In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, November 15, 2017

శ్రీ సాయి సత్చరిత అధ్యాయం - 7



సాయి సర్వాంతర్యామి. వారు పరమగురువులు. భక్తుల హృదయాలలో ఏముందో తెలుసుకోవడమే కాకుండా వారి పూర్వ జన్మ వాసనలను బట్టి వారికి ఏమి చేస్తే మంచిదో అది మాత్రమే చేసే వారు. బాబా భక్తుల జీవితంలో ఒక భాగమై వారి జీవితంలో వచ్చే ఒడిదుడుకులను సరిదిద్దేవారు.  మనం చాలా మంది గురువులగురించి చదువుకున్నాము. బాబాను ఒక సాంప్రదాయానికి, ఒక మతానికి ముడివేసి చెప్పలేము. పరమాత్మకు మతం లేదు. ఒక పరిమితి లేదు. కొందరు బాబా ముస్లిమా లేక హిందువా అనే సందేహం వ్యక్తపరుస్తారు. ఆత్మతత్వంలో ఉండే యతీంద్రులకు శరీర భావనే లేకపోతే ఇంక మతమెక్కడ, సంప్రదాయమెక్కడ. బాబా దేవుడా కాదా అనే ప్రశ్న చాలామంది వేస్తుంటారు. మన ఉపనిషత్తులు పరమాత్మ తత్వాన్ని బోధిస్తాయి. అంతా ఒక్కటే అయినప్పుడు ఈ బేధభావాలు ఎందుకు? ఇదే విషయాలను హేమద్పంత్ గారు ఈ అధ్యాయం మొదట్లో చక్కగా విశదీకరించారు. అందుకే బాబా అష్టోత్తరంలో సమ సర్వమత సమ్మతాయ నమః అని మనము చదువుకుంటాము. బాబా అల్లాహ్ మాలిక్ అని ఎప్పుడు భగవన్నామ స్మరణ చేసే వారు. నిత్యా అగ్నిహోత్రం ధుని రూపంలో రోజు వెలుగుతూ ఉండేది. సర్వ మతాల సారం ఒక్కటే అని బోధించేవారు. షిర్డీ గ్రామంలో శని, గణపతి, పార్వతి-శంకర, గ్రామ దేవత, మారుతి మొదలగు దేవాలయాలను తాత్యాపాటీలు ద్వారా ఉద్ధరించడం జరిగింది. బాబా చాలా నిరాడంబర జీవనం గడిపారు. రోజు ఎంత ధనం దక్షిణ రూపంలో వచ్చినా కాని చివరికి ఏమి మిగిలేది కాదు. ఆ ధనమంతా అందరికి పంచేసే వారు. బాబా దగ్గరకు వచ్చిన వారికి వారి కర్మానుసారంగా కోరికలను తీర్చే వారు.

బాబా ఎల్లపుడు ఆత్మా స్థితిలో ఉండే వారు. ఒక్కొక్కప్పుడు శరీర స్పృహ లేకుండా ధుని దగ్గరే కూర్చుండిపోయే వారు. కొన్నిసార్లు సరదాగా అందరిని ఆటపట్టించే వారు. మొట్టమొదటలో రోగులను పరీక్షించి ఔషదములు ఇచ్చేవారు. మనకు యోగ శాస్త్రంలో ఉన్న ప్రక్రియలన్నింటిలో అసాధారణమైన ఖండ యోగం చేసే వారు. వారి శరీరాన్ని ముక్కలుగా చేసి మరల వాటిని దగ్గరకు చేర్చే వారు అని సత్చరిత మనకు చెప్తుంది. అలానే ధౌతి ప్రక్రియలో భాగంగా బాబా తన ప్రేగులను బయటకు తెచ్చి కడిగి ఆరవేసే వారు అని చెప్తారు. ఇవన్ని ఎంతో అసమానమైన యోగ ప్రక్రియలు. పతంజలి యోగ శాస్త్రంలో ఎన్నో యోగ శక్తుల గురించి చెప్తారు. బాబా తన భక్తులను రక్షించడానికి మాత్రమే తన శక్తులను వాడే వారు. అయినా వారు సామాన్య మైన ఫకీరులాగా వ్యవహరించేవారు. తాను ఏమి చేయనట్టు, అంతా భగవంతుని లీలగా చెప్పే వారు.
  
బాబా తన భక్తులు ఎక్కడ ఉన్నా వారిని కష్టాలనుంచి రక్షించేవారు. ఒకరిని రక్షిస్తే, ఇంకొకరిని కర్మానుసారంగా వచ్చిన పాపాన్ని పోగొట్టడానికి సేవ చేయనిచ్చేవారు. ఒక సారి 1910 వ సంవత్సరంలో దీపావళి పండగ ముందురోజున ధునిలో కట్టెలు వేస్తూ తన చేతిని మంటలో ఉంచుతారు. మంటకు చేయి కాలుతూ ఉంటె మాధవుడనే అతను మరియు శ్యామా బాబా చేతిని బయటకు లాగుతారు. ఇదంతా ఒక కుమ్మరి భక్తుని బిడ్డ కొలిమిలో పడబోతు ఉంటె కాపాడే సందర్భం. ఆయన చేయి కాలకుండా కూడా ఆ బిడ్డను రక్షించవచ్చు కాని అలా చేయలేదు. ఇక్కడ కర్మను తీసే వేసి తన శరీరం దాన్ని తీసుకునేటట్లు చేశారు అని మనము చెప్పుకోవచ్చు. బాబాకే ఆ సత్యం తెలియాలి. కాలిన చేతికి చికిత్స చేయించుకోకుండా భాగోజితో సేవ చేయించుకున్నారు. నానా తీసుకువచ్చిన పరమానంద్ అనే డాక్టరుకు చికిత్స చేసే అవకాశం ఇవ్వలేదు. ఇక్కడ పరమానంద అనే పేరు ఆత్మ స్థితి
అని కూడా చెప్పుకోవచ్చు. బాబా ఎందరికో వారి వారి జబ్బులను నయం చేశారు. ఆయన శక్తి ముందు ఈ కాలిన గాయం ఒక లెక్క కాదు. ఇక్కడ ఒకరిని రక్షించి వారి నమ్మకాన్ని పెంచాలి. అలానే భాగోజి పూర్వకర్మలు పోగొట్టే గురు సేవను చేయనివ్వాలి. అలానే నానా చందోర్కరుకు పరమార్ధం బోధపడేటట్లు చేయాలి. నానాకు గురువుమీద ప్రేమ ఉంది. అందుకే ఒక పెద్ద పేరుమోసిన డాక్టర్నువెంటపెట్టుకొని వచ్చాడు. ఇక్కడ కర్మ సిద్ధాంతాన్ని బోధించే ప్రయత్నం చేసారు బాబా. మన అందరం కూడా ఒక్కో సారి గురువులను మామూలు మనుషులు లాగా చూస్తాము. ఇక్కడే వారి తత్వాన్ని అర్ధం చేసుకోవాలి. ఖాపర్డే కొడుకుకి వచ్చిన ప్లేగు జ్వరాన్ని తాను తీసుకొని వారికి ఉపశమనం కలిగిస్తారు. ఇలా బాబా మన అందరి జీవితాలలో కూడా అనేక లీలలు చూపిస్తూ ఉంటారు.

ఇలా కర్మలు తీసుకోవడమే కాకుండా మన జీవితంలో రోజు జరిగే సుఖ దుఃఖాలలో నేను ఉన్నాను అని నిరూపిస్తూ ఉంటారు. నానా చందోర్కర్ మామల్తదారుగా నందూరుబారులో పనిచేస్తూ ఉండగా ఆయనకు పండరీపురం బదిలీ అవుతుంది. పండరీపురం అంటే భగవంతుని ధామము. అటువంటి పవిత్ర స్థలంలో ఉండటం అంటే పూర్వ జన్మ పుణ్యము అని అక్కడి వారు భావిస్తారు. నానా అక్కడకు వెళ్లే ముందు బాబా ఆశీర్వాదం తీసుకునేందుకు షిర్డీ ప్రయాణం కడతాడు. అప్పటికే షిర్డీలో బాబా మసీదులో కూర్చొని అక్కడ ఉన్న వారితో కలిసి పండరి పోవాలి. అక్కడే ఉండాలి. అదే నా ప్రభువు నిజ ధామము అని పాట పాడుతూ ఉంటారు. అక్కడి వారికి బాబా ఈ పాట ఎందుకు పాడుతున్నారో నానా వచ్చిన తరువాత కాని అర్ధం కాలేదు. బాబా సర్వజ్ఞులు. మనకు ఏది మంచిదో ఆయనకు తెలుసు. మనం చేయవలిసిందల్లా ఆయనను నమ్మడం. కష్టం వచ్చినా సుఖం వచ్చినా బాబాను మాత్రం మర్చిపోకూడదు. ఆయన ఎప్పుడు మన పక్కనే ఉన్నారు అన్న సత్యాన్ని మరువకూడదు.


శ్రీ సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు !



No comments:

Post a Comment