In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, March 29, 2017

భగవద్గీత - సాంఖ్య యోగం - 2.8 -స్వధర్మము



 ఈ జీవనం అనే సమరంలో మనము చేసే ప్రతి కర్మను అర్ధం చేసుకోవడం చాలా ముఖ్యం. దీన్ని కనుక సరిగ్గా తెలుసుకోక పొతే మనకు కష్టాలు తప్పవు. శ్రీకృష్ణుల వారు ఆత్మ గురించి ఇప్పటి దాకా చెప్పి, మన పూర్వ కర్మలు వాసనలుగా మనలను ఎంత ఇబ్బంది పెడతాయో అనే విషయాన్ని ఇప్పుడు చెప్పబోతూఉన్నారు. మొట్ట మొదట మనము ఆత్మ శాశ్వతమైనది, నాశనము లేనిది, ఎల్లపుడు ఉండేది అనే సత్యాన్ని తెలుసుకోవాలి.

ఈ సత్యాన్ని తెలుసుకున్నందువల్ల ఉపయోగం ఏమిటి?

ఆత్మ శాశ్వతము అనే విషయం మనకు నిజ జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది?

ఈ సత్యము మన రోజువారి కర్మలను ఎలా ప్రభావితం చేస్తుంది?

పైన చెప్పిన ప్రశ్నలకు జవాబుల గురించి మనము ఎప్పడూ ఆలోచించాలి. మనము పుట్టిన దగ్గర నుంచే మనకు ఒక వ్యకిత్వం ఉంటుంది.  ఇది పుట్టిన పిల్లలప్పటినుంచే మనకు తెలుస్తూ ఉంటుంది. కొంతమంది ఏమినేర్పించకుండానే కొన్ని గుణాలను వ్యక్తపరుస్తూ ఉంటారు. ఒక్కోసారి తల్లితండ్రులు ఎంత ప్రోత్సహించినా కొన్నింటిని వారు పట్టుకోరు. వారికి ఇష్టమైనవే చేస్తారు కాని  పెద్ద వారు చెప్పినవి ఒప్పుకోరు. అంటే ఈ వాసనలు వారు పూర్వ జన్మలనుంచి తెచ్చుకున్నవి అని మనం అర్ధం చేసుకోవాలి. పూర్వ కర్మ కూడా ఇక్కడ ఫలితాన్ని చూపిస్తుంది. ఒక్కోసారి మనకు ఇష్టం లేక పోయినా కొన్ని పనులు చేస్తాము. ఇక్కడ కూడా మన పూర్వ వాసనలు పనిచేస్తూ ఉంటాయి. అందుకే మనం ఆ పనులు చేయాల్సివస్తుంది. తల్లితండ్రులు వారి బిడ్డల విషయంలో ఆదుర్దా పడడం సహజం. కాని వారి వారి కర్మలను బట్టి పిల్లలు ప్రవర్తిస్తూ ఉంటారు. అలా అని పూర్తిగా వదల లేరు కదా. అందుకే తల్లి తండ్రులు వారి బాధ్యత ప్రకారం వారు అన్ని చెప్పాలి కాని అది జరగక పోతే  బాధపడకూడదు. ఇదే విషయాన్ని భగవానుడు ఈ క్రింది శ్లోకాల్లో చెప్తున్నారు.

స్వధర్మమపి  చ ఆవేక్ష్య న వికంపితుమ్ అర్హసి !
ధర్మ్యాద్ధి యుద్ధాత్ శ్రేయ: అన్యాత్ క్షత్రియస్య న విద్యతే !!

అంతే కాక స్వధర్మమును బట్టియు నీవు బయపడనక్కర లేదు. ఏలనన క్షత్రియునకు ధర్మయుద్ధమునకు మించినట్టి శ్రేయస్కరమైన కర్తవ్యము మరియొకటి లేదు. 

మనము ఈ స్వధర్మాన్ని పరమాత్మ భావనతో అర్ధం చేసుకోక పోయినా, కనీసం మామూలు భాషలో అర్ధం చేసుకోమని భగవానుడు ఇక్కడ బోధిస్తున్నారు. ఆత్మ గురించి చెప్పినప్పుడు జ్ఞానం గూర్చి చెప్పారు. ఇప్పుడు కర్మ యోగం గురించి చెప్తున్నారు. మనము చేయాలి అనే పని గురించి తెలుసుకోకుండా దాంట్లో దిగడం ఎంత మంచిదో మనమే ఆలోచించుకోవాలి. ఒక వేళ తెలుసుకొని దిగినా, సవాలక్ష అడ్డంకులు. వాటిని తట్టుకొని నిలబడాలి అంటే చాలా పట్టుదల కావాలి. ఎవరికి ఓడిపోవడం ఇష్టం ఉండదు. కాని పూర్తిగా కష్టపడడం కూడా ఇష్టం ఉండదు. ఒక్కోసారి మనము ఓడిపోతామేమో అన్న భయం మనలను కృంగతీస్తుంది. అప్పుడు మనము చేపట్టిన కార్యాన్ని వదలివేస్తాము. ఇక్కడ అర్జునుడు కూడా ఇదే పని చేయాలని అని అనుకున్నాడు. కాని భగవానుడు సరి అయిన దారిలో నడిపించారు.

సహజంగా మనమందరము కొన్ని గుణాలతో ఈ భూమి మీదకు వస్తాము. ఈ పూర్వ జన్మ  
వాసనలే మన ఆలోచనలకు, మన సంకల్పాలకు కారణం అవుతాయి.  అన్ని మన వాసనలకు తగ్గట్టుగా జరిగితే ఏ గొడవ ఉండదు. కాని మన జీవితంలో ఉన్న వారు మనము చేసే పనులను మార్చాలని ప్రయత్నిస్తూ ఉంటారు. వారు మన శ్రేయోభిలాషులు కూడా అయి ఉంటారు. వారిమీద మనకు ప్రేమ కూడా ఉండచ్చు. ఇక్కడే సమస్య మొదలు అవుతుంది. వారు గట్టిగా చేయ మని చెప్పిన దాని మీద మన మనస్సు నిలవదు. ఇక్కడ అర్జునుడు కూడా యుద్ధం చేయాలని వచ్చాడు. తీరా వచ్చాక నేను యుద్ధం చేయను అంటున్నాడు. శ్రీకృష్ణులవారికి యుద్ధం చేయడం సరదా ఏమి కాదు. ఆయనే యుద్దాన్ని నివారించడానికి ప్రయత్నించారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, అర్జునుడు ఎందుకు యుద్ధం చేయాలో అర్ధం చేసుకోవడం లేదు. తన ఆలోచన సరి అయినది అని అనుకుంటున్నాడు. తను క్షత్రియుడుగా జన్మ తీసుకొని కొన్ని వాసనలతో వచ్చాడు. అవి పూర్తి చేసుకోక పొతే తన వాసనలను ఖర్చు చేసుకోలేడు. మనము ఏ పని అయినా నిస్వార్ధంగా చేయగలిగితే ఆ పని అంత కష్టం అని అనిపించదు. ఇక్కడ అర్జునుడు ధర్మాన్ని రక్షించడానికి కనుక యుద్ధం చేస్తే తన స్వధర్మానికి తగినట్లుగా చేసినవాడు అవుతాడు.

 కొంతమంది భగవద్గీతలో చెప్పిన వర్ణాలను వేరేగా అర్ధం చేసుకుంటారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు సూద్ర వర్ణాలను గూర్చి చెప్పడం జరిగింది. ఇవి కేవలము వారి వాసనలకు సంబంధించినవే కాని నిజమైన బేధాలు కావు. వారు చేసే పనులను ఆధారంగా ఈ విభజన చేయబడింది. అంతే కాని వారు ఆ వర్ణంలో పుట్టినంత మాత్రాన వారు ఆ విధులే నిర్వర్తిస్తున్నారు అనడానికి వీల్లేదు. అందరూ అన్ని వర్ణాల వారి విధులను చేస్తూ ఉన్నారు. ఒక్కో సారి ఒక్కో పాత్రను పోషిస్తూ ఉన్నారు. మనము మన బాధ్యతను తెలుసుకొని ఏ సమయంలో ఎలా నడుచుకోవాలో తెలుసుకుంటే చాలు.  భగవానుడు ఇప్పుడు మనం ఎలా నడుచుకోవాలో చెప్తున్నారు.

సుఖ దుఃఖ సమె కృత్వా లాభాలాభౌ జయజయౌ! 
తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపం అవాప్యసి !!

జయాపజయములను, లాభనష్టములను, సుఖదుఃఖములను సమానముగా భావించి యుద్ధసన్నద్దుడవు కమ్ము. అప్పుడు నీకు పాపములు అంటవు. 

ఈ జీవన సమరాన్ని ఎలా ఎదుర్కోవాలో, ఎలా మనకు అనుగుణంగా మార్చుకోవాలో ఇక్కడ గీత మనకు నేర్పిస్తుంది.

ముందు మనము మన స్వభావాన్ని అర్ధం చేసుకోవాలి. 

మనలో ఎక్కువగా ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో గమనించాలి. 

ఎందుకు అంటే మన పూర్వ జన్మ వాసనలే మన ఆలోచనలను నియంత్రిస్తాయి. వాటిని బట్టే మనం పుట్టే పరిస్థితులు నిర్ణయించబడతాయి. వీటిని మనం మార్చలేము. వాటిని ధైర్యంగా ఎదుర్కోవడం తప్ప మనకు వేరే మార్గం లేదు. 

ఈ వాసనాలే మన స్వధర్మంగా చెప్పబడతాయి. 

పిల్లలు వారి స్వధర్మాన్ని బట్టే వారి దారిని ఎంచుకోవడం జరుగుతుంది. తల్లిదండ్రులు మేమె వారికి దారి చూపించాము అని అనుకుంటే అది సత్యం కాదు. పిల్లలు ఆ వాసనలతో ఉన్నారు కాబట్టి అది జరిగింది అని అర్ధం చేసుకోవాలి. మనం చెప్పేవన్నీ చెప్పాలి కాని అవి జరగకపోతే నిరాశ చెంద కూడదు. సుఖ దుఃఖాలను లాభ నష్టాలను , జయాపజయాలను సరిగ్గా అర్ధం చేసుకోవాలి. వాటిని సమ దృష్టితో చూడాలి. అప్పుడు ఏ పనిద్వారా అయినా పాపం అంటదు అని భగవానుడు చెప్పారు. 
  
ఒక మామూలు మనిషిగా మన పూర్వజన్మ వాసనాలే మన కర్మలను నియంత్రిస్తాయి అని తెలుసుకోవాలి.

 ఆత్మసాక్షాత్కారమే మోక్షానికి దారి అని, ఇది ఒక్కటే పూర్తి శాంతిని ప్రసాదిస్తుంది అనే నిజాన్ని తెలుసుకోవాలి.

 ఒక ఆధ్యాత్మిక సాధకుడుగా మన స్వధర్మము ఆత్మ సాక్షాత్కారమే అన్న సత్యాన్ని అర్ధం చేసుకోవాలి. మన స్వధర్మములో మనము ఉండటమే ముక్తి.


  
ఓం శ్రీ సాయి రామ్ !

No comments:

Post a Comment