జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య
చ !
తస్మాదపరిహార్యేర్ధే న త్వం శోచితుమర్హసి !!
పుట్టిన వానికి మరణము తప్పదు. మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. కనుక అపరిహార్యములైన ఈ విషయములందు నీవు శోకింపతగదు.
ఇక్కడ భగవానుడు వాస్తవిక సిద్ధాంతము గురించి మాత్రమే చెప్పుట లేదు.
పుట్టిన వారు చనిపోతారు అని మన అందరకు తెలిసిన విషయమే. కాని మరణించిన వారు మరల పుడతారు
అన్న విషయం విశ్వసించుట ఎట్లు? హిందువులుగా మనము కర్మ సిద్ధాంతాన్ని, పునర్జన్మని
నమ్ముతాము కాబట్టి ఈ విషయము అర్ధం చేసుకోవడం అంత కష్టం కాదు. జ్ఞానుల దృష్టిలో ఈ
జన్మ కర్మలను దాటటమే ముక్తి. వారు ఆత్మ సాక్షాత్కారము పొందినవారై ఈ జన్మ మరణాలు
నిజం కావని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. అజ్ఞానం అంటే ఈ సత్యాన్ని అర్ధం
చేసుకోకుండా ఉండటం. అసలు ఈ సత్యాన్ని తెలుసుకోవాలి అని ప్రయత్నం కూడా చేయకుండా
ఉండటమే పెద్ద అజ్ఞానం . అందుకే ఈ అజ్ఞానుల భాషలోనే భగవానుడు ఈ జన్మ మరణాల గురించి చెప్పడం
జరిగింది. ఇలా అర్ధం చేసుకున్నా కాని వీటిగురించి దుఃఖించాల్సిన అవసరం లేదు అని
చెప్పారు. వారి వారి కర్మను అనుసరించి వారికి ఎంత కాలము బతకాలో అంత కాలము మాత్రమే
బతుకుతారు. అంతే కాని ఎవరు ఎవరి చావుకి, పుట్టుకకి కారణం కాజాలరు.
గీతలో చెప్పినట్లుగా పుట్టిన వారికి మరణము తప్పదు అలానే చనిపోయిన
వారు మరల పుట్టక తప్పదు. సరే వీరు ఎక్కడనుంచి వస్తున్నారు? ఎక్కడకు వెళ్తున్నారు?
భగవానుడు వీరు అవ్యక్తంలో ఉంటారు అని చెప్పారు. దేవుడు అంటే నమ్మకం లేని
హేతువాదులు కూడా మనం ఎక్కడనుంచి రావడం లేదు, ఎక్కడకు పోవడం లేదు అని చెపుతారు. ఈ
శరీరం ఆలా ప్రపంచంలో కలిసిపోతుంది అని కూడా చెపుతారు. స్సైన్సుకి కూడా అంతుపట్టని
విషయం ఏమిటి అంటే? చనిపోయిన తరువాత ఏమవుతుంది అన్న నిజం. ఎక్కడ ఈ సైన్సు
ఆగిపోతుందో అక్కడ మన శాస్త్రాలు మొదలుపెడతాయి. చాలా మతాలూ దేవుడిని నమ్ముతాయి కాని
చనిపోయిన తరువాత ఏమవుతుంది అనే విషయంలో బేధాలు ఉన్నాయి. ఇప్పడు అవన్ని ప్రక్కన పెడితే,
ఒక సత్యం అందరు ఒప్పుకునేది ఏమిటి అంటే భగవంతుడు అనే శక్తి మనలను నడిపిస్తుంది అనే
విషయం. ఈ శక్తినే వేదాంతులు "బ్రహ్మన్" అని అంటారు. భక్త శిరోమణులు
పరమాత్ముడు అంటారు. ఏ పేరుతొ పిలిచినా ఈ అదృశ్య శక్తే ఈ ప్రపంచానికి ఆధారం.
సైన్సుకూడా ఈ సత్యాన్ని ఒప్పుకుంటుంది. దీన్నే వారు "ఎనర్జీ" అంటారు. ఈ
శక్తి లేని చోటే లేదు. అందుకే మనము భగవంతుడు అంతటా ఉన్నాడు అని చెప్పుకుంటాము.
చనిపోయిన తరువాత ఏమవుతుంది అనే విషయం ఒక పెద్ద మిస్టరీగా మనం
అనుకోవచ్చు, రకరకాలైన అభిప్రాయాలు ఉండచ్చు. కాని హిందూయిజం దీన్ని గుడ్డిగా
నమ్మమనిచెప్పడం లేదు. మన వాసనలే మన రాబోయే జన్మకు కారణం అవుతున్నాయి. ఇక్కడ
శ్రీకృష్ణులవారు ఒక్క మరణం గురించే మాత్రమే చెప్పడం లేదు. ఒక ఆలోచన దృఢం అయితే అది
వాసనగా మారుతుంది. ఈ వాసన ఒక జన్మకు కారణం కావచ్చు. మళ్ళా జన్మలో కొత్త వాసనలు,
ఇలా ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది.
జన్మ మరణ చక్రంలో ఉన్న సత్యం ఏమిటి? అంతులేని చక్రంలో ఇరుక్కోవడమే
అసలైన సత్యం. మనం ఒక పని చేసిన తరువాత ధైర్యంగా దాని ప్రతిఫలాన్ని కూడా
స్వీకరించడం నేర్చుకోవాలి. అంతే కాని నేను కర్మ మాత్రమే చేస్తాను దానికి
సంబంధించిన ఫలం నాకు వద్దు అంటే కుదరదు. ఒకరి
గురించి చెడుగా అలోచించి, వారికీ హాని చేస్తే, మనకు కూడా ఇటువంటి ప్రతిఫలమే
వస్తుంది. మనకు ఇది జరిగినప్పుడు నాకే ఇలా ఎందుకు జరగాలి అని మాత్రం అనుకోకూడదు.
మనకు జరిగే వాటికి మనమే కారణము.
పుట్టుకకు మరణానికి మధ్యనున్న సమయాన్ని మనం జీవితం అంటాము. కాని
మరణానికి పుట్టుకకు మధ్యనున్న సమయాన్ని ఏమని పిలవాలి? దీన్నే మన శాస్త్రాలు
అవ్యక్తం అని పిలుస్తాయి. మన పురాణాలు స్వర్గం, నరకం అని కూడా చెప్తాయి. కానీ
వీటిలో ఎక్కడ ఈ శరీరం ఉన్నట్లు చెప్పరు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు దృఢమైన
వాసనలు ఇంకొక జన్మకు కారణం అవుతున్నాయి. ఈ వాసనలు కార్యరూపం దాల్చాలి అంటే సరైన
పరిస్థితులు రావాలి. అప్పటి దాకా ఆ కోరిక తీరదు. అంటే ఒక కోరిక తీరడానికి ఎన్ని
జన్మలు ఎత్తాల్సి ఉంటుందో మనం అర్ధం చేసుకోవచ్చు. అందుకే ఆధ్యాత్మిక ప్రపంచంలో
సాధకులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. మనం అసలు పట్టించుకోపోతే ఇక ఈ జనన
మరణ చక్రంలో పడి కొట్టుకుంటూ ఉండాల్సిందే. అందుకే ఈ సత్యాన్ని అర్ధం చేసుకొని మనకు
లభించిన దాన్ని ఆనందంగా స్వీకరించడం నేర్చుకోవాలి. అంటే కాని నాకు ఎందుకు ఇలా
జరిగింది అని ఏడవడం మంచి పద్దతి కాదు.
ఇలా బాధ పడడం ఎందుకు మంచిది కాదో వచ్చే శ్లోకంలో ఇలా చెప్పారు.
అవ్యక్తాదిని భూతాని వ్యక్త మధ్యాని భారత !
అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా !!
ఓ అర్జునా! ప్రాణులన్నియును పుట్టుకకు ముందు ఇంద్రియగోచరములు గావు.
మరణానంతరము కూడా అవి అవ్యక్తములే. ఈ జననమరణల మధ్యకాలమందు మాత్రమే అవి ప్రకటితములు
అవుతూ ఉంటాయి. ఇట్టి స్థితిలో వాటికై పరితపించుట నిష్ప్రయోజనము.
ఈ వ్యక్త ప్రపంచం చివరలో ఉండదు అని మనకు తెలుసు. మన భూమి సూర్యుడి
చుట్టూ తిరుగుతూ ఉన్న గ్రహాలలో ఒక్కటి. ఇలా సూర్యుడు లాంటి చుక్కలు లెక్కలేనన్ని ఈ
ప్రపంచంలో ఉన్నాయి. కొత్త కొత్త గ్రహాలు పుడుతూ ఉంటాయి.
అలానే వాటికి అంతం అనేది ఉన్నది అని మనకు సైన్సు చెపుతుంది. ఇలా అంతమైన గ్రహాలు
పూర్తిగా నశించడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టచ్చు. ప్రపంచంలోనే ఈ సృష్టి
చక్రం కనపడుతూ ఉంటే, మనం దీన్ని ఒప్పుకోవడానికి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు.
మనం మన చుట్టూ ఉన్న పరిసరాలను పాడుచేస్తే దాని ఫలితం అనుభవించక తప్పదు. అందుకే మన
వాతావరణాన్ని మనం రక్షించుకోవాలి. ఎవరైనా ఈ కర్మ ఫలితాన్ని తప్పించుకోలేరు. ఈ కర్మ
సిద్ధాంతం సమిష్టి కర్మగా తుఫాన్లుగా, భూకంపాలుగా, ప్రకృతి వైపరిత్యాలుగా మనం చూస్తూనే ఉంటాము. అందుకే మనం చేసే ప్రతి కర్మ అలోచించి చేయడం
మంచిది. నాకు నియమాలు తెలియదు అంటే కుదరదు. చెడుఫలితమైన, మంచి జరిగినా దానికి మనమే
కారణం.
ఓం శ్రీ సాయి రామ్
!
No comments:
Post a Comment