In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, November 29, 2017

శ్రీ సాయి సత్చరిత అధ్యాయం - 9



ఈ అధ్యాయంలో షిర్డీకి వచ్చిన యాత్రికులు బాబా అనుమతి లేకుండా వెళ్తే పడిన కష్టాలు, అలానే ఒక సారి ఆజ్ఞ అయిన తరువాత షిర్డీలో ఒక్క క్షణం ఉన్నా కలిగే ఇబ్బందుల గురించి హేమద్పంత్ చెప్పడం జరిగింది. ఇలా చాలామందికి అనుభవపూర్వకంగా తెలియడం మూలానా బాబా ఆజ్ఞను తప్పకుండా పాటించేవారు. రొట్టె తినివెళ్లండని బాబా చెప్పగా ఎవరైనా తినకుండా వెళ్తే వారికి బండి దొరకక ఉపవాసంతో మాడిపోయేవారు. దీనిని అనేకమంది భక్తులు గ్రహించారు. ఒక సారి తాత్యా కోతే పాటిల్ కోపర్గాంలో ప్రతివారం జరిగే సంతకు బయల్దేరి మసీదుకు వచ్చాడు. టాంగాను బయట నిలిపి బాబా దర్శనం చేసుకొని బాబా అనుమతిని తీసుకునే వంకతో వెళ్లివస్తానంటూ బాబాకు వందనం చేసాడు. తాత్యా తొందరపాటును చూసి కొంచెం ఆగు అని అన్నారు.

అవసరమైతే శ్యామాను వెంట తీసుకువెళ్ళు అని చెప్పారు. కాని తాత్యా ఒంటరిగానే వెళ్లి నడుము పట్టేట్లు చేసుకున్నాడు. ఇంకోసారి ఇలానే బాబా వద్దన్నా వెళ్లి టాంగా ప్రమాదంలో ఇరుక్కుంటాడు. ఇలాంటి సంఘటనే ఒక ఐరోపా దేశస్థుడుకి కూడా జరుగుతుంది.  ఆయన బాబా దగ్గరకు వచ్చి పాదాలకు వందనం చేసుకోవాలని అనుకుంటాడు. కాని ఆయనను ద్వారకామాయి మెట్లు ఎక్కనివ్వరు. బయటనుంచి దర్శనం చేసుకోమంటారు. అతను తిరిగివెళ్ళడానికి నిశ్చయించుకొని అనుకోగా, బాబా ఇప్పుడు వద్దు అని చెప్తారు. ఆయన వినకుండా బయలుదేరతారు. తరువాత ఆయన టాంగా పట్టుతప్పి దెబ్బలతో ఆసుపత్రి పాలవుతారు.  ఇలా లెక్కలేనన్ని అనుభవాలు కలుగగా ఎవరుకూడా బాబా మాట జవదాటడానికి సంకోచించేవారు.  బాబా ఆజ్ఞను శిరసావహించినవారు, వేళకాని వేళా కూడా రైలును అందుకొని సుఖంగా ప్రయాణం చేసి దానిని జీవితాంతం గుర్తు ఉంచుకొనే వారు. 


తరువాత హేమద్పంత్ గారు బాబా భిక్షావృత్తిని సంవత్సారాల తరబడి ఎందుకు చేసేవారు అన్న విషయం గురించి చెప్పారు. గృహస్థులుగా ఉన్నవారు అన్నం వండుకొని మొట్టమొదటగా యతులకు, బ్రహ్మచారులకు భోజనం పెట్టాలి. అప్పుడు మాత్రమే వారు స్వీకరించాలి. బాబా గృహస్థులు కారు. వారు ఒక ఫకీరులా జీవనం సాగించారు. ఈషణ త్రయాలు లేనివారు భిక్షకు అర్హులు. ఈషణ త్ర్యయం అంటే సంతానం పైన, ధనం పైన మరియు లోకంపైనా ఉన్న మోహాలు. ఈ మోహాలే మనలను బాధలకు గురిచేస్తాయి.  మనం ఆహరం తయారు చేసేటప్పుడు చాలా ప్రాణులు చనిపోతాయి. చాలామంది కష్టపడితే కాని ఈ ఆహారం మన దాకా రాలేదు. ఈ రకంగా వచ్చే పాపాలను పంచ సూనాలు అంటారు. వీటినుంచి తప్పించుకోవాలి అంటే మనం పంచ మహా యజ్ఞాలు అనేవి చేయాలి. ఈ పంచమహాయజ్ఞాలలో ఒకటి అయిన అతిధి యజ్ఞం భిక్ష ద్వారా బాబా చేయించారు. బాబా ఐదు ఇళ్లలో రోజు భిక్ష తీసుకొనే వారు. అలానే దక్షిణ రూపంలో అందరి దగ్గరినుంచి పాపాలను పోగెట్టే వారు. ఇలా ఇంటి దిగారు ఉండి బాబాకు భిక్ష ఇచ్చినవారు ఎంతో పుణ్యాత్ములు.  ఈ ఆహరం మనం స్వీకరించే ముందు భగవంతునికి సమర్పించడం కూడా అందుకే. అలా సమ్పర్పిస్తే దాని ద్వారా వచ్చే పంచ సూనాల నుంచి మనం విముక్తి పొందుతాము అని బాబా మనకు నేర్పిస్తున్నారు. 



ఇప్పుడు పంచమహా యజ్ఞాలు ఏమిటో చూద్దాము. 


బ్రహ్మ యజ్ఞము - వేదాలను, మన శాస్త్రాలను పారాయణ చేయడమే బ్రహ్మ యజ్ఞము. 


పితృ యజ్ఞము - పితృ దేవతలకు ఇచ్చే ప్రసాదం. 


దేవ  యజ్ఞము - దేవతలకు నైవేద్యం  ఇవ్వడం. 


భూత యజ్ఞము - సర్వ జీవులకు ఆహరం సమర్పించడం.  


అతిధి యజ్ఞము - మనం ఆహ్వానించని అతిధులకు ఆహరం పెట్టడం.  


మనం దేవుడికి సమర్పించేవి నిజంగా దేవుడు తీసుకుంటాడా అని కొంతమందికి సందేహం ఉండచ్చు. బాబా ఎన్నోసార్లు తనకు సమర్పించినవి స్వీకరించినట్లు చూపించడం జరిగింది. మనసులో కేవలం ప్రేమ ఉంటే చాలు. ఎవరితోనైనా బాబాకు ఏదైనా పంపితే, తెచ్చినవారు మర్చిపోయినా బాబా అడగడం మర్చిపోయేవారు కారు. రొట్టె, కూర, పాలకోవా కాని దృఢమైన భక్తితో ఇవ్వాలి. అలాంటి భక్తులు తటస్థ పడితే బాబాకు ప్రేమ ఉప్పొంగేది. అలాంటి కుటుంబం గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాము. బాబా సాహెబ్ తర్ఖడ్ బాబాను అమితంగా ప్రేమించేవాడు. అతను బాబా యొక్క చిత్రపటాన్ని చందన మండపంలో ఉంచి రోజూ త్రికాల పూజలు చేసేవాడు. రోజు నైవేద్యం ఉంచేవాడు. ఒకసారి తన తల్లితో కలిసి షిర్డీ రావాల్సి వస్తుంది. తండ్రి బాబాకు పూజ చేసి నైవేద్యం పెడతాను అని భరోసా ఇస్తే అప్పుడు షిర్డీకి వెళ్తాడు. తండ్రి చక్కగా పూజ చేసి నైవేద్యం పెట్టేవాడు కాని ఒక రోజు నైవేద్యం పెట్టడం మర్చిపోతాడు. తన తప్పు తెలుసుకొని బాబాను క్షమించమని కోరతాడు. తరువాత తన కొడుకుకి ఉత్తరం రాస్తారు.


అదే సమయానికి బాబా తన తల్లితో ఇలా అంటారు. "తల్లీ ! ప్రతిరోజులాగే నేను ఈ రోజూ బాంద్రాకు వెళ్ళాను. తినడానికి త్రాగడానికి ఏమి లేక నేను ఉపవాసంతో తిరిగిరావాల్సి వచ్చింది" అని బాబా అంటే కొడుకుకి ఎదో తప్పు జరిగిపోయిందని అర్ధం అయ్యింది. వెంటనే బాబా అన్న మాటలను ఉత్తరం రూపంలో తన తండ్రికి రాసాడు. ఇలా ఇద్దరి ఉత్తరాలు ఒకరినొకరికి చేరాయి. కొడుకు వెంటనే వెళ్లి మళ్ళి ఈ తప్పు జరగకుండా చూసుకోవాలి అనుకున్నాడు. కాని బాబా షిర్డీలోనే ఉండి పూజ చేయమన్నారు. అలానే తన తల్లి కూడా ఒక రోజు ఆకలిగొన్న కుక్కకు, పందికి రొట్టె ముక్క పెడుతుంది. బాబా అప్పుడు ఆమెను చూసి ఎలా అన్నారు. "అమ్మా! ఈ రోజు నువ్వు నాకు తిండి పెట్టావు. కడుపు నిండింది, గొంతువరకు తిన్నాను. రోజూ ఇలాగే చేస్తూ ఉండు. నిజంగా పనికి వచ్చేది ఇదే అని చెప్పారు.  ఆమెకు మొట్టమొదట ఏమి అర్ధం కాదు. నేనేంటి బాబాకు అన్నం పెట్టడం ఏమిటి అని అనుకుంటుంది. అప్పుడు బాబా కుక్కకు రొట్టె పెట్టిన సంగతి గుర్తు చేస్తారు. ఇదే భూత యజ్ఞము. 
  
 బాబా ఎప్పుడు తన భక్తుల అభిష్టం మేరకు అన్ని చేస్తారు. వారు ఎలా కోరుకుంటే అలా చేసి చూపిస్తారు. ఈ అధ్యాయంలో వంకాయ వేపుడు తినాలి అని బాబా అడిగి భక్తురాలి కోరికను తీరుస్తారు. తర్ఖడ్ భార్య గోవిందజీ అనే అబ్బాయితో పాలకోవా పంపిస్తుంది. కాని ఆ అబ్బాయి మర్చిపోయినా బాబా అడిగి మరి తీసుకుంటారు. 

మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం బాబా సర్వజ్ఞులు. ఎవరిమనసులో ఏ భావం ఉంటె దానికి అనుగుణంగా అనుభవాలు కలుగచేసి భక్తుల గౌరవాన్ని నిలబెట్టేవారు అని హేమద్పంత్ చెప్తారు. సర్వ జీవులలోను భగవంతుడిని చూడాలి అని బాబా మనకు నేర్పిస్తున్నారు.  ఇదే సర్వమతాలు బోధించే సత్యం. మనం సమర్పించే నైవేద్యం తప్పకుండా బాబా స్వీకరిస్తారు అని గ్రహించాలి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటి అంటే; బాబా సర్వాంతర్యామి. ఎలాగైతే ఒక జీవి స్వీకరిస్తే తాను తీసుకున్నట్లు బాబా చెప్తారో, అలానే బాబాకి నైవేద్యం ఇస్తే సర్వ జీవులకు అన్నం పెట్టినట్లే అని మనం తెలుసుకోవాలి. కేవలం మన కోరికల కోసమే నైవేద్యం పెట్టడం కాకుండా అన్ని జీవులకు ఆహరం బాబా ఇవ్వాలి అని మనం కోరుకోవాలి. 

  




 శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు !



No comments:

Post a Comment