సుఖదుఃఖాలు మనలను ఎంతగానో ప్రభావితం చేస్తాయి అని మనకు తెలుసు.
తెలిసి కూడా వీటినుంచి ఎందుకు బయట పడలేక పోతున్నాము అని ఆలోచించడం నేర్చుకోవాలి.
30 సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్ అయిన వాళ్ళను మనం చూస్తూనే ఉంటాము. ఆలా ఒకే
పనిని అన్ని సంవత్సరాలు ఎలా చేయగలుగుతున్నారు? ఇది ఒక బాధ్యత. కుటుంబాన్ని ముందుకు
నడిపించాల్సిన బాధ్యత తల్లి తండ్రుల మీద ఉంటుంది. ఇక్కడ ఎందుకు, ఏమిటి అనే
ప్రశ్నలు ఉదయించవు. అందుకే ఇదివరలో ఇది కష్టం అనిపించేది కాదు. కాని ఇప్పటి
పరిస్థితులలో అంత సహనం మానవులుగా మనలో కొందరికి ఉండటం లేదు. సరే మంచి ఉద్యోగం, అన్ని సదుపాయాలు ఉన్నా కాని మనకు సుఖ శాంతులు
ఉండటం లేదు. అన్ని బాగా ఉన్నా పిల్లలు బాగుందా లేదనో, లేదా వాళ్లు ఇంకా బాగా చదవడం
లేదనో, ఇలా ఎన్నో విషయాలు మనకు అసంతృప్తిని కలగ చేస్తూ ఉంటాయి. ఎందుకు అంటే మనకు
జీవితంపట్ల అవగాహన నశిస్తుంది.ఏది సత్యమో, ఏది కాదో మనకు తెలియడం లేదు.
అందుకే భగవద్గీతలో భగవానుడు ఇలా చెప్పారు.
నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః !
ఉభయోరపి దృష్టో అంతః అనయో: తత్వదర్శిభిః !!
అనిత్యమైన దానికి ఉనికి లేదు. సత్యమైన దానికి లేమి లేదు. ఈ
రెండింటియొక్క వాస్తవ స్వరూపములను తత్వ జ్ఞానియైనవాడే తెలుసుకొనును.
ఈ శ్లోకం చూడటానికి చాలా సాధారణంగా ఉండచ్చు. కాని దీంట్లోనే జీవిత
పరమార్ధం ఉంది. ఇది వేదాంత పరంగా కూడా బాగా అర్ధం చేసుకోవాల్సిన శ్లోకం. ఈ శ్లోకం
యొక్క అర్ధం అనుభవంలోకి రావడమే ఆధ్యాత్మిక లక్ష్యం.
మన చుట్టూ ఉండే సమాజం మనం చేసే ప్రతిపనిని ఎంతోకొంత ప్రభావితం
చేస్తుంది. చాలా పనులు మన కోసం మనం చేసుకోము. అందరు గొప్పగా చూడాలనే, ఇంకొకరు
మెచ్చుకోవాలనో మనం కొన్ని పనులు చేయవచ్చు.
చిన్నప్పుడు చదువుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇది వరకు విద్య వినయాన్ని ఇస్తుంది అని
చెప్పేవారు. మన సమాజం చాలా మారి పోయింది. ఇప్పుడు విద్య అర్ధమే మారిపోయింది.
అందుకే పిల్లలకు, తల్లితండ్రులకు కూడా శాంతి లేకుండా పోయింది. ఇక్కడ విద్యతో
పాటుగా మనం అసహనాన్ని కూడా నేర్పిస్తున్నాము. నిజానిజాలు చూసే తత్వమే నేర్పించడం
లేదు. మనం కేవలం సంపాయించడానికి మాత్రమే చదివిస్తున్నాము. అందుకే పిల్లలలో పెద్దవారి
పట్ల గౌరవం నశిస్తుంది. ఈ చదువులలో "విద్య" అనేదే ఉండటంలేదు. ఇదే
ప్రవృత్తి జీవితంలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మంచి ఉద్యోగం ఉండడం ముఖ్యమే కాని
అదే జీవితం కాకూడదు. ఎందుకు అంటే, ఈ జీవితం శాంతిని ఇవ్వడం లేదు.
ఎలాగైతే ఈ చదువుల్లో "విద్య" లేకుండా పోయిందో అలానే మనం
కూడా మన జీవితాల్లో సత్యాన్ని చూడడం లేదు. ఒక నది ప్రవహిస్తూ ఉంటే, ఆ నీరు ఒకే చోట
ఉండడం లేదు. నీరు ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. నది అడుగు భాగం మాత్రం అలానే
ఉంటుంది. అలానే మన జీవితంలో కూడా ఒక సత్యం ఉంటుంది. మనం చేసే ప్రతి పనిలో ఒక
అంతర్గత సత్యం ఉంటుంది. దాన్ని మనం అర్ధం చేసుకుంటే ఈ కష్ట సుఖాలు మనలను అంతగా
ప్రభావితం చేయవు.
చదువు తరువాత మరో ముఖ్యమైన అధ్యాయం పెళ్లి. ఈ బంధంలో ఉన్న ,ముఖ్య
ఉద్దేశం మనం సరిగా అర్ధం చేసుకోవడం లేదు. ఎవరు ఈ భాద్యత గురించి పిల్లలకు
నేర్పిస్తున్నారు? వాళ్లు ఈ బంధం గూర్చి ఎలా తెలుసుకుంటారు. మనం సత్యమేమిటో అర్ధం
చేసుకోక పొతే ఎలా? మన జీవితంలో సుఖ శాంతులు ఎలా వస్తాయో ఒక సారి సావధానంగా
పరిశీలించుకోవాలి.
మనం పైన చెప్పుకున్న అన్ని విషయాల్లో ఒక సత్యం నిగూఢంగా
ఉంటుంది. ఈ సత్యాన్ని చూడడం చాలా కష్టమైపోయింది. ఎలాగైతే ఒక తెర మీద సినిమా నడస్తూ
ఉన్నంతవరకు మనం తెరను చూడటం కష్టం అవుతుంది. అలానే సత్యం (ఆత్మ) అనే తెరమీద ఈ
ప్రపంచం అనే సినిమా ఉన్నంత వరకు, మనం సత్యాన్ని చూడలేము. కాని తెర అనేది ఒకటి ఉంది
అని అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమా అనేది నిజం కాదు అనే సత్యం మనకు తెలుసు. ఇక్కడ
అర్ధం చేసుకున్న విధంగానే ప్రతి విషయం మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు నిజమైన
సత్యం ఏమిటో తెలుస్తుంది. దీనికి కావాల్సినదల్లా ప్రయత్నం, అనుభవం ఉన్న వారితో
సత్సంగం. ఇదివరికి ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే వారే మార్గదర్శకత్వం చేసే వారు. అలానే
ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనకు ఒక సత్యానుభవం ఉన్న గురువు కావాలి. అప్పుడే ఈ సత్యమేమిటో మనకు తెలుస్తుంది.
అందుకే భగవద్గీత ఇలా చెపుతుంది.
అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్ !
వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్
కర్తుమర్హతి !!
నాశరహితమైన ఆ సత్యము (పరమాత్మ తత్వము) ఈ ప్రపంచమంతా వ్యాపించి
ఉన్నది. శాశ్వతమైన దీనిని ఎవ్వరు నశింపచేయలేరు.
ఈ పరమాత్మ తత్వమే అంతటా ఉన్నది. ప్రకృతిలో కనిపించేవన్నీ తెర మీద
బొమ్మలు లాంటివని మనకు వేదాంతం చెపుతుంది. విద్యుత్తు ఉంటేనే ఒక లైటు వెలిగినా,
ఫాను తిరిగినా, ఒక వస్తువుద్వారా వేడి కలిగినా, చల్లదనం వచ్చినా వీటి అన్నింటికీ
వెనుక ఉన్నది విద్యుత్తు అని గ్రహించాలి. ప్రతి విషయంలో ఒక సత్యం ఉంటుంది. ఆ
సత్యాన్ని మనం అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మనం జీవితంలో ఎంతో సుఖంగా ఉంటాము.
ఓం శ్రీ సాయి రామ్ !
No comments:
Post a Comment