవాలని ఉంటుంది. కాని ఒక్కోసారి మన
మనస్సులో భక్తి అనే నీరు ఉండదు. ఒక వేళ నీరు ఉన్నా, అంటే భక్తి ఉన్నా కామ క్రోధ మద
మాత్సర్యాలనే ఉప్పు నీరు అడ్డు పడుతూ ఉంటుంది. అందుకే ఎల్లప్పుడూ శ్రద్ధ సభూరిలతో
బాబా అనుగ్రహాన్ని కోరుకోవాలి. అప్పుడు బాబా మనలో ఉన్న ఈ అవగుణాలను తొలిగిస్తారు.
తరువాత కథలో దాము అన్నా కూడా ఈ ఉత్సవాల్లో భాగమై రెండు జండాలు తయారు చేపిస్తారు.
ఉర్సు మరియు చందన ఉత్సవాలు 1897 నుంచి 1911 వరకు
జరుగుతూ ఉన్నాయి. అప్పుడు కృష్ణారావు జోగీశ్వర భీష్మ గారికి అదే రోజు శ్రీరామనవమి
ఉత్సవం కూడా జరుపుకుంటే బాగుంటుంది అని మనసులో అనిపించింది. తరువాత బాబా అనుమతితో
ఈ ఉత్సవం కూడా భక్తులు జరుపుకోవడం మొదలు పెట్టారు.
రాధాకృష్ణమాయి
చొరవతో షిర్డీ ఒక సంస్థానంగా రూపుదిద్దుకొన్నది. శ్రీరామనవమి కోసమని ఆమె ఒక ఊయలను ద్వారకామాయికి పంపినది. ప్రజలు అందరు ఉత్సాహంతో
జయ జయ ధ్వనులు చేస్తూ ఎర్ర రంగు పొడిని చల్లుకుంటూ ఉండగా ఆ పొడి కొంచెం బాబా
కళ్ళలో పడింది. అంతలో బాబా కోపముతో అందరిని తిట్టడం ప్రారంభించారు. కొందరు బయపడి పారిపోయారు. కొందరు ఆ తిట్లు ఆశీర్వాదంగా భావించారు.
ఏదైనా కొత్తవి మొదలుపెట్టినప్పుడు బాబా ఇలా కోపగించడం గురించి సత్చరిత మనకు
చెప్తుంది. మనం అర్ధం చేసుకోవాల్సిన ముఖ్య విషయం ఉంది ఇక్కడ. మనం ఒక్కో సారి
ఆర్భాటాలకు పోయి అసలు భక్తి అనే విషయాన్ని మర్చిపోతూ ఉంటాము. ఇది గుర్తు చేయడమే
బాబా ఉద్దేశ్యం అయిఉండవచ్చు. అలానే మసీద్ మరమ్మత్తులు చేపించే సందర్భంలో తాత్యా
తలపాగాను మంటలో వేసి ఆయన గొంతుని పట్టుకుంటారు. తరువాత ఆయనే ఒక నగిషీ చెక్కిన
తలపాగాను తెప్పించి తాత్యా తలకు చుడతారు. మన అందరకు మంచి పనులు చేయాలని, దైవ
కార్యాలలో పాల్గోవాలని మంచి సంకల్పం ఉంటుంది. కాని మనలోని పూర్వ వాసనలు అహంకారమై
మన తలలోనే ఉంటాయి. ఇదే మనం చుట్టుకొనే తలపాగా. ఈ అహంకారమనే తలపాగా బాబా తీసి
జ్ఞానమనే ధునిలో వేస్తె కాని మనలో ఉన్న అహంకారం పోదు. మనం చేయాల్సింది ఏమిటి అంటే
తాత్యా ప్రేమించినట్లు బాబాను ప్రేమించాలి, బాబాకు దగ్గర అవ్వాలి. ఆయన చెప్పిన
మార్గంలో నడవాలి. అప్పుడే ఆయన మన తలపాగాను కూడా తీసి వేస్తారు.
మనలో
ఉన్న ఈ అహంకారం పోగొట్టుకోవాలి అంటే మనం ఏమి
చేయాలి? మనం బాబాకు ఎలా దగ్గర అవ్వాలో అన్న విషయాలు ఈ అధ్యాయం మొదట్లో బాబా
స్వయంగా చెప్పారు. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాము. వాటిని మన జీవితంలో భాగంగా
చేసుకుందాము. ఇవి అనుసరించడం కష్టమే మనం అనుకోవచ్చు. ఒక లక్ష్యం పొందాలి అంటే సాధన
కావాలి, వైరాగ్యం ఉండాలి.
బాబా
చెప్పిన అనుగ్రహ వాక్యాలను హేమద్పంత్ ఈ అధ్యాయంలో మొట్టమొదట పొందుపరచారు.
నా
భక్తుని ఇంట్లో అన్న వస్త్రములకు ఎప్పుడూ లోటుండదు. నా యందె భక్తిశ్రద్ధలతో మనస్సు
నిలిపిన వారి యోగక్షేమములు నేను చూచెదను. కావున వీటికొరకు ప్రయాస పడవద్దు.
ప్రపంచములో
కీర్తిప్రతిష్టలకోసం ప్రాకులాడుట మాని దైవము యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు,
భగవంతుని కరుణా కటాక్షములు పొందుటకు యత్నించుము. ప్రపంచ గౌరవమందుకొను బ్రమను
వీడుము.
లోకులు
గౌరవించినంత మాత్రాన తనను తాను మర్చిపోవాలా? ఆరాధ్య మూర్తి యొక్క అంతఃకరణం కరుణతో
కరిగిపోయి చెమటలు పట్టాలి. ఈ ధ్యేయం మీదే ప్రీతి కలగాలి.
సర్వేంద్రియాలకు
భక్తి పిచ్చి పట్టాలి. ఇంద్రియవికారాలు భక్తివైపు మొగ్గాలి. ఇతర విషయాలపై
ప్రీతిలేకుండా ఎల్లప్పుడూ మనసులో భజన జరగాలి.
మనస్సు
నందు ఇష్టదైవము యొక్క ఆకారమును నిలుపుము. సమస్త ఇంద్రియములను భగవంతుని ఆరాధనకు
నియమించుము. ఇతర విషయములపైకి మనసుని పోనివ్వకము.
మనసు
అన్నిటిని మర్చిపోయేలా నామస్మరణ యందు లగ్నం చెయ్యాలి. అప్పుడు శరీరం, గృహం, ధనం
అవేవి గుర్తు ఉండవు. సత్సంగం చేసిన ఫలితంగా చిత్తవృత్తి శాంతించాలి. చిత్తం
పరమానందంతో ప్రశాంతతను పొందుతుంది.
ఇలా బాబా
మనకు సాధనలో ఉపయోగపడే చాలా విషయాలు ఈ అధ్యాయంలో చెప్పారు. మనం ఆధ్యాత్మిక పధంలో
ఎదగాలి అంటే ఇవి పాటించక తప్పదు. బాబా పై నాకు భక్తి ఉంది అంటే సరిపోదు. ఆయన
చెప్పిన సూచనలను తప్పకుండా పాటించాలి. అప్పుడే మనము నిజమైన సాయి భక్తులుగా
ఎదగగలుగుతాము. సాయికి నిజంగా దగ్గర అవ్వగలుగుతాము.
శ్రీ
సద్గురు సాయినాథార్పణమస్తు!
No comments:
Post a Comment