భగవానుడు ఆత్మ శాశ్వతము నిత్యము అని చెపుతూ, ఈ ఆత్మ అంతటా వ్యాపించి ఉన్నదని, దీనికి నాశనము లేదని రాబోయే శ్లోకాలలో చెప్తున్నారు. రెండో అధ్యాయములో 19 నుంచి 25 శ్లోకం వరకు ఈ ఆత్మ ధర్మములను చెప్పారు.
ఆత్మ ఇతరులను చంపునని అనుకునేవాడు, అది ఇతరులచే చంపబడేది అనుకునే వారు, ఈ ఇద్దరును అజ్ఞానులే. ఎందుకంటే వాస్తవముగా ఆత్మ ఎవరిని చంపదు, ఎవ్వరి చేత చంపబడదు.
ఈ ఆత్మ ఏ కాలమునందు పుట్టదు, గిట్టదు. దీనికి భావవికారములు లేవు.
ఈ ఆత్మ నాశరహితము, నిత్యము, జనన మరణములు లేనిది అని తెలుసుకున్నవారు, ఎవరినైనా ఎట్లు చంపించును? ఎవరిని ఎట్లు చంపును?
మానవుడు చిరిగిపోయిన వస్త్రములను త్యజించి, కొత్త వస్త్రములను ధరించునట్లు జీవాత్మ ప్రాత శరీరములను వదిలి క్రొత్త శరీరమును పొందును.
ఈ ఆత్మను శస్త్రములు చేధింపజాలవు. అగ్ని దహింపజాలదు. నీరు తడుపజాలదు. వాయువు ఆరిపొవునట్లు చేయజాలదు.
ఈ ఆత్మ ఛేదించుటకు, దహించుటకు, తడుపుటకు, శోషింపచేయుటకు సాధ్యము కానిది. ఇది నిత్యము, సర్వవ్యాపి, చలింపనిది, స్థాణువు మరియు సనాతనము.
ఈ ఆత్మ అవ్యక్తమైనది. అచింత్యము వికారములు లేనిది. కనుక అర్జున! దీనికై శోకింపదగదు.
ఇలా ఆత్మ ధర్మములను భగవానుడు చెప్పారు. ఇవి తెలుసుకున్నందువల్ల ప్రయోజనం ఏమిటి? ఇవి మనకు ఎలా ఉపయోగపడతాయి?
ప్రతివిషయంలో ఒక సత్యం దాగి ఉంది అని ఇంతకుముందు మనము చెప్పుకున్నాము. ఆ సత్యాన్ని అర్ధం చేసుకుంటే మనకు చింతలే ఉండవు అని కూడా తెలుసుకున్నాము. మన జీవితంలో అన్నిటికన్నా పెద్ద సమస్య చనిపోవడం. కాని ప్రతిఒక్కరు నేను ఇప్పడు చనిపోను అని అనుకుంటారు. ఎవరన్నా చనిపోయారు అని తెలిస్తే, అయ్యో పాపం! నిన్నటిదాకా బాగానే ఉన్నాడు ఇంతలోనే చనిపోయాడు అని అనుకుంటాము. ఇక్కడ సత్యము ఏమిటి అని ఆలోచిస్తే, ఎదో ఒక రోజు మనం కూడా ఈ శరీరం వదలాలి అని మనకు తెలుసు. కాని ఈ విషయం గురించి చింతన చేయడమే మనకు ఇష్టం ఉండదు. కాని మనం చేసే ప్రతిపనీ ఎక్కువ కాలం బ్రతకాలి అని, మన జీవితం సాఫీగా సాగాలని, మనతో ఉన్న వారు సుఖంగా ఉండాలి అని విశ్వప్రయత్నం చేస్తూ ఉంటాము.
అందుకే భగవానుడు ఒక సత్యాన్ని చెప్తున్నారు. ఎవరు చంపించేవారు కాదు. చంపేవారు కాదు. ఇక్కడ అర్జునికి యుద్ధం గూర్చి చెప్పినట్లు ఉంటుంది. కానీ భగవానుడు మనకు చెప్తున్నారు. మనం రోజు చేసే పనులలో కర్త మనమే అనుకుంటాము. మన పిల్లలను మనమే పెంచుతున్నామని అని అనుకుంటాము. ఒకరికి మనమే దుఃఖాన్ని కలిగించాము అని అనుకుంటాము. ఇలా మనం చేసే ప్రతిపనీ మన ద్వారానే జరుగుతుంది అని అనుకుంటాము. దీనివల్ల అహంకారమో, లేదా దుఃఖమో కలుగుతుంది. ఇక్కడ బాధ్యత అనే సత్యం ఉంది. ఇది గుర్తిస్తే ఏ భాద ఉండదు. ఈ శరీరం, మనస్సు ఈ బాధ్యతలను పూర్తి చేస్తాయి. అంతే కాని మనకు అంటే, ఆత్మకు ఎటువంటి సంబంధం లేదు.
ఆత్మకు వికారములు లేవు అని ఒక శ్లోకంలో చెప్పారు. వికారాలు మొత్తం ఆరు ఉన్నాయి. అవి 1)ఉత్పత్తి -పుట్టుట 2)అస్థిత్వము -జన్మించిన తరువాత ఉండుట 3) వృద్ధి -పెరుగుట 4) విపరిణామము - రూపాంతరము చెందుట 5) అపక్షయము -క్షీణించుట 6)వినాశము - మరణము. ఇలా ఈ ప్రపంచములో ఏదైనా కాని ఈ ఆరు వికారాలను పొందవలిసిందే.
ఇక్కడ మనము అర్ధం చేసుకోవాల్సిన సత్యం ఏమిటి అంటే, మనము పుట్టిన తరువాత, పెరిగి పెద్ద అవ్వక తప్పదు, అలానే శరీరంలో మార్పులు రాకుండా ఆగవు. చివరికి మరణం అనేది తప్పదు. ఇలా మార్పులు జరగడమే వికారాలు అంటారు. ఈ శరీరం నశించినా, ఆత్మకు ఏమి కాదు అని మన శాస్త్రాలు చెప్పాయి. ఈ సత్యాన్ని అర్ధం చేసుకుంటే, మనము దేనికి కర్తలము కాము అని తెలుస్తుంది.
మనము పాత వస్త్రాలు తీసేసి కొత్తవి కట్టుకున్నట్లు, జీవాత్మ కర్మతో జీర్ణమైన శరీరములను వీడి కొత్త శరీరములను పొందును అని భగవద్గీత చెప్తుంది. ఇక్కడ జీవాత్మ అంటే సూక్ష్మ, కారణ శరీరాలు మాత్రమే ఆత్మ కాదు. మనం పాత బట్టలు తీసేసి కొత్తవి వేసుకుంటే చాలా బాగుంటుంది అదే శరీరం వదలాలి అంటే అంత తేలిక కాదు. మనమందరము ఎదో ఒక రోజు ఈ శరీరాన్ని వదిలి వెళ్లాల్సిందే. ఈ చేదు నిజాన్ని ఎంత తొందరగా అర్ధం చేసుకుంటే అంత తొందరగా మనం జీవితంలో ఈ కష్ట సుఖాలకు అతీతంగా ఉండగలుతాము. ఇక్కడ శరీరం వదలటం ఒక్కటే అంశం కాదు. మనం ఒక్కో పరిస్థితిలో ఒక్కో బాధ్యతను స్వీకరించాల్సి రావచ్చు, కాని మనం ఒక దాన్ని పట్టుకుంటే తొందరగా వదలము. చిన్న చిన్నవే మనం వదలలేక పొతే ఇక చివరికి ఈ శరీరం వదలటం కష్టమే. మొదటినుంచి ఈ వదలటం అనే ప్రక్రియను అలవాటు చేసుకోవాలి. అప్పుడు ఈ శరీరం వదలటం అంత కష్టం అనిపించదు. అందుకే ఆధ్యాత్మిక సాధనలో నిద్ర గురించి, మరణం గూర్చి మొట్ట మొదటగా నేర్పిస్తారు. అప్పుడే ఈ సత్యాన్ని తెలుసుకో గలుగుతాము.
ఓం శ్రీ సాయి రామ్
No comments:
Post a Comment