ఆత్మ సత్యము, నిత్యము అని మనం చెప్పుకున్నాము. ఈ విషయం నిజమే అని
తెలిసినా సంయోగ వియోగాలు కలిగినప్పుడు మనం
బాధపడుతూ ఉంటాము. ఎందుకంటే ఈ ఆత్మ తత్వము మనకు అనుభవంలోకి రాలేదు కాబట్టి. మన
మనస్సుకి, శరీరానికి కష్టం కలిగినప్పుడు బాధ రాకుండా ఎలావుంటుంది? దీనిగురించే భగవానుడు
రాబోయే శ్లోకాలలో సమాధానం చెప్పారు.
మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదా: !
ఆగమాపాయినో నిత్యాస్తాంస్తితిక్షస్వ భారత !!
ఓ కౌంతేయ! విషయేంద్రియ సంయోగము వలన శీతోష్ణములు సుఖ దుఃఖములు
కలుగుచున్నవి. అవి ఉత్పత్తి వినాశ శీలములు. అనిత్యములు. కనుక భారత వాటిని
సహింపుము.
ఇక్కడ మాత్రా అంటే ఇంద్రియములు మరియు అంతః కరణము. అంతః కరణము అంటే
మనసు, చిత్తము, బుద్ధి మరియు అహంకారము. ఒక వస్తువు యొక్క స్వరూపము తెలుసుకొనుటకు
వాడే కొలబద్దను కూడా మాత్రా అని పిలుస్తారు.
మనము బయట ఉన్న వస్తువులను తెలుసుకోవాలి అంటే, మనకు ఇంద్రియాల అవసరం
ఉంటుంది. చెవి, ముక్కు, కన్ను, నాలుక మరియు చర్మము ద్వారా మనము ఏ విషయాన్నైనా
గ్రహిస్తాము. అవి మనస్సుకి చేరి కష్టము అనో, సుఖం అనో ఒక సంకేతాన్ని ఇస్తాయి.
అప్పుడు మనస్సు సుఖమొ దుఃఖమో అనుభవిస్తుంది. కాని మనము సుఖం వచ్చినా బాధపడడం అలవాటు చేసుకున్నాము. ఎందుకంటే ఈ వచ్చిన సుఖం
ఎక్కడ పోతుందో అన్న భయం. చివరికి ఈ ద్వంద్వాలు ఎదో ఒక రకంగా మనలను ఇబ్బంది పెడుతూ
ఉంటాయి. అందుకే భగవానుడు శీతోష్ణ సుఖదుఃఖదా: అని చెపుతూ, అవి ఉత్పత్తి వినాశములు
అని కూడా చెప్పారు. అవి శాశ్వతమైనవి కావు. ఒక కాలంలో ఉండి మరో కాలంలో నశించేవి. ఈ
ప్రపంచం కూడా ఒక కాలంలో ఉండి మరో కాలంలో నశించేదే. అందుకే దీనిని మిథ్య అని
అన్నారు. ఇటువంటి అనిత్యమైన దాని గురించి అనవసరంగా చింతించవద్దు అని బోధ చేశారు.
సరే ఈ సుఖదుఃఖాలు అందరికి అశాంతిని కలగ చేస్తాయి. మరి మార్గం ఏమిటో
రాబోయే శ్లోకంలో భగవానుడు చెప్తున్నారు.
యం హి న వ్యధయన్తి ఏతే పురుషం పురుషర్షభ !
సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే !!
ఓ పురుష శ్రేష్ఠ ! ధీరుడైన వాడు సుఖ దుఃఖములను సమానముగా చూచును.
అట్టి పురుషుని విషయేంద్రియ సంయోగములు చలింపచేయజాలవు. అట్టివాడే మోక్షమునకు
అర్హుడు.
మనకు పంచభూతాల్లో ఎదో ఒక దాని వల్ల
కష్టమో సుఖమో కలగవచ్చు. గాలి మెల్లగా వీస్తే ఆనందం. గట్టిగా వీస్తే దుఃఖం. మరీ
చల్లగా ఉన్నా, మరి వేడిగా ఉన్నా కష్టమే. అలానే మనకు ఇష్టమైన వారు మనతో ఉంటె మనకు
ఆనందం. మనకు ఇష్టం లేని వారు లేదా మన శత్రువులు వస్తే దుఃఖం. ఇలా ఇంద్రియాలతో
గ్రహించే వాటిని మాత్రాస్పర్స అని అంటారు. ఈ స్పర్శలు మనము కోరుకుంటే వచ్చేవి కావు
అలానే మనం వద్దంటే పోయేవి కావు. వీటిని సమానంగా సహించగలిగినవాడే ధీరుడు అని
చెప్పబడతాడు.
మనం ఈ ద్వంద్వాలను ఎందుకు సహించలేక
పోతున్నాము?
ఏది సత్యమో ఏది నిత్యమో దానిని తెలుసుకోలేక పోతున్నాము. అది
తెలుసుకోవాలి అని కూడా ప్రయత్నిచడంలేదు. అందరిలో ఉన్నది ఒకటే తత్వము. అదే పరమాత్మ.
ఈ విషయం మనకు అనుభవంలోకి రావాలి అంటే మనం కొన్నింటిని వదిలేయాలి. ఈ సత్యాన్ని
తెలుసుకోవటానికి బాబా ఐదింటిని సమర్పించమన్నారు. అవే
ప్రాణాలు, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి మరియు అహంకారము.
పంచ ప్రాణాలు మనకు ఈ ప్రపంచం నుంచి వచ్చినవి కనుక అవి మనవి కావు.
మనిషికి మరణం కలిగితే, అవి పంచభూతాలలో కలిసిపోతాయి. అలా పోయేవి మనవి కావు. ఇక
ఇంద్రియాలు మనసు చెప్పినట్టు ఆడతాయి. ఈ మనస్సే సుఖ దుఃఖాలకు కారణం అవుతుంది.
మనస్సు బుద్ధి మీద ఆధారపడుతుంది. ఒక్కో సారి మాట వినకుండా మారాం చేస్తుంది.
ప్రియమైన వాటి వెంట పరుగులు తీసి కోరి కష్టాలు తెచ్చుకుంటుంది. ఇక అహంకారం నేను
నాది అనే భావనలో ఉంచి మాయలో పడవేస్తుంది. అందుకే బాబా వీటిని అర్ధం చేసుకుని,
వాటిని అధిగమిస్తే అప్పుడు బ్రహ్మజ్ఞానం లభిస్తుంది అని చెప్పారు. ఇక్కడ భగవానుడు
అటువంటి వాడినే ధీరుడు అంటున్నారు. అటువంటి ధీరుడే మోక్షానికి అర్హుడు అని కూడా
చెప్పారు.
ఓం శ్రీ సమర్ధ సద్గురు సాయినాధాయ నమః !
No comments:
Post a Comment